Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

దారితప్పిన ప్రత్యేక ఆర్థిక మండలాలు

leave a comment »

సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సెజ్‌ల స్థాపనకు అనుమతి ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు వహించాలని అంటున్నారు డా. యిమ్మానేని సత్యసుందరం

భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. అయితే, ప్రధాన సమస్యలైన దారిద్య్రం, నిరుద్యోగం పరిష్కరించుకోలేకపోయాం. ఇటీవల కాలంలో సగటు అభివృద్ధి రేటు ఎనిమిది శాతం దాటి ఉంది. ఈ రేటు మాత్రమే మన సమస్యలను పరిష్కరించలేదు. పైగా కొత్త సమస్యలను సృష్టించవచ్చు. అభివృద్ధి రేటుతోపాటు అభివృద్ధి తీరుకూడా ముఖ్యమే. అభివృద్ధి ఫలాలు అన్నివర్గాలకు, అన్ని ప్రాంతాలకు అందాలి. అదే నిజమైన ప్రగతి. ఈ విషయంలో మనదేశం ఆశించిన విజయం సాధించలేదు.

సెజ్‌ల లక్ష్యాలు

దేశ జనాభాలో ఇరవై మూడు శాతం దారిద్య్ర రేఖకు దిగువనున్నారు (సుమారు ముప్ఫై కోట్లమంది). అభివృద్ధి విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గలేదు. ఆదాయ, సంపద వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. సుమారు నాలుగు కోట్ల శ్రామికులు నిరుద్యోగానికి, అల్ప ఉద్యోగానికి గురవుతున్నారు.

మన ఆర్థికవ్యవస్థలో గ్రామీణరంగంలో వ్యవసాయేతర కార్యక్రమాలకు ప్రాధాన్యత నివ్వాలి. పెరిగే శ్రామికశక్తికి ఒక్క వ్యవసాయమే ఉపాధి కల్పించలేదు. కేవలం గ్రామీణ పారిశ్రామికీకరణ ద్వారా మాత్రమే గ్రామీణ దారిద్య్రం నిరుద్యోగం నిర్మూలించగలం. గ్రామీణ సౌభాగ్యానికి వ్యవసాయేతరరంగం ప్రగతి కీలకం. మన దేశంలో గ్రామీణ వ్యవసాయేతర రంగం కొంత ప్రగతిని సాధించింది. ఈ రంగంలో ఉపాధి 1977-78 లో 16.6 శాతం ఉండగా 1999-2000 కి ఇది 23.8 శాతానికి పెరిగింది. 1988లో గ్రామీణ వ్యవసాయేతర రంగంలో నలభై మిలియన్‌ శ్రామికులు పనిచేసారు.

గ్రామీణ రంగంలోనే కాకుండా వ్యవసాయరంగంలో కూడా వైవిధ్యత ఉండాలి. భూమిని కేవలం ఆహారధాన్యాలకే ఉపయోగించి ప్రయోజనం లేదు. అలాగే సంవత్సరానికి రెండు లేక మూడు పంటలు పండించాలి. పండ్లు, కాయగూరలకు తగు ప్రాధాన్యతనివ్వాలి. ప్రస్తుతం ఈ రంగంలో ఉత్పాదకత తక్కువ, వృథా ఎక్కువ. అంతేకాదు, నీరు ఎక్కువ ఖర్చయ్యే పంటలకు ప్రాధాన్యతనిస్తున్నాం. అందువలన నీటిపై ఒత్తిడి పెరిగింది. మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పు రావాలి.

గ్రామీణ ఆర్థికరంగంలో, ముఖ్యంగా వ్యవసాయరంగంలో వైవిధ్యత రావాలి. దీని ద్వారా మాత్రమే ఉపాధిస్థాయి పెంచి, దారిద్య్ర నిర్మూలన చేయగలం. ఈ దిశగా చాలా దేశాలు ప్రత్యేక ఆర్థిక మండలాలను (సెజ్‌లు) ఏర్పరచుకొన్నాయి.

మనదేశం కూడా సెజ్‌లకు ప్రాధాన్యతనిస్తోంది. సెజ్‌ల చట్టం 2005లో అమలులోకి వచ్చింది. ఈ చట్టం అమలులోకి రాకముందు 19 సెజ్‌లలో రు. 7,104 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. 10 ఫిబ్రవరి 2006 తర్వాత ఏర్పడిన సెజ్‌లలో రు. 67,347 కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. అంతకుముందున్న సెజ్‌లు రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాయి. సెజ్‌ల ఎగుమతులు 2005-06లో రు. 22,840 కోట్ల నుండి 2006-07లో రు. 34,615 కోట్లకు పెరిగాయి. 2007-08లో రు. 67,088 కోట్లు ఉండవచ్చని అంచనా (ఆర్థిక సర్వే 2007-08, పేజి. 147).

కొన్ని సందేహాలు

మనదేశంలో సెజ్‌ల స్థాపన వివాదానికి దారితీసింది. సాగు భూమిని సెజ్‌లకు అప్పజెప్పి మన ఆహారభద్రతకే ముప్పు తెచ్చుకోవడం సరికాదు. సెజ్‌లు సేకరించిన భూమిలో చాలా తక్కువ భాగం మాత్రమే సెజ్‌ల కోసం ఉపయోగించుకోవడం జరుగుతోంది. భూమి యాజ మానులకిచ్చే నష్టపరిహారం కూడా తక్కువే. సెజ్‌లలో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏమిటి? మామూలు కార్మిక చట్టాలు సెజ్‌లకు వర్తించవు. సెజ్‌ కార్మికుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. అంతేకాదు, సెజ్‌లలో స్థాపించే యూనిట్ల ఉపాధి కల్పనాశక్తి తక్కువ. ఉదాహరణకు, ఐ.టి. రంగం ఎంతమందికి ఉపాధి కల్పించగలదు?
సెజ్‌లు విదేశీమారక ద్రవ్యం సంపాదించగలవని ప్రత్యేక ప్రోత్సహకాలు కల్పించబడ్డాయి. అయితే, ప్రస్తుతం మన విదేశీమారక నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. సెజ్‌ల దుష్ఫలితాలను పక్కనబెట్టి కేవలం విదేశీమారక నిల్వలను పెంచడానికి సెజ్‌లను ప్రోత్సహించడం తగదు. అంతేకాదు, సెజ్‌ల స్థాపన కొన్ని రాష్ట్రాలలోనే (ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైనవి) కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగా భవిష్యత్‌లో ప్రాంతీయ వ్యత్యాసాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.

ఏం చేయాలి ?

గ్రామీణరంగంలో వైవిధ్యత చూపటానికి సెజ్‌లు సహాయ పడవచ్చు. అయితే, సెజ్‌ల స్థాపన ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అసలు లక్ష్యాలు మరచి ప్రస్తుతం సెజ్‌లను లాభసాటి వ్యాపార కేంద్రాలుగా మార్చటం జరిగింది. సెజ్‌ల వలన నేర్పరితనం గల శ్రామికులకు డిమాండ్‌ పెరుగుతోంది. అందువల్ల శ్రామిక శిక్షణకు ప్రాధాన్యతనివ్వాలి. నిరుపయోగంగా ఉన్న భూములను సెజ్‌లకు వాడుకోవడంలో తప్పులేదు. అయితే, భూమిని సెజ్‌ యజమానులు తమ స్వప్రయోజనాలకు వాడకూడదు. పన్ను రాయితీలు, మిగతా ప్రోత్సహకాలు ఏ స్థాయిలో ఉండాలో సమీక్షించాలి. భూమి యజమానులకు తగు నష్టపరిహారం ఇవ్వాలి. పర్యావరణంకు సంబంధించిన విషయాలను నిర్లక్ష్యం చేయరాదు. సెజ్‌ల సంఖ్య పరిమితంగా ఉండాలి. సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సెజ్‌ల స్థాపనకు అనుమతి ఇవ్వాలి. సెజ్‌ల స్థాపన గ్రామీణరంగంలో అవస్థాపన, ఉపాధి సౌకర్యాలు పెంచాలి. సెజ్‌ల స్థాపన విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisements

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:54 am

Posted in Articles, Telugu, Veekshanam

Tagged with , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: