Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

రాజ్యాంగాతీతమయిన అధికారాలతో కొత్త రాజ్యాలు

leave a comment »

– మాడభూషి శ్రీధర్‌

తీవ్ర విమర్శలు, రాజ్యాంగ వివాదాల మధ్య స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ల ఆవిర్భావం జరుగుతున్నది. ముమ్మరమయిన అభివృద్ధికి వేలకోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్‌ఇజడ్‌లు వేదికలు కాబోతున్నాయి. విదేశీ పెట్టుబడులు, ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధానాలు, శాసనాల పట్టు సడలింపులతో సహా అనేకానేక మినహాయింపులతో ప్రత్యేక సదుపాయాలతో, ఎస్‌ఇజడ్‌లు ఈ దేశ స్వరూపాన్ని మార్చబోతున్నాయి. అది మంచికేనా? ఎవరి మంచికోసం? ఈ దేశం సుస్థిర ప్రగతికి ఎస్‌ఇజడ్‌లు పునాదులా? కాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివాదాలు చెలరేగుతున్నాయి.

కనీసం నాలుగువందల ఎస్‌ఇజడ్‌లు అవతరించడానికి శరవేగంగా నిర్మాణాలు, వనరుల కల్పన జరిగిపోతున్నది. అరచేతిలో స్వర్గాలు అవతరించబోతున్నాయి. వీటి స్థాయి ప్రపంచ స్థాయి. కనీసం అయిదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మాణమయ్యే ఈ సముదాయాలకోసం భూమి సేకరణకు కనీసం రు. 9,325 కోట్ల రూపాయలువెచ్చిస్తారు. మరో ఎనిమిది వేలకోట్లతో 2000 మెగావాట్ల విద్యుచ్ఛక్తి, రు. 800 కోట్లతో డీసాలైనేషన్‌ ప్లాంట్‌, రు. 200 కోట్లతో విమానాలు దిగడానికి చిన్న ఎయిర్‌పోర్ట్‌, రు. 500 కోట్లు ఖర్చుచేసి ఒక జెట్టీ రెండు బెర్త్‌లతో చిన్న రేవు మొదలయిన సర్వహంగులతో ఈ చిన్ని నగరాలు మొత్తం 18 వేల 825 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకోబోతున్నాయి. కనీసం 263 కంపెనీలు అనుమతులు అందుకున్నాయి. మరో 169 కంపెనీలకు అనుమతులు లభించడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలో రెండు ఎస్‌ఇజడ్‌లకు 30 వేలకోట్లరూపాయలను గుమ్మరించడానికి రిలయన్స్‌ సిద్ధంగా ఉంది. హర్యానాలో మరో ప్రత్యేక ఆర్థిక మండలానికి 40 వేలకోట్లు వెచ్చించడానికి కూడా రిలయన్స్‌ వెనుకాడడం లేదు. అమృత్‌సర్‌, అంబారా, లుధియానా, గుర్‌గాంవ్‌లలో నాలుగింటికి 41 వేలకోట్ల రూపాయలతో డిఎల్‌ఎఫ్‌ ముందుకు వస్తున్నది. హర్యానా హిమాచల్‌ ప్రదేశ్‌లలో రెండింటికోసం డిఎస్‌ గ్రూప్‌ 12 వేల కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించింది. పూణే మంగళూర్‌లలో వేయి కోట్ల కన్న ఎక్కువ ఖర్చుతో భారత్‌ ఫోర్జ్‌, వీడియోకాన్‌, సుజ్లాన్‌ మొదలయిన కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వీరంతా కలిసి మూడు లక్షల హెక్టార్ల భూమి కొని పెద్దపెద్ద ఫ్యాక్టరీలకు, ఐటి పార్క్‌లకు, కార్యాలయాల కాంప్లెక్స్‌లకు, గోదాములకు, నివాస నిలయాలకు ఆలవాలమయిన నగరాలను నిర్మిస్తారన్నమాట.

దాదాపు మూడు లక్షల హెక్టార్ల భూమిని కొని అభివృద్ది చేసి విదేశీ స్వదేశీ పారిశ్రామిక వేత్తలకు అద్దెకు ఇచ్చే కార్యక్రమం ఇది. ఇది వరకు ప్రభుత్వం పారిశ్రామిక వాడలను నిర్మించింది. ఇప్పుడా పని ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించారన్న మాట. చదరపు అడుగు నేలకు 138 రూపాయల కనీస ఖర్చు లెక్క వేస్తే 3 లక్షల 30 కోట్ల పెట్టుబడి అవసరం. ఇంకా పారిశ్రామిక వేత్తల అవసరాలకు అనుగుణంగా మలచడానికి ఖర్చు కూడా లెక్క వేస్తే పెట్టుబడి 5 లక్షల 50 వేల కోట్లు దాటుతుంది. ఈ దేశపు జిడిపిలో 10 నుంచి 17 శాతం సొమ్ముతో సమానమయిన నిధిని ఈ విధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పెట్టబోతున్నారు. ఎన్నో దేశాల్లో ప్రభుత్వమే ఇటువంటి జోన్‌లను నిర్మించింది. కాని ప్రైవేట్‌ సంస్థలు నిర్మించి లాభాలుచేసుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. ఈ జోన్‌లలో ఇతర ప్రైవేట్‌ పారిశ్రామిక వేత్తలు మరిన్ని వందల కోట్లు పెట్టుబడితో వారి ఫ్యాక్టరీలు కట్టుకున్నారు. ఆ విధంగా కట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. దుబాయ్‌లో జెబెల్‌ ఆలీ ఫ్రీజోన్‌ అనే అతి పెద్ద సంస్థ 5 వేల వ్యాపార కేంద్రాలకు తగిన వనరులు లభించాయి. దుబాయ్‌ పాలకుడు షేక్‌ రషీద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తూం ఈ ప్రాజెక్టులో 3 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు ధారపోసాడు. తరువాత జెబెల్‌ అలీ ఫ్రీజోన్‌ గా పేరు పొందింది. రాజుగారు పెట్టుబడులను తిరిగివసూలు చేయబోనని మాఫీ చేసాడు. అప్పడికా డబ్బు విలువ 9 బిలియన్లడాలర్లు. ఆతరువాత దాని యాజమాన్యం జెబెల్‌ అలీ ఫ్రీజోన్‌ యాజమాన్య అథారిటీకి మారింది. ఈ వాణిజ్యసంస్థ ప్రభుత్వ మద్దత్తుతో పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, పారిశ్రామిక ఉత్పత్తులు పెంచడానికి దోహదపడుతూ, పన్ను మినహాయింపులు ఇస్తూ, చమురు లాభాలలో కొంత దీనికి మళ్లిస్తూ జోన్‌ను నిలబెడ్తున్నాయి. అంటే భూములు కొని రోడ్లు వేసినంత మాత్రాన పెట్టుబడులు విదేశీ పరిశ్రమలు వస్తాయని అనుకోవడానికి వీల్లేదని ఈ దుబాయ్‌ అనుభవం నుంచి గ్రహించాలి. చమురు నిధులు పుష్కళంగా ఉండి, రాయితీలు ఇచ్చే అవకాశాలు చూపి, ఇతర సదుపాయాలు కల్పించి ఈ జోన్‌ నిలబడిపోయింది. భారత దేశానికి ఇది సాధ్యమా అని ఆలోచించవలసిన అవసరం ఉంది.

అందరికీ లాభాలువచ్చేనా

చైనాలో కూడా ముందు ప్రభుత్వ పెట్టుబడులు బ్యాంకు రుణాలతోనే ఈ జోన్‌లు నిలబడ్డాయి. వాటి ఆశయం లాభాలు కాదు, పరిశ్రమలు ఎక్కువగా వచ్చే ప్రయత్నాలు చేయడం. మనదేశంలో పరిస్థితి వేరు. ఇక్కడ ప్రయివేట్‌ సంస్థలు లాభాపేక్షతో జోన్‌లు అభివృద్ధికి ముందుకు వస్తున్నాయి. కాని అందరికీ లాభాలు వస్తాయా? ఇన్ని చోట్ల వందలాది ప్రత్యేకజోన్‌లు కట్టి లాభాలు సంపాదించగలవా అన్నది అసలయిన ప్రశ్న. చెన్నయ్‌లో మహింద్రా వరల్డ్‌ సిటీ ఎస్‌ఇజడ్‌ 1400 ఎకరాల్లో ప్రస్తుతం 35.4 కోట్ల నష్టంతో ఉందని బిజినెస్‌ పత్రికలు రాస్తున్నాయి. నవీ బొంబయ్‌లో రిలయన్స్‌ వారు తమకు మొదటి దశలో 90 శాతం అమ్ముడయితే వేయి కోట్ల లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ లాభాలు ఎలా వస్తాయి? ఎవరికి వస్తాయి? ఎప్పుడు వస్తాయి? అనేవి అసలయిన ప్రశ్నలు. దీనికి భూములు సేకరణ కోణం, రైతుల ఆక్రందనల కోణం కూడా జత అవుతాయి. మార్కెటింట్‌ తెలివి తేటలు జోడించి రైతును తక్కువ ధరకే అమ్మేట్లు బుట్టలోకి దింపి తరువాత పెద్ద పెద్ద సంస్థలకు పెద్దధరలకు అమ్మి లాభాలు చేసుకోవడం ఈ జోన్‌ నిర్వాహకుల వ్యూహం అయి ఉండాలి.

చట్టాలకు అతీతం, రాజ్యాంగానికి దూరం

ఈ సమస్య కాకుండా మరొక ప్రమాదం ఉంది. ఈ ప్రత్యేక జోన్‌లన్నీ కప్పంగట్టకుండా ఎగవేసి స్వతంత్రం ప్రకటించుకున్న మాజీ సామంత రాజుల స్థాయినుంచి సార్వభౌమ కేంద్రాలుగా ఎదగడమే ఆ ప్రమాదం. ఎస్‌ఇజడ్‌ల చట్టం 2005 లో సెక్షన్‌ 49 అసలు సిసలు నియమం ఉంది. ఏ కేంద్ర చట్టంకూడా ఈ ఎస్‌ఇజడ్‌లకు వర్తించదు, ఏ కేంద్ర చట్టంలో నియంత్రణకూడా ఈ ఎస్‌ఇజడ్‌లపైన పనిచేయదు అని ఈ సెక్షన్‌ చెప్తున్నది. మంచినీటిసరఫరాతో సహా రోగాల నియంత్రణదాకా అన్ని పనులూ ఈ ఎస్‌ఇజడ్‌ల నిర్వాహకులే చేయాలి. చేసారో లేదో అడిగే చట్టపరమయిన అధికారం ఎవరికీ లేదు. చావులు పుట్టుకల ధృవీకరణ కూడా ఈ ప్రయివేటు కంపెనీలు చేయవచ్చు.

కనీసం ఈ చిన్న చిన్న సామ్రాజ్యాల్లో పనిచేసే వారికి తమ ప్రతినిధిని ఎన్నుకునే ప్రజాస్వామిక అధికారం లేదు. 74వ రాజ్యాంగ సవరణ ఈ మండలాలకు వర్తించదు. ఇక్కడ పారిశ్రామిక వివాదాల చట్టం, కంట్రాక్టు లేబర్‌ చట్టం, వీటికి రాష్ట్రాలు చేసిన సవరణల విషయంలో కార్మికులకు జనరల్‌గా నోటీసులు జారీ చేసారు. మహారాష్ట్ర మరొక అడుగు ముందుకు వేసి ఈ ఎస్‌ఇజడ్‌లన్నీ పబ్లిక్‌ యుటిలిటీ సర్వీసులని ప్రకటించింది.

ఎస్‌ఇజడ్‌ మండలాలలోని పరిశ్రమలన్నీ పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు ఇవ్వనవసరం లేదు. అంతేకాదు పర్యావరణ పరమయిన అభ్యంతరాలను జనం చెప్పుకోవడానికి వీలుగా బహిరంగ విచారణ జరపాల్సిన బాధ్యత కూడా లేదు.

ఈ మండలాల్లో పరిశ్రమలు విద్యుత్‌ చట్టం, విద్యుత్‌ పరమయిన పరిమితులకు కూడా లోబడి ఉండవు. ఆయా చట్టాలు ఇక్కడ వర్తించవు.

నష్టపోయిన మండలాలలను ఎస్‌ఇజడ్‌ల గుర్తింపు నుంచి మినహాయించి వేల హెక్టార్ల నేలను విముక్తి చేయడానికి వీల్లేదు. స్థూలంగా ఇవీ ఎస్‌ఇజడ్‌ల సర్వస్వతంత్ర, సర్వసత్తాక సార్వభౌమ నియమాలు. రిలయన్స్‌ వంటి స్వదేశీ సంపన్నులు గానీ లేక మరే విదేశీ సంపన్న సంస్థగానీ ఒక్క ఎస్‌ఇజడ్‌ పెడతే చాలు, అక్కడ వారిదే ఇష్టారాజ్యాం, ఇష్టారాజ్యాంగం. అదొక చిన్న రాజ్యం. ఆ ప్రభువులపైన ఏ దేశ శాసనాలూ కొరడా ఝళిపించడానికి వీల్లేదు. కనీసం వీరు తమదైన ఏ శాసనానికయినా బద్ధులవుతారో లేదా అని అడగడానికి కూడా వీల్లేదు. వీరు మన భారత రాజ్యాంగం నుంచి కూడా విముక్తులా కాదా అని రాయలేదు కాని, ఎస్‌ఇజడ్‌ల చట్టం, 2005 నియమాల జోరు చూస్తే రాజ్యాంగం కూడా కేంద్ర శాసనమే కనుక అదీ వర్తించదనే సాధారణ మినహాయింపు ఉంది కనుక అది మాత్రం వర్తించడం ఎందుకని ఈ కంపెనీల తరఫున నిపుణులయిన లాయర్‌ శిఖామణులు వాదించే అవకాశాలు లేకపోలేదు. కార్పొరేట్‌ ప్రభువుల సొంత నియంతృత్వ పాలనకు ఈ ఎస్‌ఇజడ్‌ చట్టం ఒక పూలబాట, ఎర్ర తివాచీ. మనకు మనమే ప్రభువులం, ఈ దేశ పౌరులే ఈ దేశానికి ఇచ్చుకున్న అద్భుత శాసనమాతృక అయిన రాజ్యాంగం అనిమనం గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు ఎందుకుంటే ఆ సర్వ స్వతంత్ర భావనకు, రాజ్యాంగ రక్షణా పరిధికి ఈ చట్టం ద్వారా ఎస్‌ఇజడ్‌లకు మినహాయింపు ఇచ్చేసింది.

అటు పర్యావరణ శాసనాలూ వర్తించవంటూ, ఇటు కార్మిక శాసనాలనుంచీ మినహాయింపులిచ్చి, విద్యుచ్ఛక్తి ఇతర అంశాలన్నీ మీ ఇష్టమే అంటూ వదిలేసే ఈ సరికొత్త ‘మండలాధీశుల’ రాజ్య చట్టాన్ని చేయడం తీవ్రమయిన విషయం. నిజానికి పర్యావరణం, విద్యుచ్ఛక్తి, కార్మికులు అనే అంశాలపైన కేంద్ర రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చునని రాజ్యాంగం అధికార విభజన నియమాలలో వివరించింది. ఎస్‌ఇజడ్‌ల విషయంలో ఈ అంశాలపైన శాసనాలు చేసే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలేసింది. అంటే తమకు తోచిన విధంగా శాసనపరమయిన వరాలు ఇచ్చుకునే వీలు ఆయా రాష్ట్రాలకు ఉందన్నమాట. ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలనిర్మాణానికి ఇంకా ఎక్కువ మినహాయింపులు ఏమయినా అవసరమో కాదో నిర్ణయించి ఆయా కొత్త నియమాలను రాష్ట్ర శాసనాల్లో చేసుకోవచ్చునన్న మాట. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తమకు అనుకూలమయిన నియమాలు చేసుకున్నాయి. చట్టం కింద రూల్స్‌ చేసుకునే స్వతంత్రం రాష్ట్రాలకు ఉంది. కేంద్రం పరిధిలోనే కార్మిక చట్టాలనుంచి అన్ని ఎస్‌ఇజడ్‌లకు మినహాయింపు ఇద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. కాని వామపక్షాల వత్తిడుల వల్ల ఆ పని మానుకుని, ఆయా అంశాలను రాష్ట్రాలు మినహాయించవచ్చని ఒక వెసులు బాటు కల్పించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఈ అధికారాన్ని వినియోగించుకుని, ప్రత్యేక హోదాలను ఎస్‌ఇజడ్‌లకు కట్టబెట్టవచ్చు. మహారాష్ట్ర ఈ మండలాల్లో కాంట్రాక్టు కార్మికుల చట్టం సెక్షన్‌ 10(2) వర్తించదని పేర్కొంది. దీని అర్థం అంటే శాశ్వతంగా తాత్కాలిక కార్మికులను నియమించి వారిని పనిదోపిడీకి గురి చేసే సర్వాధికారాలు ఉంటాయన్న మాట. ఇక ఈ మండలాల్లో ఏ విధమయిన పరిశ్రమలు ఉన్నాసరే, ఉదాహరణకు కోకా కోలా బాట్లింగు కంపెనీ అయినా సరే, ప్రజాప్రయోజనాలకు అవసరమైన సేవా సంస్థలుగా గుర్తించుతారన్న మాట. చట్టం తెలియని వారికి ఇది మంచిదే అనిపిస్తుంది. కాని దీని అర్థం సమ్మెల పైన నిరంతర నిషేధం అని తెలుసుకోవాలి. పర్యావరణ సమస్యలు ఎన్ని ఉన్నా సరే, అనుమతులు రాబోవని భయపడనవసరంలేదు, ఈ మండలంలో మీరు ఫ్యాక్టరీ పెడితే చాలు, అ మినహాయింపులన్నీ అత్యంత సులువుగా ఏ ఇబ్బంది లేకుండా లభిస్తాయి. ఇక్కడి ఫ్యాక్టరీ పరిశ్రమల్లో కాలుష్యం, ఉత్పత్తి వల్ల పర్యావరణానికి కలిగే ప్రతికూల ప్రభావాలపై అంచనా వేసే అవసరం నుండి మినహాయింపు ఉంది. పర్యావరణ అనుమతులు ఏవయినా అవసరమయితే ఆయా ఎస్‌ఇజడ్‌ల డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ గారు సంబంధిత కాలుష్య నియంత్రణ అధికారిని సంప్రదించి ఇచ్చేస్తారని కొన్ని రాష్ట్ర నియమాలుచెప్తున్నాయి.

ఇది కాకుండా ఈ ఎస్‌ఇజడ్‌లకు కేంద్ర చట్టాల నియంత్రణనుంచి తప్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంటే ఒక జీవో జారీచేయడం ద్వారా ప్రభుత్వం అనేక చట్టాల బాధలనుంచి వీటిని విముక్తంచేయ వచ్చునన్నమాట. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ ఎస్‌ఇజడ్‌లు భారత రాజ్యాంగం పరిధికి లోబడి ఉండవు. చట్టాల కింద బాధ్యతలేమీ ఉండవు.

ఉదార విధానాల్లో మరీ ఉదారమయిన యుగానికి ఎస్‌ ఇ జడ్‌లు తెరలేపుతున్నాయి. మన శాసనాలు ప్రగతినిరోధక శాసనాలనీ ప్రపంచంతో పాటు మన ప్రభుత్వంకూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. కనుక ఈ నిరోధక నియమాలనుంచి పరిశ్రమలను ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా విముక్తి ఇవ్వడానికి ప్రభువులు ప్రయత్నిస్తున్నారు.

ప్రయివేట్‌ రంగంలో ఎస్‌ఇజడ్‌లను నెలకొల్పే కొత్త ప్రక్రియను దాదాపు గా భారతదేశమే ప్రారంభించిందనవచ్చు. ప్రైవేట్‌ రంగంలో విస్తృతమయిన ప్రగతి సాధించిన పాశ్చాత్య దేశాల్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో జోన్‌ల ఏర్పాటు జరగలేదు. ఇక వాణిజ్యశాఖ అయితే ప్రగతి సాధనలో ఎంత ఆతురతగా ఉందంటే వీలయినన్ని జోన్‌లు వెంటవెంటనే అనుమతించడానికి తొందరపడుతూనే ఉంది. ఓ ఇరవై లేదా ముఫ్పయ్‌ జోన్‌లకు వారంరోజుల్లో అనుమతి ఇవ్వడం లేదా ఇచ్చి తీరతాం అని హామీ అయినా ఇవ్వడం జరిగిపోతూనే ఉంది.

ముంబయ్‌ నేలపై రెండుజోన్‌లు స్థాపించి 120 చదరపు కిలోమీటర్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పే సువర్ణావకాశం రిలయన్స్‌ వారికి లభించింది. చైనాలో ఇంతకన్న మూడింతలు పెద్ద మండలం 326 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జోన్‌ ఉంది. చండీఘర్‌లో 112 చకిమీ, జంషెడ్‌పూర్‌లో 64 చ కిమీ సైజు జోన్‌లు వస్తున్నాయి. తమ జోన్‌లో పదిలక్షలమందికి ఇళ్లు నిర్మించాలని, మరో 20 లక్షల మందికి ఇళ్లు కట్టుకునే బాధ్యతలను పరిశ్రమలకు అప్పగించాలని రిలయన్స్‌ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నది. అంటే మిలియన్ల జనాభా నివసించే నగరాలను నిర్మించే అవకాశం ఈ ఎస్‌ఎజడ్‌ల కింద ఉన్నపుడు వారికి స్థానిక పాలనా మండలులకుండే సంక్షేమ బాధ్యతలేమీ ఉండవా, వారు ఏ పాలనా పరిధిలోకి రావా? అంటే రావనే దీని అర్థం. అక్కడిక్కడ ఆయా జోన్‌ నిర్వాహకులే సార్వభౌములన్నమాట.

ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలను నిర్మిస్తున్న సంస్థ ప్రతినిధి (ప్రభుత్వ ప్రతినిధి కాదు) ఈ ఎస్‌ఇజడ్‌ అభివృద్ధి అథారిటీ (ఎస్‌డిఎ) ముఖ్యఅధికారిగా వ్యవహరిస్తారు. ఒక డెవలప్‌మెంట్‌ కమిష్నర్‌ను రాష్ట్రం నియమిస్తుంది. ఈ కమిష్నర్‌ ఇతర ఏ అధికారులకు లేనన్ని విపరీత అధికారాలతో రంగంలోకి దిగుతారు. రాష్ట్రాలు ఈ ఎస్‌ఇజడ్‌లకు పారిశ్రామిక పట్టణాల స్థాయి కల్పిస్తున్నది కనుక ఈ డెవలప్‌మెంట్‌ కమిష్నర్‌లు మునిసిపల్‌ లేదా మరే ఇతర స్థానిక సంస్థల పరిధిలోకిరారు. స్థానికపాలనా సంస్థ విధులను అధికారాలను అంటే పన్ను వసూలు, నీటిసరఫరా, శాంతి భద్రతలు కల్పించే బాధ్యత ఈ అథారిటీలపైన ఉంటుంది. కొన్ని చోట్ల ఈ అథారిటీలకు పుట్టుక మరణాల సర్టిఫికెట్ట్‌ జారీచేసే అధికారం ఇచ్చారు. స్మశాన వాటికలు నిర్వహించే బాధ్యత ఇచ్చారు. ఇవన్నీ మునిసిపల్‌ అధికారాలని 12 వ షెడ్యూలు (రాజ్యాంగం) లో పేర్కొన్నారు. వీథులు, రోడ్ల నిర్వహణ, చిన్న వంతెనల నిర్మాణం, రోగాల నిరోధపోరాటం అన్నీ వీరి అధికార పరిధిలోనివే. కాని ఈ పనులు చేయకపోతే జరిమానాలు ఏమిటో ఈ నియమాల్లో లేదు. స్థానిక పాలన గానీ జవాబుదారీ గాని ఏమీ ఉండవు. కాని అన్ని పాలనాధికారాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక్కడ నివసించే వారికి అన్ని రకాల సేవలందించే బాధ్యత మునిసిపాలిటీలకు ఉన్నట్లుగా నిర్ధారించలేదు. ఒకవేళ ఎవరయినా పౌరుడికి సేవలే లభింపకపోతే ఎవరిని ఎక్కడ నిలదీయాలి ఆ హక్కు ఉందా అంటే లేదు. కోర్టులో పడితే తప్ప ఈ అంశాలు బయటకు రావు. లాభాల సంపాదించాలన్న లక్ష్యంలో పడి ఈ సేవలను తగ్గించినా, నిరాకరించినా అడిగే హక్కు లేదు.

ఎస్‌ఇజడ్‌లలో విదేశీ పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది కలుగకుండా ఈ వివాదమయినా పరిష్కరించడానికి ఫాస్ట్‌ ట్రాక్‌ న్యాయవ్యవస్థలను నిర్మిస్తారు. ఈ మండలాల్లోగాని, అవతల గానీ ప్రత్యేక కోర్టులను నిర్వహించేందుకు అనుమతించే అధికారం కేంద్రానికి ఉంది.

స్థానిక స్వపరిపాలన గానీ, మునిసిపాలిటీ తరహాలో పాలనా వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఇబ్బందులు రావచ్చు. జంషెడ్‌పూర్‌ లో పరిశ్రమలను టాటా వారు నిర్వహిస్తున్నారు. 70 శాతం మంది టాటా పరిశ్రమల్లో పనిచేసే వారే. ఇప్పుడు వారికి అన్ని సౌకర్యాల కల్పన బాధ్యత టాటాదే. జార్ఖండ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతానికి మునిసిపాలిటీస్థాయి కల్పించాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. 30 సంవత్సరాల కాలానికి భూమిని టాటాకు లీజుకు ఇచ్చారు. ఈలీజును కొనసాగించే దశలో మునిసిపాలిటీ వ్యవహారం పరిశీలనకు వస్తుంది. కాని ప్రైవేట్‌ భూములను ప్రభుత్వ భూములను కొనివేసిన పక్షంలో ఎస్‌ఇజడ్‌ల మీద ఎవరికీ ఏ దశలోనూ ఏవిధమయిన పరిమితి ఉండే అవకాశం ఉండదు. ఎన్ని లక్షలమంది నివసించినా వారికి స్థానిక స్వపాలనాధికారం రాకపోవచ్చు.
ఈ మండలాలు ఆర్థిక వివక్ష అనే కొత్త సామాజిక దురాచారానికి దారి తీసే అవకాశం ఉందని ప్రశాంత్‌ భూషణ్‌ వంటి న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే ఎస్‌ ఇ జడ్‌లలో లభించే విపరీతమయిన మినహాయింపులు, ప్రయోజనాలు బయట ఉండే పరిశ్రమలకు లభించవు. ఆ పరిశ్రమలు ఇందులో ఉన్న పరిశ్రమలతో ఆర్థికంగా పోటీపడడానికి అవసరమయిన సమానతను ఈ మినహాయింపులు దెబ్బ తీస్తుంటాయి. ప్రయివేటీకరణలో శరవేగంగా అభివృద్ధిసాధించడానికి ఇదొక వెసులు బాటు అని పాలకులు సమర్థిస్తున్నారు. విమర్శకులు మాత్రం కొత్త రాజరిక వ్యవస్థకు ఇది తెరలేపుతున్నదని విమర్శిస్తున్నారు.

ఇక కోర్టులే దిక్కు:

అసమానతలు ప్రత్యేకతలు సృష్టించి, అనేక జనబాహుళ్య శాసనాలనుంచి మినహాయించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఇప్పడికే అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయినాయి. నోయిడాలో రిలయన్స్‌ వారి ఎస్‌ఇజడ్‌ పైన భూసేకరణ, భూమి కేటాయింపు పైన దాఖలయిన పిల్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్‌ ఎస్‌ ఇ జడ్‌ల ఏర్పాటు కోసం వ్యవసాయ భూములను పారిశ్రామిక ప్రయోజనాలకు మళ్లించడాన్ని సవాలుచేస్తూ ఒక పిల్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసారు. ఎస్‌ ఇ జడ్‌ చట్టం 2005 రాజ్యాంగ అధికరణాలు 14, 19, 21, 301 ని భంగపరుస్తున్నదని కనుక చెల్లదని, ఆదేశిక సూత్రాలకు కూడా పూర్తిగా ఈ చట్టం వ్యతిరేకమని, పార్లమెంట్‌ తన అధికార పరిధికి మించి శాసనంచేసిందని ఈ పిల్‌లో సవాలుచేసారు. స్థానిక పాలననుంచి మినహాయించి, బాలకార్మిక, కార్మిక చట్టాలనుంచి మినహాయించి రాజ్యాంగ నేరానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

Advertisements

Written by Polepally InSolidarity

December 1, 2006 at 2:26 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: