Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ప్రత్యేక ఆర్థిక మండలాలు ఎవరి ప్రయోజనాల కోసం ?

with one comment

అరవై సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ప్రత్యేక ఆర్థిక మండలాలంతగా మనల్ని మనం మోసం చేసుకుంటున్న సందర్భం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదంటున్నారు ఎస్‌. సుధాకర్‌

ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) చట్టం 2005 మే లో పార్లమెంట్‌లో ఆమోదం పొంది జూన్‌ నుండి అమలులోకి రావడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా భారత రైతాంగాన్ని తీవ్రస్థాయిలో అలజడి, ఆందోళనలకు గురిచేస్తున్న ఈ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. యాభై సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రజాస్వమ్య ప్రయోగాల్ని అపహాస్యం చేస్తూ ముందుకొస్తున్న ఈ ప్రత్యేక ఆర్థికమండళ్ల స్థాపన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతనఆర్థిక విధానాల అమల్లో మరో కీలకమైన ప్రజావ్యతిరేక మలుపు అని చెప్పక తప్పదు.

ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించిన నాణ్యత – పోటీ లక్ష్యంగా ఎలాంటి చట్టబద్ధ నియంత్రణ గానీ, మానవీయ విలువలకు చోటుగాని లేని అంతర్జాతీయ లాభ నష్టాల వ్యాపార సంస్కృతి కేంద్రాలుగా ప్రత్యేక ఆర్థిక మండళ్ల స్థాపన జరుగు తుందని సెజ్‌ చట్టం చెబుతోంది. భారత భూభాగంలో ఆరు వందలకు పైగా ఈ సెజ్‌ల పేరుతో స్థాపించే పరిశ్రమల ఉత్పత్తి, క్రయ-విక్రయ, కార్యనిర్వహణా కార్యకలాపాల్లో చట్టబద్ధమైన తనిఖీ, నియంత్రణలు గానీ, న్యాయ-పరిపాలనా వ్యవస్థల జోక్యం కానీ ఉండడానికి వీలులేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆధునిక జమిందారీలు, జాగీరులు, సంస్థానాల రూపంలో ఈ దేశ సార్వభౌమత్వాన్నీ, రాజ్యాంగ స్ఫూర్తినీ గేలిచేస్తూ ఈ నేలపై పోరాడి సాధించుకున్న సర్వ ‘హక్కుల్ని’ విదేశీ అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడానికి సెజ్‌ల రూపంలో సర్వం సిద్ధమైపోతోంది.

భారతదేశంలో పాడుబడ్డ, నీటి వసతి లేని భూములు లక్షలాది ఎకరాలుండగా, రైతులు సాగుచేసుకుంటున్న పచ్చని పంటపోలాలు, అందమైన పూదోటలు, పండ్ల తోటలనే సెజ్‌ల స్థాపనకు అనుకూల మైనవని నిర్ధారించి, ప్రభుత్వాలు బలవంతంగా సేకరించడం ఆశ్చర్యం గొల్పుతున్న అంశం. పోనీ వీటిని నిర్మూలించి అక్కడ ఆహార పదార్థాల్ని ఉత్పత్తి చేస్తారంటే అది కూడా లేదు. అక్కడ తయారయ్యేవి ఎగుమతికి అనువైన వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఎలక్ట్రానిక్‌, లెదర్‌, టెక్స్‌టైల్‌, కార్లు, షికార్లకు అవసరమయ్యే ఉత్పత్తులు మాత్రమే. సెజ్‌ల స్థాపనకు పచ్చని పంటపోలాల్ని ఎంచుకోవడానికి కూడా సెజ్‌ల చట్టంలోనే స్పష్టమైన సమాధానం ఉంది. సెజ్‌ల నిర్మాతలకు చట్టంలో అనేక వసతులు, రాయితీలు, గ్యారంటీ చేయబడ్డాయి. లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి అప్పజెప్పడమే కాకుండా, నిర్మాణ వసతుల కింద (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) నీరు, కరెంట్‌, రోడ్డు, విమాన, జల, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. పాడుబడ్డ బీడు భూముల్లో ఈ వసతులన్నీ కల్పించడం ఖర్చుతో కూడుకున్న పని. దశాబ్దాలు, శతాబ్దాలుగా పంటలు పండిస్తున్న పచ్చని పోలాల చుట్టూ ఈ వసతులు పుష్కలంగా లభిస్తాయి. అన్నిటినీ మించి వాటి నిర్మాణానికి రాళ్లుమోసే కూలీలు, వాటి ఉత్పత్తుల్లో చౌకగా చాకిరీ చేయడానికి అవసరమైనన్ని మానవ కళేబరాలు ఆ పోలాల చుట్టూ పుష్కలంగా లభిస్తాయన్న సత్యం కూడా వాళ్లకు బాగా తెలుసు. చట్టం నుండి దూరం చేయబడ్డ మనుషులు ఏ నాగరిక దేశంలోనైనా జీవచ్ఛవాలతో సమానం. సంస్థానాధీశులకు, జాగీర్దారులకు కప్పం కింద కమీషన్లు చెల్లించడం తప్ప చట్టబద్ధంగా కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకాలు, సర్వీస్‌ టాక్స్‌, సేల్స్‌ టాక్స్‌లు చెల్లించడాలు అసలే సాధ్యం కాదు. అందుకే సెజ్‌ల చట్టంలో అవన్నీ అధికారికంగానే రద్దుచేయడం జరిగింది. అలాగే అక్కడ నిరసన హక్కు, సమ్మె హక్కు, మెరుగైన వేతనాలు, పని గంటలు, పని భద్రత, యూనియన్‌లు, లేబర్‌ కమీషన్లు, పెన్షన్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌, విశ్రాంతి, ఆరోగ్యం లాంటి వేటినీ చట్టబద్ధంగానైనా అడిగే హక్కు ఉండదు. ఎందుకంటే సెజ్‌ చట్టంలో వాటికి ప్రత్యేక సొంత న్యాయస్థానాలుంటాయి. సొంత భద్రతా వ్యవస్థలుంటాయి. అవి భారత రాజ్యాంగానికి అను బంధంగా పని చేయాల్సిన అగత్యం కానీ, అవసరం కానీ, ఉండదు. యాభై సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వచ్ఛందంగానే తన సార్వభౌమత్వ హక్కును సెజ్‌ల నిర్మాతలకు నైవేద్యంగా అర్పిస్తోంది.

దేశవ్యాప్తంగా అన్ని వర్గాల మేధావులు, అధికార – ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సెజ్‌ల నిర్మాణంలో నష్టపోతున్నది కేవలం రైతులు – కార్మికులే కనుక వారిని ఆదుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వాలు చర్యల్ని చేపట్టాలని సూచనలు, విమర్శలు, ఉద్యమాల రూపంలో ఉధృతం గానే ముందుకొస్తున్నారు. బహుశా అరవై సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతగా మనల్ని మనం మోసం చేసుకుంటున్న సందర్భం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఈ దేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల స్థాపనతో వాస్తవంలో నష్టపోతున్నది కేవలం రైతులు, కార్మికులు మాత్రమేనా అన్నది కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని వెదకాలంటే పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభమై కొనసాగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాల అమలు, ఆచరణల్లో దాగిన తాత్విక భూమికను సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయక తప్పదు. వ్యాపార ముసుగులో అనేక వలసదేశాలు చేసిన దురాక్రమణకు గురై నాలుగు వందల సంవత్సరాలుగా భారతీయులు అనుభవించిన కష్టాలు, కడగండ్లకు వ్యతిరేకంగా వంద సంవత్సరాల పాటు కొనసాగిన భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, దాని ఫలితంగా ఆవిర్భవించిన వ్యవస్థ మనది. సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఈ దేశ పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, తాము నమ్మిన భక్తి, విశ్వాసాన్నీ ఆచరించడానికి భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తూ తరతమ స్థాయి బేధాల కతీతంగా అందరికీ ఈ భూమ్మీద సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, వ్యక్తి వికాసంతో కూడుకున్న జాతీయ ఐక్యతను సాధిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. భారత ప్రజలమైన మనం, మన పూర్వీకులు నిర్మించుకున్న భారత రాజ్యాంగ స్ఫూర్తి ఈ అధ్యయానికి గీటురాయి కావాలి. 12 షెడ్యూళ్లతో, 440కి పైగా ఆర్టికల్స్‌తో డాక్టర్‌ అంబేద్కర్‌ నాయకత్వంలో నిర్మితమైన భారత రాజ్యాంగ సౌధంలో నెలకొన్న ఎన్నో సుందరమైన ప్రాకారాలు, మరెన్నో ప్రహరీలతో కూడుకున్న అడ్డుగోడలు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు సేద తీరడానికి నిర్మితమైన ఉద్యానవనాలు, కార్మికులు, కర్షకులు, దళిత, బహుజన ఆదివాసీ, మైనారిటీ వర్గాల రక్షణకు ఉద్దేశించిన దుర్భేద్యమైన కోటలు, సకల స్వేచ్ఛలతో, సూత్రీకరణలతో జాతి యావత్తు వికసించటానికి అనువుగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ ప్రాభవం ఈనాడేమయ్యింది, ఎక్కడుంది అన్న ప్రశ్న ఆ అధ్యయానికి గీటురాయి కావాలి.

యాభై సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో జరిగిన ప్రయోగాలు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఈ దేశ ప్రజల సంక్షేమం కొరకే జరక్కపోయినా, పూర్తిగా ప్రజల పేరుతో, ఎంతో కొంత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారినుద్దేశించి జరిగిన ప్రయోగాలేనన్నది అక్షర సత్యం. ఆ క్రమంలో రాజ్యాంగం పార్లమెంట్‌ ద్వారా తన్నుతాను నిర్వచించుకుంటూ అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక, సంక్షేమ చట్టాల్ని రూపొందించడం జరిగింది. సంస్థానాలు, రాజభరణాల రద్దు మొదలుకొని బ్యాంకుల జాతీయికరణ, భారీస్థాయిలో ప్రభుత్వ రంగంలో పరిశ్రమల స్థాపన, భూ సంస్కరణల – పట్టణ భూ పరిమితి చట్టాలు, కులనిర్మూలన, జాతీయ భద్రతకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు, విద్య, వైద్య, గృహ, స్త్రీ, శిశు, శాస్త్ర, సాంకేతిక, సాంస్క ృతిక రంగాలకు సంబంధించిన సంక్షేమ చట్టాలు అనేకంగా రూపొందాయి. ఈ చట్టాలకు తూట్లు పొడవడం మూలంగా ప్రజలు అనేక నష్టాల్నీ, కష్టాల్నీ ఎదుర్కోవడం జరిగిందే కానీ పనికట్టుకుని ప్రజల్ని కష్టాలు, నష్టాల ఊబిలోకి నెట్టడానికి ఈ దేశంలో చట్టాలు, శాసనాలు గత దశాబ్దం క్రితం వరకు జరగలేదన్నది వాస్తవం. ఆ కష్టాల్నీ, నష్టాల్నీ ఉద్యమాలతో ఎదుర్కొన్న ప్రజానీకాన్ని జాతీయ భద్రత పేరుతో ప్రత్యేక చట్టాల్ని రూపొందించి, హింసా అణచివేతలకు గురి చేయడం ఈ సందర్భంలో ఒక మినహాయింపుగానే పరిగణించక తప్పదు.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాల దురాగతాలు ఒక్క భారతదేశానికి మాత్రమే సంభవించిన అంశం ఎంతమాత్రం కాదు. అది అంతర్జాతీయంగా సంబంధించిన అనేక పరిణామాల కొనసాగింపు మాత్రమే. 1960 నుండి 1980 వరకు అమెరికన్‌ సామ్రాజ్యవాదులు, రష్యన్‌ సోషల్‌ సామ్రాజ్యవాదుల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో ప్రపంచ దేశాల్లోని ప్రజలు, పాలక రాజకీయ పక్షాలు రెండు శిబిరాలుగా తమ మనుగడ సాగించేవి. భారత దేశం ఊగిసలాడు తూనైనా రష్యన్‌ సోషల్‌ సామ్రాజ్యవాద శిబిరంలో కొనసాగడం చరిత్ర. 1990 దశాబ్దంలో తీవ్రమైన అంతర్గత కలహాలు, బలమైన అంతర్గత వైరుధ్యాలతో సతమతమైన రష్యా, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఒక రాజకీయ పరిష్కార మార్గాన్ని రూపొందించుకోవడంలో జరిగిన వైఫల్యంతో రష్యన్‌ సోషల్‌ సామ్రాజ్యవాద శిబిరం కుప్ప కూలిపోవడం జరిగింది. దాంతో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం తొలగిపోయి అమెరికన్‌ సామ్రాజ్యవాదం ఎదురులేని మొనగాడుగా ముందుకొచ్చి, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాల ముసుగులో ప్రపంచప్రజల జీవితాల్ని తన మార్కెట్‌ ప్రయోజనాలకు అనుగుణంగా సాధ్యమైన దేశాల్లో ఆర్థికంగా, సాధ్యం కాదనుకున్న దేశాల్లో సైనికంగా శాసించే క్రమాన్ని ప్రారంభించింది. దాని కొనసాగింపే భారతదేశంలో నేడు తెర మీదకొచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలుల నిర్మాణం.

భారతదేశంలో పి.వి. నరసింహారావు, మన్మోహన్‌ సింగుల నాయకత్వం లో ప్రారంభమైన ఈ ప్రక్రియ మొదట తేనె పూసిన కత్తిలాగా చాలా మందికి ఎంతో తియ్యగానే అనిపించింది. ఎందుకంటే చరిత్రలో దోపిడీ పాలక వర్గాలు ప్రజల్ని వంచించడానికి ఎన్నుకునే మార్గం ప్రారంభంలో ఎప్పుడూ తియ్యగానే ఉండాలన్నది వారి తాత్విక దృక్పథం లో భాగం. అందుకే దశాబ్దాలుగా సుపరిచితమైన భావనల (కాన్సెప్ట్స్‌) నిర్వచనాలు తారుమారైపోతున్నా వాటి వెనుక దాగిన కుటిలత్వాన్ని మనం గ్రహించి ప్రజానీకాన్ని జాగృతం చేయడంలో విఫలం చెందడం జరిగింది. ప్రజల కొరకే అభివృద్ధి అన్న నినాదం కాస్తా డెవలప్‌మెంట్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌గా రూపాంతరం చెందింది. అంటే దాని వెనుక దాగిన అసలు అర్థం ఇప్పటికి గానీ మనకు స్పష్టంగా బోధపడడం సాధ్యం కాలేదు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధి చెందాలంటే నందిగ్రామ్‌ లో కెమికల్‌ హబ్‌ నిర్మాణం జరగాల్సిందే. ఆ అభివృద్ధికి నందిగ్రామ్‌ రైతులు, ప్రజలు అడ్డంకిగా ఉన్నారు కాబట్టి వారిని తొలగించక తప్పదు. ఆ అభివృద్ధికీ నందిగ్రామ్‌ ప్రజలకూ ఏ మాత్రం సంబంధం లేదు కాబట్టి వారిని తొలిగించే విషయంలో పాలక వర్గాలు హ్యూమన్‌ ఫేస్‌ అనే బురఖాను ధరించాలి. అప్పుడు నందిగ్రామ్‌లో పోలీస్‌కాల్పులు, రైతుల మరణాలు, రక్తపుటేరులు అనేవి ప్రత్యక్ష పద్ధతుల్లో, కాకుండా మూడోకంటికి కూడా తెలియని పద్ధతుల్లో నందిగ్రామ్‌ రైతుల పోలాలకు సంబంధించిన అడ్రస్సులు వారి శవాలకు కూడా తెలియకుండా తారుమారైపోవాలి. అలాగే, ప్రజల కొరకే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్న నిర్వచనం ‘సైన్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌’గా రూపాంతరం చెందింది. ఇప్పుడు మన కళ్లముందు సాక్ష్యాత్కరిస్తున్న కంప్యూటరైజ్డ్‌ హైటెక్‌ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అంతా అదే. పట్టెడన్నం కరువై ఆకలిచావుల్నీ, ఆత్మహత్యల్నీ ఆశ్రయిస్తున్న కోట్లాది మంది వ్యవసాయ కార్మికుల్నీ, చేతివృత్తుల వారినీ ఆదుకోవాల్సిన శాస్త్ర విజ్ఞానం, కొద్ది మందికి మాత్రమే కోట్లాది రూపాయల లాభాలు, జీతభత్యాలుగా మారి వాటిని అందుకోవడానికి తమతో పోటీ పడమని, అందుకు మీ గ్రామాల్ని సైతం కంప్యూటరీకరించడానికి ఉదారంగా సహకరిస్తామని అంటున్నారంటే అందులో ‘హ్యూమన్‌ ఫేస్‌’ లేదనగలిగిన సాహసం చేయగలమా? ఇప్పుడు కొత్తగా ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలన అన్న భావన కాస్త ఇ – గవర్నెన్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌గా రూపాంతరం చెందడంలో దాగిన విషాదాలు ఎలా ఉంటాయన్నది భవిష్యత్తులో అనుభవించి తెలుసుకోవాల్సిందే. మొత్తం పరిపాలనను ప్రైవేట్‌ వ్యక్తుల, స్వచ్ఛంద సంస్థలపరం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఇ – గవర్నెన్స్‌ తప్ప మరేమీ కాదు.

మళ్లీ కాస్త వెనక్కి వెళ్లి అసలు విషయానికొస్తే ఈ ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాల అమలుకు సంబంధించిన ఆచరణ ఎలా పరిణామం చెందుతూ వచ్చిందన్న అంశాన్ని కూడా సూక్ష్మ స్థాయిలో లోతుగా పరిశీలించక తప్పదు. ‘ఒక కుక్కను నువ్వు చంపదలచుకుంటే అది పిచ్చిదని నువ్వు ముందుగా ప్రచారం చెయ్యి’ అన్నది సామెత. 1990లలో భారత సన్‌ ఎట్‌ సేన్‌గా ప్రగతి శీల ప్రజాస్వామిక వాదిగా పేరు పొందిన అరుణ్‌ శౌరి నాయకత్వంలో ఈ సామెతను ఆచరణలో నిజం చెయ్యడానికి భారతదేశంలో కేంద్రస్థాయిలో ఆవిర్భవించిన మంత్రిత్వ శాఖే డిజిన్వెస్ట్‌మెంట్‌ మినిస్ట్రీ. అప్పటికి పబ్లిక్‌ రంగ సంస్థల స్థాపన, అభివృద్ధి, విస్తరణల్ని పర్యవేక్షించే మంత్రిత్వ శాఖల్ని మాత్రమే చూసిన ప్రజలు ఇలా నిర్మూలించడానికి కూడా మంత్రులా? అని గగ్గోలు పెట్టడం ప్రారంభిస్తే ఆ మంత్రిత్వ శాఖనుండి వెలువడ్డ సమాధానంతో అనేక మంది నోళ్లు ముసుకు పోవడం జరిగింది. వారి మాటల్లోనే ఆనాటి వారి సమాధానం ‘భారత ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారి నష్టాల ఊబిలో నడుస్తున్న పబ్లిక్‌రంగ సంస్థల్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మి భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతిని మళ్లీ అభివృద్ధి పట్టాలపై నిలబెట్టడమే డిజిన్వెస్ట్‌మెంట్‌ శాఖ ప్రధాన లక్ష్యం’ అని ప్రకటించడం జరిగింది. అలా నష్టాల ఊబిలో పరిశ్రమలు కూరుకు పోవడానికి కారణాలేమిటన్న సమీక్ష కనీస స్థాయిలో కూడా జరక్కపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. అలా వందలాది పబ్లిక్‌ రంగ సంస్థలను నాలుగు సంవత్సరాల పాటు కోలాహలంగా వేలం వేశారు. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పబ్లిక్‌రంగ సంస్థల కార్మికుల్నీ, ప్రభుత్వోద్యోగుల్నీ సోమరిపోతులుగాను, దొంగలు, లంచగొండులుగాను చిత్రించడంలో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. యాభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అదొక దౌర్భాగ్యమైన తిరోగమన దశ. అలా ప్రారంభమైన సంస్కరణల ప్రక్రియ నాలుగు సంవత్సరాల అనంతరం నష్టాలతో నడుస్తున్న పరిశ్రమల్ని ప్రైవేట్‌ వ్యక్తులు కొనడానికి ముందుకు రావడం లేదని, వారికి బోనస్‌గా లాభాల్లో ఉన్న పబ్లిక్‌రంగ సంస్థల్ని కూడా అమ్మడం అనే ప్రక్రియగా పరిణామం చెందడం కూడా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సాగిందేనన్నది ఇప్పుడు స్పష్టంగానే అర్థమౌతోంది. ఆ తదుపరి దశలో గణనీయంగా కొనసాగిన అభివృద్ధి ప్రక్రియలో ఊళ్లు ఆక్రమించి, ఇళ్లు కూలగొట్టి నిర్మించిన మెగా హైటెక్‌ రోడ్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రధానమైనవిగా సాగాయి. ఆధునిక యుగంలో ఉనికిలోకొచ్చిన చట్టబద్ధ రాజ్యాంగ ప్రభుత్వ వ్యవస్థలకు భూమి మీద సర్వహక్కులూ బదిలీ కావడం జరిగింది. ఏ ప్రభుత్వ వ్యవస్థలోనైనా వ్యక్తులకు సంబంధించి భూమి మీద పట్టా రూపంలో సంక్రమించే హక్కు కేవలం క్రయ, విక్రయ భుక్తి సంబంధమైన షరతులతో కూడుకున్నదే కానీ, సర్వకాల శాశ్వత హక్కు ఎంత మాత్రం కాదు. అందుకే ప్రజాప్రయోజనాలకు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఎవరి హక్కు భుక్తమైన భూమినైనా, తిరిగి స్వాధీనం చేసుకునే హక్కును కలిగి ఉంటుంది. ఇక్కడ వ్యక్తుల ప్రయోజనాలు కాక ప్రజా ప్రయోజనాలు అన్న నియమం ఉల్లంఘించడానికి వీలు లేదు. ఈ పద్ధతి భారతదేశంలోనే కాక శతాబ్దాలుగా గణనీయమైన స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అమలౌతున్న ఒక చట్టబద్ధ నియమం. భారత దేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల స్థాపనతో ఈ చట్టబద్ధ నియమానికి కూడా గండికొట్టి నేటి పాలకులు ప్రైవేట్‌ వ్యక్తుల, సమూహాల వ్యాపార లావాదేవీలకు రైతుల హక్కు భుక్తమైన పచ్చని పోలాల్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడమే కాక, యాజమాన్య హక్కుల్ని బదలాయించడమన్నది అసాంఘికమైన అనాగరిక చర్యగా మిగిలి పోతుంది.

ప్రస్తుత దశ నిర్మాణాత్మకమైన ఏ రంగంలో కూడా ప్రభుత్వ ప్రమేయం కానీ, జోక్యం కానీ అసాధ్యం, అనాలోచితం అన్న స్థాయికి చేరుకుంది. అందినకాడికి కమిషన్లు పుచ్చుకోవడం, కాంట్రాక్టులు ఖరారు చేయడం అన్న ఏకైక కార్యక్రమం మాత్రమే నేటి భారత పాలక పక్ష రాజకీయ పార్టీల ఎజెండాగా మిగిలింది. అన్నిటికన్నా విషాదకరమైంది, ప్రస్తుతం భారతదేశంలో అస్తిత్వంలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ పక్షాల్లో ప్రధానమైన మూడు కూటముల్లో (యుపిఎ, ఎన్‌డిఎ, వామపక్షాలు) ఏ ఒక్క కూటమీ కూడా ఈ చట్ట వ్యతిరేక, అప్రజాస్వామిక పద్ధతుల్నీ, విధానాల్నీ సూత్రబద్ధంగా వ్యతిరేకిస్తున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించకపోవడమే కాక వారి గత చరిత్రను కూడా మరచి, ప్రవర్తించడం జరుగుతోంది. యుపిఎ కూటమికి నాయకత్వం వహిస్తున్న నేటి కాంగ్రెస్‌ పార్టీ గతంలో సంస్థానాలు, రాజభరణాల రద్దు మొదలుకొని భూ సంస్కరణలు, పట్టణ భూ గరిష్ఠ పరిమితి లాంటి చట్టాల రూపకల్పనకూ నాయకత్వం వహించిందన్న స్పృహకూడా లేకుండా ప్రవర్తింస్తుంటే మరో వైపు భూస్వాముల, జాగీరుదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న వేలాది ఎకరాల భూమిని విముక్తం చేయడానికి దున్నేవారిదే భూమిహక్కు అంటూ దేశ వ్యాప్తంగా మహత్తరమైన త్యాగాలతో పోరాటాల్ని నడిపిన చరిత్ర కలిగిన కమ్యూనిస్టుల పార్టీలు వామపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. వీటి మధ్య అధికారం కొరకు ఆబగా అర్రులు చాస్తున్న ఎన్‌డిఎ కూటమికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి గతంలో నినదించిన ‘భారతీయుడిగా బతుకు – భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొని వినియోగించు’ (బి ఇండియన్‌ – బై ఇండియన్‌) అన్న నినాదాలు ఈనాడు కనీస స్థాయిలో కూడా గుర్తుకు రాకపోవడం మరీ అశ్చర్యం గొలిపే అంశం. ఈ అన్ని కూటముల ఆరాటం, పోరాటమంతా కూడా ఆ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు ఎవరు నాయకత్వం వహించాలన్నదే కావడం మరింత విషాదకరమైన వాస్తవం.

గతాన్ని విస్మరించి భవిష్యత్తును నిర్మించడమన్నది ఎలా సాధ్యం కాదో అలాగే ప్రారంభాన్ని మరిచిపోయిన వారు గమ్యాన్ని చేరడం కూడా సాధ్యం కాదు. భారత దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ ఇంతటి సంక్లిష్టమైన సంక్షోభంలో కూరుకుపోవడానికి చారిత్రక కారణాలేమైనా ఉన్నాయా? అన్నది చర్చనీయాంశం. బహుశా ఇన్ని అవస్థలకు కారణ మైన వ్యవస్థ స్వరూప స్వభావాల్ని విశ్లేషించుకోవడం లోనూ, నిర్వచించుకోవడంలోనూ జరుగుతున్న వైఫల్యం కూడా ఆ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తోందేమోనన్న అనుమానం కూడా సత్యమైనదే. నేటికీ భారత వ్యవస్థ భౌతికంగానూ, భావజాల పరంగానూ, ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థగానే కొనసాగుతోందన్నది ఒక వాదం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఐరోపా దేశాల్లో భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా కొనసాగిన ప్రజాస్వామ్య పోరాటాలు విజయవంతమై ఆ సమాజాలు ఎంతోకొంత ప్రజాస్వామికీకరణకు నోచుకోవడం సాధ్యమైంది. భారతదేశంలో 1850లో ప్రారంభమై 1947 వరకు కొనసాగిన స్వాతంత్య్రోద్యమం అధికార మార్పిడితో అర్ధాంతరంగా ఆగిపోవడం మూలంగా ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవం. దాని కొనసాగింపుగా జరగాల్సిన ప్రజాస్వామికీకరణ అర్ధాంతరంగానే నిలిచిపోవడం జరిగింది. మాటల్లో మనం చెప్పుకుంటున్న భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక ఆకాంక్షగానే మిగిలిపోయింది. దాన్ని మనం ఇంకా సాధించుకోవడం అన్నది జరగాల్సి ఉంది. భారత సమాజాన్ని శాసిస్తున్న వర్గాలు (క్లాసెస్‌), పాలిస్తున్న శక్తులు భౌతికంగానూ, భావజాల పరంగానూ భూస్వామ్య శక్తులే. వారికి వ్యతిరేకంగా కలిసొచ్చే అన్ని జాతీయ శక్తులు, వర్గాలు ఐక్యమై మరో స్వాతంత్య్ర సంగామంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాగించందే భారత సమాజాన్ని ప్రజాస్వామికీకరణ చేయడం సాధ్యం కాదు. అలాంటి పరిపక్వమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పుకోలేనంత కాలం ప్రజలకు ఈ కష్టాలు, నష్టాలు తప్పవేమో.

Advertisements

Written by Polepally InSolidarity

June 1, 2007 at 2:52 am

One Response

Subscribe to comments with RSS.

  1. ప్రైవేట్ పెట్టుబడులతో నడిచే మార్కెట్ వ్యవస్థలో నీతి నియమాలు ఉండవు. అందినంత దోచుకోవడమే ఇక్కడి నీతి. మార్కెట్ దోపిడీదారులకి పాలక వర్గం నుంచి పూర్తి సప్పోర్ట్ ఉంది. పేదవాళ్ళు ఇంటి స్థలం కొనడానికి డబ్బులు లేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు పీకించి, ఆ స్థలం ఖాళీ చెయ్యించి ఆ స్థలాన్ని వేలం వేస్తారు సర్కారోళ్ళు. ఆ స్థలాన్ని డబ్బున్న వాడు కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్సో, అపార్ట్మెంటో, ఆఫీసో కడతాడు. ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పేదవాళ్ళు ఇంకో ప్రభుత్వ స్థలాన్ని వెతుక్కుని, మళ్ళీ అక్కడ కష్ఠ పడి గుడిసెలు కట్టుకోవాలి. వాటిని కూడా మళ్ళీ పోలీసులు పీకరని ఖచ్చితంగా చెప్పలేం. పల్లె ప్రాంతాలలో ఎస్.ఇ.జెడ్.ల పేరుతో మార్కెట్ దొంగలు పచ్చని వ్యవసాయ భూముల్ని కూడా ఆక్రమించుకోవడం కనిపిస్తుంది. భూములు కోల్పోయే రైతులకి సరైన నష్ట పరిహారం ఇవ్వరు, ఉద్యోగాలైనా ఇస్తామని అగ్రిమెంట్ రాయించరు. కార్పరేట్ దొంగలు పాలకవర్గం & పోలీసుల సప్పోర్ట్ తోనే లీగల్ గా భూములు ఆక్రమించుకుంటారు. నందిగ్రాం అయినా, కళింగనగర్ అయినా, పోలేపల్లి అయినా, ఇంకే గ్రామమైనా దాని మీద సెజ్ ఔత్సాహికుల కన్ను పడితే చాలు ఆ గ్రామాల ప్రజలు తమ భూములు ఎమైపోతాయో, తమ బతుకు తెరువు ఎమైపోతుందోనని భయపడుతూ బతకాలి. నందిగ్రాం వాసుల లాగ తిరగబడితే పోలీస్ కాల్పులు, రేపులు జరుగుతాయి.

    మార్కెట్ దోపిడీలో బ్యాంకుల వాటా కూడా ఉంది. రైతులు అప్పులు అడిగితే వెంటనే ఇవ్వరు కానీ రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు. బ్యాంకు అధికారుల దృష్టిలో రైతులు మనుషులు కారు, వాళ్ళ లాగ తెల్ల చొక్కాలు వేసుకునే వాళ్ళు మాత్రమే మనుషులు. సత్యం కంపెనీ లాంటి దొంగల సిండికేట్లకి కూడా మన బ్యాంకులు అడిగిన వెంటనే అప్పులు ఇచ్చేశాయి. సత్యం కంపెనీ రాజులు (రాబందులు) చేసిన ఘరానా మోసం ఇప్పుడు బయట పడింది. వాళ్ళు బ్యాంకు లావాదేవీల గురించి కూడా తప్పుడు లెక్కలు వ్రాయగలిగారు. ప్రభుత్వ బ్యాంకులు డబ్బున్న రైతులకి మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇస్తామని చెప్పుకుంటాయి కానీ గ్రామీణ ప్రాంతాలలో వాటి బ్రాంచిలు కనిపించవు. అందుకే రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి, అవి తీర్చలేక కాకుల్లా రాలి చనిపోతున్నారు. రైతులు ఎలా చచ్చినా బ్యాంకు అధికార్లకి పట్టదు. కార్పరేట్ రాబందులకి మాత్రం తమకి సాధ్యమైనంత సేవ చేస్తున్నారు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దొంగల రాజ్యం. ఫాక్టరీలు కట్టడానికి పచ్చని వ్యవసాయ భూముల్ని కారు చవకగా ఆక్రమించుకోవడం, కంపేనీ లాభాలు పెంచుకోవడానికి షేర్ హోల్డర్లని నట్టేట ముంచడం, నష్టాలొస్తే ఉద్యోగుల్ని రోడ్డున పడేయడం (ఎన్రాన్ కంపెనీ 22,000 మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేసింది), ఇంకా అనేక రకాలుగా నీతి లేని పనులు చేస్తారు కార్పరేట్ రాబందులు.

    Marthanda

    January 13, 2009 at 12:25 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: