Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ బాధిత మహిళల అరెస్టు

leave a comment »

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్‌ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్‌పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జడ్చర్ల ఎస్‌.ఐ రవీందర్‌, బాధితులు, న్యాయవాదులు తెలిపిన ప్రకారం… పోలేపల్లి గ్రీన్‌ పార్కు వద్ద తనపై దాడి చేశారని సెక్యూరిటీ గార్డు వెంకటయ్యగౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2007 మార్చి 13న కేసు నమోదు అయింది. ఐపీసీ సెక్షన్‌ 504, 324, 447, 323ఆర్‌/డబ్ల్యు 34 కింద కేసులు నమోదయ్యాయి. నిందితులుగా తందూరి నర్సమ్మ, గోవిందమ్మ అలియాస్‌ చుక్కమ్మ, కొంగలి కిష్టమ్మ అనే సెజ్‌ బాధితులపై కేసులు ఉన్నాయి. మిగిలిన మరికొందరిపై కేసులు ఉన్నా వారు బెయిల్‌ తీసుకున్నారు. ముగ్గురు మహిళలు మాత్రం హాజరు కాలేదని న్యాయ స్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులు గ్రామస్థులకు సరైన వివరాలు తెలుపకపోవడంతో ఆందోళన మొదలైంది. మహిళలను పురుష పోలీసులు అరెస్టు చేయడం పట్ల సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల ఖండించారు. పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించారని ఫార్మా కంపెనీల యాజమాన్యం వత్తిడిలకు లొంగి తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ విషయంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

న్యాయ స్థానం ఆదేశాలు పాటించాం : ఎస్‌ఐ వివరణ
కేసులో తమకు న్యాయ స్థానం ఆదేశించిన మేరకు నిందితులను అరెస్టు చేశామని ఇందులో తమ ప్రమేయమేమి లేదని ఎస్‌ఐ రవీందర్‌ వివరణ ఇచ్చారు. తన హయాంలో ఈ కేసు నమోదు కాలేదని, పూర్తి వివరాలు తెలియదని, కేవలం న్యాయస్థానం ఆదేశం పాటించామని వివరణ ఇచ్చారు.

మాకు తెలియని కేసు : బాధితులు
మేము ఎవరిని కొట్టింది లేదని తమపై ఎవరు కేసు పెట్టారో తెలియదని, భూములు పోగొట్టుకొని బాధపడుతుంటే అరెస్టు చేయడం అన్యాయమని నిందితులుగా ఉన్న సెజ్‌ బాధిత మహిళలు బెయిల్‌పై విడుదల అయిన తర్వాత విలేకరులకు వివరించారు.

న్యాయమూర్తి కనికరంతో మహిళలకు ఊరట
నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌కు సంబంధించి జైలుకు వెళ్లాల్సిన ముగ్గురు మహిళలకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కనికరించడంతో మహిళలకు ఊరట లభించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇవ్వడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తమ పొరపాట్లను గుర్తించిన పోలీసులు న్యాయవాదులతో మాట్లాడి బెయిల్‌కు సహకరించండని కోరడం విశేషం.

Written by JayaPrakash Telangana

June 8, 2009 at 8:20 am

Leave a Reply