Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

చెబుతున్నదేమిటి – చేస్తున్నదేమిటి?

leave a comment »

జెండాలు ఏవైనా, ఎజెండా ఏది ప్రకటించినా సామ్రాజ్యవాదులను సంతృప్తి పరచడంలో పాలక, ప్రతిపక్ష పార్టీలన్నింటి విధానం ఒకటేనని అంటున్నారు ఎం. రత్నమాల

అక్షరక్రమంలో రెండో స్థానంలోనే కాదు ప్రత్యేక ఆర్థిక మండళ్లు నెలకొల్పడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కలిపి 446 సెజ్‌లు ఇప్పటికి ఏర్పాటు కానుండగా మన రాష్ట్రం 76 సెజ్‌లను అనుమతించుకుని దేశంలో రెండో స్థానంలో ఉంది. 88 సెజ్‌ల మహారాష్ట్రను కూడా మించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల రాష్ట్ర సముద్రతీరం పొడుగునా కోస్టల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణంతో పాటు మరో పన్నెండు ప్రత్యేక ఆర్థిక మండలాలు (స్పెషల్‌ ఎకానామిక్‌ జోన్స్‌ అనే సెజ్‌లు పొడి అక్షరాల్లో ఎస్‌.ఇ.జెడ్‌ లు) రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటయిన 54 ప్రత్యేక ఆర్థిక మండలాల్లో (సెజ్‌ల్లో) 27 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆశ చూపుతున్నారు. దాదాపు సముద్రతీరం పొడుగునా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా విస్తరించనున్న ఇండస్ట్రియల్‌ కోస్టల్‌ కారిడార్‌ (సముద్రతీర ప్రాంత పారిశ్రామిక కారిడార్‌) లో రానున్న పది ఓడరేవులు కలిపి మున్ముందు మరికొన్ని లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని కూడా ఎరచూపుతున్నారు. అయితే ఈ ఎర లక్ష్యం, ఫలితం, ప్రజాజీవనానికి వాటిల్లే ప్రమాదం మాటేమిటి. ప్రత్యేక ఆర్థిక మండలాలలో పొంచి ఉన్న ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజలు పసిగట్టి ప్రత్యేక మండలాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పోరాడుతున్న ప్రజలపై పాశవిక ప్రభుత్వ నిర్బంధం అమలవుతోంది.

ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని పార్లమెంట్‌లో ఏదో కొద్దిపాటి నామమాత్రపు పైపై విమర్శలు, సూచనలతో ఒక్కరోజులోనే ఆమోదించిన ప్రతిపక్షాలు – ఒక్కరోజులోనే ఆమోదించిన రాష్ట్రపతి బిల్లు ప్రతిపాదించి వివరణ ఇచ్చి మరో రోజు వెరసి కేవలం మూడంటే మూడు రోజుల్లో స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ చట్టం 2005 చట్టరూపంలో 10 ఫిబ్రవరి 2006 న అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో అడ్డుకొనని ప్రతిపక్షాలు, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆందోళన సరే కనీసం ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టని పార్టీలు, రైతుల భూములు ప్రభుత్వం అక్రమంగా, మోసపూరితంగా, కుట్రలు కుతంత్రాలతో, నిర్బంధం ప్రయోగించి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన వెంటనే అడ్డుకో ప్రయత్నించని పార్టీలు ప్రత్యేక ఆర్థిక మండలాల పునాదుల కింద భూములు కోల్పోయిన రైతులు, కుటుంబాలు జీవనాధారం కోల్పోయిన వ్యవసాయాధారిత వృత్తులవారు, సముద్ర సంపదపై ఆధారపడి జీవించే ప్రజలు మొత్తంగా ప్రత్యేక ఆర్థిక మండలాలు గుటకాయాస్వాహా చేసిన గ్రామాలకు గ్రామాల ప్రజలు 2005 నుంచి పోరాడుతున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు (ఉపఎన్నికల సందర్భంగా కూడా) దగ్గపడుతున్న కొద్ది ప్రత్యేక ఆర్థిక మండలాలకు వ్యతిరేకంగా విమర్శలు, ఆందోళనలు ప్రారంభించాయి. ధర్నాలు గట్రా చేస్తున్నారు. కాకినాడ వంటి చోట్ల భారతీయ జనతాపార్టీ పోరాట క్రమంలో జైలు నిర్బంధంలో ఉన్నవారిని పరామర్శించి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతో పాటు పలుమార్లు ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించింది. సంఘీభావ కమిటీల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు భాగస్వాములవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ‘మీకోసం’ అంటూ ఓట్ల కోసం చేస్తున్న యాత్రల్లో ప్రత్యేక ఆర్థిక మండలాలకు వ్యతిరేకంగా భీకర ప్రకటనలు, ప్రతిజ్ఞలు గుప్పించారు. విశాఖ పట్టణంలో సి.పి.ఐ. (ఎం) పార్టీ సెజ్‌లను వ్యతిరేకిస్తూ నినాదాలు రాసిన ప్లేకార్డులను చేతబూని ధర్నాలు చేసింది. ఈ మార్క్సిస్ట్‌ పార్టీ ప్రభుత్వమే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నందిగ్రాంలో నెలకొల్ప తలపెట్టిన ఇండోనేషియా బహుళజాతి సంస్థ సలీం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీకి చెందిన రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలను ఊచకోత కోసింది. బెంగాల్‌ మార్క్సిస్ట్‌ (పార్టీ భాగస్వాములైన) ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ మొదలైన మిత్రపక్షాలు నందిగ్రాం ప్రజలపై ప్రభుత్వ మారణకాండను నామ మాత్రంగా నోటి మాటల్తో వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్‌లో అదే సి.పి.ఐ. (ఎం) ప్రత్యేక ఆర్థిక మండలాలపై పోరాడుతామంటూ ప్రకటనలు చేస్తున్నది. రాష్ట్రంలో సెజ్‌ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీకి గుజరాత్‌లో సెజ్‌ల గురించి గుర్తుండదు – ఇది పాలక – ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ వైఖరి. రెండు నాల్కల ధోరణి.

ప్రత్యేక ఆర్థిక మండలాలు భారతదేశంలో సామ్రాజ్యవాదులకు అవసరమైన సరుకులు అతి చవగ్గా ఉత్పత్తి (చవక కూలికి అందించే కార్మికులు) చేసే పారిశ్రామిక వాడలు – ఈ పరిశ్రమల వల్ల కాలుష్యం మన దేశాన్ని కబళిస్తే సంపన్న దేశాలు సెజ్‌లో ఉత్పత్తి అయిన సరుకుల సంపదలు పెంచుకుంటాయి. ప్రత్యేక ఆర్థిక మండలాలు దేశంలో విస్తరిస్తున్న ఆధునిక సామ్రాజ్యవాద భూస్వామ్య పారిశ్రామిక వాటికలు. గోవా ప్రభుత్వం ప్రజల ప్రజాందోళనకు తలవొంచి ప్రత్యేక ఆర్థిక మండలాలను తిరస్కరించి, (అయితే ఒక్కటి ప్రభుత్వ మొత్తంగా టూరిజం ఆదాయంపై ఆధారపడి ఉంది కనుక, టూరిజం పరిశ్రమల పాలకులు వారి బంధుగణం సంపదల పురోభివృద్ధి ఆధారపడిఉంది కనుక, ఆ వర్గాల ఏకైక ఆదయవనరు టూరిజం పరిశ్రమ ఆధారిత వ్యవస్థలు, సంస్థలు, అంటే రవాణశాఖ, హోటళ్లు మొదలైనవి) వాణిజ్య మంత్రిత్వ శాఖతో సహా, కొందరు క్యాబినెట్‌ మంత్రులు, పాలక, ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి సెజ్‌లకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంతకూ పార్లమంట్‌ లోకి ప్రత్యేక ఆర్థిక మండలాల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారం అని సాక్షాత్తూ ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. బీహార్‌ రాష్ట్రం అసలు ప్రత్యేక ఆర్థిక మండలాల కోసం ప్రతిపాదనే పంపలేదు. అయితే మన రాష్ట్ర పాలకులు గోవాను ఆదర్శంగా ఆశించడం బాగానే ఉంది, కానీ ఆశలకు పునాది ఉండాలి కదా. లేకపోతే పాలకులు వ్యతిరేకిస్తే లేదా ప్రజలు కోరితే ఆ కోరికలు తీరుస్తారనే భ్రమలు వాస్తవాలు కాదని నందిగ్రాంలో మార్క్సిస్ట్‌ పార్టీ ప్రభుత్వం రుజువు చేసింది. ఏ జెండా కప్పుకున్నా ఎజెండా ఏది ప్రకటించినా సామ్రాజ్యవాదులను సంతృప్తిపరచడంలో భాగంగా ప్రజలను పాశవికంగా అణచివేయడానికి ఎంతటి దుర్మార్గానికైనా కుతంత్రానికైనా పాల్పడడంలో ‘నందిగ్రాం’ దేశ ప్రజల ముందుంచిన సజీవ ఉదాహరణ. దేశవ్యాప్త నిరసనలతో పాటు అణు ఒప్పందం – నందిగ్రాం అనే తాడు గుంజుడు ఆటలో చెరొకవైపు కాంగ్రెస్‌ ఐక్యసంఘటన ప్రభుత్వం కమ్యూనిస్ట్‌ ఐక్య సంఘటన ప్రభుత్వాల మధ్య ప్రజలు అడకత్తెరలో పొకచక్కలు అయ్యాయి. సెజ్‌లు నందిగ్రాంలో పోయినా రూబార్‌కు తరలినా ప్రజలు నిత్యం నిర్బంధం ఎదుర్కొంటూనే ఉన్నారని తెలుస్తోంది. అందరికీ అణుశక్తి అంత ప్రమాదకరమైన ప్రత్యేక ఆర్థిక మండలాల గురించి అర్థం చేసుకోవాలంటే నందిగ్రాంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.

నందిగ్రాంలో ఏం జరుగుతోంది?

భారతదేశ భ్రష్ట రాజకీయ నైతిక పతనానికి నిలువుటద్దం నందిగ్రాం. ఆయుధాల, గుండాల బలంతో గత ముప్ఫై సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌ అశేష పేద ప్రజానీకాన్ని నరహోమానికి గురిచేసిన నందిగ్రాం రక్తపాతం సి.పి.ఐ. (ఎం) రాజకీయపు ఎత్తుగడలకీ, అధికారంలో కొనసాగే అసంఖ్యాక వ్యూహాలకీ, మచ్చు తునక. భారతీయ ప్రజాస్వామ్య చరిత్ర పుటలపై నెత్తుటి మరక నందిగ్రాం. 2007 మార్చ్‌ 14న సంభవించిన బీభత్సభయానక వృత్తాంతాలని ప్రత్యక్షంగా అవలోకించడం కోసం ఇటీవల నందిగ్రాం, సింగూర్‌ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అందిస్తున్న నెత్తుటి కన్నీటి దృశ్యాల అక్షర సాక్ష్యం.

సెప్టెంబర్‌ 1,2,3 తేదీల్లో నందిగ్రాం, సింగూర్‌ ప్రాంతాల్లో స్త్రీలపై హింసవ్యతిరేక కమిటీ, నిజనిర్ధారణ బృందం పర్యటించింది. సి.పి.ఐ. (ఎం) ప్రభుత్వం నందిగ్రాంలో మళ్ళీ ఒకసారి వ్యూహాత్మక రక్తపాత రాజకీయానికి మరోసారి తెరను లేపింది. మేం గ్రామాలు పర్యటిస్తున్నపుడు ప్రతి గ్రామం, సోనాచుర్‌, ఖెజోరి, గోకుల్‌ నగర్‌ ఈ గ్రాaమాలూ, గ్రామాల్లో ప్రజలు గుండెలు నివురుగప్పిన నిప్పులా సెగలు పొగలతో ఉడికెత్తి ఉన్నాయి. ఇది త్వరలోనే బద్ధలవుతుందని అప్పుడే అనిపించింది. మరోపక్క మేం ఆ ప్రాంతాన్ని పర్యటిస్తున్నపుడు మార్చ్‌ 14న ఖెజోరి, సోనాచుర గ్రామాలమధ్య కూలిన తల్పట్టి వంతెన కిరువైపులా ఉన్న గ్రామాలు మార్చ్‌ 14న జరిగిన మారణకాండ తరువాత సి.పి.ఐ. (ఎం) సాయుధ నాయకత్వం, కార్యకర్తలు, ఖెజోరి గ్రామం నుంచి ప్రజలను బయటికి తరిమేసి ఖెజోరిని పూర్తిగా ఆక్రమించారు. అది మేం కళ్లారా చూసాం. మేం అక్కడ కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించినపుడు మాకు ఆ ప్రదేశంలో సంఘటనలను వివరిస్తున్న భూమి విచ్ఛేద్‌ ప్రతిరోధ్‌ కమిటీ కార్యకర్తలు ఎక్కువగా మాట్లాడకండి, గట్టిగా మాట్లాడకండి, మనమీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిస్తే, అవతలివైపు ఖెజోరి నుంచి సి.పి.ఐ. (ఎం) వాళ్లు కాల్పులు జరుపుతారు అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే మాకు ఆ అనుభవం లేదు గనుక ‘ఇక్కడేమయింది, ఇక్కడ తూటాలు గుర్తులు ఉన్నాయే, ఇక్కడ ఆడవాళ్ల చిరిగిన చీరకొంగులున్నాయేమిటి? పగిలిన గాజులున్నాయేమిటి? ఇక్కడ గోడలకు తూటాలు గుర్తులున్నాయేమిటి? మార్చ్‌ 14న ఎక్కడ ఏమి జరిగింది?’ అని వివరాలు అడుగుతుండగా ఆ కొద్దిపాటి శబ్దాలకే అక్కడ పోలీసులు ముగ్గురు ఉండగానే, ఖెజోరిలో ఎర్ర జెండాలెగురుతున్న ఇండ్లలోంచి (సి.పి.ఐ.(ఎం) వాళ్ల హైడౌట్స్‌) తుపాకి శబ్దాలతో పాటు మావైపు తూటాలు ఎగిరివచ్చాయి. మేం అక్కడ నుంచి పరుగు పెట్టక తప్పలేదు. మర్నాడు మేం గోకుల్‌నగర్‌ వెళ్లాం. గోకుల్‌నగర్‌ మార్చ్‌ 14న కాల్పులు జరిగిన రెండోదిక్కు ప్రాంతం. అక్కడ కూడా రాత్రికావడం వల్ల మాలో ముగ్గురు సభ్యులు వెనకబడి పోవటంతో భూమి విచ్ఛేద్‌ ప్రతిరోద్‌ కమిటీ (భూ స్వాధీన వ్యతిరేక పోరాట కమిటీ) సభ్యులు గట్టిగా పిలవద్దని చెపుతున్నప్పటికీ, మేం మావాళ్ల కోసం గట్టిగా పిలిచాం. దాంతో అటువైపు నుంచి మళ్లీ కాల్పులు. మాకు అక్కడ అదే పరిస్థితి ఎదురయింది. ఈ గ్రామాలల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారన్న విషయం అప్పుడే అర్థమయింది. వాళ్లు ఒక్కటే మాట అడిగారు, ‘అమ్మా! మీ రాష్ట్రంలో సి.పి.ఐ. (ఎం) పార్టీ ప్రజలకు భూము లివ్వాలని ఆందోళన చేస్తున్నదట. ఆ కార్యక్రమాలలో భాగంగా ఖమ్మం జిల్లా ముదిగొండలో భూమి కోసం సి.పి.ఐ. (ఎం) వారు పోరాటం చేస్తున్నపుడు అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్పులు జరిపిందట. కొందరు మరణించారట. ఆ తరువాత మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఒత్తిడికి తలవంచి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చిందట. గాయపడిన వారికి వైద్య సహాయం అందించిందట. కమిషన్‌ వేసిందట. కాల్పులు తప్పని ఒప్పుకొని విచారం ప్రకటించిందట. మాకు నష్టపరిహారం ఇవ్వక పోయినా సరే, ప్రజల పట్ల సానుభూతి కల రచయిత్రి మహాశ్వేతాదేవి, ప్రజలకు మద్దతు ఇచ్చే వైద్యులు కొందరు కలిసి సోనాచురిలో నెలకొల్పిన షహీద్‌ స్మృతి స్వాస్థ్య కేంద్ర (అమరుల స్మారక వైద్య కేంద్రం) వైద్యులు కాల్పుల్లో గాయపడిన మాకు చికిత్సలు చేస్తూనే ఉన్నారు. కనీసం ‘మీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుక్నునట్టు మా బుద్ధ ప్రభుత్వం విచారం ప్రకటించి తప్పు ఒప్పుకుంటుందా? అట్లా ఒప్పుకోవాలని మీ రాష్ట్రంలోని సి.పి.ఐ. (ఎం) వారు మా ప్రభుత్వానికి చెబుతారా అని మమ్మల్ని అడిగారు’ మేమేం చెప్పగలం?

ఈ పరిస్థితి ఇలా ఉంటే, చనిపోయివారు చనిపోగా, తీవ్రంగా గాయపడివారు ఇంకా కోలుకోలేని స్థితిలో ఉండగా, ఆనాడు కాల్పుల్లో గాయపడి, రోడ్డుమీద పడివున్నవారిని పరుగెడుతున్న ప్రజలు కొందరు చూశారు. వారిలో కొందరు మరణిస్తే, కొందరు కొనవూపిరితో ఉన్నవారికి ప్రజలు సహాయం చేద్దామని చూస్తే పోలీసులు వారిని దగ్గరికి రానీయలేదు. అలా కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుండగా ప్రజలు, చూసిన కొందరు వ్యక్తులు ఇప్పటికీ గ్రామాలకుగానీ, ఇళ్లకుగానీ తిరిగిరాలేదు. వారేమయ్యారో ఇప్పటికీ తెలియదు. పౌరహక్కుల భాషలో చెప్పాలంటే ఇవన్నీ మిస్సింగు కేసులు. ఇలాంటి ఒక మిస్సింగు వ్యక్తి ఇంటికి మేం వెళ్లాం. చనిపోయిన వ్యక్తుల ఇళ్లకి వెళ్లినప్పుడు కొంచెం కళ్లు తుడుచుకున్నారు, బాధపడ్డారుగానీ, మార్చ్‌ 14న తల్పట్టి వంతెన పక్కన చిట్టచివరి సారిగా క్షతగాత్రుడై పడివున్న సుభబ్రత సామంత్‌, గ్రామస్తులు (ఘర్‌చక్రబెరియా) మమ్మల్ని చూడగానే బోరుబోరున విలపించారు. సుభబ్రత్‌ సామంత్‌ కుటుంబ సభ్యుల దుఃఖాన్ని అయితే మేం అక్కడున్న మూడు నాలుగు గంటలు ఆపలేకపోయాం. చచ్చిన కుటుంబాల్లో ఏడ్చి ఏడ్చి ఊరుకున్నారు. గానీ, చచ్చాడో, బతికాడో తెలియని సామంత్‌ కుటుంబమూ, ఆ గ్రామస్తులు పడుతున్న క్షోభ అతడేమయ్యాడో తెలిసేవరకూ ఇట్లానే ఉంటుందేమో?

ఖెజోరి గ్రామాన్ని మార్చ్‌ 14న స్వాధీనం చేసుకున్న సి.పి.ఐ. (ఎం) సాయుధులు ఆ గ్రామం నుంచి 125 కుటుంబాల ప్రజలను బయటికి తరిమారు. అట్లా నిర్వాసితులైన ప్రజలను మేం సోనాచూరిలో భూమి విచ్ఛేద్‌ ప్రతిరోధ్‌ కమిటీ నిర్వహిస్తున్న నిర్వాసితుల శిబిరం వద్ద కలిసాం. కమిటీ ప్రతినిధులు జిల్లా అధికారులతో విజ్ఞప్తులు చేయగా చేయగా, ఒక అరవై మందిని స్త్రీలు, వృద్ధులను మాత్రం ఖెజోరి గ్రామంలోకి అనుమతించారని, మిగతావారి గురించీ ఇంకా విజ్ఞప్తులు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు బుద్ధదేవుడు ప్రభుత్వం మాత్రం ఆయా గ్రామాలలోకి నిర్వాసితుల్ని తిరిగి ప్రవేశపెట్టడానికి సి.పి.ఎం. కార్యకర్తలూ, ప్రభుత్వ సేనలు కలిసి ఈ వారం రోజులుగా జరుగుతున్న బీభత్సాన్ని చేయక తప్పలేదని అనడం ఎంత అసంబద్ధంగా ఉందో మేధావులూ, ప్రజాస్వామికవాదులూ అర్థం చేసుకోవాలి. అందుకనే 14 మార్చ్‌ 2007 తరువాత మరింత ఉధృతంగా, మరింత తీవ్రస్థాయిలో బుద్ధదేవుడి ప్రభుత్వం పథకం ప్రకారం జరిపిన వ్యూహాత్మక రక్తపాత రాజకీయం నందిగ్రాంలో ప్రజలు భూములను స్వాధీనం చేసుకుని ‘సలీం గ్రూప్‌ ఆఫ్‌ బహుళజాతి సంస్థ’ కి ధారాదత్తం చేయడానికేనని, దేశవ్యాప్తంగా ప్రజలూ, ప్రజాస్వామికవాదులూ అర్థం చేసుకునే విధంగా నందిగ్రాంపై మారణహోమానికి మరోసారి తెరలేపింది.

బుద్ధదేవుడి భూమిలో రాజకీయ రక్తపాతం

14 మార్చ్‌కి ముందునుంచే అంటే 2006 నుంచే పశ్చిమబెంగాల్‌ అధికారపార్టీ, సి.పి.ఐ. (ఎం) సాయుధులు సింగూర్‌, నందిగ్రాం ప్రజలపై వారి ప్రభుత్వ అండదండలతో దాడులూ, దౌర్జన్యాలూ సాగిస్తూనే ఉన్నారు. పాలకులు పాలిత ప్రజలపై సాగిస్తున్న ఈ ప్రచ్ఛన్నయుద్ధం 2006 డిసెంబర్‌ 28నే మొదలైంది. హల్దియా (నందిగ్రాంలో ఒక డివిజన్‌) అభివృద్ధి అధికార సంస్థ డిసెంబర్‌ 28న నందిగ్రామ్‌ డివిజన్‌లోని కొన్ని గ్రామాల రైతులకు వారి వ్యవసాయ భూములను, నివాస భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసిందిగా నోటీసులు జారీచేసింది. నందిగ్రాంలో ఇండోనేషియాకి చెందిన బహుళజాతి సంస్థ సలీం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ నందిగ్రాంలో నెలకొల్ప తలపెట్టిన రసాయన పరిశ్రమ కోసం స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ అంటే ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌) కోసం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఈ భూమిని రైతులనుంచి స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నోటీస్‌. ఈ నోటీస్‌ ప్రకారం నందిగ్రాం డివిజన్‌లో 1,2,3 బ్లాక్‌ల గ్రామాల్లో (ముఖ్యంగా ఒకటవ బ్లాక్‌ అత్యధిక విస్తీర్ణ భూమి) 27 మౌజాలు, మరో చోట రెండు మౌజాల (సుమారు 25,000 ఎకరాలు) వ్యవసాయ భూమిని, కొన్ని నివాస భూములను కూడా ప్రభుత్వానికి దఖలు చేయాల్సిందిగా ఆయా భూముల రైతులకు, ఆయా భూముల సర్వే నంబర్లతో సహా నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుతో నందిగ్రామ్‌ ప్రజల్లో ఆందోళన, ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకోడానికి మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి 3 జనవరి 2007న రైతులు ‘కాళీ చరణ్‌పూర్‌’ పంచాయతీ ముందు గుమిగూడారు. అక్కడ కొంత ఘర్షణ జరిగింది. ఆ తరవాత జనవరి 7న సి.పి.ఐ. (ఎం) సాయుధులు తల్పట్టి వంతెనవద్ద హత్యాకాండ జరిపారు. ఆరోజు తెల్లవారు జామున సి.పి.ఐ. (ఎం) సాయుధులు బాంబులు, తుపాకులూ, తదితర మారణాయుధాలతో సోనాచురా, ఖెజోరి ప్రజలపై జరిపిన దాడిలో అయిదుగురు మరణించిన విషయాన్ని సిక్కిమ్‌ హైకోర్ట్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎన్‌. భార్గవ ఆధ్వర్యంలో పౌరహక్కులూ, మానవహక్కుల సంస్థల ప్రతినిధులూ, మేధావులూ, ప్రజావైద్యులూ, రచయితల బృందం 2007 మే 26, 27, 28 తేదీలలో నందిగ్రాం, కోల్‌కతాలలో నిర్వహించిన ప్రజా ట్రిబ్యునల్‌ నివేదిక కూడా ధృవీకరించింది. తల్పట్టి వంతెన పక్కనే ఉన్న స్థానిక సి.పి.ఐ. (ఎం) నాయకుడు శంకర్‌ సామంత్‌ నివాసముంటున్న పెద్ద బంగ్లా నుంచి సి.పి.ఐ. (ఎం) సాయుధులు ప్రజల మీదికి బాంబులు విసిరారనీ, కాల్పులు జరిపారనీ, పరిగెత్తే ప్రజలను వెంటాడి మారణాయుధాలతో గాయపరచారనీ స్థానిక ప్రజలు తెలిపారు. ఈ హత్యాకాండలో విశ్వజిత్‌ మండల్‌, షేక్‌ సలీమ్‌, బాదల్‌ మండల్‌, అనుకూల్‌ పాత్ర అక్కడికక్కడే మరణించారు. ఈ అయిదుగురు మృతుల కుటుంబ సభ్యులతో మేం మాట్లాడాం. వీరంతా న్యాయమూర్తి భార్గవ ట్రిబ్యునల్‌ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పారు. రోజంతా ఇక్కడ మారణకాండ నిరాఘాటంగా సాగుతూంటే స్థానిక అధికార యంత్రాంగం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, ఎంతమాత్రం పట్టించుకోలేదని న్యాయమూర్తి భార్గవ నివేదిక పేర్కొంది. దాడి జరుగుతున్న సమయంలో నందిగ్రామ్‌ పోలీస్‌స్టేషన్‌కు కొందరు ప్రజలు వెళ్లి ఫిర్యాదు చేసినా, పోలీసులు పోలీస్‌స్టేషన్‌ నుండి బయటకి ఒక్క అడుగు వేయలేదని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులను విచారించిన భార్గవ కమిషన్‌ న్యాయమూర్తి కూడా ధ్రువీకరించారు. పోలీసులూ, అధికారులూ ఆదుకోకపోవడంతో కోపోద్రిక్తులైన ప్రజలు బాంబులూ, తూటాలూ చొచ్చుకువస్తున్న ఇంటిని భారటూలీ క్యాంపు (తల్పట్టి వంతెన పక్కనున్న శంకర్‌ సామంత్‌ పెద్ద బంగ్లా)ను తగలబెట్టారు. అందులో శంకర్‌ సామంత్‌ సజీవ దహనమయ్యాడు. అదే రోజు సమీపంలో జరిగిన మరో ఘర్షణలో రెచ్చిపోయిన ప్రజలు సాధూ ఛటర్జీ అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ని రాళ్లు విసిరి, కొట్టి చంపారు. అతని శవం 10న సమీపంలో ఉన్న నదిలో కొట్టుకువచ్చింది.

ఇన్ని దారుణాలు జరిగాకనే 12 ఫిబ్రవరి 2007న హల్దియా పట్టణంలో జరిగిన ఒక బహిరంగసభలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య మాట్లాడుతూ, రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా, భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోదని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మరునాడే, ముఖ్యమంత్రి హామీకి విరుద్ధంగా సి.పి.ఐ. (ఎం) స్థానిక పార్లమెంట్‌ సభ్యులు లక్ష్మణ్‌ సేథి తమ్లూక్‌లో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ‘హల్దియా అభివృద్ధి అధికార సంస్థ జారీ చేసిన నోటీస్‌ ప్రకారం రైతుల నుంచి వ్యవసాయ భూములను, నివాస భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తీరుతుంద’ని ప్రకటించారు. ఇది పశ్చిమ బెంగాల్‌ మార్క్సిస్ట్‌ పాలకుల ధోరణి. పార్టీవారు గిచ్చుతారు, ప్రభుత్వం జోలపాడుతుంది. వ్యూహాలూ, పథకాలూ రూపొందించుకుని వ్యూహాత్మక రక్తపాత రాజకీయాలకు ప్రజలను బలిచేస్తారు. జనవరి 14న కాల్పుల ఘటన తరవాత పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగానూ ప్రజలూ, ప్రజాస్వామిక వాదులూ మేధావుల నిరసనలూ, ఆందోళన వల్ల, గత ముప్ఫై ఏళ్లుగా మార్క్సిస్ట్‌ పార్టీ రాజకీయాలనూ, ప్రభుత్వాలనూ సమర్థిస్తూ వారి పక్షాన ఉన్న రచయితలూ, కళాకారులూ, మేధావులూ, ప్రభుత్వ అవార్డులనూ, రివార్డులనూ కూడా వాపసు చేసి, ఒక్కరొక్కరుగా సిపిఐ (ఎం) ప్రభుత్వానికి దూరం కావడంతో, బుద్ధదేవుడు మరోసారి నందిగ్రాం రైతుల నుంచీ భూములను స్వాధీనం చేసుకోబోమని 14 జనవరి 2008 తరువాత నెలరోజులకు, పత్రికలలో దృశ్యప్రసార సాధనాల్లో, సభలలో, సమావేశాలలో పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. బుద్ధదేవుని నోట అబద్ధాల ఊట అన్న వాస్తవానికి నిదర్శనంగా రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలోనే నవంబర్‌ 2007లో మళ్లీ రక్తపాత రాజకీయ పథకంలో భాగంగా సైన్యాన్ని రప్పించుకుని, బీభత్సం సృష్టించి 7 జనవరి 2008 నుంచి అనేక హత్యాకాండల్లో పాల్గొన్న సిపిఐ (ఎం) పార్టీకి చెందిన నిందితులను (పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్న వాళ్లని కూడా) నందిగ్రాం డివిజన్‌లోని గ్రామాలకి భద్రంగా చేర్చింది. అరెస్ట్‌ చేయడానికి దొరకని నిందితులు గ్రామాలకు తిరిగి చేర్చడానికి ఏ విధంగా అందుబాటులోకి వచ్చారో బుద్ధదేవుడూ, ఆయన పార్టీ వాళ్లూ, పోలీసులే చెప్పాలి.

ఇండోనేషియా సలీం కంపెనీ కోసం భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలపై సాయుధ దాడులకు పాల్గొన్న సిపిఐ (ఎం) నాయకులనూ, కార్యకర్తలనూ గ్రామాల్లో పునఃప్రతిష్టించి నందిగ్రాం, ఇతర గ్రామాలను తిరిగి సిపిఐ (ఎం) సాయుధ ముఠాలకు అప్పజెప్పే ప్రయత్నంలో ఆడుతున్న నాటకమే అమెరికాతో భారతదేశ అణు ఒప్పంద వ్యతిరేక నాటకీయ వ్యూహాత్మక పట్టును సడలించడం.

నందిగ్రాం సెజ్‌ ప్రతిపాదన విరమించుకున్నా, మార్క్సిస్ట్‌ పార్టీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటు క్రమంలో ప్రజలపై ఎంచుకున్న పగను మాత్రం వదులుకోలేదని ఇటీవల భూమి విచ్ఛేద్‌ ప్రతిరోధ్‌ కమిటీ ప్రతినిధులు నిత్యం నందిగ్రాంలో మార్క్సిస్ట్‌ పార్టీ సాయుధ గూండాలు సాగిస్తున్న దౌర్జన్యకాండ, హత్యలు, అత్యాచారాలు, వెల్లడిస్తున్నా అందుకే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రజాస్వామిక వాదులు, మేధావులు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

మన రాష్ట్రంలో విశాఖ జిల్లా అనంతగిరి మండలం, అరకులోయ ప్రాంతంలో జిందాల్‌ అల్యూమినా కంపెనీ సెజ్‌ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలను, గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు. (ఇది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఏజెన్సీ చట్టాలు, 1/70 చట్టం ప్రకారం గిరిజనుల నుంచి ఏ విధమైన భూబదలాయింపు చేయరాదు. అంటే గిరిజనుల నుంచి భూమిని కొనుక్కోవడం కూడా ఈ చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది) ప్రభుత్వ చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్నదనటనానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. భూసేకరణ ప్రయత్నాల్లో భాగంగా, ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ప్రజాభిప్రాయ సేకరణ’ మొదటి సదస్సును ప్రజలు బహిష్కరించారు. రెండవసారి నిర్వహించిన సదస్సులో 99 శాతం మంది ప్రజాభిప్రాయ సదస్సులో పాల్గొని ‘సెజ్‌’ని వ్యతిరేకిస్తూ ఖరాఖండిగా తమ అభిప్రాయాలను నమోదు చేశారు. ఈ విధంగా ప్రజలు రెండుసార్లు ప్రభుత్వ ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టారు. భంగపడిన ప్రభుత్వం, పోలీసులు, ఆ ప్రాంతాలపై ‘కూంబింగు’ పేరుతో జరిపిన బీభత్సకాండ ముఖ్యంగా వాకపల్లి గ్రామంలో గిరిజన ప్రాంతాల స్త్రీలపై పోలీసుల హింసాత్మక, లైంగిక దౌర్జన్యాలు రాష్ట్ర ప్రజలకు విదితమే. బాధిత మహిళలు హైదరాబాద్‌లో మానవ హక్కుల కమిషన్‌కు విన్నవించుకున్నా, గిరిజన సంఘాలు హైకోర్టులో, పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ (పి.ఐ.ఎల్‌.) వేసినా, బాధిత ప్రజలకు సామాజిక మద్దతు, ద్వారా సామాజిక న్యాయం లభించిందే కానీ, చట్టపరమైన న్యాయం దొరకలేదు.

Advertisements

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:58 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: