Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ప్రత్యేక ఆర్థిక మండలాలు – కొత్త భూస్వామ్యం

leave a comment »

– ఎన్‌. వేణుగోపాల్‌

దేశంలో భూమి ఇంకా ప్రధాన ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అధికార చిహ్నంగానే ఉన్నదని, భూస్వామ్యవర్గాల పట్టు సడలలేదని, కొత్త భూస్వామ్యవర్గం ఒకటి ప్రపంచీకరణశక్తుల అండ దండలతోనే ఏర్పడుతున్నదని రెండు మూడేళ్ల కిందటిదాకా ఎవరైనా అని ఉంటే వారిని ‘మార్క్సిస్టు మూర్ఖులు’గా అభివర్ణించడం జరిగేది. ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని బలోపేతం చేయడానికే ప్రపంచీకరణ వస్తున్నదని, అది భూస్వామ్యవర్గాలను అంతం చేసి పారేస్తుందని, భూమి ప్రాధాన్యత తగ్గిపోయి, మార్కెట్‌ సంబంధాలు బలపడతాయని, అందువల్ల ప్రపంచీకరణను సమర్థించాలని చెపుతూ మార్క్సిస్టు-లెనినిస్టు శిబిరం నుంచే ఒక దశాబ్దం కింద ఒక పుస్తకం వెలువడింది. ఆ పుస్తకం దేశంలోని అర్థ భూస్వామ్య, అర్థ వలస వ్యవస్థను గమనంలోకి తీసుకోలేదనీ, సామ్రాజ్యవాద శక్తులకూ భూస్వామ్యానికీ మధ్య ఉన్న మిలాఖత్తును గుర్తించలేదనీ నేను వ్యాఖ్యానించినప్పుడు (గ్లోబలైజేషన్‌ ఆఫ్‌ కాపిటల్‌ – మరో దృష్టి, అరుణతార, డిసెంబర్‌ 1999) అటువంటి విమర్శలే వచ్చాయి.

ఆశ్చర్యకరంగా ఇప్పుడు ప్రత్యేక మండలాల రూపంలో ప్రపంచీకరణ శక్తుల భూదాహం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ కొత్త మహమ్మారి దేశంలోని పంట పొలాల్లో కనీసం ఏడెనిమిది లక్షల ఎకరాలను ఆక్రమించబోతూ కొత్త భూస్వామ్యానికి దారి తీస్తోంది. దేశంలోని ప్రధాన పెట్టుబడిదారీ వ్యాపార గృహాలుగా పేరొందిన టాటా, బిర్లా, మహీంద్రా, బజాజ్‌, గత రెండు దశాబ్దాలలో అనూహ్యంగా ఎదిగిన అంబానీలు, ఇటీవల ఇన్ఫోటెక్‌ – బయోటెక్‌ – రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో ప్రముఖులైన సహారా, సత్యం, విప్రో, ఇన్ఫోసిస్‌, బయోకాన్‌, డిఎల్‌ఎఫ్‌ వంటి దళారీ, బడా పెట్టుబడిదారీ వ్యాపార సంస్థలన్నీ ఈ భూ ఆక్రమణలో ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఉక్కు వ్యాపార సంస్థ పోస్కో వంటివి కూడ ఇందులో భాగం పంచుకుంటున్నాయి. అంబానీలు ఒక్కరే అన్ని రాష్ట్రాలలో కలిపి డెబ్భై వేల ఎకరాల ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో హర్యానాలో ఇరవై ఐదు వేల ఎకరాలు, ముంబాయి సమీపంలో నలభై వేల ఎకరాలు ఉన్నాయి.
ఈ భూ ఆక్రమణలను ఆధునిక భారత చరిత్రలో అతి పెద్ద భూ ఆక్రమణలుగా అభివర్ణించిన చరిత్రకారుడు సుమిత్‌ సర్కార్‌ ‘దేశంలో, ముఖ్యంగా బీహార్‌ లోనూ, ఆంధ్రప్రదేశ్‌ లోనూ 1960ల చివరినుంచి జరిగిన భూ ఆక్రమణ ఉద్యమాలకు ఇది పూర్తిగా వ్యతిరేకమైనది, తలకిందులు చేసేది. అప్పుడు జరిగినది నిజంగా రైతులు, భూమిలేని నిరుపేద కూలీలు పాల్గొన్న మహాసమీకరణ. అప్పుడు ఏ కుటుంబం దగ్గరయినా గరిష్ట పరిమితి కన్న ఎక్కువ భూమి ఉంటే ప్రజలు వెళ్లి ఆక్రమించుకున్నారు. ఆ ఉద్యమం పేదప్రజలది. దానికి వామపక్షాలు నాయకత్వం వహించాయి. ప్రస్తుత భూ ఆక్రమణ ధనికుల్లోకెల్లా ధనికులది’ అన్నారు.

అయితే సహజంగానే ఏ పోలికలోనైనా ఉన్నట్టుగానే ఈ కొత్త భూస్వామ్యానికీ పాత భూస్వామ్యానికీ మధ్య సామ్యాలూ ఉన్నాయి, భేదాలూ ఉన్నాయి. పాత భూస్వామ్యం లాగనే కొత్త భూస్వామ్యానికి కూడ ఆ భూములలో పంటలు తీయడం మీద పెద్ద ఆసక్తి లేదు. ఆ భూమిని ఏ పేరు మీద తీసుకుంటున్నారో ఆ అవసరానికే వినియోగించాలనే నియమం కూడ లేదు. తీసుకున్న భూమిలో 35 శాతం మాత్రం ప్రకటిత అవసరం కోసం వాడి, మిగతాదాన్ని ఇష్టప్రకారం వాడుకోవడానికి చట్టమే వీలు కల్పిస్తుంది. పాత భూస్వామ్యానికి వేల ఎకరాల భూమి ఉండడం ప్రతిష్ఠాచిహ్నం కాగా, కొత్త భూస్వామ్యానికి గోల్ఫ్‌ కోర్సులు, రియల్‌ ఎస్టేట్‌, విలాసవంతమైన హోటళ్లు వంటి అదనపు భూవినియోగ అవకాశాల గురించి తెలుసు. పాత భూస్వామ్యం భూమి మొత్తం రాజుదే అని రాజ్యాధికారాన్ని స్థాపించి, రాజునుంచి ఇనాములు, అగ్రహారాలు, మక్తాలు, జాగీర్లు సంపాదించినట్టుగానే, ఇప్పుడు కొత్త భూస్వామ్యం భూమి మీద, భూసేకరణ మీద ప్రభుత్వాధికారాన్ని స్థాపించి, ప్రభుత్వం నుంచి చౌకధరలకు జాగీర్లు సంపాదిస్తోంది. పాత భూస్వామ్య అధికారం తనకు తానే చట్టమై, మరే చట్టానికీ లొంగి ఉండని విధంగానే, కొత్త భూస్వామ్యం కూడ ఈ దేశపు చట్టాలకు లోబడి ఉండనక్కరలేని, ‘విదేశీ భూభాగం’ హోదాను అనుభవించబోతోంది. ఒకటే తేడా ఏమంటే కొత్త భూస్వామ్యానికి వచ్చినంత ఆకర్షణీయమైన, సమ్మోహకమైన భాష పాత భూస్వామ్యానికి వచ్చేది కాదు. కొత్త భూస్వామ్యానికి ఆధునికతా వాసన ఉన్నప్పటికీ, అదే పాత భూస్వామ్యం కన్న ఎక్కువ మొరటుగా, ఎక్కువ దుర్మార్గంగా ఉన్నట్టు కనబడుతోంది.

ఈ రాజకీయార్థిక శాస్త్ర చర్చను పక్కనపెట్టి, అసలు ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలు ఎట్లా, ఎందుకొరకు ప్రారంభమయ్యాయి. వాటి ప్రకటిత, అప్రకటిత లక్ష్యాలేమిటి. వాటి తక్షణ, దీర్ఘకాలిక ఫలితాలేమిటి, వాటి పట్ల రాజకీయపక్షాల, సామాజిక వర్గాల వైఖరులేమిటి అనే ప్రశ్నలగురించి ఆలోచించవలసి ఉంది.

స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ (సెజ్‌ – ప్రత్యేక ఆర్థిక మండలాలు) అనే పేరుతో ప్రఖ్యాతమైన ఈ ఏర్పాటును, స్పెషల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ జోన్స్‌ (ప్రత్యేక దోపిడీ మండలాలు) అనీ, స్పెషల్‌ ఎర్రోనియస్‌ జోన్స్‌ (ప్రత్యేక తప్పుడు మండలాలు) అనీ కూడ విమర్శకులు పిలుస్తున్నారు.

దేశవ్యాప్తంగా మౌలిక సాధన సంపత్తిని సమకూర్చడం సాధ్యం కాదు కాబట్టి, అది చాల ఖర్చుతో కూడుకున్నదీ, ఎక్కువ సమయం తీసుకునేదీ కాబట్టి, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటు ఒక వ్యూహమని ప్రభుత్వ వాదన. అందుకోసం పన్ను మినహాయింపులను ఇవ్వడం, స్థలాన్నీ, సౌకర్యాలనూ తక్కువ ధరకో, ఎక్కువ కాలవ్యవధితోనో సమకూర్చడం, కావలసిన మౌలిక సౌకర్యాలనూ, విద్యుత్తు, నీరు తదితర అవసరాలనూ కల్పించడం, సింగిల్‌ విండో అనుమతులివ్వడం, సులభతరమైన పద్ధతులు, చట్టాల సరళీకరణ వంటి చర్యలు ప్రభుత్వం చేపడుతుంది.

నాలుగు దశాబ్దాలుగా ఈ దేశంలో నడుస్తున్న ఎగుమతి ప్రోత్సాహక మండలాలు ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక మండలాలుగా మారిన క్రమం ఆసక్తికరమైనది. వీటికి మూలం చైనా అమలుచేస్తున్న విధానంలో ఉంది. భాజపా నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో వాణిజ్యశాఖ మంత్రిగా ఉండిన మురసోలి మారన్‌ 2000లో చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రత్యేక ఆర్థిక మండలాలను, ముఖ్యంగా షెన్‌జెన్‌ను చూసి ముచ్చట పడి 2000 ఏప్రిల్‌లో ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని ప్రకటించారు.

ఇప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అగ్ర నాయకులు ప్రకాష్‌ కరత్‌, సీతారాం యేచూరిలు చైనా అవలంబిస్తున్న విధానం విభిన్నమైనదని సమర్థిస్తున్నారు గాని ప్రఫుల్‌ బిద్వాయ్‌, రమేశ్‌ రామనాథన్‌ వంటి స్వతంత్ర పరిశోధకులు షెన్‌జెన్‌ నమూనాలో జరుగుతున్న అక్రమాల గురించి వివరించారు. చైనా చర్చ ఇక్కడ అప్రస్తుతం గాని, ఎన్‌డిఎ హయాంలో మొదయిన ఈ విధానం, ఆ తర్వాత మూడు సంవత్సరాలు పడుతూలేస్తూ ముందుకుసాగి, కాంగ్రెస్‌ నాయకత్వంలో, వామపక్షాల మద్దతు కూడ ఉన్న యుపిఎ ప్రభుత్వ హయాంలో 2005 మే 11న చట్టరూపం పొందింది. ఈ బిల్లు చట్ట రూపం పొందడానికి లోక్‌సభలో జరిగిన చర్చ రెండు మూడు రోజులు మించక పోగా, రాజ్యసభలో ఒకేఒక్క రోజులో చర్చ ముగిసిపోయింది. అంటే, దేశంలోని పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ, ఇవాళ బయట ఏమి చెపుతున్నప్పటికీ, ఎటువంటి ఆందోళనలు నడుపుతున్నప్పటికీ, ఈ విధాన నిర్ణయపు తిలాపాపంలో తలా పిడికెడు పంచుకోవలసిందే.

2004 మేలో అధికారానికి వచ్చిన యుపిఎ ప్రభుత్వం తన కంటే ముందు ఎన్‌డిఎ తయారు చేసిన ఎస్‌ఇజెడ్‌ విధానం పెట్టుబడిదారులు కోరుకున్నంత సరళంగా లేదని, ఎక్కువ రాయితీలు లేవని భావించింది. అందువల్ల తానే ఒక బిల్లు తయారు చేసింది. ఆ బిల్లును 2005 జనవరిలో కేంద్ర మంత్రి వర్గం చర్చించి కొన్ని చర్చనీయాంశాల మీద తుది తీర్పు కోసం మంత్రివర్గ బృందానికి (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌కు) పంపించింది. ఆ తర్వాత ఆ బిల్లును 2005 బడ్జెట్‌ సమావేశాలలో, బడ్జెట్‌ చర్చ ముగిసిన తర్వాత, సమావేశాలు ముగియడానికి రెండు రోజుల ముందు హడావిడిగా ప్రవేశపెట్టారు. సమాచార హక్కు బిల్లు చట్టం కావడానికీ, మహిళలకు రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టడానికీ ఏళ్లకు ఏళ్లు తీసుకున్న ప్రభుత్వాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల బిల్లును చట్టం చేసే పనిని రోజులలోనే ముగించాయి. అంతేకాదు, ఇంత ముఖ్యమైన చట్టాన్ని ఆపేశక్తి లేకపోయినా, రభసచేసి ఆలస్యం చేయడానికయినా అవకాశం ఉన్న ప్రతిపక్షాలు దాదాపు మౌనాంగీకారంతో బిల్లును చట్టం కానిచ్చాయి.

లోక్‌సభలో సిపిఐకి చెందిన గురుదాస్‌ దాస్‌గుప్తా, సిపిఎంకు చెందిన రూప్‌చంద్‌ పాల్‌, రాజ్యసభలో సిపిఎంకు చెందిన నీలోత్పల్‌ బసు ఈ బిల్లుమీద కొంత చర్చ చేసి, కొన్ని సవరణలు ప్రతిపాదించారు గాని వాటి ఫలితం పెద్దగా లేదనే చెప్పాలి.

ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం దగ్గరికి ఎన్ని అభ్యర్థనలు వస్తున్నాయో, ప్రభుత్వం ఎంత వేగంగా వాటికి అనుమతులను ఇస్తున్నదో చూస్తే దేశాన్ని పారిశ్రామికీకరించడానికి గత అరవై ఏళ్లలో లేని ఉత్సాహం హఠాత్తుగా ఈ ఆరు నెలలలోనే వచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా పారిశ్రామికీకరణ ఆసక్తి కాదేమోననీ, బహుశా ఈ పేరుతో కారుచౌకగా వేల ఎకరాల భూమి ఆక్రమించుకోగల భూదాహం మాత్రమేననీ అనుమానం కలుగుతుంది. ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటుకు అనుమతి పొందినవారి సంఖ్య, సూత్రరీత్యా అనుమతి పొందినవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నవంబర్‌ రెండో వారం చివరికి అన్ని అనుమతులు పొందిన ఎస్‌ఇజెడ్‌లు 263, సూత్రరీత్యా అనుమతి పొందిన ఎస్‌ఇజెడ్‌లు 169, మొత్తం 432 ప్రత్యేక ఆర్థిక మండలాలు అనుమతి పొంది ఉన్నాయి.

ప్రత్యేక ఆర్థిక మండలాల (స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్ల) విషయంలో గత కొంతకాలంగా, ముఖ్యంగా 2006 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు జారీ అయినప్పటినుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. అప్పటినుంచే ఈ ప్రత్యేక ఆర్థిక మండలాల గురించి ప్రచారసాధనాల ద్వారా ప్రజలకు ఎక్కువగా తెలిసివస్తోంది. ప్రజలలో, ముఖ్యంగా ఆయా ప్రాంతాల రైతాంగంలో ఆందోళన పెరిగిపోతోంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలాల వల్ల రైతుకూలీల జీవనోపాధి రద్దవుతుందనీ, ఆహారభద్రత కొరవడుతుందనీ, భూమి కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం అందడం లేదనీ, మధ్య దళారులు ఇబ్బడిముబ్బడిగా లాభాలు చేసుకుంటున్నారనీ, వీటివల్ల పారిశ్రామికాభివృద్ధి గానీ, ఉద్యోగకల్పన గానీ ఏమీ ఉండబోదనీ, వీటిలో ప్రకటిస్తున్న సంస్థల, వ్యాపారాల బదులు వేరే వ్యాపారాలు జరిగే అవకాశం ఉందనీ, ఇవి అంతిమంగా రియల్‌ ఎస్టేట్‌గా మారిపోతాయనీ, ఇవన్నీ ఇప్పటికే రాయితీలు పొందుతున్న వ్యాపారవర్గాలకే మేలు చేస్తాయనీ, వీటివల్ల ఖజానాకు వచ్చే పన్నుల ఆదాయానికి గండి పడుతుందనీ, వీటిలో చట్టాలు చెల్లవుగనుక ఇవన్నీ కార్మిక, ఉద్యోగవ్యతిరేక విధానాల నమూనాలుగా మిగిలిపోతాయనీ, ప్రభుత్వం ఉద్యోగ కల్పన గురించి, పెట్టుబడుల గురించి గుప్పిస్తున్న వాగ్దానాలన్నీ నీటిమూటలనీ అనేక విమర్శలు చెలరేగుతున్నాయి. వీటిలో ప్రతిఒక్క విమర్శకూ ఆధారాలు, బలమైన వాదనలు ఉన్నాయి.

ఆరాధనా అగర్వాల్‌ అనే పరిశోధకురాలు చెపుతున్న ప్రకారం మొత్తం అనుమతులు పొందిన ప్రత్యేక ఆర్థిక మండలాలలో 61 శాతం ఐటి రంగంలోనే ఉన్నాయి. నిజానికి ఐటి రంగ సంస్థలు గత పదిహేను సంవత్సరాలుగా ఏవేవో రాయితీలను అనుభవిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తమ రాయితీల గడువులను పొడిగించుకోవడానికి, పాత వ్యాపార సంస్థలను కొత్త వ్యాపార సంస్థలుగా నమోదుచేసి మరింత భూమి సంపాదించడానికి ఒక మార్గంగా ఈ కొత్త విధానం కింద అనుమతులు సంపాదిస్తున్నాయి గాని, కొత్తగా రాబోయే సంస్థలూ లేవు, పెట్టుబడులూ లేవు, ఉద్యోగ కల్పనా లేదు.

అట్లాగే ఈ ప్రత్యేక మండలాల ఏర్పాటు కోసం అభ్యర్థనలు పెట్టుకున్న వారందరూ ప్రధాన నగరాల చుట్టుపట్ల ఉన్న భూమి కోసమే దరఖాస్తు చేసుకున్నారంటే వారి పారిశ్రామిక ఆసక్తికన్న రియల్‌ ఎస్టేట్‌ ఆసక్తే ఎక్కువని తెలిసిపోతోంది. అట్లాగే, మొత్తం దరఖాస్తులలో 65 శాతం కేవలం ఐదు రాష్ట్రాలలోనే ఉన్నాయంటే ఇది అభివృద్ధి చెందిన ప్రాంతాలలో మరింతగా రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి తప్ప నిజమైన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కాదని తేలిపోతుంది. ఇక దరఖాస్తు చేసిన కొన్ని సంస్థలైతే స్పష్టంగానే రియల్‌ ఎస్టేట్‌, వినోద, విలాస సంస్థలుగా తెలిసిపోతున్నాయి. అవి అటు ఎటువంటి పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేయగలవో, వాటికి కారుచౌకగా వేల ఎకరాల భూమి ఎందుకు ఇవ్వాలో అర్థం కాదు.

ప్రత్యేక ఆర్థిక మండలాలను చట్ట బద్ధంగానే ‘విదేశీ భూభాగంతో సమానమైనవిగా’ గుర్తిస్తారు. అంటే అక్కడ భారతదేశంలో అమలులో ఉండే చట్టాలు పనిచేయవన్నమాట. దేశానికి సంబంధించిన 21 చట్టాలు ఈ మండలాలలో వర్తించవు. అనుమతులు లేకుండానే సుంకాలేవీ చెల్లించకుండానే అక్కడికి విదేశీ సరుకులు దిగుమతి చేసుకోవచ్చు. అక్కడ సంపాదించే లాభాలను భారత రిజర్వ్‌ బ్యాంకు అనుమతి లేకుండానే విదేశాలకు తరలించుకుపోవచ్చు.

అంతే కాదు, ఎస్‌ఇజెడ్‌లలో అనేక పన్ను రాయితీలుంటాయి. ఆ రాయితీలన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే, అక్కడి వ్యాపార సంస్థలు పది సంవత్సరాలపాటు పూర్తిగా పన్నులపై సెలవును అనుభవించవచ్చు. కేవలం 150 ఎస్‌ఇజెడ్‌లపైనే కనీసం రెండువేల కోట్ల డాలర్ల (ఒక లక్ష కోట్ల రూపాయల) పన్ను ఆదాయాన్ని నష్టపోవలసివస్తుందని స్వయంగా ఆర్థిక మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. చాల ఆశ్చర్యకరంగా ఈ 150 ఎస్‌ఇజెడ్‌ల ద్వారా ప్రభుత్వం అంచనా వేస్తున్న పెట్టుబడుల మొత్తం రెండున్నరవేల కోట్ల డాలర్లు మాత్రమే.

గతంలోనైతే ప్రైవేట్‌ పెట్టుబడిదారులు వారికి అవసరమైన భూమిని వారే మార్కెట్‌ ధరలకు కొనుక్కునే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండలాలలో ప్రభుత్వమే రైతుల దగ్గరి నుంచి భూమిని సేకరించి పెట్టుబడిదారులకు అందజేస్తుంది. ఇలా ప్రభుత్వం కొనబోతుందని ముందే తెలిసిన మధ్య దళారులు చిన్న చిన్న కమతాలు అన్నింటిని కొనివేసి తిరిగి ప్రభుత్వానికి లేదా పెట్టుబడిదారులకు అమ్మజూపుతున్నారు. ఇందువల్ల రైతులకు రావలసినంత రావడం లేదనేది ఒక అంశం అయితే, ఇన్నాళ్లు వచ్చిన దానికన్నా ఎక్కువే వస్తుందని ఆశ చూపే మధ్యవర్తులు ఉండడం మరొక అంశం. అయితే నష్ట పరిహారం లక్షలు వస్తుందా కోట్లు వస్తుందా అనే దాని కన్నా ముఖ్యమైనది రైతులు తమ శాశ్వత జీవనోపాధి వనరును పోగొట్టుకొని తమ భూములనుంచి బైటపడవలసి వస్తుంది. వచ్చిన డబ్బులు ఎంత జాగ్రత్తగా వారి అవసరానికి ఉపయోగపడతాయో అనుమానమే.

పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాల పేరుతో సాగే ఇటువంటి రాయితీలవల్ల, ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో నడుస్తున్న పారిశ్రామిక, వ్యాపార సంస్థలు కూడ తమను తాము ఎస్‌ఇజెడ్‌లుగా పిలుచుకుని ఈ వసతులన్నీ పొందడానికి ప్రయత్నించవచ్చునని స్వయగా ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక వేత్త రఘురాం రాజన్‌ అన్నారు.

గత అనుభవాన్ని ఒకసారి పరికిస్తే, 1970ల నుంచీ నడుస్తున్న ఎగుమతి ప్రోత్సాహక మండలాలలో సుంకాల రాయితీలవల్ల నష్టపోయిన మొత్తం 170 కోట్ల డాలర్లని, అది ఆ మండలాలు ఎగుమతుల ద్వారా సాధించిన ఆదాయం కన్న 60 శాతం ఎక్కువని ప్రభుత్వ అంచనాలే ప్రకటిస్తున్నాయి.

గతంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాలకు ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా అవి పెద్దగా సాధించింది ఏమిలేదు. ప్రత్యేక ఆర్థిక మండలాల నుంచి 2004-05లో మొత్తం దేశంలోని ఎగుమతుల్లో కేవలం 5 శాతం మాత్రమే జరిగాయి. అవి కేవలం 0.32 శాతం పెట్టుబడులను మాత్రమే ఆకర్షించగలిగాయి. కేవలం ఒక్క శాతం కార్మికులకు మాత్రమే ఉపాధి కలిగించగలిగాయి.

ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలు ఎట్లా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాటి ప్రకటిత, అప్రకటిత లక్ష్యాలేమిటో స్థూలంగా పరిశీలించిన తర్వాత వాటి పట్ల రాజకీయ వైఖరులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రత్యేక ఆర్థిక మండలాల విషయంలో రాజకీయ వైఖరులు విచిత్రంగా ఉన్నాయి. ఈ ఆలోచనను ప్రారంభించినది ఎన్‌డిఎ ప్రభుత్వమని, కొనసాగించింది యుపిఎ ప్రభుత్వమని పైననే చూశాం. అంటే ఈ విధానపు ప్రధాన బాధ్యతను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లే తీసుకోవాలి. ఆ రెండు పార్టీలు కూడ తాము అధికారంలో ఉన్నచోట ఒక వైఖరిని, ప్రతిపక్షంలో ఉన్నచోట అందుకు భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ ఎస్‌ఇజెడ్‌ల వ్యతిరేక ఆందోళనల్లో కూడ పాల్గొంటున్నాయి.

ఒక వైపు మాజీ ప్రధాని వి.పి. సింగు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి ఎస్‌ఇజెడ్‌లను వ్యతిరేకిస్తుండగా, వెనుకబడిన కులాల పార్టీగా తనను తాను గుర్తించుకునే సమాజ్‌ వాది పార్టీ అంబానీ సోదరుల తరఫున ఎస్‌ఇజెడ్‌లను సమర్థిస్తూ అగ్రభాగాన నిలబడింది.

ప్రత్యేక ఆర్థిక మండలాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వామపక్షాలు, ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), తాము అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌, కేరళలలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర చట్టం 35 శాతం ప్రకటిత అవసరానికి వాడుకోవాలని, మిగిలిన భూమి ఎందుకైనా వాడుకోవచ్చునని చెపుతుండగా, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఆ 35 శాతం ను 50 శాతానికి మాత్రం మార్చి అదే గొప్ప విప్లవాత్మక మార్పు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. చట్టంలో మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండాలని పార్లమెంట్‌లో వాదించి నెగ్గించుకున్న సిపిఐ(ఎం) పశ్చిమ బెంగాల్‌లో తనదైన విధానం ప్రకటించింది. ప్రభుత్వం ఆక్రమించదలచుకున్న భూమి మీద ఒక వేళ పంట ఉంటే, ఆ పంట కోసుకోవడానికి కూడ రైతుకు హక్కు లేదని, బెంగాల్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది!

మొత్తం మీద, ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల, రాజకీయ పక్షాల, దళారుల ఉమ్మడి వ్యూహంగా అమలవుతోంది. ఆ ఉమ్మడి వ్యూహానికి నష్టపోయేది భారత పీడిత రైతాంగం, భారత ఆర్థిక వ్యవస్థ, భారత ఆహార భద్రతా వ్యవస్థ. దేశ ప్రయోజనాలను అతి దారుణంగా దెబ్బతీస్తున్న ఈ విధానాన్ని ప్రతిఘటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

Advertisements

Written by ఎన్.వేణుగోపాల్

December 1, 2006 at 2:29 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: