Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఉసురు తీసిన సెజ్‌!

leave a comment »

ఒకే గ్రామంలో 25 మంది బలి
సొంతభూమిలోనే కూలీలైన రైతులు
ఎదురుతిరిగినవారిపై కేసులు
జైళ్లలో కుక్కిన యంత్రాంగం
అవమానంతో ఆత్మహత్యలు
జడ్చర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ప్రభావం

ఈయన పేరు బాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద పోలేపల్లి రైతు. 16 ఎకరాల ఆసామి. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తన భూమిని సేకరించడాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఇతడిని అరెస్టుచేసి జైలుకు పంపింది. అవమాన భారంతో కుంగిపోయి మరణించాడు. ఇతడే కాదు.. పాతిక మందికిపైగా రైతులు ఇలా భూసేకరణకు బలయ్యారు. రైతులను తమ పొలంలోనే కూలీలుగా మార్చేసి వారి బతుకులను ఛిద్రం చేసిన ఓ ప్రత్యేక ఆర్థిక మండలిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.

మొన్నటిదాకా 16, 17 ఎకరాల భూస్వాములు వారు. నేడు.. తమ పొలంలోనే కూలీలుగా మారిపోయారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) వారి భూముల్ని మింగేసింది. కొందరి ప్రాణాలను కబళించింది. ఇంకొందరి బతుకులను ఛిద్రం చేసింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికి 25 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.. నమ్ముకున్న భూమిని కోల్పోయిన బాధను తట్టుకోలేక గుండె ఆగి కొందరు చనిపోయారు. తమ సొంత భూమిలోనే కూలీలుగా మారిన అవమానభారంతో ఇంకొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆ అవమానంతో వారిలోనూ కొందరు మంచంపట్టి చనిపోయారు. బతికున్నవారూ తాము కోల్పోయిన భూముల్లోనే కూలీలుగా పనిచేస్తూ జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు.. రాష్ట్ర రాజధానికి దగ్గర్లోని జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. ‘న్యూస్‌టుడే’ ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల దయనీయ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసింది.

ఎం.ఎల్‌. నరసింహారెడ్డి
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

 

తెలుగుదేశం హయాంలో గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద భూసేకరణ చేపట్టింది. 1000 ఎకరాలు సేకరించింది. ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో రైతులే తమ భూములను సాగు చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2005 నుంచి పరిస్థితి మారిపోయింది. రైతులు సాగు చేసుకుంటున్న భూములను సర్కారు స్వాధీనం చేసుకుంది. ఔషధ రంగానికి సంబంధించిన ప్రత్యేక ఆర్థిక మండలి కోసం కేటాయించింది. అరవిందో ఫార్మాకు 70 ఎకరాలు, హెట్రోడ్రగ్స్‌కు 80 ఎకరాలు ఇచ్చింది. కార్తీకే, మమత తదితర సంస్థలకూ భూములు కట్టబెట్టింది. ఏడాది కాలంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి వారిని అణచివేశారు. రైతులకు పరిహారం అందినా.. ఇంత తక్కువ చెల్లించిన సంఘటన రాష్ట్రంలో ఎక్కడా లేదు. అసైన్డ్‌ భూమికి ఎకరాకు రూ.18 వేలు, పట్టా భూమికి రూ.30 వేలు చెల్లించారు. ఇందులో కూడా కొంత దళారుల పాలైందని రైతులు వాపోయారు.

 

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ

* భద్యా అనే రైతుకున్న ఐదెకరాల భూమి పోయింది. ఇది తట్టుకోలేక భార్య చనిపోతే.. అతడూ విషం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారి పిల్లలు ఇప్పుడెక్కన్నారో కూడా తెలియదు.

* భద్రా అనే మరో రైతుదీ ఇదే పరిస్థితి. భూమి కోల్పోయిన దిగులుతో ఒకరోజు బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల గాలించారు. చివరకు బావిలో శవమై తేలాడు.

* మంగ్యా అనే రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే.. భార్య తన నలుగురు పిల్లలతో తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది.

* పదెకరాల భూమిని కోల్పోయిన దీప్లానాయక్‌ ముగ్గురు కుమారులు కూలీలుగా మారారు.

* అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేశారని, పరిహారం తీసుకోకుంటే భూములు గుంజుకొంటామని బెదిరించడంతో కోట్యానాయక్‌ అనే రైతు మరణించాడు.

* తమ భూములు స్వాధీనం చేసుకొన్న ఏడాదికే భర్త చనిపోయారని, ఇప్పుడు పిల్లలకు పనులు ఇవ్వడం లేదని ఓ మహిళ వాపోయింది.

జైలుకు పంపారన్న అవమానంతో

భూములు కోల్పోయిన రైతులు ఇటీవల ఆందోళన చేయడంతో పోలీసులు తమ ప్రతాపం చూపి 36 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ అవమాన భారం భరించలేక కొందరు రైతులు చనిపోతే.. కొందరు ఇప్పటికీ దానిని తలుచుకుని కుమిలిపోతున్నారు. తాండాకు చెందిన బాలుకు ఉన్న 16 ఎకరాల భూమి పోయింది. ఇటీవల ఆందోళన చేసినపుడు పోలీసులు పట్టుకెళ్లారు. అవమానం భరించలేక పస్తులుండి, కుమిలిపోయి మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన కొడుకు 14 ఏళ్ల వయస్సున్న లక్ష్మణ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

* పోలేపల్లిలోని దళిత వాడకు చెందిన వల్లూరు బాలయ్య కూడా భూమిని కోల్పోయి, పోలీసులు కేసు పెడ్తే కోర్టు చుట్టూ తిరిగి అవమానం భరించలేక మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

* నాలుగు ఎకరాల భూమి ఉంటే రెండు ఫ్యాక్టరీలకు తీసేసుకున్నారని, ఈ బాధ తట్టుకోలేక తన భార్య చనిపోయిందని పోలేపల్లికి చెందిన పెద్ద పెంటయ్య చెప్పారు. ఇటీవల ఆందోళన చేసినపుడు పోలీసులు అరెస్టు చేసి నానా ఇబ్బందులు పెట్టారన్నారు. ఎవరైనా చనిపోతే శవాన్ని పూడ్చడానికి కూడా స్థలం లేదని విలపించారు.

* భూములు కోల్పోవడంతో మరణించిన వారిలో తాండాకు చెందిన తోగ్యా, దళితవాడకు చెందిన బాలయ్య, వెంకయ్య తదితరులున్నారు.

భర్త వదిలేసి ఎక్కడికో పోయాడు!

ఉన్న భూమిని ప్రభుత్వం లాగేసుకోవడంతో భర్త తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని నర్సమ్మ అనే మహిళ వాపోయింది. మొగిలయ్య అనే రైతుకు ఈమె కూతురు. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే భూమిని ప్రభుత్వం తీసుకుంది. భూమి పోయాక ఉండలేనంటూ అల్లుడు వెళ్లిపోయాడు. నర్సమ్మ, మొగిలయ్య ఇప్పుడు తమ భూమిలోనే కూలీలుగా పని చేస్తున్నారు.

 

నిర్వాసితుల తరపున నిలబడి..

పోలేపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ ఉపేందర్‌రెడ్డి భూమి కోల్పోలేదు. యువకుడైన ఈయన నిర్వాసితులకు అండగా నిలబడి పోరాడాడు. అరెస్టయి జైలుకెళ్లాడు. పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలొదిలాడు.

నిన్నటి రైతులే నేటి కూలీలు

పోలేపల్లి, గుండ్లగడ్డ తాండాల్లో రెండేళ్ల క్రితం వరకు ఐదు నుంచి 25 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులు నేడు తమ పొలాల్లోనే కూలీలుగా మారారు.

*ఉన్న మూడెన్నర ఎకరాల భూమి పోయింది.. భర్త ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. నాకు మూడు ఆపరేషన్లు జరిగాయి. అయినా కుటుంబాన్ని పోషించడానికి ఇక్కడే పనికి రావాల్సి వచ్చిందని బాలమ్మ అనే మహిళ వాపోయింది.

కోల్పోయిన భూముల్లో రైతులందరికీ పని దొరకడం లేదు. నడివయసు దాటిన వారికి ఔషధ సంస్థలు పనులివ్వడం లేదు. తనకు వయస్సు మీరిందంటూ తిప్పి పంపారని టోప్యా అనే నిర్వాసితుడు తెలిపారు. ఈయన భార్యను మాత్రం పనిలో పెట్టుకున్నారు. ‘గతంలో పొలం దున్ని నాలుగునెలలు పనిచేస్తే ఏడాది తినేవాళ్లం. ఇప్పుడు తమ భూముల్లోనే కంపెనీల తరపున ఎండలో పెద్దపెద్దరాళ్లు మోసే పనులు చేయలేక అల్లాడుతున్నాం. మా బతుకులు చెట్లపాలు, రాళ్లపాలు అయ్యాయి’ అని గ్రామస్తులు విలపిస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి చేపట్టిన వారిని ఏమైనా అడిగితే.. ‘మాకేమీ సంబంధం లేదు, మీ దగ్గర నుంచి ఏపీఐఐసీ తీసుకుంది. వారినడగండని సమాధానం చెబుతున్నారు’ అని పలువురు వాపోయారు. ఇక్కడ కూడా కొద్దిరోజులే పని ఇస్తారని, ఫ్యాక్టరీలకు గోడలు లేచాక తమను తీసేస్తారని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

సీత్యానాయక్‌కు 17 ఎకరాల భూమి ఉండేది. అధికారులు భూమి తీసుకుంటామంటే ప్రత్యామ్నాయంగా భూమి ఇమ్మని ఆరునెలల పాటు అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా అధికారులు పట్టించుకుకోకుండా గ్రామంలో సమావేశం పెట్టి భూమి తీసుకొంటామని ప్రకటించారు. తట్టుకోలేక సీత్యానాయక్‌ మరణించాడని ఆయన కుమారుడు కిష్ణు తెలిపాడు.

-తమకున్న 16 ఎకరాలు పోవడంతో తన భర్త సోన్యానాయక్‌ ఆవేదనతో మరణించాడని ముడావత్‌ రుక్కీ అనే మహిళ విలపించింది. ఇద్దరు పిల్లలు కూలికిపోయి వారి కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారింది. నేనెలా బతకాలని ఆమే భోరుమంటోంది.

శంకర్‌నాయక్‌కు 16 ఎకరాల భూమి పోయింది. ప్రస్తుతం రోజుకు రూ.120 కూలితో ఇక్కడే పనిచేస్తున్నానని వాపోయాడు.

17 ఎకరాలు కోల్పోయిన దిమ్సానాయక్‌ది ఇదే పరిస్థితి. కూలి చేయగా వచ్చిన డబ్బులు తిండికి మాత్రం సరిపోతున్నాయని చెప్పాడు. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.16 వేల వరకు పరిహారంగా ఇచ్చారని, ఈ డబ్బుతో ఎక్కడా భూములు కొనలేని పరిస్థితిలో నిస్సహాయులుగా మిగిలిపోయామన్నారు.

మూడున్నర ఎకరాల భూమిని తీసేసుకొన్న ఏడాదికే తన భర్త నరసయ్య మరణించాడని, ఆరుగురు పిల్లలను ఎలా సాకాలో అర్థం కావడం లేదని సుక్కమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

తాను చచ్చి బతికానని ఆరు ఎకరాల భూమి కోల్పోయిన కూర్మయ్య అనే రైతు విలపించాడు. భూమి కోల్పోయిన బాధతో ఆందోళన చెంది పక్షవాతానికి గురయ్యాడు. కొన్నిరోజుల తర్వాత కోలుకుని.. ప్రస్తుతం అక్కడే కూలిగా పని చేస్తున్నాడు.

Courtesy: Eenadu Newspaper Dated 18-4-2008

Advertisements

Written by dilkibaatein

April 21, 2008 at 8:49 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: