Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పచ్చని పల్లెల్లో సెజ్‌ చిచ్చు

leave a comment »

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని నాలుగైదు మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన సెజ్‌లు పేదల జీవితాలను నామరూపాలు లేకుండా ఎలా నాశనం చేస్తున్నాయో వివరిస్తున్నారు ఘంటా చక్రపాణి

ప్రపంచీకరణ ఫలితాలు ఉహించిన దానికంటే వేగంగా ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఇంతకాలం చాపకింది నీళ్లలా పరోక్షంగానే నష్టం కలిగించిన ఆర్థిక సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)తో నేరుగా గ్రామీణ జనజీవితాల్ని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థను ముట్టడిస్తున్నాయి. మన రాజకీయ, పరిపాలన, న్యాయ వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తోంటే ఈ విధానాలను ఆసరా చేసుకొని పల్లెల్లో ప్రవేశించిన బహుళజాతి కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు ఈస్టిండియా కంపెనీని తలపిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని పల్లెపల్లెనా నయా సామ్రాజ్యవాద పోకడలు ‘సెజ్‌’ల రాకతో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నందిగ్రాంతో ‘సెజ్‌’లపై రాజకీయ, పౌర సమాజంతో మొదలైన చర్చ కొత్తగా ఆర్థిక విధానాల విశ్లేషణకూ కొత్త తరహా ప్రతిఘటనా పోరాటాలకు ఊపిరి పోసినట్టు తోస్తోన్నా, పరిస్థితి చేజారిపోయిందన్నది వాస్తవం. నిజానికి నందిగ్రాం కన్నా తీవ్రస్థాయిలో నష్టం కలిగించే అనేక కంపెనీలు ఇప్పటికే దేశవ్యాప్తంగా రంగంలోకి దిగాయి. పల్లెల్లో వ్యవసాయ క్షేత్రాలు, అడవులు, చెరువులు ఇతర గ్రామీణ ఉమ్మడి వనరులన్నింటినీ చదును చేసి గ్రామాల మధ్య, జిల్లాల మధ్య, రాష్ట్రాల మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తున్నాయి. ఆ పనిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామి కావడం ఆందోళన కలిగించే విషయం. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని నాలుగైదు మండలాల్లో తమిళనాడును కలుపుతూ ప్రభుత్వం చేపట్టిన ‘సెజ్‌’లు అక్కడి వెనుకబడిన, నిరుపేద ప్రజల జీవితాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నాయి.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తమిళనాడు రాష్ట్రానికి ఆనుకుని ఉన్న తడ, సూళ్లూరుపేట, వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ప్రత్యేక మండలాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. చెన్నై నగరాన్ని కలిపే ఐదో నెంబర్‌ జాతీయ రహదారిని, రైలుమార్గాన్నీ ఆనుకొని ఉన్న ఈ భూముల సేకరణ, వేలం పనులు శరవేగంతో సాగిపోతున్నాయి. ఇప్పటికే తడ మండలాలో అపాచీ అనే చైనా కంపెనీ ‘సెజ్‌’ను ఏర్పాటు చేసి చెప్పుల తయారీ మొదలుపెట్టింది. ఈ భూములన్నీ చెన్నై ఓడరేవుకు చేరువలో ఉండడం వల్ల, సముద్రతీరానికి, రైలు మార్గానికి, హైవేకి ఆనుకొని ఉండడం వల్ల ప్రభుత్వం ఈ ప్రాంతమంతా ప్రత్యేక ఆర్థిక మండలాలుగా రూపొందించి, విదేశీ కంపెనీలను, పెట్టుబడిదార్లను, బడా పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే భూసేకరణ, భూముల అభివృద్ధి పనులు ప్రారంభమైనాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఈ పనులను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాల్లో ప్రాంతీయ అగ్రగామి కాబోతోంది. సేకరించిన భూములకు ఇప్పటికే మంచి డిమాండ్‌ వస్తోంది. చెన్నై సిటీకి చేరువగా ఉండడం, రవాణా మార్గాలు మెండుగా ఉండడం దీనికి ప్రధాన కారణం అని ఈ ప్రాంతంలో భూ సేకరణ పనులు చూస్తోన్న ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

తడ మండలంలోని కొండూరు, కడతారు, అక్కంపేట, పెదమాంబట్టు, చినమాంబట్టు, ఎన్‌.ఎం. కండ్రిగ గ్రామాల్లో వెయ్యి ఎకరాలతో రాష్ట్రంలో మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2006 ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 708 ఎకరాలను అపాచీ కంపెనీ అదే నెల 24న తీసుకుని పనులు ప్రారంభించింది. ఆరు నెలల్లో ఆ కంపెనీ, పరిశ్రమ ప్రారంభించడమే కాకుండా గత ఐదు నెలలుగా ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది. చైనాకు చెందిన ఈ కంపెనీ అమెరికన్‌ బహుళజాతి కంపెనీల కోసం చెప్పులు తయారు చేస్తుంది. ప్రస్తుతం ‘ఆడిడాస్‌’ కంపెనీ ఆర్డర్ల మేరకు షూ తయారుచేసి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అపాచీ కంపెనీకి ఇవ్వగా మిగిలిన భూమిని కూడా ఏదైనా విదేశీ కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. గతంలో వోక్స్‌వాగన్‌ కార్ల ఫ్యాక్టరీ కోసం కూడా ఈ స్థలాన్ని చూపించామని, అలాగే పలు ఐటి రంగ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని స్థానిక రెవెన్యూ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాంతంలోని మండల రెవెన్యూ కార్యాలయాలన్నీ రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులుగా మారిపోయాయి. భూసేకరణ, క్రయవిక్రయాలు, గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతులను భూములు అమ్ముకునేలా ఒప్పించే పనిలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. మరో వైపు చెన్నై, హైదరాబాద్‌ నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఆయా స్థలాలు చూపించడం, బేరసారాలు నడపడం అధికారులకు ప్రధానమైన పని అయిపోయింది. ఐదో నెంబర్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న తడ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ముందు బారులు తీరి ఉండే విలాసవంతమైన కార్లను చూసిన వారికెవరికైనా ఈ ప్రాంతంలో ఏదో గొప్ప అభివృద్దే జరుగుతున్నదన్న భ్రమ కలుగక తప్పదు. ఈ మండలంలో ఇప్పటివరకు సేకరించిన వెయ్యి ఎకరాలు ఎపిఐఐసి స్వాధీన పరుచుకున్నదని, మరో 314 ఎకరాలు కూడా దీనిలో కలుపబోతున్నామని, ఆ భూముల సేకరణ జరుగుతున్నదని తడ మండల రెవెన్యూ ఆధికారి ఆనందం చెప్పారు.

తడ మండలాన్ని ఆనుకుని చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం ఉంటుంది. ఇప్పుడు సెజ్‌ వల్ల ఈ రెండు జిల్లాల సరిహద్దులు నిజంగానే చెరిగి పోయాయి. తడ సెజ్‌ను ఆనుకుని ఉన్న తొండూరు – మోపురు పల్లె, సిద్ధన్న అగ్రహారం గ్రామాల్లో 2046 ఎకరాలను కూడా ప్రభుత్వం తాజాగా సేకరించింది. ఇందులో దాదాపు సగం భూమి రైతులు వ్యవసాయం చేసుకుంటున్న పట్టా భూమి. వారందరికీ ఏప్రిల్‌ మొదటి వారంలో నష్టపరిహారం పంపిణీ చేసి భూముల్ని ప్రభుత్వం (ఎపిఐఐసి) స్వాధీనం చేసుకుంది. అలాగే ఇదే మండలంలో చెదులుపాకం, చిలుమత్తూరు గ్రామాల భూములు స్వాధీనానికి కూడా చర్యలు మొదలైనాయి. ఈ రెండు గ్రామాల్లో 2543 ఎకరాల భూమి సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఆశ్చర్యమేమిటంటే ఇందులో దాదాపు 2100 ఎకరాలు రైతుల సాగుభూమి ఉంది. కాగా కేవలం 446 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి.

రైతుల నుంచి భూములు సేకరించకూడదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించినట్టు చెపుతున్నా మన రాష్ట్రంలో భారీగా రైతుల భూములనే సేకరిస్తున్నారు. రైతు ప్రభుత్వంగా పదేపదే ప్రకటించుకుంటున్న ముఖ్యమంత్రికి తెలియకుండానే గ్రామాలకు గ్రామాలకు అమ్ముడు పోతున్నాయా అన్నది అర్థం కా(లే)ని ప్రశ్న. చిలమత్తూరునే ఉదాహరణగా తీసుకుందాం. ఈ గ్రామం వరదయ్య పాలెం మండలంలో భాగం. ఈ గ్రామంలో సెజ్‌కు సేకరిస్తోన్న భూమిలో 1024.56 ఎకరాలు పట్టాభూమి. రైతులు చెరుకు, వరి తదితర పంటలు పండించుకుంటోన్న వ్యవసాయ భూమి. ఈ గ్రామానికి ఐదారు కిలోమీటర్లలోపే కె.సి.పి. మయూర చక్కెర ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీ 2500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నడుస్తోంది. అంటే ఇక్కడ చెరుకుకు కొదువ లేదు. పంటలకు ఎంతో అనువైన ఈ భూములను రైతుల నుంచి లాగేసుకొంటున్నారు. కాగా రైతులు స్వచ్ఛందంగా, ఏకాభిప్రాయంతో భూములు ఇచ్చేస్తున్నారని, వారికి ఎంతో లాభదాయకమైన నష్ట పరిహారాన్ని వారి అంగీకారం మేరకే నిర్ణయించామని వరదయ్య పాలెం ఎమ్మార్వో జయరాం చెపుతున్నారు. ఈ ‘సెజ్‌’లో భూములు కోల్పోయిన వారికి మెట్ట అయితే ఎకరానికి రెండున్నర లక్షలు, మాగాణి అయితే మూడు లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు. ఇది మార్కెట్‌ ధరకంటే చాలా ఎక్కువ అని అధికారులు చెపుతున్నారు.

వరదయ్య పాలెంను ఆనుకుని సత్యవేడు మండలం ఉంటుంది. సత్యవేడులో ఇప్పటికే ఎనిమిది గ్రామాలను గుర్తించారు. ఈ ఎనిమిది గ్రామాల్లో దాదాపు పదిహేను వేల ఎకరాల దాకా భూమిని సేకరించబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా మొదలైనాయి. సత్యవేడులో తమిళ సరిహద్దు గ్రామం చెంగంబాకం వరకు భూములన్నీ ఈ సెజ్‌ పరిధిలోకి రాబోతున్నాయి. అక్కడినుంచి మద్రాసు నగరం ఇరవై కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఈ భౌగోళిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇరవై వేల ఎకరాల భూములను లక్ష్యం చేసుకుని సెజ్‌లను ఏర్పాటు చేస్తోంది.

పేదలే సమిధలు

సెజ్‌లవల్ల పేద ప్రజానీకం ముఖ్యంగా వృత్తి పనుల్లో ఉండే వెనుకబడిన కులాలు, దళితులు, భూమిలేని పేదలు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు దేవాలయాల భూముల్లో, బంజరు భూముల్లో గ్రామ ఉమ్మడి అవసరాల కోసం ఉండే ప్రభుత్వ భూముల్లో సేద్యం చేసుకునే దళితులు, పశువుల కాపర్లు, యాదవులు ఉపాధి కోల్పోతున్నారు. ఇందుకు అపాచీ సెజ్‌ను ఆనుకుని ఉన్న మాంబొట్టు ఒక ఉదాహరణ.

మాంబట్టు గ్రామ జనాభా 2500. నిజానికి ఈ గ్రామంలో ఎస్‌.సి. (మాల) ఎస్‌.టి. (యానాది) బిసి (యాదవ, బైరి, దేవాంగ) కులాల వాళ్లే 90 శాతం ఉన్నారు. గ్రామంలో దాదాపు 60 రెడ్డి కుటుంబాలు మినహా అగ్రవర్ణాలు ఎవరూ లేరు. పది పదిహేను బిసి, ఐదారు ఎస్‌సి కుటుంబాలకు వ్యవసాయ భూములున్నా ప్రధానంగా మెజారిటీ భూముల యజమానులు రెడ్డి కులస్తులే. గ్రామంలో ఉన్న 70 మంది యాదవులు గొర్రెలు పెంచుకునే వాళ్లు. గ్రామంలో 79 ఎకరాల దేవాలయ భూములు, 673 ఎకరాల ప్రభుత్వ బంజరాయి గ్రామ అవసరాల కోసం ఉపయోగపడేది. ఈ మొత్తం భూమిని ప్రభుత్వం సెజ్‌గా ప్రకటించడంతో ఇప్పుడా గ్రామంలో ఉమ్మడి అవసరాలకు భూమి లేకుండాపోయింది. ‘ఎంత గీపెట్టినా వినలేదు, మా అవసరాలు చూడలేదు, కలెక్టర్‌ వచ్చి అన్ని వసతులు సమకూరుస్తామని చెప్పారే తప్ప, ఒక్క ఎకరం భూమైనా వదిలిపెట్టలేదు. ఇప్పుడు గ్రామంలో ప్రజలకు దొడ్డికి వెళ్లడానికి కూడా స్థలం లేదు’ అని ఆ గ్రామ సర్పంచ్‌ ప్రకాష్‌ చెప్పారు. ఏదో పరిశ్రమ వస్తుందని, ఉద్యోగాలు ఇస్తామని అంటే సరే అన్నాం కానీ ఇంత ముప్పు ముంచుకొస్తుందని ఊహించలేదని వాపోయాడు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో చెలకతో పాటు రెండు చిన్న చిన్న చెరువులు, నీటి కుంటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్రామంలో పశువుల మేతకు చెలకల్లేవు. నీళ్లకు చెరువుల్లేవు. చేసేది లేక యాదవులు గొర్రెలు అమ్మేసుకొని కూలికి వెళ్తున్నారు. తరతరాలుగా స్వతంత్ర జీవనానికి, పశు పోషణ వృత్తికి అలవాటు పడ్డ వాళ్లు ఇవాళ వలస పక్షులై వెళ్లిపోతున్నారు.

ఈ గ్రామానికి అనుబంధంగా ఉన్న ఎన్‌.ఎం.కండ్రిగలో నివసిస్తున్న ఎనభై గిరిజన కుటుంబాలది మరీ విషాదకరమైన పరిస్థితి. సముద్ర తీరం పక్కన నివసిస్తూ ఉండే ఈ కుటుంబాలు 1984లో వరదలకు సర్వం కోల్పోయారు. వీరికి మాంబట్టు గ్రామ శివార్లలో ఎన్‌.ఎం. కండ్రిగ పేరుతో పునరావాస గ్రామం ఏర్పరిచారు. ఆ గ్రామం ప్రభుత్వ భూమి కావడంతో అక్కడే వ్యవసాయం చేసుకుంటూ, పశువులు మేపుకుంటూ బతుకుతున్న వాళ్లను సెజ్‌ పేరుతో ప్రభుత్వం మళ్లీ తరిమేసింది. ఇప్పుడు ఈ పల్లెకు చెందిన 70 యానాది కుటుంబాలు, పది వడ్డెర కుటుంబాలు నిలువ నీడ లేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ గ్రామంలో సెజ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఇక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, పక్కా ఇల్లు నిర్మించి అన్ని వసతులు కల్పిస్తామని గ్రామ సభల్లో కలెక్టర్‌ ఇచ్చిన హామీ అమలు కాకుండానే పోయింది. కంపెనీల నియమ నిబంధనలకు ఇక్కడి యువకులు సరితూగడం లేదు.

ఇది ఒక్క మాంబట్టు పరిస్థితే కాదు. మొత్తం ఈ ఇరవై వేల ఎకరాల్లో విస్తరించబోయే సెజ్‌లు ఇదే సామాజిక సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయి. ఈ ‘సెజ్‌’ల విస్తరణ చేపట్టిన గ్రామాలన్నీ సూళ్లూరుపేట, సత్యవేడు శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నాయి. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు కలిసి జనాభాలో 80-85 శాతం ఉన్నా ఈ రెండు నియోజకవర్గాలు ఎస్‌.సి. రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. గ్రామాల్లో ప్రధానంగా మాల, యానాది, వడ్డెర, యాదవ, దేవాంగ (చేనేత) బోయ, వాల్మీక, పల్లె రెడ్డి వంటి కులాల జనాభా అధికం. రెవెన్యూ అధికారుల ప్రకారం ఈ ప్రాంతంలో పదుల ఎకరాల్లో భూములున్న రైతులు ఎక్కువగా లేరు. అందరూ చిన్న, సన్నకారు రైతులే. దాదాపు 80 శాతం మంది 4-5 ఎకరాలు లోపు భూములున్న వారే. వీరే ఎక్కువగా నష్టపోయి శాశ్వతంగా ఉపాధి కోల్పోయే పరిస్థితులు ‘సెజ్‌’ల వల్ల తలెత్తాయి.

కొనబోతే కొరివి

‘సెజ్‌’ల కోసం భూసేకరణ మొదలయ్యిందో లేదో పరిసరాల భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూసేకరణలో రైతులకు నిర్ధారించిన మార్కెట్‌ వ్యాల్యూ కంటే ఇప్పుడు భూములు కోల్పోయిన రైతులు కొనుక్కోవాలంటే కనీసం 8 నుంచి 10 రెట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నష్టపరిహారం పొందిన రైతులెవ్వరూ కనీసం కోల్పోయిన భూమిలో నాలుగోవంతైనా తిరిగి కొనుక్కోలేకపోయారు. ప్రభుత్వం మాంబట్టులో రైతుల నుంచి సేకరించిన భూమికి ఎకరానికి (మాగాణి) 1 లక్షా 70 వేల రూపాయలు మార్కెట్‌ విలువగా నిర్ణయించి, దానికి 30 శాతం అంటే మరో 51 వేల రూపాయలు సోలేషన్‌ వ్యాల్యూ నిర్ధారించి దానిపై 12 శాతం (రు. 16,264) అదనపు మార్కెట్‌ విలువ కలిపి 2 లక్షల 37 వేల రూపాయల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. రైతులు నష్టపోతున్నారు కాబట్టి, శాశ్వతంగా భూములు వదులుకొంటున్నారు కాబట్టి చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ మొత్తం పై పరిహారంగా మరో 50 శాతం కలిపి ఎకరానికి 3 లక్షల 54 వేల రూపాయలు చెల్లించింది. ఐతే రైతులకు పరిహారం అంది, వాళ్లు తిరిగి భూములు కొనుక్కోవాలనుకునే లోపు ఈ ప్రాంతంలో భూముల ధరలు 9 నుంచి 11 లక్షల రూపాయలకు ఎకరంగా పెరిగిపోయాయి. ఈలోగా పెద్ద పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు రంగంలోకి దిగి వేలాది ఎకరాలు ప్రైవేట్‌గా సేకరించుకున్నాయి. ఇప్పుడు రైతులు కొనుక్కోవడానికి సెంటు భూమి కూడా లేకుండా పోయింది. తీరా వచ్చిన సొమ్మును ఇంట్లో పాత అప్పులకు, పిల్లల చదువులకు ఫలహారమై పోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది తడ మండలం పరిస్థితి.

మరో వైపు చిత్తూరు జిల్లాలో రైతుల పరిహారాన్ని కాన్సెంట్‌ అవార్డ్‌ పేరుతో మెట్ట అయితే 2.5 లక్షలని, మాగాణి అయితే 3 లక్షలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల అంగీకారంతోనే ఇలా నిర్ధారించినట్టు రెవెన్యూ అధికారులు చెపుతున్నా, తమ అంగీకారం లేదని తమకు న్యాయం జరగడం లేదని రైతులు వాపోతున్నారు. అసలు తమకు భూములు అమ్ముకునే ఆలోచనే లేదని అధికారులే బలవంతంగా లాగేసుకొని చెక్కులు చేతుల్లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ‘నా పొలం పక్కన ప్రభుత్వ భూమి ఉంది దాన్ని ‘సెజ్‌’లో చేర్చారు. మరో పక్కనున్న రైతుల భూమి కూడా సెజ్‌ కింద సేకరించారు. ఇప్పుడు రెండింటి మధ్య ఉన్న నాకు అమ్మకుండా తప్పని పరిస్థితి. రేపు ‘సెజ్‌’ అయిపోతే చుట్టూ గోడ కట్టేస్తారు. నా భూమినే ఆక్రమిస్తారని అధికారులు బెదిరిస్తున్నారు’ అని వరదయ్యపాలెం మండలానికి చెందిన చెంగయ్య అనే రైతు వాపోయాడు.

ఇది బెదిరింపు కాదు. నిజం కూడా. మాంబట్టు గ్రామంలో ఇలా అమ్మకుండా ప్రయత్నించిన రైతులు దాదాపు ఏడాదిగా తమ భూముల్ని సేద్యం చేసుకోలేక పోతున్నారు. ఈ గ్రామంలో గ్రామానికీ, రైతుల పోలాలకీ మధ్య ఉన్న భూమిని ప్రభుత్వం ‘సెజ్‌’ కిందికి చేర్చింది. వెంటనే అపాచీ కంపెనీ ఆ భూమి చుట్టూ గోడ కట్టేసింది. రైతులు పోలాలకు వెళ్లే దారికి అడ్డంగా గోడ రావడంతో ఇప్పుడు రైతులకు పోలాలకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. దీంతో దాదాపు వంద ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి నిరుపయోగంగా పడి ఉంది. దాన్నీ ఇప్పుడు కచ్చితంగా అమ్ముకోవాలి. లేదా నష్టపోవాలి. ఇదీ అక్కడ పరిస్థితి. తమ పోలాలకు సెజ్‌ గుండా దారి కల్పించాలని రైతులు మొరపెట్టుకోకుండా ఆ అధికారం మాకు లేదంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్తేసారు. ”ప్రభుత్వం చైనా కంపెనీకి భూమి ఇచ్చేసింది. ఇప్పుడు మేం ఏం చెయ్యగలం” అని ఎం.ఆర్‌.ఒ అన్నారు. అయితే రైతుల అవసరాల దృష్ట్యా మరో వైపు నుంచి మార్గం కల్పించాలని తాను ఎపిఐఐసికి పలు మార్లు కోరానని, ఆయన చెప్పారు. ఇలా బలవంతంగా కూడా రైతులు తలొగ్గే పరిస్థితులను ఈ ‘సెజ్‌’లు కల్పిస్తున్నాయి.

కొరవడిన పోరాట స్ఫూర్తి

నందిగ్రాం ఉదంతం తరువాత ‘సెజ్‌’లను ఎవరు అడ్డుకోవాలో, ఎవరు సమర్థించాలో తెలియని సైద్ధాంతిక సంక్షోభం తలెత్తినట్టు అనిపిస్తోంది. ఇవాళ చిత్తూరు, నెల్లూరు జిల్లాల మధ్య రూపొందుతోన్న బహుళజాతి ఎస్టేట్లకు బలైపోతోన్న ప్రజల పక్షాన ఇప్పటివరకు బలమైన గొంతు వినిపించట్లేదు. పని మొదలైన కొత్తలో చిత్తూరు జిల్లా సిపిఎం, జన విజ్ఞాన వేదికలు కొంత చొరవ చూపాయి. నందిగ్రాం తరువాత ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. నిజానికి నందిగ్రాంలోలాగా బలమైన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లేకపోవడం, బలమైన రైతులు, భూస్వాములు కూడా లేకపోవడం, రెండూ దళిత నాయకత్వంలో ఉన్నా రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు అవడం వల్ల అగ్రకుల రాజకీయ నాయకత్వానికి పెద్దగా భవిష్యత్తు పై కూడా ఆశలు లేకపోవడం, విధానపరంగా అధికార కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీకి పెద్దగా తేడా ఏమీ లేకపోవడం వల్ల అక్కడ జరుగుతున్న విధ్వంసంపై చర్చ జరగడం లేదు.

ఏ రకంగా చూసినా తడ, సత్యవేడు రైతులకు నందిగ్రాం కంటే ఎక్కువగానే నష్టం జరుగుతోంది. పైగా ఇక్కడ నష్టపోతున్న సామాజిక వర్గాలు కూడా నందిగ్రాం కంటే అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ఈ గ్రామాలు తమిళనాడు సరిహద్దులో ఉండడం వల్ల ఇక్కడ ఉద్యమాలతో పెద్దగా పరిచయం ఉన్నట్టు కూడా లేదు. మాంబొట్టులో నాలుగు వందల దళిత కుటుంబాలున్నాయి. కానీ వారికి హైదరాబాద్‌లో ఉండే ఏ ఒక్క దళిత నాయకుడి పేరు తెలియదు. ఏ ఒక్క దళిత సంఘం కూడా ఆ ఊరినీ, దళితవాడనూ సందర్శించలేదు. ఇది ఒక్క ఆ ఊరికే పరిమితం కాదు. ఆ ప్రాంతం అంతా అదే స్థాయి చైతన్యం కనిపిస్తోంది. రాజకీయ పక్షాలు, పౌరసమాజం, మౌనంగా ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్లంతా ఇప్పుడు ఒకటై వారికి స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున సాగుతోన్న ఈ సెజ్‌ల వ్యవహారం గ్రామీణ వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేయముందే వారికి రాజకీయ, న్యాయసహాయం అందించి వారి హక్కులను కాపాడే బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇదే నిర్లిప్తత కొనసాగితే మన కాళ్లకింద నేలకి కూడా ఖరీదు కట్టే నయా వలస విధానం అందర్నీ కబళించే ప్రమాదం ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: