Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పంట భూముల్లో సెజ్‌ల మంట

leave a comment »

By ప్రసాదరావు

పారిశ్రామిక రంగం అభివృద్ధి జరిగితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితికి భిన్నంగా జీవనం ఉంటుందని ఊహిస్తారు. ఉద్యోగం లేక నిరుద్యోగులుగా తిరుగుతున్న యువతకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ బలంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పడతాయి. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయని కలలు కంటారు. తమ భూముల విలువ పెరుగుతుందని, గ్రామాలు అన్న రంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని ప్రజలు భావించడంలో తప్పేమీ లేదు.

కాని రాష్ట్రంలో కాదు, దేశంలోనే పరిశ్రమల స్థాపన ఇందుకు విరుద్దంగా సాగుతున్నది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు (పారిశ్రామిక యజమానుల గుత్తాధిపత్యం) వస్తున్నాయంటే మొత్తంగా గ్రామాలు గ్రామాలే తరలిపోవాల్సి వస్తుంది. మొత్తం వారి జీవన విధానంపైనే ఈ పరిశ్రమలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గ్రామాలన్నింటిని కబళించివేస్తున్నాయి.

వందల సంవత్సరాల నుండి అదే భూమిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఈ భూములకు దూరం చేస్తున్నాయి. బలవంతంగా వాటిని లాక్కుంటున్నాయి. ఈ పరిశ్రమల యజమానుల గుత్తాధిపత్యానికి ప్రభుత్వం వందశాతం సహకరిస్తూ పోలీసుల్ని వారికి అండగా పంపి ఆ భూములు స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నది. ఎంతో కొంత చెల్లిస్తాం. భూములు ఖాళీ చేయమంటూ హెచ్చరికలు చేస్తూ భూములన్ని తమ కబంద హస్తాల్లోకి తీసుకుంటున్నారు. లక్షల్లో కొనుగోలు చేసిన భూములను కోట్ల రూపాయలకు అమ్ముకుని పరిశ్రమల యజమానులు లబ్ది పొందుతుంటే ప్రభుత్వం మాత్రం కళ్ళప్పగించి చూస్తోంది. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ భూ వ్యాపారాలు దళితులు, బలహీనవర్గాలను మరీ కుంగదీస్తున్నాయి. రైతుల వద్ద నుంచి గుంజుకున్న భూములను ప్రభుత్వం అమ్ముకుంటున్నది. ఎన్నో సంవత్సరాల కింద ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములను మళ్ళీ గుంజుకుంటున్నది. ఇదేమని అడిగితే ప్రభుత్వమే ఇచ్చింది, ప్రభుత్వమే తీసుకుంటుందన్న జవాబు చెబుతుంది. తమ తాతలు, తండ్రుల నాటినుంచి అనుభవించిన భూమి తమది కాకుండా పోతున్న వైనాన్ని చూసి బడుగు, బక్కరైతులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వంతో ఎదురొడ్డి పోరాడే ధైర్యం, శక్తి లేక వీరు నానా అగచాట్లు పడుతున్నారు.

పక్కోడు అన్యాయం చేస్తే వాడిపై పోలీసులకు, రెవిన్యూ అధికారులకు, ఫిర్యాదు చేస్తాం. కలెక్టర్‌ కూడా న్యాయం చేయకపోతే సచివాలయంలో ప్రభుత్వ ప్రతినిధుల వద్దకు వెళతాం. కాని ఇక్కడ రెవిన్యూ అధికారి నుంచి మొదలుకొని రెవిన్యూ మంత్రివరకు, ఎమ్మెల్యే మొదలుకొని ముఖ్యమంత్రి వరకు అందరు కూడగట్టుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులు ఎవరి వద్దకు పోవాలి. వారికి జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, తమది కాకుండా పోతాయనుకున్న భూముల వద్దే, రేయింబవళ్ళు కాపలా ఉంటున్నారు. ఎవరు కొత్తవారు ఆ పరిసరాల్లో కనిపించినా వారిని నిలదీస్తున్నారు.

మార్చి 25 తేదీన ప్రొ. హరగోపాల్‌ గారి నాయకత్వాన తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన నిజనిర్దారణ బృందం మహబూబ్‌నగర్‌ జిల్లాలో సెజ్‌ల బారిన పడుతున్న గ్రామాలను సందర్శించింది, ఆ పర్యటనలో పంటభూముల్లో సెజ్‌ల మంటలు ఎట్లా ఎగిసిపడి బడుగు బలహీన ప్రజల జీవనాన్ని విధ్వంసం చేస్తున్నదో వెల్లడయ్యింది. రంగారెడ్డి జిల్లాలో భూములు దొరకకపోవడంతో ప్రభుత్వం కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాపై దృష్టి సారించింది. ఇక్కడ దళితులు, బడుగు బలహీన వర్గాల భూములు ఎక్కడున్నాయో, ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు ఎక్కడున్నాయో ముందుగా పరిశీలించారు. దళితుల భూములు ఎక్కువశాతం ప్రభుత్వం ఇచ్చినవే అయినందున వీటిపై కన్నేసారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న బాలానగర్‌, జడ్చర్ల మండలాల్లో భూసేకరణ ప్రారంభించారు. ఎన్నడూలేని విధంగా గ్రామాల్లోకి కొత్త కొత్త కార్లు వస్తుండటంతో రైతులు ఆశ్చర్యపోయారు. ఇక్కడ కంపెనీలు పెడుతున్నామంటే పోరగాల్లకు నౌకర్లు ఒస్తాయని సంతోషపడ్డరు. కాని వారి కాళ్ళకింద భూమి కదిలిపోతుందని, తరతరాలుగా గంజినీళ్ళకు గింజలిచ్చిన భూదేవి కంపెనీలకు బానిసవుతుందని వారు భావించలేదు.

‘ఎప్పుడో మా నాయిన చెప్పిండు, ఈ భూమి మనదిరా అని అప్పటి నుంచి గిండ్లనే దున్నుకుంటున్నం. మా అయ్య ఐదెకరాలు చూపిస్తే ముగ్గురం అన్నదమ్ములం మనిషింత పంచుకొని దున్నుకుంటున్నం. గిప్పుడేమో ఈ భూమి మాది కాదంటున్నారు. సర్కారోల్లు ఒచ్చి ఈ భూమి గుంజుకుంటమని చెపుతుండ్రు ఇప్పుడు మేమెక్కడ పోవాలె’. ఇక్కడ ఏ రైతులను కదిలించినా ఇదే మాటలు వినపడ్తయి. కడుపులు పేగులు అవిసిపోయే ముచ్చట్లు తెలుస్తయి. సర్కార్‌ చేస్తున్న ఈ భూ పంపిణీకి గ్రామాలకు గ్రామాలే విచ్చిన్నమవుతున్నాయి. కుటుంబాలు అల్లకల్లోలమవుతున్నయి. ఏ ఆధారం లేని రైతులు ఆ భూములపైనే జీవించేవారు. చదువులు లేనివారు ఇతరత్రా ఏ పని తెలియనివారు తమ భూములు కోల్పోయి ఏంచేయాలో అర్థంకాక అర్ధాంతరంగా కాలం చేస్తున్నారు. భవిష్యత్తు భయంకరాన్ని వూహించుకుని భయకంపితులవుతున్నారు.

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ఏర్పాటుతో అతలాకుతల మవుతున్న ఈ గ్రామాలను పరిశీలిద్దాం. ఉదాహరణగా ఈ గ్రామాలను తీసుకుంటే దాదాపు ఇలాంటి పరిస్థితే అన్ని గ్రామాల్లోను ఉంటుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామాన్ని తీసుకుందాం. ఈ గ్రామం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నది. ఇక్కడ గౌండ్ల కులస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరందరికి కలిపి 150 ఎకరాల భూములున్నాయి. భూములన్ని ఇప్పుడు ఫ్యాక్టరీల పరమయ్యాయి. ఈ గ్రామంలోని నాగన్నగౌడ్‌ను కదిలిస్తే చాలు భూబాగోతం బయట పెడ్తడు. ‘మా భూములన్ని పోయినయి. ఇప్పుడు మా కులంల ఎవడన్న సస్తే, బొంద వెట్టనీకి కూడా జాగలేదు. నా ఒక్కనిదే 24 ఎకరాలు పోయింది. ఇప్పుడేం చెయ్యాలె. వాళ్లు పైసలిస్తే వాటిని మేం ఏం చేసుకోవాలె. అవి తిని తాగితే ఏడాదిల ఖతమయితయి అప్పుడేంచెయ్యాలె’!

ఇదే గ్రామంలో మరో ఘోరం జరిగింది. ఓ కుటుంబమే విచ్చిన్నమైంది. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వమిచ్చే సీలింగు భూమి మూడెకరాలు సాయి మానయ్య అనే రైతుకు ప్రభుత్వం ఇచ్చింది. రాళ్ళు, రప్పలు ఉన్న భూమిని ఆయన శక్తినంతా ధారపోసి చదును చేసుకుని వ్యవసాయం చేసి తిండిగింజలు పండించుకున్నాడు. పిల్ల పెళ్లికెదగడంతో కట్నం ఇచ్చుకోలేని స్థితితో మూడెకరాలలోంచి ఎకరం భూమిని కట్నంకింద అల్లునికిచ్చి బిడ్డ పెండ్లి చేసిండు. అల్లుడు – బిడ్డ హాయిగా జీవిస్తున్నారు. అయితే ‘సెజ్‌’ వీరి కుటుంబంలో నిప్పులు పోసింది. భార్యాభర్తలను విడదీసింది. ఇదెట్లంటారా?

మానయ్య అల్లునికి ఇచ్చిన ఎకరం భూమితో సహా తనకున్న రెండెకరాల భూమిని ప్రభుత్వం గుంజుకుంది. ఒక్కపైసా కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. దాంతో అల్లునికి కోపం వచ్చింది. బిడ్డతోపాటు భూమి ఇచ్చినవ్‌. ఇప్పుడు ఆ భూమి లేదుకద, నీ బిడ్డెందుని అల్లుడు బిడ్డను తెచ్చి మానయ్య ఇంటిమీద ఒదిలి పెట్టిండు. అసలే భూమిపోయి బతికేందుకు దిక్కుతోచని స్థితిలో ఉన్న మానయ్య ఇంటికి బిడ్డ ఆమెతోపాటు ఇద్దరు పిల్లలు వచ్చి చేరారు. ”నన్ను నా మొగున్ని ఈ సర్కారే ఇడగొట్టింది. మా భూమి గుంజుకున్నరు. ఆయన నన్ను ఇడిసిపెట్టిండు. ఇప్పుడు నాకేంది దిక్కు నాకెవ్వరు న్యాయం చేస్తరు’. అంటూ మానయ్య బిడ్డ మంజుల ప్రశ్నిస్తుంది. సెజ్‌లు కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు ప్రతి గ్రామంలోను ఉంటాయి. గ్రామంలో మరో వృద్దురాలు చింతపల్లి నాగమ్మ మాట్లాడుతూ’ నా పొలం మూడెకరాలు తీసుకున్నరు. ఒక్కపైసా కూడా ఇయ్యలేదు. నేనెట్ల బతకాలె నాకు దిక్కెవరని’ ప్రశ్నిస్తుంది. ఇదే గ్రామంలో మరో సంఘటన చోటు చేసుకుంది, అదేమంటే అక్కడి రైతులు కంపెనీలకు గుర్కోల్లుగా మారారు. వారి పొలాలను కాజేసిన కంపెనీలు వారికి గుర్కా ఉద్యోగాలిచ్చినయి. ఒకరి వద్ద తీసుకున్న భూమిలో మరొకరిని కాపలాకు పెట్టాయి. ఇప్పుడు గ్రామాల్లో రైతుల మధ్య కంపెనీలు పంచాయతీ పెట్టినయి.

ఎకరానికి 18 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఒక్క పైసా కూడా చెల్లించలేదని భూములు కోల్పోయినవారు ఆవేదన చెందుతున్నారు. ‘ఇగ ఆ ఇచ్చే పైసలకు కూడా బ్యాంక్‌లోన్‌లుంటే అవి పట్టుకోని ఇస్తరట. నా భూమి మీద 20 వేల లోనున్నది. అదిప్పుడు 30 వేలు అయితది. ఇగ నాకేం పైసలొస్తయి. అందుకే ఆ పైసల దిక్కుపోతనే లేదు. కూలి చేసుకుని బతుకుతున్న’ అంటూ మరో రైతు చెప్పిండు.

ఇక జడ్చర్ల మండలంలోని పోలెపల్లి గ్రామం జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ దళితులు, ముస్లింలు, గౌడ్స్‌ల భూములన్ని సెజ్‌ల పరమయ్యాయి. గ్రామంలో నయా దళారీలు తయారయ్యి కంపెనీల యజమానులకు వత్తాసు పలుకుతున్నాయి. అందువల్ల దళితులు రేయింబవళ్ళు గుంపులు గుంపులుగా ఆ భూముల వద్దే కాపలా ఉంటున్నారు. మగవారినైతే పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారని, గుండాలు దాడిచేసి కొడతారన్న భయంతో నడివయస్సు మహిళలు ఇక్కడ కాపలాగా ఉంటున్నారు. ఇక్కడి భూములు ‘అరబిందో ఫార్మా’ కంపెనీకి ఇచ్చారని, వారి మనుషులొచ్చి భూములపై దౌర్జన్యం చేస్తున్నారని మహిళలు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ బోర్‌ వేసేందుకు వస్తే వారందరినీ తరిమేశామని వారు చెప్పారు. ఇక్కడికే సద్దులు తెచ్చుకుని కావలి కూర్చుంటున్నామని, ఓ రాత్రి దొంగలోలె వచ్చి మా పొలాల్లో జెండాలు పాతిపోతే వాటన్నింటిని తీసి కాలపెట్టినమని ఆ మహిళలు చెప్పారు. వూర్లె పట్వారి కాడ్నించి ఎమ్మార్వో, ఆర్డిఓ, కలెక్టర్‌ అందరు కంపెనీలోల్ల పట్టే ఉన్నారని రుక్కమ్మ అనే మహిళ పేర్కొన్నది.

తప్పెట మొగులమ్మ భర్త భూమిపోయిందన్న బాధ తట్టుకోలేక చనిపోయిండు. ఊశాని రంగమ్మకున్న రెండెకరాలు పోయింది. ఇప్పుడామెకు మిగిలిందేమీ లేదు. ఒక పక్కనే ఉన్న గుండ్లగడ్డ తాండాలో లంబాడీలు 70 కుటుంబాలుంటాయి. వీరందరి భూములు కంపెనీ రాక్షసి మింగేసింది. ఇదే గ్రామానికి చెందిన ధర్మ్యా మాట్లాడుతూ ‘మాకు ఒక్కపైస ఇయ్యకుండనే భూములు గుంజుకున్నరు’ అని చెప్పాడు. రంగమ్మ, పెద్ద వెంకయ్య భూములు కూడా ఇలాగే పోయాయి. వీరు ఇవ్వమని మొండిచేసినా అధికారులు బెదిరించి గుంజుకుంటున్నారని చెప్పారు. ‘ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఈ రాజశేఖర్‌రెడ్డి గుంజుకుంటున్నడు. ఆమె మా ఇంట్ల దీపం పెడితే ఈయన మా కాష్టం పెడుతుండు. మీదికెల్లి తాను ఇందిరమ్మ రాజ్యం తెస్తనంట్నుడు ఆయనకేం న్యాయం కాదు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?’ అని వారు పెడుతున్న శాపనార్థాలు వారి బాధలు దుఃఖానికి ప్రతీకలు.

ఇస్తున్నది సర్వీస్‌ చార్జెనట – పోలేపలి గ్రామ సర్పంచ్‌ బాలస్వామిగౌడ్‌

ప్రభుత్వం ఇచ్చిన భూమిని రెవిన్యూ రికవరీ యాక్టు కింద తీసుకుంటున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆ భూములకు కేవలం సర్వీసు టాక్సు కింద 18 వేలు చెల్లిస్తున్నారు. ఇది కూడా కాకుంటే బలవంతంగా తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎంతదూరం పోయిన కూడ న్యాయం జరగడంలేదు. మా భూములు కూడా ఇట్లనే పోయినవి. మా భూములను మాకండ్లముందరనే కోట్ల రూపాయలకు అమ్ముతున్నరు. పేదల భూములను గుంజుకోవడం ఎంతో దారుణం. భూములన్ని గుంజుకుంటే పేదోల్లు ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలి. ఉద్యోగాలిస్తామని చెపుతుండ్రు. ఏం ఉద్యోగాలిస్తరు. మా రైతులను కూలీలుగా మారుస్తరంతే!

ఇస్తామన్నది 18 వేలు, ఇచ్చింది 9 వేలు

ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి తీసుకున్నందుకు ఎకరాకు 18 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అక్కడ రైతులకు అందింది మాత్రం 9 వేలే. కొందరికి అవికూడా అందలేదు. ఇక పట్టాభూములకు లక్షరూపాయలు, కొన్నింటికి 80 వేలు చెల్లించారు. అయితే ఇదే భూమిని ప్రభుత్వం ఫ్యాక్టరీలకు 7 లక్షలకు ఎకరం చొప్పున అమ్మకాలు సాగించింది. ఇలా కొన్న భూమిని కొందరు కంపెనీల వారు తిరిగి కోటిరూపాయలకు ఎకరం చొప్పున అమ్ముతున్నట్లు చెపుతున్నారు.

పోరాటాలే పరిష్కార మార్గాలు :

పేద ప్రజల జీవితాల్లో మటలు రూపుతున్న ఈ సెజ్‌లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ భూములన్నింటినీ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలను రాజశేఖర్‌రెడ్డి చాపకింద నీరులా సాగిస్తున్నాడు. వీటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకోసం రాజకీయాలకతీతంగా ఐక్యపోరాటం సాగించాల్సిన అవసరముందని రాజకీయ పార్టీలు గుర్తెరగాలి.

Courtesy: Telangana Times

URL: http://www.times.discover-telangana.org/2007/05/agricultural_lands_sez/

Advertisements

Written by dilkibaatein

April 2, 2008 at 5:35 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: