Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ (సెజ్‌) – ఒక పరిశీలన

leave a comment »

– సురవరం సుధాకర రెడ్డి

ప్రత్యేక ఆర్థిక మండళ్లులేక స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ (సెజ్‌) కోసం చట్టం 2005 మే నెలలో పార్లమెంటులో ఆమోదింపబడి అమలులోకి వచ్చిన తర్వాత తీవ్రంగా వివాదాస్పదమైంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో తీవ్ర విమర్శలకు గురైన చట్టం బహుశా ఇదే.

ఎగుమతి ఆర్థిక మండళ్ల పేరుతో ఇలాంటి ప్రత్యేక సంస్థలు గతంలో మనదేశంలోనూ, ఇతర దేశాలలోనూ అమలులో ఉండేవి. కాని ఇవి చాలా పరిమితంగా ఉండేవి. 1986 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 176 ఎగుమతి మండళ్లు 47 దేశాల్లో ఉండేవి. ప్రపంచీకరణ వేగవంతమయ్యేసరికి 116 దేశాల్లో 3000కు పైగా ఇలాంటి మండళ్లు ఏర్పాటయ్యాయి.

మన దేశంలో టాటా కంపెనీ 1977లోనే బుర్రోస్‌ అనే అమెరికన్‌ కంపెనీతో సాఫ్ట్‌వేర్‌ పరికరాల ఎగుమతి కంపెనీని ఏర్పాటు చేశారు. అలాగే ముంబాయిలో 1987-88లో ఆధునిక ఆభరణాల యూనిట్‌ను (సీపిజడ్‌) ఏర్పాటు చేశారు. ఈ రెండింటి నుంచి కూడా ఎగుమతులు చాలా పుంజుకున్నాయన్న వాదన ఉంది. ఆభరణాల తయారి భారతదేశంలో సంప్రదాయకంగా విశ్వకర్మలు తమ ఇళ్లలో, చిన్న దుకాణాల్లో ఉత్పత్తి చేసే పరిశ్రమ. లక్షలాది మందికి స్వయం ఉపాధి కల్పించే పరిశ్రమ. ఆధునిక యంత్రాలతో ఈ జోన్‌ ఏర్పాటైన తర్వాత ఆభరణాల తయారి బాగా పెరిగింది. 2002-03లో మొత్తం ఆభరణాల ఎగుమతితో 55 శాతం ఈ మండళ్ల నుంచే జరిగింది. ఆధునిక యంత్రాల వాడకం ఈ రెండు దశాబ్దాల కాలంలో దేశీయ ఆభరణాల తయారిలోకి కూడా జొరబడి లక్షలాది స్వర్ణకారుల పొట్టకొట్టింది. చిన్న గ్రామాలలో, మండల కేంద్రాలలో తయారైన ఆభరణాల అమ్మకందార్లు ఏర్పడ్డారు. పెట్టుబడి పెట్టలేని స్వర్ణకారులు (వీరే అత్యధికులు) నిరుద్యోగులయ్యారు. ప్రజల ఆదాయం పెరిగింది. బంగారం కొనుగోలు పెరిగింది. కానీ స్వర్ణకారులు నిరుద్యోగులు కావడం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐటి రంగానికి చెందిన కుటీర పరిశ్రమలు లేవు గనుక సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఎగుమతులు, యాంత్రీకరణ ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.

ఈ మధ్య కామర్స్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి, హైదరాబాద్‌లో ఒక పత్రికాగోష్ఠిలో మాట్లాడుతూ, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌కు కేటాయిస్తున్న భూమి, భారతదేశంలో మొత్తం సాగుభూమిలో 0.00001 శాతం కూడా లేదని, ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. వ్యవసాయ భూమిని సెజ్‌లకు కేటాయించడంపట్ల పంట దిగుబడి దెబ్బతిని, ఆహారోత్పత్తి తగ్గి, ఆహార భద్రతకు ప్రమాదం వస్తుందన్న వాదనకు ఆయన జవాబు ఇది. సెజ్‌లపై విమర్శకులు లేవనెత్తిన అనేక అంశాలలో ఆహార భద్రత సమస్య కూడా ఒకటి. అదొకటే అభ్యంతరం కాదు. ఇతర అంశాలపై సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకున్నారు.

రైతులు, ప్రజలు ‘అభివృద్ధి’ అంటే ఉలిక్కిపడే రోజులొచ్చాయి. అభివృద్ధి అంటే పరిశ్రమల కోసం, సెజ్‌ల కోసం, రోడ్ల వెడల్పు కోసం, మాల్స్‌ కోసం, రైతుల భూములు లాక్కొని వారిని వీథుల్లోకి నెట్టి, ఒక నూతన ధనిక ప్రపంచాన్ని నిర్మించడం, మరొక వైపు దారిద్రీకరణను పెంచడంగా ప్రజలు భావిస్తున్నారు.

సెజ్‌లు ఎలా ప్రకటిస్తారు ?

కేంద్ర ప్రభుత్వం స్వయంగా సెజ్‌లను ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్‌లపై ఆసక్తి ఉన్న డెవలపర్స్‌ పెట్టే దరఖాస్తులను, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక బోర్డు పరిశీలించి నిర్ణయం చేస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎగుమతులు – దిగుమతుల వ్యాపారం ప్రాధాన్యత వహిస్తుంది. కొన్ని ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం వెనుకబడిపోతున్నామన్న భయం, వేగంగా ఆర్థికాభివృద్ధి రేటును పెంచాలన్న తపన నుంచి సెజ్‌ల పట్ల క్రేజ్‌ పాలక వర్గాలలో పెరిగింది. కొన్ని రకాల ఎగుమతులలో ఇంతకు ముందే కొన్ని ప్రోత్సాహకాలు ఉన్నాయి. కాని అవి చాలడంలేదని ఈ సెజ్‌లు ప్రారంభించారు. వివిధ శాఖల అనుమతులు ఆలస్యం కాకుండా ‘ఏకగవాక్షం’ (సింగిల్‌విండో) ద్వారా వేగంగా సెజ్‌లో లభిస్తాయి.

సెజ్‌లో ఏర్పాటైన పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఆకర్షణీయమైన రాయితీలు లభిస్తాయి.

 1. కస్టమ్స్‌ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ టాక్స్‌, సెంట్రల్‌ సేల్స్‌ టాక్స్‌, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌ల రాయితీ ఈ సంస్థలకు, డెవలపర్స్‌కు లభిస్తాయి.
 2. గతంలో ఏడేళ్లపాటు ఉన్న పన్నుల రాయితీ 15 సంవత్సరముల వరకు పెంచారు. (1) మొదటి 5 సంవత్సరములలో వందశాతం రాయితీ (2) ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత 10 సంవత్సరముల వరకు యాభైశాతం పన్ను రాయితీ (3) ఆఖరి 5 సంవత్సరములలో ఎగుమతుల లాభాలలో యాభైశాతం రాయితీ
 3. సెజ్‌లు ఏర్పాటు చేసిన డెవలపర్స్‌కు 10 సంవత్సరముల వరకు ఆదాయ పన్నులో వంద శాతం రాయితీ.

ప్రభుత్వం స్వంతంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టలేదనే సాకుతో ప్రభుత్వ – ప్రైవేట్‌ భాగస్వామ్యం పేరుతో ప్రభుత్వం భూమి కేటాయించి, పన్నుల రాయితీలు ఇచ్చేట్లు, ప్రైవేట్‌ సంస్థలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి (భూమి చదును చేయడం, రోడ్లు వేయడం, విద్యుచ్ఛక్తి, నీరు ఏర్పాటు చేయడం, ప్లాట్లు కేటాయింపు వగైరాలు) డెవలపర్స్‌ చేస్తారు. బ్యాంకులు, రుణ సౌకర్యాలు, విమానాశ్రయాలు, రేవులు, రైళ్ల ద్వారా రవాణాను మళ్లీ ప్రభుత్వమే సహాయం చేయాలి. విదేశాలకు ఎగుమతి కోసం ప్రత్యేక రేవులను కేటాయిస్తున్నారు.

సెజ్‌ల ఏర్పాటకు కేంద్రమే కాక జోనల్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. వారు దరఖాస్తులను అంగీకరించడానికి, నిరాకరించడానికి, అందులోని అంశాలను మార్చడానికి హక్కుంది. జోనల్‌ స్థాయిలో సెజ్‌లన్నీ పరిపాలనాంశాలపై అధికారం గల డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ (అభివృద్ధి కమిషనర్‌) ఉంటారు. కార్మిక చట్టాలకు సంబంధించి, లేబర్‌ కమిషనర్‌ అధికారాలు కూడా అభివృద్ధి కమిషనర్‌కు బదలాయించారు. క్లాజ్‌ 23 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్‌లలో వచ్చే సివిల్‌ కేసులు, నోటిఫై చేయబడిన రకాల నేరాలు విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తుంది. వీటిపై అప్పీలు ఆయా రాష్ట్రాల హైకోర్టులకు చేసుకోవచ్చును.

ఇన్ని అసాధారణమైన రాయితీలు, ప్రత్యేక సౌకర్యాలు కలిగించి, భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత పటిష్టత చేకూరుతున్నట్లు? నిజంగా దేశాభివృద్ధికి ఇవి ఉపయోగపడితే దీనిని సానుకూలంగా పరిశీలించవచ్చును. కాని ఫలితాలు అలా లేవు.

ప్రస్తుతం పనిచేస్తున్న సెజ్‌లు : 16
ఇందులో ఎనిమిది ఎగుమతి ప్రొసెంసిగు జోన్స్‌ను సెజ్‌లుగా మార్చారు.
ప్రభుత్వ పెట్టుబడులు : రు. 948 కోట్లు
ప్రైవేట్‌ పెట్టుబడులు : రు. 2841 కోట్లు
మొత్తం : రు. 3789 కోట్లు
ఎగుమతులు : రు. 22,511 కోట్లు
ఉపాధి : 1,23,440 మంది
అంశం సంఖ్య భూమి అవసరం
నోటిఫై చేయబడిన సెజ్‌లు 41 3,36,468 ఎకరాలు
సూత్రబద్ధంగా అనుమతి 166 –
ఇవ్వబడినవి
ఫార్మల్‌గా అనుమతి 237 86,400 ఎకరాలు
వాయిదా వేయబడిన 173 1,03,565 ఎకరాలు
ప్రతిపాదనలు
కొత్తగా వచ్చిన దరఖాస్తులు 73

ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కేటాయిస్తూ, దాని ప్రాధాన్యతను తగ్గించి చూపటం అధికారుల మోసపూరిత చర్య.

గతంలో ఏదో ఒక ప్రత్యేక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, ఉదాహరణకు ఆభరణాలు లేక ఐటి లాంటి వాటికి సెజ్‌లు కేటాయించబడేవి. ఇప్పుడు బహుళ ఉత్పత్తుల కోసం సెజ్‌లు కేటాయిస్తున్నారు. ఆసియా ఖండంలోనే మొదటి ఎగుమతి జోన్‌ను భారతదేశంలో గుజరాత్‌లోని కాండ్లారేవులో 1965లోనే ఏర్పాటు చేశారు. ఇది విజయవంతంగానే నడిచిందని ప్రభుత్వవాదన. ఈ మధ్య వచ్చిన అనుభవాలను బట్టి సెజ్‌లకు అనుమతులు పెంచుతున్నామన్నారు. గత సంవత్సరం మొత్తం భారత ఎగుమతుల్లో సెజ్‌ల ద్వారా జరిగింది 5 శాతం మాత్రమే. దేశంలోని మొత్తం పారిశ్రామిక పెట్టుబడిలో సెజ్‌ల పెట్టుబడి 1 శాతం ఉండగా, ఉపాధి కల్పన 0.32 శాతం మాత్రమే. స్థానికంగా ఆర్ధికాభివృద్ధికి, నైపుణ్యంలేని స్థానిక కార్మికులకు ఉపాధిలో తగినంత సహాయం చేయలేక పోయాయి.
దేశ ఆర్థికాభివృద్ధికి ఎగుమతుల పెరుగుదల అవసరమే అయినప్పటికీ, ఇన్ని పన్నుల రాయితీలు దీనికి అవసరంలేదు. సెజ్‌ల ఏర్పాటుపై న్యాయబద్ధంగానే తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నాయి.

 1. సెజ్‌ల పేరుతో రాయితీలిస్తున్నందున, బయట ఉన్న పరిశ్రమలనే, సెజ్‌ల ఆవరణలోకి మార్చి రాయితీలు పొందే సంస్థలున్నాయి. కొత్త పెట్టుబడిరాదు. రాయితీల రూపంలో కోట్ల రూపాయల అదనపు లాభాలు దండుకుంటారు. నూతన పెట్టుబడుల కోసం సెజ్‌లన్న వాదన పసలేనిదే.
 2. సాంప్రదాయకంగా దశాబ్దాల తరబడి పెద్ద ఎత్తున ఉత్పత్తులు సాగించి, ఎగుమతులు చేస్తున్న పారిశ్రామిక సంస్థలకు లేని రాయితీలు సెజ్‌లోని సంస్థలకిచ్చినందున, వివక్ష చూపడం అనివార్యమవుతుంది. వారిలో తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది.
 3. సెజ్‌ల కోసం రాయితీలు విదేశ ఎగుమతుల కోసం ఇచ్చే రాయితీలు, స్వదేశంలో భారత ప్రజల కోసం చేసే ఉత్పత్తుల పైన అన్ని రకాల పన్నులు వేస్తూ విదేశీయుల కోసం చేసే ఉత్పత్తుల పైన రాయితీలు ఇవ్వటం దేశ ప్రజలపై అసాధారణమైన వివక్ష అవుతుంది. ‘అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో’ అన్న సామెత వర్తిస్తుంది.
 4. సెజ్‌లకు ఎంత భూమి కావాల్సి ఉంటుందన్న అవగాహన ప్రభుత్వానికి లేదు. అందువల్ల అవసరమైన దానికంటే 10 రెట్లు, వందరెట్లు భూమిని కంపెనీలు డిమాండ్‌ చేయటం, ప్రభుత్వం కేటాయించడం, భవిష్యత్తులో అదనపు భూమిని రియల్‌ ఎస్టేట్‌కు ఉపయోగించుకోవటం వారి ఆలోచనలగా ఉంది. ముంబై ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లోకి 400 మీటర్ల ప్లాటు వేలం వేస్తే 84 కోట్లు పలికింది. దానికి దగ్గరలోనే 35,000 ఎకరాలు అంబానీలు తమ సెజ్‌ల కోసం ప్రతిపాదించారు. ఢిల్లీ నగరానికి దగ్గర్లో యుపిలోని ఘజియాబాద్‌ జిల్లాలో అనిల్‌ అంబానీకి 25,000 ఎకరాలు పారిశ్రామికీకరణకు కేటాయిస్తే, పంజాబ్‌లో ముఖేష్‌ అంబానీకి 20,000 ఎకరాలు కేటాయించారు. రైతుల దగ్గర తక్కువ ధరకు బలవంతంగా కొని, బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టడం రైతాంగ వ్యతిరేక చర్య.
 5. ఏ రకమైన ఉత్పత్తులకు, ఎగుమతులకు డిమాండ్‌ ఉందో వాటి కోసం సెజ్‌లు కేటాయించడం కాక, బహుళ ఉత్పత్తులు కేటాయించడం మంత్రిత్వశాఖలో అస్పష్టత గందరగోళాన్ని సూచిస్తున్నది. పన్నుల రాయితీల కోసం ఏదో పేరుతో దరఖాస్తులు ఇస్తున్నారు. ప్రభుత్వం అంతే అరాచకంగా కేటాయిస్తున్నది. ఇది సెజ్‌ల లక్ష్యాన్ని నెరవేర్చదు.
 6. విదేశీ పెట్టుబడులను సెజ్‌లలో ఆహ్వానిస్తున్నారు. విదేశీ పెట్టుబడితో దాదాపు ఉచిత మౌలిక సదుపాయాలు, భూమితో పరిశ్రమలు ఏర్పాటు చేసి, భారత దేశంలో తక్కువ వేతనాలతో కార్మికులతో పనిచేయించుకొని, అన్ని రకాల పన్నుల రాయితీలు పొంది, విదేశాలకు ఎగుమతులు చేసి, లాభాలను కూడా ఎగుమతి చేస్తారు. కొద్దిమంది కార్మికులకు పని దొరకటం, భారత భాగస్వాములుంటే వారికి కొంత లాభం మినహా దేశానికి ఏం ఒరుగుతుంది? పన్నుల రాయితీల నష్టం తప్పదు. దేశం నుంచి ఎగుమతులు మరికొన్ని వందల, వేల కోట్లు చేశామన్న లెక్కలు రాసుకోవడానికి జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదల రికార్డులో అదనంగా చేర్చుకోవటం ద్వారా సంతృప్తి పొందటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
 7. సెజ్‌లలో వ్యాపార, పారిశ్రామిక సంస్థల ఫ్యాక్టరీల ఏర్పాటుతోపాటు, అందులో పెట్టుబడులు పెట్టిన వారికి, ఉద్యోగులకు అవసరమైన నివాసానికి ఫ్లాట్లు, ఇళ్లు, ఆస్పత్రులు, పౌర జీవనానికి అవసరమైన ఏర్పాట్లు వారే చేసుకోవచ్చు. అక్కడ జరిగే నేరాలకు (నోటిఫైడ్‌ అఫెన్సెస్‌) చట్టవిరుద్ధ కార్యక్రమాలపై పోలీసులకు, న్యాయవ్యవస్థకు అధికారం లేదు. ప్రత్యేక కోర్టులుంటాయి. విదేశీ రాయబార కార్యాలయాలకుండే ఈ ప్రత్యేక హక్కులు, భారత భూభాగంలో విదేశీ భూఖండాలలోని హక్కులు భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే హేయమైన చర్య.
 8. సెజ్‌లలో అన్ని రాయితీలతోపాటు కార్మిక చట్టాలకు కూడా చెల్లుచీటి ఉంటుంది. లేబర్‌ కమిషనర్‌ అధికారాలు డేవలప్‌మెంట్‌ కమిషనర్‌కు బదలాయించబడ్డాయి. భారతదేశంలో విదేశీ స్వదేశీ పెట్టుబడిదార్లు ‘ఆర్థిక సంస్కరణల్లో’ భాగంగా లేబర్‌ చట్టాలను సరళీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మె హక్కులేని, యూనియన్లులేని, లేబర్‌ కమిషనర్‌లేని సెజ్‌లలో కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు అవకాశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ట్రేడ్‌ యూనియన్లు ఉన్నా బయటి నాయకులుండరాదన్న షరతు కొన్ని సెజ్‌లలో పెడుతున్నారు. ఇది కార్మిక వ్యతిరేక చర్య.
 9. సారవంతమైన వ్యవసాయ భూమి లక్షలాది ఎకరాలు గనుల త్రవ్వకం కోసం, నగరాల విస్తరణ కోసం, నాలుగులైన్ల, ఆరు, ఎనిమిది లైన్ల రోడ్ల కోసం, పరిశ్రమలు కోసం కేటాయించడం, రాను రాను ఆహార భద్రత సమస్యను కలిగిస్తుంది. లక్షలాది రైతులను వారి కుటుంబాలను వీథుల్లోకి నెట్టుతుంది. వీటి ద్వారా ఎంత మందికి నూతన ఉపాధి ఉద్యోగావకాశాలు వస్తాయో అంతకంటే ఎక్కువ సంఖ్య, నిరుద్యోగానికి, దీర్ఘ దారిద్రానికి గురౌతారు. ఇచ్చే నష్టపరిహారం చేసిన అప్పులకుపోతే రైతు బికారిగా మిగుల్తాడు. జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు ఇండెక్సు పైకి పోతుంది. మరికొన్ని లక్షల రైతుల కుటంబాలు దారిద్రరేఖ దిగువకు బలవంతంగా నెట్టబడుతారు. భూపరిమితి చట్టాలు గాలికి పోతాయి. కొత్త జమిందార్లు, భూకామంధులు, రియల్‌ ఎస్టేటుదార్లు చట్టబద్ధంగా ఆవిర్భవిస్తారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకపోతుంది.
 10. సెజ్‌ల ఏర్పాటుకు అంగీకరించి, భూమి కేటాయించిన తర్వాత దాని ఏర్పాటుకు పరిమితిలేదు. ఎగుమతుల లక్ష్యం విఫలమైతే శిక్షలేదు. గతంలో ప్రభుత్వ విధానాల వల్ల ఎగుమతుల ప్రోత్సాహకాలు విఫలమైతే, ఇప్పుడు మరిన్ని రాయితీలిస్తున్నారు.

ఈ అంశాలేకాక సెజ్‌ల ఏర్పాటు పట్ల మంత్రివర్గంలో కూడా అభిప్రాయభేదాలున్న మాట బహిరంగమే. స్వయంగా ఆర్ధిక మంత్రి సెజ్‌ల సంఖ్య పెంచేందుకు వ్యతిరేకం. ఇప్పటికి ఏర్పాటైన సెజ్‌లకిచ్చే పన్ను రాయితీల వల్ల, రాబోయే 4 సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్లు (సరిగ్గా చెప్పాలంటే 97,900 కోట్లు) దేశానికి నష్టం వాటిల్లుతుంది. సెజ్‌లలో దీర్ఘకాలంలో వచ్చే లాభాలు దీనిని పూడ్చటం అసాధ్యం.

సారవంతమైన వ్యవసాయ భూములు పెద్ద విస్తీర్ణంలో సెజ్‌లకు కేటాయించవద్దని యు.పి.ఎ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు హితవు పలికింది. ఇష్టాపూర్తిగా పన్నుల రాయితీలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని ప్రధాని హితవు చెప్పారు. కాని స్వయంగా కేంద్రమే ఈ రాయితీలిస్తున్నది. ఆయన దానిని సరిచేయాలి. సెజ్‌ల ఏర్పాటుకు, రిజర్వ్‌బ్యాంక్‌ రియల్‌ ఎస్టేట్‌ల ఏర్పాటుగానే చూస్తున్నది. కాని సెజ్‌ల కేటాయింపు కొనసాగుతున్నది. ప్రజా ఆందోళన ద్వారానే దానిని ఆపాలి.

వామపక్షాలు ఆర్థికాభివృద్ధికి వ్యతిరేకంకాదు. పెట్టుబడిదారి వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి జరిగి సంపదను సృష్టించినా అది కేంద్రీకృత మవుతున్న తీరు ధనిక-పేద వర్గాల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతున్న విషయం గమనంలోకి తీసుకుంటూనే, దానిపై సైద్ధాంతిక రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతూనే పరిమితంగానైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే ఆర్థికాభివృద్ధిని ఆహ్వానిద్దాం.

ఏం చేయాలి ? :

 1. సెజ్‌ల ఏర్పాటు అడ్డదిడ్డంగా, అరాచకంగా జరగకూడదు. దానికి సహేతుకమైన పరిమితి ఉండాలి.
 2. ఖచ్చితమైన ఎగుమతుల డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులకే కేటాయించాలి.
 3. వ్యవసాయానికి పనికిరాని భూములు మాత్రమే సెజ్‌లకు కేటాయించాలి.
 4. రైతుల భూములు అనివార్యంగా కొద్ది మొత్తంలో తీసుకుంటే న్యాయమైన నష్టపరిహారంతోపాటు అంతే భూమిని ప్రత్యామ్నాయంగా ఆ రైతులకు కేటాయించాలి.
 5. సెజ్‌లకు విదేశీ భూభాగాలకిచ్చే హక్కులు రద్దుచేసి, న్యాయస్థానాల, చట్టబద్ధ పరిపాలన చెల్లుబాటు చేయించాలి.
 6. భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలి. తర్వాత కాలంలో రియల్‌ ఎస్టేట్‌కు, ఇతర కార్యక్రమాలకు వాడుకుంటే తిరిగి వాపసు తీసుకోవాలి.
 7. సకాలంలో సెజ్‌లు పని ప్రారంభించకపోయినా ఎగుమతుల లక్ష్యంలో సగానికి కూడా చేరలేని వైఫల్యమున్నా దానిని రద్దుచేయాలి. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
 8. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల భూములు తీసుకున్న రైతులను కూడా, ఆయా సెజ్‌ల డెవలపర్స్‌తో భాగస్వాములుగా ప్రకటించి, వారికి వచ్చే లాభాలలో రైతులకు వారి వాటా ఇచ్చేట్లు చట్టంలో మార్పుతేవాలి.
 9. అన్ని సెజ్‌లలో అన్ని కార్మిక చట్టాలు పూర్తిగా అమలు అయ్యేట్లు చట్టం సవరించాలి.
 10. సెజ్‌ చట్టాన్ని మొత్తంగా పునరాలోచించాలి. వామపక్షాలు కోరిన సవరణలతో కొత్త చట్టం తేవాలి.
Advertisements

Written by Polepally InSolidarity

December 1, 2006 at 10:20 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: