Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మహాసెజ్‌గా మారనున్న హైదరాబాద్‌

leave a comment »

సెజ్‌లనూ తూర్పు ఇండియా కంపెనీని పోల్చి చూపుతూ, సెజ్‌ విధానం వల్ల హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్నారు డా. ఘంటా చక్రపాణి

చరిత్ర పునరావృతమవుతుందన్న సత్యాన్ని ఎన్నో సంఘటనలు, సందర్భాల తరువాత ఆవిష్కరించి ఉంటారు. ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమట అస్తమించడం గమనించి భూమి గుడ్రంగా ఉంటుందని, పదే పదే అదే కక్ష్యలో తిరుగుతుందనీ అర్థం చేసుకొన్నట్లే చరిత్ర గమనంలో కూడా గతించిన సందర్భాలు మళ్లీ మళ్లీ ఎదురవడం చూసి పునరావృతమవుతుందన్న నిర్ధారణకొచ్చి ఉంటారు. అలాంటి సందర్భమే ఇప్పుడు మళ్లీ వచ్చింది. అయితే ఇప్పుడు వందరెట్ల వేగంతో, విసురుగా, విధ్వంసంగా, విచ్ఛిన్నంగా వచ్చిపడింది. సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల కిందట ఈ దేశంలోకి ప్రవేశించిన బహుళజాతి పెట్టుబడి బహుముఖాలుగా విస్తరించి ఇప్పుడు మారుమూల పల్లెల్ని, పంటపొలాల్ని ముట్టడిస్తోంది. అప్పుడు ఈస్టిండియా కంపెనీ రూపంలో దేశంలో ప్రవేశించిన కంపెనీ వ్యవస్థ ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో వాడవాడలా విస్తరిస్తోంది. గ్రామాలను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని కుప్పకూల్చి ఇప్పుడు కొత్త వ్యాపార, వాణిజ్య, ఆధునిక నగర సంస్కృతిని నలుమూలల్లో వ్యాపింపజేస్తోంది. ఈ నయా సామ్రాజ్యవాద విస్తరణ పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా ప్రపంచీకరణను తలకెత్తుకుని తిరిగిన వాళ్లు కూడా ఇది ప్రమాదకరమైన ధోరణి అని, ఇదిట్లాగే కొనసాగితే దేశానికి ముప్పు తప్పదని అంటున్నారు.

1608

భారతదేశంలోకి ఈస్టిండియా కంపెనీ ప్రవేశించిన సంవత్సరం. సరిగ్గా ఇప్పటికి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలోకి విదేశీ పెట్టుబడి వచ్చిచేరింది. 1608 ఆగస్ట్‌ 24న ఈస్టిండియా కంపెనీకి చెందిన తొలి నౌక దేశానికి పశ్చిమ తీరంలో ఉన్న సూరత్‌ రేవులో లంగరేసి ఆగింది. వర్తక వ్యాపారాలు, ఎగుమతి దిగుమతులే ప్రధానమని చెప్పి దేశంలో దిగిన కంపెనీ క్రమక్రమంగా దేశపాలనా వ్యవహారాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదిగింది. మొదటి వంద సంవత్సరాలు వాడవాడలా విస్తరించిన ‘ఈ’ కంపెనీ ఆ కాలంలోనే కోటానుకోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ఆనాటి కాలంలోనే ‘రాయల్‌ డిక్టేట్‌’ గా మారి అప్పటి ప్రభువుల మెప్పుపొంది పన్నులు, సుంకాల రాయితీలు పొందగలిగింది. అభివృద్ధి పేరుతో, పారిశ్రామికీకరణ పేరుతో, ఉపాధి పేరుతో, మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఏటా పదిలక్షల ఎకరాల చొప్పున భూములు, పంట పొలాలు, అడవులు ఆక్రమించుకొంటూ యావత్‌ భారతదేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగింది. మొత్తంగా 1780 నాటికి అంటే దాదాపు 170 సంవత్సరాల్లో ప్రత్యక్షంగా పరిపాలనలో జోక్యం చేసుకొంటూ తన అధీనంలో ఉన్న ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు వసూలు చేసే వ్యవస్థగా అవతరించింది. ఇదే దేశంలో వలసపాలనకు, సామ్రాజ్యవాదానికి, దోపిడీకి, దాస్యానికీ దారి తీసింది. ఇలా దాదాపు రెండు వందల సంవత్సరాలు లూటీచేసిన కంపెనీ ఈ ఉపఖండం మొత్తాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం చెరలోకి నెట్టివేసింది.

ఈస్టిండియా కంపెనీకి ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు బీజాలు నాటిన తొలి బహుళజాతి కంపెనీగా పేరుంది. కేవలం 125 మంది షేర్‌ హోల్డర్లు, 75 వేల పౌండ్ల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టిన ఈ కంపెనీ ‘మదర్‌ ఆఫ్‌ మల్టినేషనల్‌ కంపెనీస్‌’గా వినుతికెక్కింది.

రెండు శతాబ్దాల్లో భారత దేశపు సకల సంపదలు కొల్లగొట్టి దేశాన్ని గుల్లచేసిన ఈస్టిండియా కంపెనీ తన సంపద కోసం వేల ఏళ్లపాటు సుసంపన్నంగా వర్ధిల్లిన భారతీయ ఆర్థిక వ్యవస్థను నేలమట్టం చేసింది. వ్యవసాయం, వృత్తులు, కళలు, మారకం, మార్కెట్‌ ఇట్లా మొత్తంగా దేశపు స్వపరిపాలనను, స్వయం సమృద్ధిని సమూలంగా కుప్పకూల్చి దేశ సార్వభౌమాధికారాన్ని బ్రిటిష్‌ సింహాసనానికి దాసోహం చేసింది. ఇట్లా ఈ దేశం మీద గుత్తాధిపత్యాన్ని స్థిరపరచుకోవడానికి ఈస్టిండియా కంపెనీ లాంటి ‘ఆదిశక్తి’కి కనీసం రెండు వందల సంవత్సరాలు పట్టింది. ఆ ఒక్క కంపెనీకి వ్యతిరేకంగా నిలబడడానికి, ఆ కంపెనీ వ్యాపార సామ్రాజ్యానికి, సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి పోరాడి గెలవడానికి ఆ తరువాత మరో వందేళ్లు పట్టింది.

ఇప్పుడు దేశంలో ఆ కంపెనీ లేదు. కానీ ఆ కంపెనీని పోలిన, ఆ కంపెనీకంటే వందల రెట్లు బలమైన కంపెనీలు ఇవాళ దేశంలోకి వేలాదిగా వచ్చి చేరాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ కంపెనీకి చెందిన ఒకే ఒక్క నౌక నిలబడిన చోట ఇవాళ అనేక నౌకలు లైన్లో ఉన్నాయి. నౌకాశ్రయాలున్న సూరత్‌, బరోడా, ముంబాయ్‌, కొచ్చిన్‌, చెన్నై, విశాఖపట్నం, కోలకతా ఇట్లా దేశం నలువైపులా భూమి, వనరులు, వస్తు సంపద ఈ కంపెనీల చేతుల్లోకి చేరిపోయింది. ఉన్నవి చాలవన్నట్టు ఇప్పుడు తీరప్రాంతాల్లోని ప్రధాన పల్లెలన్నిటినీ పోర్టులుగా మారుస్తున్నారు. కోస్తా తీరమంతా కారిడార్లుగా విస్తరిస్తున్నారు. ఈ కారిడార్లలోకి రమ్మని, పెట్టుబడులు పెట్టమని ప్రజా ప్రభుత్వాలు ఇవాళ ఈ బహుళజాతి సంతతికి సాగిలబడి స్వాగతాలు పలుకుతున్నాయి.

ఆర్థిక సంస్కరణలు – అనువైన వాతావరణం పేరుతో ఇప్పటికే చట్టాలన్నీ ‘సరళీకరణ’ చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు ఈ దేశాన్ని ఖండ ఖండాలుగా విభజించి కొత్తగా వస్తోన్న కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు, బహుళజాతి వ్యాపార కూటములకు అప్పగిస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌ల) పేరుతో ఇప్పుడు విస్తరిస్తోన్న ఈ కొత్త సామ్రాజ్యాలు దేశాన్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం స్వయంగా సెజ్‌ చట్టం 2005లో అన్ని చర్యలు తీసుకున్నది. ఈ చట్టం ఆమోదం పొందిన ఈ రెండేళ్లలో ఇప్పటికి దాదాపు ఐదు వందల కంపెనీలకు సెజ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ఈస్టిండియా కంపెనీని తలదన్నే రీతిలో వస్తోన్న ఈ ప్రత్యేక మండలాలు లక్షలాది మంది మదుపరులు, కోట్లాదిమంది వినియోగదారులను కొల్లగొట్టే కొత్త సామ్రాజ్యవాద పెట్టుబడిని దేశంలో విస్తరించబోతున్నాయి.

ఈస్టిండియా కంపెనీ కనీసం ఓ వందేళ్ల పాటయినా దేశ చట్టాలకు, నియమాలకు లోబడి వ్యాపారం చేసుకొన్నది. చేస్తున్నది మిరియాలు, పత్తి, పొగాకు, తేయాకు, కాఫీ లాంటి చిల్లర వ్యాపారమే అయినా మార్కెట్‌ సూత్రాలను అనుసరించి నడుచుకున్నది. పరిశ్రమలు స్థాపించి, దేశ వర్తక వాణిజ్య అభివృద్ధిలో ప్రధానమైన శక్తిగా ఎదిగేంత వరకు అణిగిమణిగే ఉన్నది. కానీ సెజ్‌ చట్టం ఇప్పుడు కంపెనీలకు గుత్తాధిపత్యాన్ని అప్పగిస్తున్నది. సెజ్‌ల వల్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాలు దొరుకుతాయని, అభివృద్ధి చెందుతామని చెప్పటం కేవలం ఆశలు కల్పించేందుకే తప్ప సెజ్‌లనేవి స్వతంత్ర జాగీర్లుగా అవతరించబోతున్నాయని పాలకులుకు తెలియంది కాదు.

జమీందార్ల జాగీర్లు

‘సెజ్‌’ అంటే పరిశ్రమ కాదు. ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించే వ్యవస్థ అంతకంటే కాదు. సెజ్‌ అనేది పరిపాలనా వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, నియంత్రణ విషయంలో సర్వ స్వతంత్రంగా ఉండే ఒక ప్రదేశం. అంటే ఈ దేశంలో అమలయ్యే చట్టాలుగానీ, శాసనాలుగానీ, పన్నుల వ్యవస్థగానీ, సుంకాలు గానీ అమలు కాకుండా ఎలాంటి అనుమతులు, పరిమితులు లేకుండా ఎగుమతి దిగుమతుల్ని చేసుకోవడానికి వీలున్న ‘విముక్త’ ప్రాంతం. సెజ్‌ యజమానిని ‘డెవలపర్‌’ అంటున్నారు. అంటే భూమి సేకరించి అభివృద్ధి చేసే వాడన్నమాట. అతను ఆ సెజ్‌ భూభాగానికంతటికీ యజమాని. ఆ భూమి, ప్రాంతం మీద అతనికి సర్వహక్కులు ఉంటాయి. అది అతని సొంత జాగీరు. అందులో రకరకాల వాణిజ్య వ్యాపార లావాదేవీలకు అవసరమైన వసతులన్నీ అతను కల్పిస్తాడు. ఆ భూభాగంలో అతను ఏం చేస్తాడు, ఎలాంటి వ్యాపారం, పరిశ్రమ ప్రారంభిస్తాడు, అక్కడ ఏ రకమైన కార్యకలాపాలు సాగుతాయి అన్న విషయం ప్రభుత్వానికి వివరించ వలసిన అవసరం లేదు. ఆ భూభాగంలో స్థానిక ప్రభుత్వ సంస్థలైన గ్రామ పంచాయితీ గానీ, మున్సిపాలిటీగానీ జోక్యం చేసుకునే వీలులేదు. వేలాది ఎకరాలు సేకరించి సొంతం చేసుకోవడానికి ఇప్పటి వారికున్న ఏ భూపరిమితి చట్టం కూడా సెజ్‌లకు వర్తించదు. అంటే సెజ్‌ ఏర్పాటు చేయాలనుకున్న వ్యక్తి ఎన్నీ వేల ఎకరాల భూమినయినా సొంతం చేసుకోవచ్చు. ఆ భూమిలో ఆ ప్రాంతానికి, ఆ పరిసరాలకు సంబంధం లేని, ఉపయోగపడని ఏ రకమైన ఉత్పత్తినైనా చేసుకోవచ్చు. ఎవరైనా సరే భూమి చూపించి, సెజ్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే నలభై ఐదు రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు ఏకకాలంలో ఇచ్చివేసి ఆ ప్రాంతాన్ని ‘సెజ్‌’గా నోటిఫై చేస్తుంది.

‘సెజ్‌’లలో పరిపాలనా వ్యవహారాలన్నీ ‘డెవలప్‌మెంట్‌ కమిషనర్‌’ చూసుకుంటాడు. సెజ్‌కు సంబంధించినంత వరకు ఈ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ సర్వాధికారి. అతనే చట్టం, అతనే న్యాయం, అతనే సమస్తం. ఆ సెజ్‌లో నెలకొల్పుతున్న పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వ్యవహారాలు, ఆ పరిశ్రమలు లేదా కంపెనీల లావాదేవీలు, ఆయా కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు ఇట్లా అన్ని పర్యవేక్షించే ‘కేర్‌ టేకర్‌’ ఆయన. సాధారణంగా ఒక పరిశ్రమగానీ, కంపెనీ గానీ లేక వ్యాపారం గానీ ప్రారంభించాలంటే కనీసం పది పన్నెండు సంస్థల నుంచి పర్మిషన్లు పొందాలి. మున్సిపాలిటీ లేదా పంచాయతీ మొదలు ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్‌ సుంకాల దాకా అనేక పన్నులు చెల్లించాలి. ఉద్యోగాల నియామకం, భద్రత, వారి భవిష్య నిధి పట్ల నిబంధనలు అమలుచేస్తూ ఆ కంపెనీ కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు జవాబుదారుగా ఉండాలి. అంటే కంపెనీ ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష పర్యవేక్షణలో పనిచేయాలి. కానీ సెజ్‌ల చట్టం వీటన్నిటి నుంచీ సెజ్‌లో నెలకొల్పే పరిశ్రమలు, వ్యాపారాలకు మినహాయింపు నిచ్చింది. చట్టంలోని 49వ సెక్షన్‌, సెజ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌కే ఈ అన్ని అధికారాలు అప్పగిస్తూ అతన్ని స్వతంత్ర పర్యవేక్షకుడిగా పేర్కొంటూ దేశంలో అమలవుతున్న ఏ పారిశ్రామిక, కార్మిక చట్టం కూడా సెజ్‌లో అమలు కావాల్సిన అవసరం లేదంటూ పేర్కొంటున్నది. అందుకు అనుగుణంగా చట్టాలను మార్చుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తున్నది.

అందుకే ఈ చట్టం నిరంకుశమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ అజమాయిషీకి, వివిధ శాఖల పర్యవేక్షణకు, నియంత్రణకు ఉన్న అన్ని ప్రజాస్వామిక అవకాశాలను ఈ చట్టం తొలగించి వేస్తున్నది. అంతే కాకుండా రెవెన్యూ, పరిపాలన, నిర్వహణ, ఆర్థిక, న్యాయ, కార్మిక సంక్షేమ, పర్యావరణ అంశాలతో పాటు విదేశీ వాణిజ్య వ్యవహారాలన్నీ ఒకే అధికారి చేతుల్లో పెట్టడం అంటే సెజ్‌ ప్రాంతాన్ని ఒక స్వయం ప్రతిపత్తి గలిగిన ప్రత్యేక రాజ్యంగా ప్రకటించడమే అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన అనేక అభివృద్ధి అవకాశాలకు అవరోధంగా ఉందని, జాతీయవాద స్ఫూర్తికి విరుద్ధమనీ అంటున్నారు.

అయితే ప్రభుత్వం ఈ వాదనలేవీ వింటున్నట్టు లేదు. కేవలం సెజ్‌ల వల్ల పెట్టుబడులు, విదేశీ వర్తకం అభివృద్ధి చెందుతుందని ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువని ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఇదొక్కటే పరిష్కారమని నమ్మ బలుకుతోంది. ఈ సెజ్‌ల వల్ల దేశంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయనీ ప్రచారం చేస్తోంది.

లక్షలాది కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చేస్తోన్న వాదనలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నది అర్థమవుతూనే ఉంది. అవసరానికి మించిన సంఖ్యలో సెజ్‌లకు అనుమతులు ఇచ్చినా ఆశించిన మేర పెట్టుబడులు రాలేకపోతున్నాయి. ఇక ఉద్యోగాల సంగతి సరే సరి. అసలు ఈ సెజ్‌ల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న విషయంలోనే ప్రభుత్వాలకు స్పష్టత లేదు. సెజ్‌ల వల్ల దేశవ్యాప్తంగా కనీసం ముప్ఫై లక్షల కొత్త ఉద్యోగాలు రావచ్చునని ఇప్పటి సెజ్‌ల రూపశిల్పి కేంద్ర వాణిజ్య శాఖమంత్రి కమల్‌నాథ్‌ అంచనా వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మాత్రం మన రాష్ట్రంలో ఏర్పాటు కానున్న సెజ్‌లలోనే వచ్చే నాలుగేళ్ల కాలంలో కనీసం ఇరవై ఏడు లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని పదే పదే చెపుతున్నారు. నిజానికి ఈ సెజ్‌లలో పరిశ్రమలో వ్యాపారాలో ప్రారంభించేందుకు ఎవరైనా వస్తారా, వస్తే ఎలాంటి పరిశ్రమలు వస్తాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అనే విషయం ఎవరికీ తెలియదు. ప్రభుత్వం ప్రకటించిన చట్టం లక్ష్యాల్లో ఉద్యోగాల కల్పన ఒకటి అని పేర్కొన్నప్పటికీ కచ్చితంగా ఉద్యోగాలు కల్పించే లేబర్‌ ఇంటెన్సివ్‌ పరిశ్రమలే పెట్టాలన్న క్లాజు ఏమీలేదు. అందుకే ఏ రకమైన పరిశ్రమలు వస్తాయో తెలియని సెజ్‌ డెవలపర్లు మల్టి ప్రోడక్ట్‌ సెజ్‌లని, ఐటి, ఐటి ఆధారిత పరిశ్రమలని ఊహాజనితమైన లక్ష్యాలతో సెజ్‌ల అనుమతి పొందుతున్నారు. నిజానికి ఇప్పటి వరకు ఏర్పాటైన సెజ్‌లు అన్ని కలిపి కూడా పది లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేక పోతున్నాయి. అసలు ఈ సెజ్‌ల ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం ఉద్యోగాలో, విదేశీ పెట్టుబడులో, ఎగుమతులో కాదని కేవలం దేశంలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు కాజేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడంతో పాటు ఈ కంపెనీలు తమ ఎస్టేట్లు నిర్మించుకోవడమేనని ఇప్పటిదాకా జరుగుతోన్న తతంగం చూస్తే అర్థమవుతోంది. సెజ్‌ విధానం ప్రకటించిన వెంటనే దేశంలోని ప్రధాన పెట్టుబడిదారీ సంస్థలన్నీ తమ తమ వ్యాపారాలన్నిటినీ సెజ్‌ పరిధిలోకి తెచ్చుకొని పన్నుల మినహాయింపు ద్వారా కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నాయి. సెజ్‌ నిబంధనలు చూపి లక్షలాది ఎకరాల భూములు సంపాదించుకొన్నాయి. తమ కంపెనీలకు అనుబంధంగా రియల్‌ ఎస్టేట్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు ఏర్పాటు చేసుకుని వేల కోట్ల రూపాయల వ్యాపారం మొదలుపెట్టాయి. ఇట్లా ఈ కంపెనీలు, వాటి యజమానులు కోట్లకు పడగలెత్తుతుంటే రైతులు, కూలీలు, గ్రామీణ పేదలు మాత్రం ఉపాధి కోల్పోయి వీథిన పడుతున్నారు.
ఎవరికి లాభం – ఎవరికి నష్టం?

సెజ్‌లు పెట్టుబడిదారీ కంపెనీలను ప్రోత్సహిస్తూ పేదరైతుల పొట్టలు కొడుతున్నాయి. దేశం మొత్తం మీద ఇప్పుడు వస్తోన్న సెజ్‌ల వల్ల దాదాపు ఏడు లక్షల ఎకరాల భూములు ఈ కంపెనీల ఆధీనంలోకి పోనున్నాయి. మరోవైపు కనీసం లక్షన్నర కుటుంబాలు వ్యవసాయం నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. మరో లక్ష కుటుంబాలు వ్యవసాయపు పనుల నుంచి వైదొలగవలసి వస్తోంది. ఒక్కొక్క కుటుంబానికి సగటున ఐదుగురు సభ్యులుంటారనుకున్నా కనీసం పన్నెండున్నర లక్షల మంది ప్రత్యక్షంగా జీవనాధారం కోల్పోతున్నారు. ఇంకా పరోక్షంగా వ్యవసాయం, భూమి, ఆ భూమిపై ఉన్న చెట్లు, చేమలు, చెరువులు, కుంటల పై ఆధార పడిన వృత్తులు, కులాలు, కుటుంబాలను లెక్కలోకి తీసుకుంటే ఈ సెజ్‌ల ప్రభావం కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నష్టం కలిగిస్తున్నాయి. బతుకుదెరువు లేకుండా చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఉపాధి దొరుకుతుందో తెలియని ఈ సెజ్‌ల మూలంగా ఇప్పుడు మాత్రం భారీ విధ్వంసం జరుగుతోంది.

సెజ్‌లు గ్రామీణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే వ్యవస్థలుగా మారుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సెజ్‌లు వ్యవసాయ భూములను సేకరించి ఎస్టేట్లుగా మార్చడం వల్ల దేశంలో దాదాపు ఏటా పదిలక్షల టన్నుల ఆహార ధాన్యాల లోటు ఏర్పడబోతోందని ఒక అంచనా. అలాగే వ్యవసాయం పై ప్రత్యక్షంగా ఆధారపడ్డ కుటుంబాలు పనికి దూరం కావడం వల్ల ఏడాదికి కనీసం 212 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయి బికారులౌతారని ఢిల్లీకి చెందిన సిటిజన్స్‌ కలెక్టివ్‌ లెక్కగట్టింది. ఇక పరోక్షంగా కూడా భూమి, వ్యవసాయాధార వృత్తుల మీద ఆధారపడ్డ గొర్రెలు, పశువుల కాపర్లు, పశు పోషకులు, వడ్రంగి, కమ్మరి, తెనుగు, బెస్తవంటి కులాల ఆదాయ నష్టాన్ని కూడా లెక్కగడితే వీటివల్ల జరిగే నష్టం ఏటా ఏడు వందల కోట్లకు పైమాటే ఉండొచ్చు. ఇది గ్రామీణ సమాజం కోల్పోతున్న ఆదాయం సంగతి. మరోవైపు సెజ్‌ల పేరుతో ఉన్న వ్యాపారాలను మరింత విస్తరించుకుంటున్న కంపెనీలు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన కంపెనీల పన్నుల మినహాయింపుల వల్ల వచ్చే నష్టం దాదాపు లక్ష అరవై వేల కోట్ల పైనేనని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడున్న సెజ్‌లు నిర్వహిస్తోన్న వ్యాపారాలపై ఇస్తోన్న పన్నులు, సుంకాల రాయితీలను లెక్కగట్టిన ఆర్థిక శాఖ 2007-2010 మధ్య కాలంలోనే ప్రభుత్వం కోల్పోనున్న ఆదాయాన్ని ఈ మేరకు అంచనా వేసింది. ఈమేరకు సెజ్‌లు ప్రజలకు రావాల్సిన ఈ సొమ్మును తమ లాభాల ఖాతాలలో జమ చేసుకుంటున్నాయి.

ప్రజలకు ప్రత్యక్షంగా నష్టం కలిగిస్తూ పెట్టుబడిదారులకు లాభాలు కుమ్మరిస్తోన్న ఈ సెజ్‌లను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు, ఈ విధానం వల్ల అంతిమంగా ఎవరికి మేలు కలుగుతుంది అన్న విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఇది పూర్తిగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పక్షాలు తమ స్వప్రయోజనాల కోసం విస్తరిస్తోన్న వ్యాపారమని ఇటీవలి విశ్లేషణలను బట్టి అర్థం అవుతోంది. దేశంలోని బడా పారిశ్రామిక సంస్థలు, విదేశీ వాణిజ్య కంపెనీలతో, బహుళజాతి శక్తులతో కలిసి ఈ విధానాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి. ప్రపంచబ్యాంక్‌ ఈ విధానం వెనుక ప్రధాన సూత్రధారిగా ఉండి పెట్టుబడిదారీ దేశాల, వాటి కంపెనీల ప్రయోజనం కోసం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ ఊబిలోకి నెడుతున్నాయి. సెజ్‌ల వల్ల రెండు ప్రయోజనాలను ప్రపంచబ్యాంక్‌ ఆశిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ నిరుద్యోగం ఉండడం వల్ల, తక్కువ జీతానికే పనిచేసే శ్రామికుల సంఖ్య ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాలకు అవసరమైన వస్తూత్పత్తి కేంద్రాలను ఈ పేద, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశాలల్లోకి తరలించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రపంచానికి కావాల్సిన వినియోగ వస్తువులు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇకపోతే ఈ దేశాల్లో ఉన్న సహజ వనరులను తమకు కావాల్సిన సరుకుల ఉత్పత్తికి వాడుకోవచ్చు. దీంతో అభివృద్ధి చెందిన, సంపన్న దేశాల్లోని ప్రజల అవసరాలకు కావాల్సిన సరుకులు కొరత లేకుండా, తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగాలు కల్పించలేని పేదదేశాల ప్రభుత్వాల బలహీనత ఈ బహుళజాతి శక్తులకు బాగా ఉపయోగపడుతోంది. సరళీకరణ విధానాలు అమలై ఒకటి రెండు దశాబ్దాలు దాటుతున్నా ఆశించినమేరకు ఉద్యోగాలు దొరక్కపోగా, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీనివల్ల ఉపాధి కల్పనపై ప్రభుత్వాలు ఎక్కువగా డబ్బుపెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వాల దగ్గరి వనరులు అందుకు సరిపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ సెజ్‌ పాచిక వచ్చిపడింది. ప్రైవేట్‌ కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తే సరిపోతుందన్న ఆలోచనలతో ఇప్పటి దాకా కేవలం మార్కెట్లను మాత్రమే సరళతరం చేసిన దేశాలు ఇప్పుడు వనరులు, ముఖ్యంగా భూమిపై శాశ్వత హక్కులను ఈ కంపెనీలకు అప్పగిస్తున్నాయి. కేవలం భూమి మీద అధికారం మాత్రమే కాక భారత ప్రభుత్వం రూపొందించిన సెజ్‌ పాలసీ గ్రామాలు ధ్వంసం చేసి, వ్యవసాయాన్ని కుప్పకూల్చి కొత్త పారిశ్రామిక కేంద్రాలు, ప్రైవేట్‌ నగరాలు, పట్టణాలు ఏర్పాటు చేసే కొత్త ప్రక్రియకు సెజ్‌ చట్టం ద్వారా వీలు కల్పిస్తుంది. ఇది ముంబాయిలో రిలయన్స్‌ కంపెనీతో మొదలయ్యింది. ముంబాయిలో రిలయన్స్‌ సెజ్‌ నవీ ముంబయ్‌ పేరుతో ఒక నయా సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. దాని విస్తీర్ణం ఇప్పుడున్న పాత ముంబయ్‌తో సమానం. ఈ నగరం మీద సర్వహక్కులు, సార్వభౌమాధికారం పూర్తిగా రిలయన్స్‌ కంపెనీకే ఉంటుంది. అంటే అది అంబానీ రాజ్యం కాబోతోంది. అట్లాంటి రాజ్యాలు మరో కొద్ది రోజుల్లో ఈ దేశంలో కనీసం ఐదు వందల దాకా ఆవిర్భవించ బోతున్నాయి. అందులో హైదరాబాద్‌ కూడా ఒకటి కాబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ కథ

ఈస్టిండియా కంపెనీ రాకకంటే పది పదిహేనేళ్ల ముందు కులికుతుబ్‌ షా హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించాడు. గడిచిన చరిత్రలో తొలి నాలుగు వందల సంవత్సరాల్లో ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన నగరంగా వినుతికెక్కింది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, జాతులు, తెగలు, భాషలకు చెందిన ప్రజలకిది ప్రధాన కేంద్రం అయ్యింది. భారత దేశపు నడిబొడ్డున ఉన్న ప్రాచీన పర్షియన్‌ సంస్కృతికి, వాస్తుకళకి హైదరాబాద్‌ పెట్టిన పేరుగా నిలిచింది. ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడాలతో పాటు గుజరాతీ, బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ భాషలు మాట్లాడే ప్రజలతో ఉత్తర, దక్షిణ భారతీయ సంస్కృతికి వారధిగా నిలిచింది. 1790 తరువాత ఈస్టిండియా కంపెనీకి తొత్తులుగా మారిన నైజాం పాలకులు వారినుంచి సైనిక, రాజకీయ సహకారం పొంది గ్రామాలను జాగీర్దార్లకు వదిలేసి ప్రజలను ఆర్థిక దోపిడీలోకి నెట్టి అందమైన నగరాన్ని నిర్మించడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా ఎదిగారు. హైదరాబాద్‌ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో మంది కవులు, కళాకారులు, చరిత్రకారులను ముగ్దుల్ని చేశాయి. ఇప్పుడు ఆ హైదరాబాద్‌ పూర్తిగా అంతరించిపోతోంది. సమైక్య రాష్ట్రం ఏర్పాటుతో మొదలైన ముప్పు 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తీవ్రమైన ఇండో – పర్షియన్‌ సాంస్కృతిక భాగాల్ని సమూలంగా చెరిపేసి ఆంధ్ర ప్రాంత వలసదారులకు కేంద్రంగా మార్చివేసాయి. తెలుగుదేశం పార్టీ పాలన 2004 నాటికి నాలుగు వందల ఏళ్ల చారిత్రక సాక్షీ భూతంగా నిలిచిన చార్మినార్‌ మరుగున పడిపోయి హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీ ప్రతీకగా మారిపోయింది.

రాజశేఖరరెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మరో అడుగు ముందుకు వేసి హైదరాబాద్‌ నామరూపాలు లేకుండా చేస్తున్నదని ఈ నాలుగేళ్ల పాలన పర్యవసానాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. నిజానికి హైదరాబాద్‌ నగరానికి, నగరం చుట్టూరా కోడిపిల్లల్లా ఒదిగిన తెలంగాణ జిల్లాలకు 1982-2004 మధ్య జరిగిన నష్టం కంటే 2004 తరువాత జరుగుతున్న నష్టమే ఎక్కువ. మొదటి దశలో హైదరాబాద్‌ పై జరిగింది కేవలం సాంస్కృతిక దురాక్రమణే అనుకోవచ్చు. కానీ రెండో దశలో హైదరాబాద్‌ భౌగోళికంగా, భౌతికంగా కూడా పరాయి వాళ్ల చేతుల్లోకి పడిపోయింది.

ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినట్టు గమనించవచ్చు. భూమి పుత్రుడిగా, రైతు బిడ్డగా ప్రజల్లోకి వచ్చిన రాజశేఖరరెడ్డి భూమిని కేంద్రంగా చేసుకుని హైదరాబాద్‌ పునర్‌నిర్మాణానికి పూనుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సూచనలు మావోయిస్టు పార్టీ – జనశక్తి నక్సలైట్లతో చర్చలు మొదలుపెట్టినప్పుడే కనిపించాయి. అడవుల్లోంచి నక్సలైట్లను చర్చలకు తీసుకువచ్చిన ప్రభుత్వం రెండు రోజుల్లోనే చర్చలకు చేతులెత్తి మళ్లీ ఆయుధాలు ఎక్కుపెట్టింది. హైదరాబాద్‌ చుట్టూ ఆంధ్రా సంపన్న వర్గాలు పరిశ్రమల పేరుతో ఆక్రమించిన ఇరవై ఏడు వేల ఎకరాల భూమికి సంబంధించి నక్సలైట్లు చర్చను లేవదీశారు. నగరంలో దాదాపు నలభై మూడు కంపెనీలు ఈ భూములు కబ్జా చేసినట్లు ఒక జాబితాను కూడా వాళ్లు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్న ముఖ్యమంత్రి ‘భూముల సంగతి వాళ్లకేం తెలుసు’ అని ప్రశ్నించి చర్చలు అక్కర్లేదన్న సంకేతాన్ని పంపించారు. ఆ మరుసటి రోజే చర్చలు విఫలమైనట్టు ప్రభుత్వం ప్రకటించి తలుపులు మూసివేసింది. ఆ వెంటనే ఊపిరి సలపనీయకుండా పల్లెల్లో, అడవుల్లో దాడులు చేసి భూముల కోసం పోరాడుతున్న పేదలకు అండగా నిలిచి, అక్రమాలను ఎదిరించే వాళ్ల ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించింది. ఉద్యమంలో కీలకమైన వ్యక్తులను వెంటాడి, వేటాడింది. ఆ తరువాత భూమి గురించి ఇంకెవ్వరూ మాట్లాడరని నిర్ధారించుకున్న తరువాత నగరం చుట్టూ 162 కిలోమీటర్ల మేర అవసరం లేకపోయినా ఔటర్‌ రింగురోడ్డు పేరుతో పల్లెల్ని చిన్నా చితకా పట్టణాల్ని కలుపుతూ ఓ సరిహద్దు రేఖ గీసింది.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు చుట్టు పక్కల గడిచిన నాలుగేళ్లలో జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే భూములన్నీ తెలంగాణ పేద రైతాంగం చేతుల్లోంచి రాయలసీమ పెత్తందార్ల కబంధ హస్తాల్లోకి ఎలా చేరాయో అర్థమవుతుంది. అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, వారి పిల్లలు పెట్టుబడిదార్లు కలిసి వేలాది ఎకరాలు సొంతం చేసుకోగలిగారు. రింగు రోడ్డు ఇప్పటికీ ఇంకా మొదటి దశ కూడా పూర్తికాలేదు గానీ ఆ భూముల్లో కాలనీలు, కంపెనీలు వెలిశాయి. రింగురోడ్డు పొడవునా మళ్లీ నగరమంత విస్తీర్ణం ఉన్న భూములన్నీ వలసవాదుల చేతుల్లోకి చేరిపోయాయి. ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వేలకోట్ల రూపాయలకు చేరుకొంది. అధికారంలో కంటే వ్యాపారంలోనే ఎక్కువ లాభం ఉందని గ్రహించిన ఈ నాయకులు మరింత భూమిని అందుబాటులోకి తేవడం కోసం భూగరిష్ట పరిమితి చట్టాన్ని రద్దు చేశారు. దాంతో నగరంలో ఉన్న భూములు, చుట్టూ ఉన్న పొలాలు, పంట భూములను హస్తగతం చేసుకోవడం సులభతరమైపోయింది. దానికి సెజ్‌ చట్టం బాగా తోడ్పడింది. తమ బంధువులు, భాగస్వాములతో వ్యాపారాలు ప్రారంభించిన నేతలు సెజ్‌ల పేరుతో దరఖాస్తులు చేసుకొని నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ, బంజరు భూములను ఆక్రమించు కోవడంతో పాటు, రైతులనుంచి అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాల భూములు సేకరించుకోగలిగారు. సత్యం, ఇందు, లాంకో వంటి కంపెనీలు ప్రారంభించిన సెజ్‌లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఈ కోవకే చెందుతాయి.

బినామీ పేర్లతో అధికారంలో ఉన్న వాళ్లే సెజ్‌లకు దరఖాస్తులు చేయడం, తమ పలుకుబడిని ఉపయోగించి, అనుమతులు ఇప్పించడం మొదలైంది. జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ఆనుకుని ఉన్న హౌసింగు బోర్డ్‌ భూముల్ని ఓ కంపెనీ తమకు కేటాయించుకుంది. అక్కడ ఇందూ అరణ్య పేరుతో ఓ విలాసవంతమైన నగరం నిర్మాణంలో ఉంది. అంతకు ముందు కూకట్‌పల్లి హౌసింగు బోర్డ్‌ కాలనీకి, హైటెక్‌ సిటీకి మధ్య ఉన్న ప్రభుత్వ భూమిని పొంది, అపార్ట్‌మెంట్లు, బంగ్లాలు నిర్మించి అమ్ముకున్న ఈ కంపెనీకే ప్రభుత్వం మామిడిపల్లి సమీపంలో పహాడీషరీఫ్‌లో వందలాది ఎకరాల కొండలు, అడవులు సేకరించి సెజ్‌గా మార్చివేసింది. ‘పాయింట్‌ ఇందూ’ టెక్నో సెజ్‌ పేరుతో ఇప్పుడు పహాడీషరీఫ్‌ పర్వతశ్రేణుల చుట్టూ ఈ కంపెనీ ఓ పెద్ద ప్రహరీగోడ నిర్మించింది. ఇంకా ఆ సెజ్‌లో ఏ ఉత్పత్తులు చేస్తారో తెలియదు గానీ భూమి మాత్రం చేతులు మారింది. ఇట్లా నగరం చుట్టుపక్కల ఉన్న భూములన్నీ చిన్నరైతుల నుంచి, పెద్ద పెద్ద భూస్వాముల చేతుల్లోకి చేరిపోయాయి.

ఈ భూములు, వాటి విలువను ముందుగానే లెక్కగట్టుకున్న నేతలు హడావుడిగా హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన విమానాశ్రయాన్ని నిర్మించేశారు. అటువంటి వ్యాపారాన్ని ఒక విధానంగా అమలు చేయడం, రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ తతంగం వల్ల ఇప్పుడు హైదరాబాద్‌ చుట్టూ ఉన్న భూములన్నీ తెలంగాణేర పారిశ్రామిక, వ్యాపార వేత్తల చేతుల్లోకి చేరిపోయాయి. సత్యం కంపెనీ కొంపల్లి, బహుదూర్‌పల్లి, బాచుపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఈ పద్ధతిలో సేకరించినట్టు ఆరోపణలున్నాయి. సత్యం కంపెనీ మేటాస్‌ పేరుతో (అక్షరాలు తిరగేసి) ప్రారంభించిన కొత్త కంపెనీ ప్రధాన వ్యాపారం భూమి, మౌలిక వసతుల కల్పన. అట్లాగే 2000 సంవత్సరం తరువాత కొండలు, గుట్టలు, చెలుకలు సంపాదించడానికి వాటిపై లాంకో హిల్స్‌ పేరుతో మేటాస్‌ హిల్‌ కౌంటీ పేరుతో, సత్యం సోదర సంస్థ నిర్మించిన భూతల స్వర్గానికి ధీటుగా అపార్ట్‌మెంట్స్‌, విల్లాలు, హోటళ్లు నిర్మిస్తోంది. అదే క్రమంలో ఇందూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అనే కంపెనీ నేరుగా ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థలకు చెందిన భూముల్నే కాజేసి కాలనీలు నిర్మిస్తోంది. అవసరం కంటే ఐదురెట్లు ఎక్కువ స్థలాన్ని సేకరించి ఒక ప్రైవేట్‌ కంపెనీచేత దేశంలో కెల్ల విశాలమైన విమాశ్రయాన్ని శంషాబాద్‌లో ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. శంషాబాద్‌ నుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్లే బెంగుళూరు జాతీయ రహదారిని ఆనుకుని జడ్చర్ల దాకా భూములన్నీ ఇప్పుడు రాయలసీమ వాసులే కొనేసుకున్నారని రికార్డులే చెపుతున్నాయి. ఆ ప్రయోజనాలకు అనుగుణంగానే జడ్చర్ల దగ్గర పోలేపల్లిలో పదివేల ఎకరాల భూమిని ఫార్మాస్యూటికల్‌ సెజ్‌గా ప్రకటించడం వెన కూడా పాలకవర్గాల వ్యాపార ప్రయోజనాలున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ నాలుగేళ్ల ఆక్రమణకు హైదరాబాద్‌ నగరం, రంగారెడ్డి జిల్లా విమానాశ్రయాన్ని ఆనుకున్న ఉన్న భూములు సరిపోలేదు. మరోపక్క తెలంగాణ వాదం కూడా పదునెక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఒక ప్రత్యేక రాష్ట్రం రూపొందే ప్రయత్నం కూడా పాలక వర్గాల నుంచి జరిగింది. ఆ ఆలోచనలకు అనుగుణంగానే గ్రేటర్‌ హైదరాబాద్‌ రూపొందింది.

హైదరాబాద్‌ ఈ నాలుగేళ్లలో మారుతున్న సందర్భంలో కూడా మళ్లీ చరిత్ర పునరావృతమవుతున్న దృశ్యమే సాక్షాత్కరిస్తోంది. హైదరాబాద్‌ నవాబు ప్రపంచంలోకెల్లా ధనవంతుడే కాదు అంతకు మించిన భూస్వామి కూడా. ‘అత్రాఫ్‌ బల్దా’ పేరుతో లక్షలాది ఎకరాల భూమి నిజాం సొంత ఆస్తిగా ఉండేది. నగరం చుట్టు పక్కలే కాకుండా జాగీర్లు, జమీందార్ల పరిధిలోకిరాని కొన్ని భూములు కూడా నిజాం సొంత ఆస్తుల్లో భాగంగా ఉండేవి. అయితే ఆ భూముల్లో కొంతభాగం దళితులకు, తనని నమ్ముకున్న సేవకులకు, దాసీలకు, తన కొలువులో పనిచేసి విరమించుకున్న ఉద్యోగులకు ఇనాంలుగా ఇచ్చే అలవాటు కూడా ఆయనకు ఉండేది. అంతే కాకుండా ఆ భూముల్లోనే ప్రభుత్వ రంగ కంపెనీలైన ఆల్విన్‌ లాంటివి, హౌజింగు బోర్డ్‌ లాంటివి ఏర్పాటుచేసి తన ప్రజలకు ఉద్యోగాలు, గృహవసతి కల్పించాలన్న సంకల్పాన్ని కూడా ఆయన అప్పుడప్పుడు చాటుకొనే వాడు. అయితే నైజాం వారసుల్లా నగరాన్ని, నగరం నాలుగు దిక్కులా ఉన్న వేలాది ఎకరాలను కాజేసిన వారికి ఇంకా ఆక్రమించుకోవడానికి భూములు లేకుండా పోయాయి. మరోవైపు ఔటర్‌ రింగు రోడ్డుకు అటూ, ఇటూ కలిపి నగరం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనా వచ్చి ఉంటుంది. ఆ ఆలోచనలోంచి పుట్టిందే గ్రేటర్‌ హైదరాబాద్‌.

ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండు ప్రయోజనాలను ఆశించి గ్రేటర్‌ హైదరాబాద్‌ సృష్టించినట్టు అర్థమవుతోంది. అందులో ఒకటి తక్షణం మరికొన్ని వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం అయితే రెండోది తెలంగాణ డిమాండ్‌ను తేలికపరచడం. గత మార్చిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక రాష్ట్ర వాదనకు పదును పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ ఎం.పి.లు, ఎం.ఎల్‌.ఎ. లు మార్చ్‌ 6న పదవులకు రాజీనామా చేశారు. అందుకు రెండు నెలల క్రితమే రాజీనామా విషయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి మార్చ్‌ 6 ‘డెడ్‌లైన్‌’ విధించారు. నిజంగానే అధిష్టానం తలొగ్గి తెలంగాణ ఇచ్చేస్తుందో ఏమోనని భయపడ్డ కాంగ్రెస్‌ పాలకులు ఒక వేళ తెలంగాణ ఏర్పడ్డప్పటికీ ఈ ప్రాంతానికి ప్రయోజనం ఉండకుండా హైదరాబాద్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించి మార్చ్‌ 17న గ్రేటర్‌ హైదరాబాద్‌ను ప్రకటించి గతంలో ఉన్న హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధి విస్తరించి పేరు కూడా హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చి వేశారు. ఆ మరుసటి వారంలో (తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రాజీనామా చేసిన తరువాత) ఈ మేరకు చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చైర్మన్‌గా ఉంటారు. హైదరాబాద్‌ నగర పరిధి ఈ చట్టం మూలంగా అనూహ్యంగా మూడింతలు పెరిగింది. హుడాగా ఉన్నప్పుడు 2197 చదరపు కిలోమీటర్లున్న నగర వైశాల్యం 6852 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. తెలంగాణలోని 54 మండలాలకు నగర పరిధి విస్తరించి హైదరాబాద్‌, రంగారెడ్డితోపాటు మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలను ఇందులో కలిపారు. దీంతో హైదరాబాద్‌ విస్తీర్ణం మంబయ్‌ నగర విస్తీర్ణం కంటె పెద్దది అయిపోయింది.

మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌, కడప రోడ్డులో షాద్‌నగర్‌, వరంగల్‌ రోడ్డులో భువనగిరి, విజయవాడ రోడ్డులో చౌటుప్పల్‌, శ్రీశైలం రోడ్డులో దాసర్లపల్లి, నాగార్జున సాగర్‌ రోడ్డులో బీచుపల్లి, వికారాబాద్‌ దగ్గర కిష్టాపూర్‌, కరీంనగర్‌ రోడ్డులో సింగరాయపల్లి వరకు ఇప్పుడు నగరంలో భాగమైపోయింది. అంతేకాదు సంగారెడ్డి, శంకర్‌పల్లి, భువనగిరి, షాద్‌నగర్‌ పట్టణాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 23 శాసనసభ స్థానాలు, మూడు పార్లమెంట్‌ స్థానాలు కలిపి 85 లక్షల జనాభాతో హైదరాబాద్‌ ఒక ప్రత్యేక రాష్ట్రానికి కావాల్సిన అన్ని హంగులూ సమకూర్చుకోగలిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నేతల్లో కొందరు గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని, మరికొందరు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలని కూని రాగాలు తీశారు. ఇట్లా హైదరాబాద్‌ నగరం తెలంగాణ పల్లెల్ని పట్టణాల్ని మింగేసి ఇప్పుడు మహానగరంగా విస్తరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాపోగా మెదక్‌లో పది మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు, నల్లగొండలో నాలుగు మండలాలు ఆయా మండలాల్లోని 450 గ్రామాలు, ఆ గ్రామాల్లోని లక్షలాది ఎకరాల భూములు ఇప్పుడు నగరంలో కలిసిపోయాయి.

నిజాం నవాబు కింది జాగీర్దార్లలా కొత్త వ్యాపారవర్గం ఇప్పటికే సెజ్‌ల పేరుతో ఈ భూములను కబ్జా చేసే పని ప్రారంభించింది. రింగు రోడ్డుకు అటూ ఇటూ వేలాది ఎకరాలు ఆక్రమించుకున్న పాలకవర్గాలు ఈ నయా భూస్వాముల్ని పెంచి పోషించేందుకు సెజ్‌ చట్టాన్ని ఒక అవకాశంగా వాడుకొంటున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌నే కాకుండా మహానగరం పరిధిలో మరో డెబ్బై దాకా ఇటువంటి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఇప్పుడు తలమునకలై ఉంది. రాష్ట్రంలో ప్రారంభం కానున్న వంద సెజ్‌లలో దాదాపు డెబ్బై ఈ మహానగరం పరిధిలోనే ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో 90 శాతం ఐ.టి. / ఐ.టి.ఇ.ఎస్‌. సెజ్‌ లే కావడం మరో విశేషం. అయితే కేవలం సెజ్‌ల పేరుతో సేకరించిన భూములే కాదు, సెజ్‌ల లోపల, సెజ్‌ల బయట కూడా వేలాది ఎకరాల్లో కొత్త టౌన్‌షిప్‌లు, ఇండస్ట్రియల్‌ సిటీలు, ఇన్‌ఫ్రా సిటీలు వెలుస్తున్నాయి. విదేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రవాసాంధ్రులు కోటి నుంచి ఐదు కోట్ల వ్యయం చేసే ఇళ్లను, ఆధునిక కాలనీలను, కౌంటీలను కొనేసుకుంటున్నారు. ఇప్పుడు నగరం చుట్టూ సెజ్‌ల పేరుతో వెలుస్తోన్న ఈ డెబ్భై ఎస్టేట్లు పూర్తయితే నగర జనాభా రెండు కోట్లకు చేరవచ్చని అంచనా. అంటే ఇప్పుడున్న హైదరాబాద్‌ మినహా మొత్తం తెలంగాణ జనాభా కంటే ఎక్కువ.

ప్రభుత్వం ఈ లెక్కలన్నీ వేసుకునే హైదరాబాద్‌ని ఒక ‘మహాసెజ్‌’గా మలిచింది. దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక సెజ్‌లు మన నగరం చుట్టూ కొత్త గఢీలను నిర్మిస్తున్నాయి. నవాబుగారి నగరం చుట్టూ అప్పుడు వెలసిన జాగీర్దార్ల గఢీల్లాగే ఇప్పుడు సెజ్‌లు కూడా కొత్త జాగీర్లు కాబోతున్నాయి.

ఇప్పుడు దేశంలో విస్తరిస్తున్నది పెట్టుబడిదారీ బహుళజాతి వ్యాపారం అని బుద్ధిజీవులు బాధపడుతున్నారు. కానీ మన రాష్ట్రంలో, మన మహానగరం చుట్టూ విస్తరిస్తోన్న వ్యాపార సంస్కృతిలో పెట్టుబడి – ఫ్యూడలిజం కలగలిసి ఉన్నాయి. ఇక మరో తెలంగాణ సాయుధ పోరాటం వస్తే తప్ప ఈ నేలకు, నేలను నమ్ముకున్న శ్రమజీవులకు విముక్తిలేదు.

Advertisements

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:15 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: