సత్తా చాటిన సెజ్ బాధితులు
15 మంది అభ్యర్థులకు 65 వేల ఓట్లు | ప్రధాన పార్టీల గెలుపును శాసించిన ‘పోలేపల్లి’
(మహబూబ్‌నగర్ -ఆన్‌లైన్ ప్రతినిధి) మహబూబ్‌నగర్ పార్లమెంటుకు పోటీచేసిన పోలేపల్లి సెజ్ బాధితులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశారు. 15 మంది బాధితులు పోటీచేసి 65 వేల ఓట్లు సంపాదించారు. ఇక్కడ గెలుపొందిన కేసీఆర్‌కు 20,184 ఓట్ల ఆధిక్యత లభించింది. సెజ్ బాధితులు పోటీలో లేకుంటే.. ఈ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లివుంటే కేసీఆర్ ఓటమి బాట పట్టేవారే. ఈవిధంగా సెజ్ బాధితులు ఎన్నికల్లో పోటీచేసి తమ సమస్యను లోకానికి చాటిచెప్పారు. జడ్చర్ల ఉప ఎన్నికల్లోనూ సెజ్ బాధితులు పోటీచేసి టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలిగించారు.
అప్పట్లో ఏడుగురు బాధితులు పోటీచేశారు. మెరుగైన పునరావాసం కల్పిస్తామని, భూమికి భూమి ఇస్తామని మోసం చేసినందుకు నిరసనగానే ఎన్నికల్లో పోటీ చేయాలని బాధితులు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రావుతోపాటు పలువురు వారిని పోటీ నుంచి విరమింపజేసేందుకు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ బాధితులు లొంగలేదు. ఈసారి జరిగిన ఆర్భాటపు ప్రచారంలో సెజ్ బాధితుల గొంతు పెద్దగా వినిపించలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు వెదజల్లడంతో సెజ్ బాధితుల ప్రచారం పెద్దఎత్తున సాగలేదు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, సంతలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయినా బాధితులు తమ లక్ష్యాన్ని సాధించగలిగారు.అభ్యర్థుల జాతకాల్ని తిరగరాశారు. లోక్‌సత్తా అభ్యర్థుల కన్నా సెజ్ బాధితులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోనూ వీరికి 150-200 ఓట్లు వచ్చాయి. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చా యి.
బాధితుల్లో మునుస్వామికి 2603 ఓట్లు, హుసేని శాంతమ్మకు 2,9 66, హుసేని రంగమ్మకు 2000, ఎట్టి వెంకటయ్యకు 24 26 ఓట్లు, ఎట్టి లింగయ్యకు 2977, కందూరు కూర్మయ్య 2949 ఓట్లు, కర్రె జంగయ్య 11,268 ఓట్లు, గజ్జి నర్సింలు 3740 ఓట్లు, దేపల్లి మైసయ్య 1974 ఓట్లు, దేపల్లి సాయన్నకు 1937, మాల జంగిలమ్మకు 1854, బుడగ జంగం లక్ష్మమ్మకు 9811, సీనయ్యగౌడ్‌కు 6351, ఎంఎ జబ్బార్‌కు 2084, మహ్మద్ గౌస్ మైనొద్దిన్‌కు 9298 ఓట్లు వచ్చాయి. లోక్‌సత్తా అభ్యర్థి గుండాల విజయలక్ష్మికి 2282 ఓట్లు వచ్చాయి.






