జడ్చర్ల బరిలో సెజ్ బాధిత రైతులు

పది మంది నామినేషన్లు దాఖలు
సిద్ధమవుతున్న మరికొంతమంది
జడ్చర్ల, న్యూస్‌టుడే: చెప్పినట్టే చేశారు.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ బాధిత రైతులు 10 మంది శుక్రవారం జడ్చర్ల తహసిల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్‌లను సమర్పించారు. తొలిగా ఎట్టి లింగయ్య నామినేషన్ అందజేశారు. మరో 9 మంది (కందూరు కుర్మయ్య, సత్యమ్మ, బచ్చంగాలి శీనయ్యగౌడ్, ఎ.శీనయ్య, దేపల్లి యాదయ్య, కందూరు నర్సయ్య, జంగిలమ్మ, ఎట్టి చిన్న వెంకటయ్య, మొగులమ్మ) ఆయనను అనుసరించారు. సెజ్ వ్యతిరేక పోరాట ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షుడు మధు కాగుల ఆధ్వర్యంలో పోలేపల్లి నుంచి బాధిత రైతులు తరలివచ్చారు.
తహసిల్దారు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేటు మూసేశారు. నామినేషన్ వేసే అభ్యర్థి, బలపరిచే వారిని ఒక్కొక్కరిగా లోపలికి వదిలారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిలో కొందరు దళితులున్నా.. కుల ధ్రువీకరణ పత్రం కావాలని రిటర్నింగ్ అధికారి రాజశేఖర్ కోరారు. తమ వద్ద ప్రస్తుతం లేదని.. వారు రూ.5 వేల డిపాజిట్ అందజేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బాధిత రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘మా దుస్థితికి కారణమైన ప్రభుత్వం తీరును ప్రజలకు వివరిస్తా’మని ఎట్టి లింగయ్య పేర్కొన్నారు. ప్రజల వద్ద బిక్షం అడుగుతూ మద్దతు తెలపాలని కోరతామన్నారు. అయితే.. నామినేషన్ వేసిన వారి వివరాలను ప్రధాన రాజకీయ పార్టీల అనుచరులు సేకరించారు. వారికి సంబంధించిన వ్యక్తులు తహసిల్దారు కార్యాలయం వద్ద ఉంటూ పరిస్థితులను గమనించారు.
మేం గెలవకపోయినా వారిని మాత్రం గెలవనీయం: కందూరు కుర్మయ్య
ఉప ఎన్నికల్లో పోటీ చేసి మేం గెలవకపోయినా.. మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గెలవకుండా చేస్తాం. ప్రజల వద్దకు వెళ్లి నాయకుల అసమర్థతను వివరించి మమ్మల్ని గెలిపించాలని కోరతాం.
పోటీ చేస్తాం.. న్యాయం చేసే వరకు పోరాడుతాం: సత్యమ్మ
ఎవరేం చెప్పినా పోటీ చేస్తాం. ఏమైనా సరే మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.
కొన్ని ఓట్లయినా తీసుకుంటాం: శీనయ్యగౌడ్
పోటీ ఖాయం. మేం గెలవకపోయినా మాకు అన్యాయం చేసిన వారిని ఓడించే ప్రయత్నం చేస్తాం. కొన్నైనా ఓట్లు తీసుకుంటాం. కానీ వదిలేది లేదు. మేం చచ్చినా మా భూమిని మాత్రం వదిలేది లేదు.
గెలుపోటములు శాసిస్తాం.. రైతుల సత్తా చాటుతాం: సెజ్ వ్యతిరేక పోరాట ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షుడు
మరి కొంతమంది రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు అందరి సహకారంతో ప్రచారం నిర్వహిస్తాం. ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తాం. రైతులు తలచుకుంటే ఏం చేస్తారో ఈ ఉప ఎన్నిక ద్వారా చాటుతాం.
–
సెజ్‌కు వ్యతిరేకంగా గోపాలకృష్ణ నామినేషన్
జడ్చర్ల, న్యూస్‌టుడే: పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలికి వ్యతిరేకంగా శనివారం నవాబుపేట మండలం కాకర్ల పాడ్ గ్రామానికి చెందిన జి.గోపాలకృష్ణ స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ చేశారు. తన నామినేషన్ పత్రాలను జడ్చర్ల తహసిల్దారు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజశేఖర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెజ్ కారణంగా దాదాపు 150 గ్రామాల్లో కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
Courtesy: Eenadu






