Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

చచ్చాకా శాంతి లేదు – శ్మశానాన్ని మింగేసిన సెజ్‌

leave a comment »

అంత్యక్రియలకు భూమి కొన్నాం
నిర్వాసిత కుటుంబం ఆవేదన

జడ్చర్ల నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి

కొన్నేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలకు జాగా కావాలంటూ పోలేపల్లిలో పాదం మోపింది. తొలి అడుగు ఆస్తుల మీద, మలి అడుగు నిర్వాసితుల బతుకుల మీద వేసింది. ఇటీవల పోలేపల్లి శివారు గుండ్లగడ్డ తండావాసి ఒకరు మరణించాక తెలిసింది. మూడో అడుగు చావు మీద పడిందని. అంత్యక్రియలకు ఆరు అడుగుల జాగా కూడా లేదని! ఉప ఎన్నికల వేడిలో ప్రస్తుతానికి చావు సమస్య పరిష్కారమైనా బతుకు సమస్య ఇంకా అలాగే ఉంది.

అది మహబూబ్‌నగర్‌ జిల్లా గుండ్లగడ్డ తండా… చుట్టూ ఉన్న సాగు భూములను పోలేపల్లి సెజ్‌ కోసం ప్రభుత్వం లాగేసుకుంది. ఇప్పుడు నాలుగెకరాల విస్తీర్ణంలో తండా ఒక్కటే వాళ్లకు మిగిలింది. తండాకు చెందిన బాలూ నాయక్‌ మూడెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంది. పోయిన భూమిని దక్కించుకొనే పోరాటంలో బాలూనాయక్‌ అరెస్టయి జైలుకెళ్లాడు. జైలునుంచి వచ్చిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఆయన్ను ఖననం చేసేదెక్కడ? ప్రభుత్వం వూరు బయట ఆరు అడుగుల జాగా కూడా లేకుండా చేసింది. తాండా శ్మశానంగా ఉపయోగించే స్థలంకూడా ప్రత్యేక ఆర్థిక మండలి పాలైంది. ఉన్న మూడెకరాల భూమిని సర్కారు తీసేసుకోవడంతో బాలూ నాయక్‌ కుటుంబానికి సొంత భూమి కూడా లేకుండా పోయింది. ఎక్కడ ఖననం చేయాలో తెలియక చివరికి రూ.ఐదు వేలు పెట్టి కొంత జాగా కొని, అందులో అంత్యక్రియలు చేశామని బాలూ నాయక్‌ కుమారుడు లక్ష్మణ్‌ చెప్పారు. ఈ సంఘటన కొద్ది నెలల క్రితం జరిగింది.

వారంరోజుల క్రితం ఇదే తాండాకు చెందిన రుకాలీ అనే మహిళ చనిపోయింది. ఈమెను పూడ్చడానికి స్థలం లేదు. ఎక్కడో ఒకచోట భూమిని కొని కార్యక్రమం చేసే స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో శవంతోనే శ్మశానం కోసం తాండా వాసులు ఆందోళనకు దిగారు. జడ్చర్ల ఎన్నికల బరిలోకి దిగిన పోలేపల్లి సెజ్‌ నిర్వాసితులు శ్మశానానికి కూడా స్థలం లేక పోవడాన్ని ప్రధాన ప్రచారాంశంగా చేపట్టారు.

ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి మల్లు రవి జోక్యంతో అధికారులు రంగప్రవేశం చేశారు. శ్మశానం కోసం రెండెకరాలు భూమి కేటాయించడానికి అంగీకరించారు. వాస్తవానికి తాండా ఉన్న స్థలం కూడా ఎ.పి.ఐ.ఐ.సి నోటిఫై చేసిన ప్రాంతంలోనే ఉంది. దీనిని కూడా మినహాయించారు. అంటే, తాండాకు నాలుగు ఎకరాలు, శ్మశానానికి రెండెకరాలు మిగలనుంది.

ఎన్నికల పుణ్యమాని గుండ్లగడ్డ తండాలో చావు సమస్య తీరనుంది. బతుకు సమస్య ఇంకా అంతే మిగిలి ఉంది. నిర్వాసితుడిగా మారి మరణించిన బాలూ నాయక్‌కు నలుగురు పిల్లలు. ఇందులో ఇద్దరు ఫార్మా సెజ్‌ నిర్మాణ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు పోలేపల్లిలోనే చదువుతున్నారు. నేడోరేపో ఈ పిల్లలు కూడా కూలీలుగా మారే వాతావరణం కనిపిస్తోంది. ఈ కుటుంబానిదే కాదు, అనేక మందిదీ ఇదే పరిస్థితి. తాండాకే కాదు పక్కనే ఉన్న పోలేపల్లి గ్రామానికీ శ్మశానం సమస్య ఏర్పడింది. ఉన్నశ్మశానం నిండిపోయింది. విస్తరించాలంటే స్థలం లేదు. మాక్కూడా చోటివ్వాలని అభ్యర్థులుగా బరిలో ఉన్న పోలేపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.

జడ్చర్ల పరిధిలోని పోలేపల్లిలో రైతులకు పండ్ల తోటలు, పూలతోటలు పెట్టిస్తామని మెగా గ్రీన్‌పార్కు పేరుతో 969 ఎకరాల భూమిని 2003లో తెలుగుదేశం ప్రభుత్వం సేకరించింది. కానీ, 2005 వరకు రైతులు సాగు చేసుకొన్న ఈ భూములను, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఔషధ పరిశ్రమల ప్రత్యేక ఆర్థికమండలి కోసం కేటాయించింది. ఇక్కడ నిర్వాసితులైన రైతుల్లో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారే. వీరికి అన్ని వసతులూ కల్పించామన్న ప్రభుత్వం గ్రామస్థులు ఎన్నికల బరిలో నిలబడే వరకు శ్మశానం విషయంలో కూడా నిర్ణయం తీసుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

బరిలోకి బాధితులు

పోలేపల్లి సెజ్‌ కింద భూమిని కోల్పోయి నిర్వాసితులైన దళితులు, గిరిజనులు ఉప ఎన్నికల బరిలో నిలబడటంతో జడ్చర్ల ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకొంది. ఉన్నభూమి కోల్పోయి, రోజువారీ గడవటం కష్టమైన దళిత, గిరిజన మహిళలు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. నిరక్ష్యరాస్యులే ఎక్కువ మంది. చిరిగిన పాత చీర, దుమ్ము ధూళితో నిండిన జుట్టు, ఒక చేతిలో పాత సంచి, అందులో ఎందుకు పోటీ చేస్తున్నామో తెలిపే కరపత్రం, ఇంకో చేతిలో మట్టి గిన్నెతో… బతకడానికి జీవనాధారం కల్పించాలంటూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మహిళలు చేస్తున్న ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకు పోటీ చేస్తున్నారంటే, ‘మా భూమి మాకు కావాలి. అందుకే’ అని సత్యమ్మ అనే అభ్యర్థిని సమాధానమిచ్చింది. ‘మా భూమి అంతా లాక్కొన్నారు. మా ఇంట్లోనే భూమి పోయిన బాధతో ముగ్గురు మరణించారు’ అని గుండ్లగడ్డ తాండా నుంచి పోటీలో ఉన్న చాందీ అనే మహిళ తెలిపింది. లాక్కొన్న భూమి తిరిగి ఇచ్చే వరకు వదిలి పెట్టేది లేదని ఆమె స్పష్టం చేసింది. ”ఉన్న ఆరెకరాల భూమిని ప్రభుత్వం లాక్కొంది. భూమిపోతే ఎట్లా బతకాలని నా భర్త రాములు గుండె పగిలి చనిపోయాడు. ఐదుగురు పిల్లలున్నారు. అందరం రోడ్ల పాలయ్యాం. మళ్లీ భూమి దక్కేవరకు వదిలేదిలేదు” అని పోటీలో ఉన్న మొగిలమ్మ అనే మరో మహిళ పేర్కొంది.

Courtesy: Eenadu, 23rd May 2008

Written by Konatham Dileep

May 23, 2008 at 6:35 am

Leave a Reply