పోలేపల్లి సెజ్ బాధితుల అక్రమనిర్భంధం
పోలీస్ జులుం
ముఖ్యమంత్రి పర్యటన కోసం ఎన్నికల కోడ్ ఉల్లంఘన
వారంతా.. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) బాధితులు.. అరకొర పరిహారంతో తమ భూములను లాక్కొని.. జీవనోపాధిని దెబ్బతీసిన సర్కారుపై నిరసన గళం విప్పిన అతి సామాన్యులు. అందివచ్చిన ఉప ఎన్నికలను అస్త్రంగా చేసుకొని.. తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి ఎన్నికల బరిలో దూకారు.. వినూత్న శైలిలో ఊరూవాడా ప్రచారం చేపట్టారు. ఇదే పాలకులకు కంటగింపుగా మారింది. తమ సమస్యను ముఖ్యమంత్రికి ఏకరువు పెట్టుకునేందుకు సిద్ధమైన వారిపై పోలీసు బలగాన్ని ప్రయోగించారు. వారి నిరసనపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల కోడ్‌ను దర్జాగా ఉల్లంఘించి.. అభ్యర్థులను అపహరించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఉప ఎన్నికల బరిలో నిలిచిన పోలేపల్లి సెజ్ బాధితులను శనివారం పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి సృహ తప్పి పడిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం సాగిన ఈ అక్రమ నిర్బంధంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబ్‌నగర్, మే 24(ఆన్‌లైన్ ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఉప ఎన్నికల బరిలో నిలిచిన పోలేపల్లి సెజ్ బాధిత అభ్యర్థులపై శనివారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పర్యటన సందర్భంగా తమ సమస్యలపై ఆ అభ్యర్థులు నిలదీస్తారనే భయంతో పోలీసులు వారిని కిడ్నాప్ చేసి.. అక్రమంగా నిర్బంధించారు. పోలేపల్లి సెజ్ సమస్యకు నిరసనగా ఆ గ్రామానికి చెందిన 12 మంది అభ్యర్థులు జడ్చర్ల ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న విషయం విదితమే. అభ్యర్థులందరూ కలిసికట్టుగా గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
సంతల్లో తిరుగుతూ ఓట్ల భిక్షమెత్తుతున్నారు. ఎవరైనాదాతలు భోజనం పెడితే తిని.. ఓట్లు అడుగుతున్నారు. వారి వినూత్న ప్రచారం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. రాజకీయ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. తమ ప్రచారం సందర్భంగా కలిసిన నాయకులందరికీ సెజ్ బాధిత అభ్యర్థులు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. బాలానగర్ సంతలో ఎన్నికల ప్రచారం నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ శనివారం అక్కడకు వస్తున్నారని తెలుసుకొని.. ఆయనకు కూడా వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కావేరమ్మపేట సంతలో ప్రచారం చేస్తున్న ఎనిమిది మంది అభ్యర్థులు జి.గోపాలకృష్ణ, దేవులపల్లి యాదయ్య, మొగులమ్మ, సత్యమ్మ, పోల జంగిలమ్మ, ఎట్టి చిన్న వెంకయ్య, ఎట్టి లింగయ్య, కందూరి కుర్మయ్యలను నిర్బం«ధించారు. అనంతరం వారిని మహబూబ్‌నగర్ మండలం బండమీదిపల్లికి, అక్కడ్నుంచి వల్లూరుకు, తర్వాత దేవునిగుట్ట తండాలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఆ సమయంలో సత్యమ్మ అనే అభ్యర్థి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని భావించిన పోలీసులు సత్యమ్మతోపాటు మిగిలిన అభ్యర్థులను జడ్చర్ల ఆసుపత్రికి తరలించి.. చల్లగా జారుకున్నారు.
వాస్తవంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అపహరించడం.. నిర్బంధించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, పోలేపల్లి సెజ్ బాధితుల విషయంలో పోలీసులకు ఇవేమీ గుర్తుకురాలేదు. ముఖ్యమంత్రి సాక్షిగా కోడ్‌ను ఉల్లంఘించారు. ఈ సంఘటనపై పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులకు, మానవ హక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐక్య సంఘటన కన్వీనర్ మధు కాగుల డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలపైనా..
మరోవైపు.. సెజ్ బాధిత అభ్యర్థులతోపాటు బీజేపీ నాయకులనూ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సెజ్ బాధితుల సమస్యలను లేవనెత్తుతారనే భయంతో భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు శౌరి, అభ్యర్థులు పెంటయ్య, బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని వదిలేశారు.
Courtesy: Andhrajyothy, 25th May 2008







ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రౌడీ రాజకీయలకి ఇది పరాకాష్ట. పోలీసుల అత్యుత్సాహం మరియు విమర్శలని ధైర్యంగా ఎదుర్కోలేని ఒక పిరికివాడి చర్య.
చక్స్
May 26, 2008 at 7:31 am