Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పంట భూములకు సెగపెడుతున్న సెజ్‌లు

leave a comment »

– వి. హనుమంతరావు

గొర్రెల మంద మనస్తత్వం మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందేమోననిపిస్తుంది. గ్రెనైట్‌, చేపల చెరువులు, సిమెంటు పరిశ్రమలు అందుకు ఉదాహరణలు. ఎవరో ఒకరిద్దరు ప్రారంభించి లాభాలు చేసుకోవటంతో, అందరూ ఆ పరిశ్రమ మీద పడిపోతారు. మంద ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుంది అన్నట్లు, ఇంతమంది ప్రవేశించటంతో, ఆ ఉత్పత్తులకు అంత మార్కెట్‌ ఉండకపోవటంతో, లేక మరే ఇతర కారణాల వల్లనో లాభాలు రాక ఉత్సాహం సన్నగిల్లుతుంది.

ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌ అని పిలుద్దాం) స్థాపనలకోసం దేశం అంతటా వేళం వెర్రిగా వెనకాలపడుతుంటే, పై అనుభవం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం సెజ్‌ల భవిష్యత్తు అంతా పచ్చగా కనపడుతుంది. రాష్ట్రంలో గ్రెనైట్‌ పరిశ్రమ కూడా ప్రారంభంలో అలాగే అనిపించింది. ఇప్పుడు దాని ఊసే వినపడటం లేదు. సెజ్‌లు కూడా అదే బాటలో పయనిస్తాయా? లేక, సిమెంటు పరిశ్రమలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరిస్తాయేమో. ప్రపంచీకరణతో పోటీ ఎక్కువైంది. మన ఉత్పత్తులు ప్రపంచ విపణిలో పోటీ పడాల్సి వస్తోంది. నాణ్యత, మన్నిక, ధరవరల విషయంలో, ఎగుమతులు చేసేటపుడు, అభివృద్ధి చెందిన, అలాగే వర్ధమాన దేశాలతో పోటీపడాలి. ఈ లక్ష్యంతోనే దేశంలోని పారిశ్రామికవేత్తలకు కొంత వెసులుబాటు కలిగించే ఉద్దేశంతో ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లను (ఇపిజడ్‌) ఏర్పాటు చేసింది. కొన్ని సౌలభ్యాలను అందచేసి, పోటికి అనువైన పరిస్తుతులు కల్పించింది. కాని ఈ ప్రయాత్నం పేలలేదు. మొత్తం ఎగుమతుల్లో ఈ మండళ్లు చేసిన ఎగుమతుల శాతం 2003-04లో అయిదు శాతం మాత్రమే వాటిలో పెట్టిన పెట్టుబడి మొత్తం ఫ్యాక్టరిలలో పెట్టుబడుల్లో 0.32 శాతం మాత్రమే. ఈ మండశ్లు స్థాపించినపుడు కూడా ఇప్పటిలాగే ఇల్లెక్కి అరిచారు. సెజ్‌ల విజయావకాశాల గురించి ఊహగానాలు చేసినపుడు ఈ అనుభవాన్ని గుర్తుంచుకోవాలి.

సెజ్‌కు సంబంధించిన బిల్లు 2005 పార్లమెంట్‌లో చట్టంగా రూపొందినా, దేశంలో అంతకుముందు నుంచే అక్కడక్కడ పని చేయటం ప్రారంభించాయి. చట్టంగా రూపొందిన తర్వాత ఊపందుకోవటం ప్రారంభమైంది. కాని సెజ్‌లు త్వరలోనే స్థాపించబడతాయని ఉప్పందుకొన్న బడా పారిశ్రామిక వేత్తలు వేలకు వేల హెక్టార్ల భూమి కొనుగోలు ప్రారంభించారు. అంచనాలు 2000 సంవత్సరంలోనే పదివేల హెక్టార్ల భూమిని ముంబై పరిసరాల్లో సేకరించి ఎనభై శాతం కొనుగోలు పూర్తి చేశారు. ఆ వ్యాపార సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఈ సెజ్‌లో మూడు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని, రెండు వందల మంది విదేశీ పెట్టుబడిదారులు క్యూలో నిల్చొన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో అంచనాలకు ఉన్న పలుకబడి ఏమిటో ఇది తెలియజేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వమే పద్నాలుగు వేల హెక్టార్లు సేకరించటాన్ని అక్కడి రౖెెతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మాకు భూమి బదులు ఉద్యోగాలు అవసరం లేదు. మా భూమి, మా చెట్లు, మాసముద్రం మాకున్నాయి. మేము కడుపు నిండాతింటున్నాం. మాకిదే చాలు’ అని రైతులు అంటున్నారు. పంజాబ్‌లో వ్యవసాయం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా ఉండదు. అలాంటి రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి సెజ్‌లు ఏర్పాటు చేయాల్సిందే అంటున్నారు. సెజ్‌లు ఏర్పాటు చేయాలంటే పంట భూమినేకదా స్వాధీనం చేసుకొనేది. అబ్బే, మేము ఎందుకూ పనికిరాని ఏర్ర భూములే స్వాధీనం చేసుకొంటున్నాం అని అధికారులంటున్నారు. అలాంటి భూముల్లో భూ గర్భ జలాలుండవుకదా. లక్షలు, కోట్లు ఖర్చు చేసి పెట్టుబడులు పేట్టేవారు అలాంటి భూములు తీసుకొంటారా? దేశం మొత్తం మీద ఒక లక్ష హెక్టార్లలో సెజ్‌లు వెలుస్తాయని ప్రస్తుత అంచనా. ఎంత పంట నష్టం అవుతుంది? ఎంతమంది నిరాశ్రయులవుతారు? స్వాధీనం చేసుకొనేవి పంట పండని భూములంటున్నారు. అంటే పంట పండని భూముల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారా? సంస్కరణలు ప్రవేశ పెట్టినప్పటి నుంచి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తూ పెట్టుబడులు పెట్టడం లేదని అందరూ విమర్శిస్తూ వచ్చారు. ఆ విషయాన్ని అంగీకరించిన ప్రస్తుత ప్రభుత్వం కూడా, బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణం మొత్తం పెంచడం తప్ప వ్యవసాయానికి చేసిందేమీ లేకపోగా, సెజ్‌ల కోసం-పరిశ్రమల కోసం రైతుల భూముల్నే స్వాధీనం చేసుకోవటం దారుణం. ప్రభుత్వం తలకాయలో పరిశ్రమల రంగమే ఇంకా తిష్టవేసుకొని కూర్చుందనడానికి వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడమే తిరుగులేని నిదర్శనం.

అభివృద్ధి కోసం వ్యవసాయ భూములను తీసుకోవటం తప్పదని అలా తీసుకోవడాన్ని విమర్శిస్తూన్నవారిని అభివృద్ధికి వ్యతిరేకులుగా ప్రభుత్వం చిత్రిస్తోంది. ఇప్పటికే నీటి పారుదల ప్రాజెక్ట్‌ల కోసం, భారీ పరిశ్రమల కోసం, రహదారులను వెడల్పు చేయటం కోసం రైతుల, గిరిజనుల భూములను నోటీసులిచ్చి స్వాధీనం చేసుకొంటున్న ప్రభుత్వం సరికొత్తగా సెజ్‌ల కోసం లక్ష హెక్టార్లను స్వాధీనం చేసుకోబూనుకోవటం, రైతులను వ్యవసాయాన్ని వెన్నుపోటు పొడవటమే. సంవన్నుల ప్రయోజనాలకోసం, రైతుల భూములను కైంకర్యం చేయటం, రైతులు రెచ్చిపోవడానికి దారి తీస్తుంది. ప్రయివేట్‌ రంగం సెజ్‌లలో పరిశ్రమలు పెడతానంటుంది. వారు పరిశ్రమలు పెట్టేది లాభం కోసమే కదా. వాళ్లకు భూమి కావాలంటే, రైతులు అంగీకరిస్తే వాళ్ల వద్ద కొనుక్కోమనండి. అంతేగాని పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం భూమిని సేకరించి వాళ్లకు అప్పచెప్పడమేమిటి? పెట్టుబడిదారులకు ప్రభుత్వం బ్రోకర్‌ పని చేపట్టిందా? రైతులను దబాయించి చవక ధరకు స్వాధీనం చేసుకొని హెచ్చు ధరకు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం చూస్తే రైతుల ప్రాణాలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందా అని అడగాలి. ఒకపక్క మార్కెట్‌ ఎకానమీ అంటాం. ఏ ధరకు కొనాలి, ఏ ధరకు అమ్మాలి అనేది మార్కెటింగు ఎకానమీ ప్రాథమిక సూత్రం. సెజ్‌ల విషయంలో మార్కెట్‌ ఎకానమీ సూత్రం వర్తించదా. మన్మోహన్‌జీ రైతు తన భూమిని తన ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకొనే హక్కులేదా?

పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌపిగ సౌకర్యాలకు, ముఖ్యంగా భూ సేకరణ విషయంలో ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందే అంటున్నారు ప్రభువులు. సెజ్‌లో భవనాలు, రహదారులు, ఇళ్లనిర్మాణానికి సిమెంట్‌ అవసరం. రైతులను తమ భూములను చవక ధరలకు అమ్మాలని ఎలా అంటున్నారో, సిమెంట్‌ కంపెనీలను కూడా సిమెంట్‌ను తక్కువ ధరకు అమ్మాలని ప్రభుత్వం అడుగుతుందా?
ఒక పక్క భూ సంస్కరణలు అమలుపరుస్తున్నాం, భూ స్వామ్య వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ, రెండో పక్క సెజ్‌ల పేరుతో కొత్త తరం భూస్వాములను సృష్టించటం, వేలకు వేల ఎకరాలు డెవలపర్స్‌కు ఇవ్వటం జరగటం లేదా? కొత్త జమీందారీ వ్యవస్థను సృష్టించటం లేదా? ప్రముఖ చరిత్రకారుడు సుమిత్‌ సర్కార్‌ ‘ఇది స్వతంత్ర భారతంలో అదిపెద్దదైన భూములను లాక్కొనే కుంభకోణం’ గా వర్ణించారు.

సెజ్‌లలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఆ ఉత్పత్తులు ఎగుమతి చేయాలనేది లక్ష్యం. అంటే సెజ్‌లో సింహభాగం పరిశ్రమలకు కేటాయించబడుతుందని అనుకొంటాం. కాని కేటాయించిన భూమిలో ఢెభై అయిదు శాతం పారిశ్రామికేతర అవసరాలకు కేటాయించాలని చట్టమే చెబుతుంది. ఇదేమిటని అడిగితే, భవనాలు, మాల్స్‌, గృహాలు, రహదారులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ (అంటే సినిమాలు, నైట్‌ క్లబ్‌లు) లాంటి వాటి కోసం ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులంటున్నారు. ఇది రియల్‌ ఎస్టేట్‌కు మరో పేరు మాత్రమే. సెజ్‌లో ఏర్పాటయ్యే సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇస్తే, అది రియల్‌ ఎస్టేట్‌కు రుణం ఇచ్చినట్లు భావించాలని రిజర్వు బ్యాంకు అదేశించింది. మరి రియల్‌ ఎస్టేట్‌ కాదంటారేమిటి? రైతుల భూములు లాక్కొనేది ఇందుకోసమన్నమాట. ఎగుమతులు చేయాలంటే పైనే చెప్పినట్లు తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఖర్చు తగ్గుతుంది. కాని ఢిల్లీ, ముంబై, చండీఘర్‌ లాంటి పట్టణాల పొలిమేరల్లో అత్యధికంగా ఏర్పాటు చేయబడుతున్నాయి.

సెజ్‌లో తమ వ్యాపకాలకు స్థలాలకోసం ఎక్కువగా ఎగబడుతున్నది ఐటి, ఐటిఇ కంపెనీలు. వీరంతా, ఇవన్నీ ఇప్పటి వరకూ పట్టణాల్లో, నగరాల్లో పనిచేస్తున్న సంస్థలే. సెజ్‌లకు ఇస్తున్న రాయితీలు,పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను నంజుకోవడానికి, వారు సెజ్‌లకు ఎగబడుతున్నారు. బయట ఉన్నప్పుడు కూడా ప్రోత్సాహకాలు అనుభవిస్తున్నాయి. అవికాక ఈ ప్రోత్సాహకాలు అదనం. ఏ ప్రోత్సాహకాలు లేకుండానే ఈ సేవా పరిశ్రమ ముప్ఫై శాతం వార్షికాభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు రెండు చేతుల్తో లాభాలు పోగేసుకొంటాయి. వాళ్ల లాభాల కోసం రైతులు నిర్వాసితులు కావాలన్నమాట. ఎగుమతులు ఏ ప్రోత్సాహకాలు ఇవ్వకుండానే పెరుగుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.అలాంటి నేపథ్యంలో, ఎగుమతులు పెంచటానికి ప్రత్యేకంగా రైతుల ప్రయోజనాలను బలిచేసి, సెజ్‌లు స్థాపించాలా? ప్రభుత్వం బలహీనతను కొంతమంది సొమ్ము చేసుకొంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం, ఒరిస్సాలోని విదేసీ పోస్కో ఉక్కు కర్మాగారం సెజ్‌లను ఏర్పాటుకు ప్రయత్నించడేమేమిటి? బయటనున్న పరిశ్రమలు తమకు కూడా సెజ్‌లో ఇస్తున్న మినహాయింపులు, ప్రోత్సాహకాలు (లెవెల్‌ ప్లేయింగు ఫీల్డ్‌) ఇవ్వాలని అంటున్నాయి.

సెజ్‌లో స్థాపించే పరిశ్రమలకు నేరుగా భూమిని కేటాయిస్తే అదో పద్ధతి. కాని భూమిని డెవలపర్స్‌కు ఇస్తున్నారు. వారు పెట్టుబడి పెడతారు కాబట్టి వారి లాభం వారు చూసుకొంటారు. ఆ ధరకు పారిశ్రామికవేత్తలు స్థలాలు తీసుకొని వారి లాభాలను కలుపుతారు. ఏతావాతా వినియోగదారుడి మీద భారం పడుతుంది. అక్కడే పని చేస్తూ అక్కడి ఇళ్లల్లో ఉండేవారు ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ సెజ్‌ల స్థాపన కామర్స్‌ మంత్రిత్వశాఖ బాధ్యత. లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటుంది.చిదంబరం, ఇచ్చే రాయితీల వల్ల లక్ష కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వస్తుందని అంటున్నారు. ఇది లాలూచీకుస్తీ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది, ప్రధాని ఓకే అన్నారు. ఇంత వరకూ అనుమతించిన సెజ్‌లను పరిశీలిస్తే 80.8 శాతం సెజ్‌లు కేవలం ఆరు రాష్ట్రాల్లో ఉంటాయి. ఇది ప్రాంతీయ అసమానతలను మరింతగా పెంచుతుంది.

వ్యవసాయాన్ని దెబ్బతీయటం, పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూర్చటం అనే ప్రపంచ బ్యాంకు విధానాన్ని ఈ సెజ్‌లు మరింత ముందుకు తీసుకుపోతాయి.

ప్రోత్సాహకాల పట్టికను పరిశీలిస్తే, విదేశీ పెట్టుబడులకు ఈ సెజ్‌లు అడ్డాగా మారుతాయి. వాటన్నిటికీ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. లాభాలు, డివిడెండ్లు, జీతనాతాలు అన్ని విదేశాలకు తరలిపోతాయి.
పారిశ్రామికేతర అవసరాలకు ఢెబ్భై అయిదు శాతం ప్రాంతాన్ని కేటాయించుకోవచ్చునన్న సౌలభ్యాన్ని యాభైశాతం మాత్రమే అనుమతిస్తూ పశ్చిమ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వ విధానాన్ని అంగీకరిస్తే, సెజ్‌ల ఏర్పాటుకు వామపక్షాల సూత్రప్రాయ అంగీకారం తెలియచేసింది. సెజ్‌ల్లో కార్మిక హక్కులకు స్థానం లేదు. కార్మిక సంబంధిత చట్టాలు వర్తించవు. రైతుల భూముల అక్రమణ, కార్మిక హక్కుల కాలరాయడం, ప్రభుత్వ ఆదాయం కోల్పోవడం, విదేశీ పెట్టుబడులకు మరింతగా తెరిచిన ద్వారాలు క్లుప్తంగా ఇదీ సెజ్‌ స్వరూపం.

తాజా స్పందన : ఈ నెల 15వ తేదిన కామర్స్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె. పిళ్లే హైదరాబాద్‌లో సెజ్‌ల గురించి ప్రసంగిస్తూ, ఇప్పటి వరకూ అనుమతి ఇచ్చిన సెజ్‌ల కోసం 34,510 హెక్టార్ల భూమి మాత్రమే అవసరమవుతుందని, ఇది దేశంలోని మొత్తం పంట భూమిలో 0.000012 శాతం మాత్రమేనని, ఇంత తక్కువ భూమి వ్యవసాయానికి ఎలా నష్టం కలుగ చేస్తుందని, ఆహార భద్రతకు ఎలా భంగం కలిగిస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తలను ఎద్దేవా చేశారు. ఈయన వాదన ఒక కథను గుర్తుకు తేస్తోంది. ఒక రాజుగారి ఇంట్లో వివాహ సందర్భంలో ఉళ్లో ఉన్న వారంతా ప్రతి ఒక్కరూ ఒక చెంబుడు పాలు గంగాళంలో పోయాలని ఆదేశించారు. అందరూ పాలే పోస్తారు నేనొక్కడిని నీళ్లు పోస్తే ఏమీ కాదుకదా అని ప్రతీ ఒక్కరూ నిళ్లే పోసే సరికి సాయంత్రానికి గంగాళంలో అన్నీ నిళ్లే వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక శాఖలు భూమిని సేకరిస్తున్నాయి. రహదారులు, భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, భారీ పరిశ్రమలు, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు భూమిని సేకరిస్తున్నాయి. కామర్స్‌ శాఖ ముప్ఫైనాలుగు వేల హెక్టార్లే ఆక్రమించవచ్చు కాని, కేంద్ర ప్రభుత్వంలో పని చేసే కార్యదర్శికి ఒక విశాలమైన ధృక్పథం ఉండాలి కదా. అన్ని శాఖలు లక్షల హెక్టార్లు సేకరిస్తుంటాయి. ఇదేదో ఒక్కసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి సేకరణ నిరంతర ప్రక్రియ. ఇలా సేకరిస్తూపోతుంటే సాగుభూమి విస్తీర్ణం తగ్గుతూపోతే, అది ఆహార భద్రతకు భంగకరం కాదా? మొత్తం దేశంలో తన శాఖ ఒక్కటే, అది కూడా ముఫ్పైనాలుగు వేల హెక్టార్లు మాత్రమే స్వాధీనం చేసుకొన్నట్లు మాట్లాడతారేమిటి? పిళ్లే పిన్‌ హోల్‌ దృష్టిని సవరించుకొంటే మంచిది.

Advertisements

Written by Polepally InSolidarity

December 1, 2006 at 2:17 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: