Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఇదే నిజం – ఈ జీవచ్చవాలే సాక్షి

leave a comment »

ఈమె పేరు బాలమ్మ.. చేతిలోని చిత్రం భర్త దేపల్లి వెంకయ్యది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం, అటు తర్వాత ఫార్మా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం జరిగిన భూసేకరణలో జీవనాధారమైన భూమి కోల్పోయి.. ఉపాధి కరవై.. కుటుంబాన్ని పోషించలేక పుట్టెడు దిగులుతో వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ‘ఉసురు తీసిన సెజ్‌’ శీర్షికన ఈనెల 18న ‘ఈనాడు’ రాసింది ఈయన గురించి. వైఎస్‌ తనయుడి పత్రిక ‘సాక్షి’.. ఆ వూళ్లో ఇద్దరే వెంకయ్యలున్నారని, ఇంకెవరూ లేరని బొంకింది. మరి ఈ వెంకయ్య భార్య బాలమ్మకేం సమాధానం చెబుతుంది? వీరికి ఎకరా భూమి ఉంది. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చింది. ఉన్న ఎకరా పోవడంతో ఇక ఎలా బతుకుతామని దిగులుపడి తన భర్త మరణించాడని బాలమ్మ రోదిస్తూ శుక్రవారం తనను కలిసిన ‘న్యూస్‌టుడే’ ప్రతినిధికి చెప్పింది.

‘పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక’- ‘సాక్షి’

ఫ్యాక్షనిజంలో పుట్టి, ‘ఈనాడు’పై పగబట్టి ‘ఏది నిజం’ పేరిట సర్వాబద్ధాల్ని ప్రచురిస్తూ అక్షరాలా రాజకీయ కక్షకు సాక్షీభూతంగా నిలుస్తోంది ‘సాక్షి’!
ముప్ఫై మూడేళ్ల క్రితం పుట్టింది ‘ఈనాడు’. తెలుగువారి ఆదరాభిమానాలే కొండంత అండగా ఎదిగిన ‘ఈనాడు’కు ఎల్లవేళలా సత్యనిష్ఠ, ప్రజాప్రయోజనాలే ప్రాణస్పందనలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలపక్షాన అక్షర అక్షౌహిణుల్ని మోహరించి జనహితం తెగటారిపోకుండా కాచుకోవాలన్నదే ‘ఈనాడు’ ఏకైక లక్ష్యం. అందుకోసమే సాగిస్తోంది అసిధారావ్రతం!

ముప్ఫై మూడు రోజుల క్రితం పుట్టింది ‘సాక్షి’. తెలుగు పాత్రికేయంలో కొత్తగా వచ్చిన పత్రిక ఉన్నత వృత్తిప్రమాణాలకు కట్టుబడితే, కనీసం తానే శిరసున దాల్చిన ‘సత్యమేవ జయతే’కు నిబద్ధత చాటితే పరిస్థితి భిన్నంగా ఉండేది. వచ్చిన రోజునుంచే వైఎస్‌ తనయుడి పత్రిక తండ్రి అజెండాకు అనుగుణంగా ‘ఈనాడు’పై దాడిచేస్తోంది. పాఠకుల్లో గల అచంచల విశ్వసనీయతే ‘ఈనాడు’ మహాసౌధానికి పునాది. దాన్ని కదలబార్చడం కోసమే అబద్ధాలకు రంగులద్ది జనంలోకి వదులుతున్నారనడానికి జడ్చర్ల కథనమే తిరుగులేని సాక్ష్యం!

 

నిజం నిప్పు కణిక. కట్టుకథల నివురుగప్పినా అది జ్వలిస్తూనే ఉంటుంది. కోర్టులో అబద్ధపు సాక్ష్యమిచ్చేవారూ తాము సత్యహరిశ్చంద్రుడికి సన్నిహిత బంధువులమని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అబద్ధాల సాక్ష్యాల తయారీకోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంటారు. నిజాలకు పాతరేసి, అబద్ధాల జాతర మొదలెట్టిన ‘సాక్షి’ దినపత్రికదీ ఇదే తంతు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తిమ్మినిబమ్మిని చేస్తోందనడానికి జడ్చర్ల సెజ్‌పై ఆ పత్రిక ప్రచురించిన కథనమే సాక్షి! జడ్చర్ల సెజ్‌లో తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న అభాగ్యుల గుండెల్ని అసత్యపు అక్షర రంపాలతో సాక్షి నిలువునా కోసింది. సెజ్‌లో సమిధలైన పాతికమందికి పైగా అభాగ్యుల కష్టాల్ని ‘ఈనాడు’ కళ్లకు కడితే… కాదంటూ సవాలుచేసిందీ పత్రిక. కానీ తాను చెప్పిందే నిజమని ససాక్ష్యాధారాలతో నిరూపిస్తోంది ‘ఈనాడు’. ముందే వాస్తవాలు నిర్ధారించుకొని కథనాన్ని ప్రచురించినా… బాధ్యత గల పత్రికగా మరోసారి ఈనాడు, ఈటీవీ ప్రతినిధి బృందం శుక్రవారం పోలేపల్లి గ్రామానికి వెళ్లి వాస్తవాలు మరోసారి ధ్రువీకరించుకుని బాధితుల గోడుకు అక్షరరూపం ఇస్తోంది.
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధులు
అనాదిగా భూమి, రైతు మధ్య బంధం విడదీయలేనిది. కానీ ఇప్పుడా పేగుబంధాన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌) తెగ్గోస్తున్నాయి. పచ్చటి పొలాల్లో, చక్కటి బతుకుల్లో చిచ్చు రేపుతున్నాయి. రైతు బతుకును బజారుపాలుచేస్తున్నాయి. ప్రభుత్వం విదిల్చే పరిహారపు చిల్లర డబ్బుల్తో మరోచోట భూముల్ని కొనలేక, కూలీలుగా పనిచేయలేక రైతు రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతున్నాడు. నిన్నామొన్నటిదాకా సాగుచేసిన తమ పొలాల్లోనే కూలీగా మారుతున్నాడు. గౌరవంగా బతికిన వూర్లోనే తలదించుకోవాల్సిన దుస్థితి. జడ్చర్ల సెజ్‌లో భూముల్ని కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి.
”ఉన్న భూములు పోయాయి. ఈ బాధను తట్టుకోలేక మా భర్తలు చనిపోయారు. ఎలా బతకాలో అర్థంకావడం లేదు. మా భూముల్లోనే కూలీలుగా పనిచేస్తున్నాం. అవమానాలు ఎదుర్కొంటున్నాం”- పోలేపల్లి వద్ద సెజ్‌లో భూమిని కోల్పోయిన మహిళల దీనస్థితి ఇది. ఇక్కడ ఏ మహిళను కదిపినా కన్నీళ్లే. ”అదిగో అక్కడ జేసీబీలు పనిచేసేది మా భూమి” అని ఒకరంటే, ”ఆ భవంతి కట్టేది మా స్థలంలోనే” అని మరొకరు ఆవేదనతో చెబుతున్నారు. భూమిని కోల్పోయిన రైతులు కూలీలుగా మారడమే కాదు, దిగులుతో కుమిలిపోయి, విగతజీవులైన రైతులు, వారి కుటుంబాల దుస్థితిని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. కానీ ఇవన్నీ అబద్ధాలని, పోలేపల్లి గ్రామంలో ఇద్దరు వెంకయ్యలు మాత్రమే ఉన్నారని, వారిద్దరూ బతికే ఉన్నారని, కథనం కోసం చంపేశారంటూ అవాస్తవ, అభూత కల్పనలతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈనాడు పత్రికలో ‘ఉసురు తీసిన సెజ్‌’ శీర్షికతో ప్రచురించిన కథనంలో మరణించిన రైతులు బాలు, సీత్యానాయక్‌ ఫొటోలు వేశాం. ఈ ఇద్దరు రైతులూ చనిపోయారు. ప్రచురించిన వారి ఫొటోల కింద పేర్లు తారుమారు అయ్యాయి.

అది సాక్షి కంటికి కనిపించలేదా?
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి గ్రామం వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో భూసేకరణ చేపట్టింది. 2003లో 969 ఎకరాలు సేకరించింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని గ్రోత్‌ సెంటర్‌గా ప్రకటించింది. 2006 సెప్టెంబరులో ఫార్మాస్యూటికల్‌ ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించింది. అరబిందో ఫార్మా, హెట్రోడ్రగ్స్‌ తదితర కంపెనీలకు కేటాయించింది. అరబిందో ఫార్మా ప్రమోట్‌చేసిన ట్రిడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ సాక్షి దినపత్రికలో రూ.6 కోట్ల 80 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. హెట్రో డ్రగ్స్‌, ల్యాబ్స్‌, హెల్త్‌కేర్‌ సంస్థల పేరిట రూ.1.94 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆ సంస్థలున్న సెజ్‌లో అంతా సవ్యమేనని చెప్పేందుకు సాక్షి పడరాని పాట్లు పడుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే భూసేకరణ చేపట్టారని, వెయ్యి ఎకరాలు సేకరించారని ఈనాడు తన కథనం ప్రారంభంలోనే స్పష్టంగా పేర్కొన్న విషయం సాక్షి కంటికి కనిపించలేదా? ఈనాడు పత్రిక ఉద్దేశపూర్వకంగానే దీనిని పక్కనబెట్టిందంటూ సాక్షి పేర్కొనడం బాధ్యతా రాహిత్యం కాదా? 

 

——–
బురద జల్లడమే ‘నిజం’

ఒక దినపత్రికలోని వార్తలను, కథనాలను మరో పత్రిక అక్షరం అక్షరం సమీక్షించే పని చేపట్టడం ప్రపంచ పాత్రికేయ చరిత్రలోనే నభూతో… తాజా వార్తలు, మేలిమి విశ్లేషణలతో పాఠకుల్ని ఆకట్టుకోవడానికి ఎక్కడైనా పత్రికలు పరిశ్రమిస్తుంటాయి. అందుకు పూర్తి భిన్నంగా- ముఖ్యంగా తనకు నప్పని, ఏ వ్యాపార విలువలూ ఒప్పని నీతులు వల్లిస్తూ, సాటి పత్రికకు గోతులు తవ్వే క్రమంలో ‘సాక్షి’ ఇప్పటికే దిగజారిపోయింది. ‘జో హుకుం’ అంటూ తన దారికి రాని వ్యక్తులు, వ్యవస్థల్ని నానారకాలుగా పీల్చి పిప్పి చెయ్యడంలో వై.ఎస్‌.ది అందెవేసిన చేయి. వై.ఎస్‌. జమానాలో ‘ఈనాడు’ గ్రూప్‌ సంస్థలపై అప్రకటిత ఆత్యయిక స్థితి(ఎమర్జెన్సీ) అమలవుతోంది. ఎన్ని విధాలుగా దాడులు చేసినా ‘ఈనాడు’ గుండె నిబ్బరం చెక్కు చెదరకపోయేసరికి- దిక్కుతోచని పెద్దలు తెలుగువాడి విజ్ఞతకు పరీక్ష పెడుతూ తెచ్చిందే ‘సాక్షి’. ఈ నెల రోజుల్లో ‘ఈనాడు’పై బురద జల్లడమే లక్ష్యంగా వండి వార్చిన అవాస్తవాలు ఎన్నని? ఆ కథనాలకు స్పందిస్తే ‘ఈనాడు’ దిగజారినట్లవుతుంది. వారితోపాటు ఆ అడుసులో ఈదులాడినట్లవుతుంది. కాబట్టే ఇంతకాలం ఎన్ని అసత్యాల్ని అడ్డగోలుగా ప్రచురించినా ‘ఈనాడు’ ఓపిక పట్టింది. ఇలా ఉపేక్షిస్తే కొంతమంది పాఠకులైనా వారి అసత్య కథనాలు నిజమనుకునే ప్రమాదం ఉండడంతో ‘ఏది నిజం’ బండారాన్ని ‘ఈనాడు’ బట్టబయలు చేస్తోంది.
జడ్చర్ల సెజ్‌లో నిర్వాసితుల గోడుకు ఈనెల 18న ‘ఈనాడు’ అక్షర రూపమిచ్చింది. బడుగు ప్రాణాల్ని బలిగొంటున్న అమానుషంపై ‘ఈనాడు’ కథనం రాస్తే- బాధ్యత అనేది ఉంటే గింటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అంతేగాని దానిపై వాస్తవాల సమీక్షకు ‘సాక్షి’ సాహసించిందంటే, అందుకు కొన్ని ప్రత్యేక కారణాలూ ఉన్నాయి. జడ్చర్ల సెజ్‌లో భూములు పొందిన పెద్దల్లో కొందరు ‘సాక్షి’లో పెట్టుబడిదారులు! అందుకే ‘సాక్షి’కి అంత ఉలుకు! ఎక్కడెక్కడినుంచో సేకరించిన సొమ్ముతో ‘సాక్షి’ పెట్టి ‘ఈనాడు’ను దెబ్బతీయడానికి రోజూ కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పత్రికాలోకాన ఫ్యాక్షనిస్టు పోకడలు పోతూ పేపరు ధర ఎంత ఉండాలో, రోజుకు ఎన్ని పేజీలు, ఎన్ని రంగుల్లో ఉండాలో తామే నిర్దేశిస్తున్నారు! కష్టపడి సంపాదించింది అయితేగదా నొప్పీ దప్పీ తెలియడానికి? ‘ఈనాడు’పై వై.ఎస్‌. కక్ష సాధించడానికే పుట్టిన ‘సాక్షి’- సెజ్‌ల మాయాజాలంలో మసైపోయిన బడుగు రైతుల బతుకుల్నీ అభూత కల్పనలుగా చిత్రించడానికి తెగిస్తోంది. ఆ వంచనను పటాపంచలు చేయడానికే ‘ఈటీవీ’ సచిత్ర కథనాల దన్నుతో ‘ఈనాడు’ జడ్చర్ల వాస్తవాల్ని మీ ముందుకు తెస్తోంది. పాఠక దేవుళ్లకు నాణ్యమైన, విశ్వసనీయ సమాచార నైవేద్యం అందించడానికే దశాబ్దాలుగా నిబద్ధమైన ‘ఈనాడు’- ఈ రోజు సాటి పత్రిక ‘ఏది నిజం’ అంటూ రాసిన అసత్యాల్ని మీ ముందు ఖండఖండాలుగా ఖండించడానికే అమూల్యమైన కొంత స్థలాన్ని కేటాయిస్తోంది.

Courtesy: Eenadu
Date 26th April 2008

Advertisements

Written by dilkibaatein

April 26, 2008 at 3:54 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: