Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి ప్రజల పోరుబాట

leave a comment »

సెజ్‌ల కోసం పంట భూములు గుంజుకొని, బిచ్చంగా రెండు రూపాయల బియ్యం ఇస్తున్న ప్రభుత్వ దుర్మార్గాన్ని, నిర్వాసితుల బాధల్ని వివరిస్తున్నారు గీతాంజలి

ఊర్లల్లో మూఢనమ్మకాలు, దారిద్య్రం, కరువు, వలసలు, ఆకలి కారణాలుగా మాస్‌ హిస్టీరియా (పూనకం) వస్తుంది. దాని వెనకాల ఉన్న పైన ఉదహరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు,వాటి పరిష్కారాల జోలికి పోకుండా ప్రభుత్వం ఊర్లల్లోకి ఆ అమాయకమైన ప్రజల దగ్గరికి సైకియాట్రిస్ట్‌లను, మెజిషియన్స్‌ను, కౌన్సిలర్స్‌ను పంపిస్తుంది. వాళ్లు కౌన్సిలింగు జిమ్మిక్కులు చేసి బాణామతి, చేతబడి, పూనకాలు అన్ని కూడా మూఢనమ్మకాలనీ, కొన్నేమో మానసిక వత్తిడివల్ల వచ్చిన సమస్యలని వివరించి మళ్లీ పట్నాల్లోకి తమ కార్పొరేట్‌ ఫైవ్‌స్టార్‌ హాస్పిటల్స్‌లో వచ్చి పడిపోతారు. ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.

అదే ప్రభుత్వం మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లిలో నలభై ఒక్కమంది రైతులు గుండెపోటు వచ్చి మరణిస్తే దాన్ని కనీసం ఒక తీవ్ర అనారోగ్యం కిందికి కూడా పరిగణించకుండా కనీసం ఒక్క కార్డియాలజిస్ట్‌ను కూడా అక్కడికి కారణాలేంటో పరిశోధించమని పంపియ్యలేదు. పైగా అవన్నీ బూటకపు ఇంకా సహజ మరణాలని, ఒక్కొక్కరికి ఏవో వ్యాధులు అంతకుముందే ఉన్నాయని, కొంతమంది ఏక్సిడెంట్స్‌లో చనిపోయారని బుకాయిస్తూ బూటకపు ప్రకటనలు చేసింది. నిజానికి పోలేపల్లికి డజన్లకొద్ది కార్డియాలజిస్టులను పంపించాలి.

ఇంతకీ ఆ పోలేపల్లి రైతులు గుండెపోటెందుకు తెచ్చుకున్నారు? రక్షణ బాధ్యత ఇవ్వాల్సిన ప్రభుత్వమే సామ్రాజ్యవాద దేశాలకు దళారీగా, మార్కెటింగు ఏజెంట్‌గా మారి వాళ్ల భూముల్ని దౌర్జన్యంగా గుంజుకొంది కాబట్టి. తద్వారా రాజ్యం పట్ల వారి విశ్వాసాన్ని, తమ జీవనాధారాన్ని, ఊరిలో తమ స్థానికతను కోల్పోయి నిర్వాసితులుగా మార్చబడ్డారు కాబట్టి. పోలేపల్లిలోకి పోయే ముందు సెజ్‌ల నేపథ్యం కొద్దిగా అర్థం చేస్కోవాలి.

ప్రత్యేక ఆర్థిక మండలాల పేరిట దేశవ్యాప్తంగా అభివృద్ధి ముసుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి, మైనారిటీల భూముల్ని గుంజుకొని బహుళజాతి కంపెనీలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల ఎకరాల సాగుభూమి దేశ విదేశీ కంపెనీల పరమైపోయింది. కొన్ని వేలమంది రైతులు నిర్వాసితులు అయిపోయారు. సాగులో ఉన్న పంటభూముల్ని, బోరుబావులు, నీటి వసతులు ఉన్న బహుళ పంటలు పండే రైతుల భూమిని ఒకే పంట పండే భూములని, బీడు భూములనే నెపంతో అసైన్డ్‌ పట్టా – డి ఫారమ్‌ భూముల్ని ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల ధర నిర్ణయించి తీసుకుపోతే ఆ ఇంత నష్టపరిహారం కూడ ఇవ్వమని బెదిరించి కుట్రపూరితంగా, బలవంతంగా గంజేస్కు ఇవ్వమని ఎదురు తిరుగుతున్న రైతుల్ని కొట్టి అన్యాయంగా జైళ్లలో పెడుతోంది ఈ ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా ఆరువందల సెజ్‌ల అమలు వేగంగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో రైతుల భూములు గుంజుకొని పరిశ్రమల నిర్మాణం కూడా మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో భూసేకరణ శరవేగంగా జరిగిపోతోంది. కమ్యూనిస్ట్‌ పార్టీ ముసుగు వేసుకున్న సి.పి.ఎం. ప్రభుత్వం సలీం కంపెనీ కోసం నందిగ్రాం లో భూసేకరణ పేరిట మరొక జలియన్‌వాలాబాగును సృష్టించింది.

నక్సల్బరీ ఉద్యమం ఒక విలువైన మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌ విప్లవ పంథాని భారతదేశ పీడిత ప్రజలకు అందిస్తే, నందిగ్రాంలో ఒక ఫాసిస్ట్‌ పంథాలో సి.పి.ఎం. రివిజనిజం నిజరూపాన్ని బయటపెట్టింది. సి.పి.ఎం. పార్టీ బహుళజాతి కంపెనీలకు, సంపన్న దేశాలకు తాను తన దేశంలో ఎంత బలమైనదో ఈ మారణకాండ ద్వారా నిరూపించ దల్చుకుంది. భారతదేశంలోని మిగతా రాజకీయ పార్టీలకంటే మిన్నగా, ఎక్కువగా వారికి, వారి పెట్టుబడులకు, దోపిడీకి హత్యలు చేసైనా సరే ఎర్రతీవాచీ పరుస్తామని ప్రకటించింది. అదే సి.పి.ఎం. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సెజ్‌లకు వ్యతిరేకంగా నినాదాలిస్తోంది. నిజానికి నందిగ్రాంలో ఒక గుజరాత్‌ జీనోసైడ్‌ లాంటిదే జరిగింది. భూమికోసం, భుక్తికోసం నిరంతరం శ్రమించే పేద, పీడిత రైతాంగం హత్యాకాండకు గురయ్యింది. సి.పి.ఎం. గూండాలు ఒక మిలిటరీ హంతక రూపాన్ని దాల్చి, దాడిని ఆపలేని నిస్సహాయతలో దేవుడే కాపాడాలన్న ఆశతో వేలకొద్దీ హిందూ, ముస్లిం ప్రజలు స్త్రీలు, పిల్లలు పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు దాడిచేసి పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసారు. స్త్రీలను టార్గెట్‌ చేసి లైంగిక అత్యాచారాలు చేసారు. పసిపిల్లల్ని నిలువునా చీల్చి చంపి హాల్దీనదిలో విసిరేసారు. వందలమంది ఆచూకి ఇప్పటికీ లేదు. గుజరాత్‌లో కంటే కూడా సరికొత్త హింసా ప్రయోగాలు చేసారు. ఇండోనేషియా దేశానికి చెందిన సలీం గ్రూప్‌ సెజ్‌ల కోసం భూములు ఇవ్వకపోతే వేరే రాష్ట్రం వెతుక్కుంటామని బెదిరించిన దానికి పర్యావసానమే ఈ హత్యాకాండ. ఆ సి.పి.ఎం. ప్రభుత్వాన్ని ఈ రోజు నందిగ్రాం, సింగూరు ప్రజలు ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తమ నిరసన తెలిపారు. అయినాకానీ బుద్ధదేవ్‌ భట్టాచార్య సెజ్‌లకోసం భూసేకరణను కొనసాగిస్తామనీ ఆపే ప్రసక్తే లేదని ప్రకటించారు.

మళ్ళా అవే కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో సెజ్‌లకు వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడకుండా, దళితుల కోసం భూసేకరణ ఉద్యమాన్ని ఎన్నికల ముందు మొదలుపెట్టాయి. సి.పి.ఎం. ఒక్కటేకాదు టి.డి.పి., కాంగ్రెస్‌, టి.ఆర్‌.ఎస్‌., బి.జె.పి. లాంటి పార్లమెంటరీ పార్టీలు అన్నీ కూడా సెజ్‌లకు తమ అనుకూల ధోరణినే ప్రకటిస్తున్నాయి. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద ధోరణులకు తగు అనుకూలతను ఎప్పటిలాగా కొనసాగిస్తుండడం ఒక సంప్రదాయం కూడ. ప్రపంచీకరణలో భాగంగా స్పెషల్‌ ఎక్స్‌పోర్ట్‌ జోన్స్‌ (ప్రత్యేక ఎగుమతుల మండలాలు) కాస్తా ప్రత్యేక ఆర్థిక మండలాల రూపం తీసుకొంది. చైనాలో ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న సెజ్‌లు ఏడు మాత్రమే. ఆ దేశంలో చూపిస్తున్న పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని చూసిన మురసోలి మారన్‌ మన దేశంలో వాటిని మొదలు పెట్టే పనికి నాంది పలికిన ఫలితమే ప్రస్తుత సెజ్‌ల ఉపధ్రవం. భారతదేశంలో సెజ్‌ల పేరుతో జరుగుతున్న భూకబ్జా వెనక పాలకులు, బడాకంపెనీల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుట్ర ఉంది. విదేశీ కంపెనీలకే భూమినిచ్చే పని అయితే వెనకబడ్డ ప్రాంతాల్లో సెజ్‌లు పెట్టాలి. కానీ, అన్నీ సెజ్‌లు అభివృద్ధి చెందిన పట్టణాల్లో అదీ నగరానికి 45-70 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడానికి కారణం కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఉద్దేశించి మాత్రమే. భూసేకరణ కేవలం పరిశ్రమలు, ఎగుమతుల కోసం మాత్రమే జరగడం లేదన్నది స్పష్టం.

సరిగ్గా హైదరాబాద్‌ నగరానికి 75 కిలోమీటర్ల దూరాన ఉన్న జడ్చర్ల మండలంలో నేషనల్‌ హైవేకి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదిరెడ్డిపల్లె, పోలేపల్లి, గుండ్లగడ్డ తాండాల్లో 1240 ఎకరాల్లో అసైన్డ్‌, పట్టా భూముల్ని ఆక్రమించుకొని ఎనభై ఎకరాలు అరబిందో ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీకి, డెబ్భై ఎకరాలు హెటిరో డ్రగ్సుకి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ప్రాస్టక్చరల్‌ కార్పొరేషన్‌ (ఎ.పి.ఐ.ఐ.సి.) ద్వారా ఆక్రమించుకుని కంపెనీలకు అమ్మేసుకొంది. ఆ ప్రాంతాల్లో దాదాపు అరవై ఫార్మా సెజ్‌లకు అనుమతి ఇచ్చింది.

అఖరికి అక్కడ శ్మశానవాటికలను కూడా ఆక్రమించుకొని ఎ.పి.ఐ.ఐ.సి. స్తంభాలను నాటింది. మొన్న రుక్కి అనే లంబాడా స్త్రీ గుండ్లగడ్డ తాండాకు చెందిన వృద్ధురాలు – ఎ.పి.ఐ.ఐ.సి. ద్వారా ఆరు ఎకరాల భూమిని కోల్పోయిన నిర్వాసితురాలు కుమిలిపోయి, గుండె ఆగి చనిపోతే శవాన్ని పాతిపెట్టడానికి శ్మశానం లేక ఒక రోజంతా గుడిసెలోనే శవాన్ని పెట్టుకున్నారు. సరిగ్గా ఉప ఎన్నికల ముందరి సందర్భంలో దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రైవేట్‌ భూమిని శ్మశానానికి గెలిపిస్తారన్న ఆశతో ఇచ్చాడు.

పోలేపల్లిలో మూడు వందల యాభై మంది దళితుల భూమి పోయిం తర్వాత ఏమయ్యింది? పోలేపల్లి ఎలా ఉంది? ఆ రైతులు ఏమయ్యారు? ఒక సునామీ తర్వాత, లేదా భూకంపం తర్వాత ప్రజలు భూమినీ, ఇంటినీ, బంధువుల్ని, అయినవాళ్లనీ కోల్పోయిన తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడిని, ఒక విభ్రాంతికి లోనవుతారు. దాన్నే పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిసార్డర్‌ (పి.టి.ఎస్‌.డి.) అంటారు. పోలేపల్లి రైతు ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉన్నారు. 2003 నుంచీ అప్పటి టి.డి.పి. ప్రభుత్వం గ్రీన్‌పార్క్‌ల పేరుతో మొదలుపెట్టిన భూసేకరణ, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004 నుంచీ సెజ్‌ల కోసం, 2005లో పార్లమెంట్‌లో కేవలం రెండు రోజులలో ఆమోదముద్ర వేసుకొన్న సెజ్‌ చట్టం వచ్చిన తర్వాత కూృరమైన పద్ధతుల్లో సెజ్‌ల కోసం భూసేకరణ మొదలుపెట్టింది.

పోలేపల్లి ప్రజలు అక్కడి టి.ఆర్‌.ఎస్‌. కార్యకర్త, గ్రామ ఉపసర్పంచ్‌ తమ్ముడు ఉపేందర్‌ రెడ్డి నాయకత్వంలో అనేకసార్లు కలెక్టరేట్‌ ముందు అరబిందో, హెటిరో ఫార్మా సెజ్‌ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు, అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేసి లాఠీదెబ్బలు తిని జైళ్లల్లో నిర్బంధింపబడ్డారు. స్త్రీలను జైళ్లలో, ఎక్కడంటే అక్కడ ముట్టుకొని పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. దాదాపు ఈ పోరు మూడు సంవత్సరాలుగా నిరవధికంగా నడిచింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీల వలన భూమి కోల్పోయిన నిర్వాసితులకు నౌఖరీల్లో చేరారు.

ఆరుగాలాలు పండించే పంట భూముల్ని లాక్కొని – రైతుల్ని బిచ్చగాళ్లుగా, దినసరి కూలీలుగా మార్చిన ప్రభుత్వం ఉదారంగా రెండు రూపాయల కిలో బియ్యాన్ని వారి మొఖాన కొడ్తూ అభివృద్ధి పథకం అని ఊదరగొడుతోంది. ‘మకళ్లాలల్ల వడ్లగింజల్ని గుంజుకొని మాకు బియ్యం గింజలు బిచ్చమేస్తాంది గీ బాడ్కవు సర్కారు. థూ!’ అని ఛిత్కరిస్తున్నారు పోలేపల్లి ప్రజలు.

భూమిని కబ్జా చేసేందుకు రైతులకు, వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు, రెండు వందల గజాల జాగాను వాదా చేసింది ప్రభుత్వం. అదీ దగా, పచ్చిమోసం. ఎందుకంటే సెజ్‌లో ఉద్యోగం ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కేవలం ఒక ప్రత్యేక విదేశీ భూభాగం కిందకి వచ్చే సెజ్‌ల యాజమాన్యానికే ఆ అధికారం ఉంటుంది. ప్రభుత్వం తనది కాని, తనకులేని అధికారాన్ని ఉన్నదిగా చూపించి రైతుల్ని భ్రమలకు, ఆశలకు లోనుచేసి మోసం చేసింది. దీన్ని మానవ హక్కుల కమిషన్‌ ఖండించి, కలెక్టర్‌కు నిర్వాసితుల పరిస్థితి ఏంటన్న నోటీస్‌ కూడా పంపింది. జైల్‌నుంచి విడుదల అయిన ఉపేందర్‌ రెడ్డి బ్రెయిన్‌ క్యాన్సర్‌తో కోమాలోకి వెళ్ళి చనిపోయినాడు. అదీ, మహిళా ఎస్‌.ఐ. నెడితే ఆయన తలకు దెబ్బ కూడా తగిలింది. విచిత్రంగా టి.ఆర్‌.ఎస్‌. అభ్యర్థి లక్ష్మారెడ్డి అరబిందో సెజ్‌ రావడానికి కారకుడైతే, టి.ఆర్‌.ఎస్‌. కార్యకర్త దానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు.

వచ్చిన 18 వేల రూపాయిల్లో (ఎకరానికి) అదికూడా ప్రభుత్వం రైతుకు ఇచ్చిన అసైన్డ్‌ భూమిని అభివృద్ధి చేసి సాగుయోగ్యంగా చేసినందుకు డెవెలప్‌మెంట్‌ ఛార్జెస్‌ కింద ఇచ్చిన సొమ్ము ఆర్‌.ఒ., ఎం.ఆర్‌.ఒ., కలెక్టర్‌, సర్పంచ్‌, పటేల్‌-పట్వారీ, పోలీస్‌ యంత్రాంగాలకు లంచాలుగా పోయాక మిగిలిన కొద్ది డబ్బు రైతు మొత్తం జీవితానికి భూమి ఇచ్చినంతగా శాశ్వత జీవనాధారంగా ఎలా మిగులుతుంది? రైతులేకాదు, రైతును నమ్ముకున్న రైతుకూలీలు, కౌలుదార్లు, ఎరువులు అమ్ముకునే వాళ్లు, చాకలి, మంగలి, గొర్రెలు మేపేవాళ్లు, యాదవులు, పశువులు కాసేవాళ్లు – ఇలా గ్రామంలో అంటే అన్ని కులాల వాళ్లు, వృత్తుల వాళ్లు నష్టపోయి వలసలు వెళ్లిపోయారు. ప్రభుత్వానికి రైతుల భూములేకాదు, వాళ్ల నివాస స్థలాలు కావాలి. పోలేపల్లి గ్రామంలో పవన్‌ పార్మాస్యూటికల్‌ కంపెనీ వెదజల్లే కాలుష్యంతో బర్రెలు, గొర్రెలు చనిపోయాయి. ఆసిడ్‌తో ఇద్దరు పిల్లల కండ్లు పోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. పోలేపల్లి గ్రామానికి ప్రాణధార వంటి ఉప నది పెదవాగు కూడా కాలుష్యమై చేపలు చచ్చి తేలుతున్నాయి. ఈ కంపెనీ ఇప్పుడు అరబిందో సెజ్‌లో కలిసిపోయింది. ఇప్పుడు ఈ మూడు కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో పోలేపల్లి ప్రజలు ఆరోగ్యం ఏమైపోవాలి? ఇత్తడి బిందెల్లో నీరు నింపిన కొద్ది సేపటికి బిందేలోపటి గోడలు నీలిరంగులో మారేంతగా నీరు కాలుష్యమైతున్నదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టరీల్లో కార్మికులుగా మారిన రైతులు అదే కష్టాన్ని తమ స్వంత భూముల్లో పడితే సంవత్సరానికి సరిపడే కంటే కూడా ఎక్కువ పంటను పండిస్తామని చెబుతున్నారు. ఆరుకాలాలు తమ స్వంత పొలాల్లో ఆముదాలు, కొర్రలు, వరి, కందులు, మినుములు, పత్తి లాంటి ఆయా కాలాల పంటలు పండించుకునే తమ భూముల్లోనే వెలసిన ఫ్యాక్టరీల్లో దినసరి కూలీలుగా మార్చేసిందీ ప్రభుత్వం.

ఒకప్పుడు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసి రైతులు సాధించుకొన్న హక్కులు, పెంచుకొన్న కూలీ రేట్లు అన్ని కోల్పోయి ఇప్పుడు ఈ నయా ఆధునిక భూస్వాముల కాళ్లమీద పడి ‘ఒక్కపూట పనిప్పియ్యి బాంచెన్‌’ అన్న కాడికే మళ్లీ పరిస్థితిని తీసుకువస్తున్నారు మన పాలకులు, విధానకర్తలు. తమ భూములకే హోమ్‌గార్డ్స్‌గా కాపలాకాస్తూ గుండెల్లో లావాలు మోస్తున్నారు పోలేపల్లి, ముదిరెడ్డిపల్లె యువకులు. ఏపుగా కోతకొచ్చిన పంటల్ని, చెలకల్లో మేస్తున్న పశువుల్ని పెట్రోలు పోసి కాల్చి భూమిని దోచుకున్న ప్రభుత్వం అదీ రైతు అభివృద్ధి ప్రణాళికలో భాగమేనని చెబుతోంది.

సెజ్‌ల తర్వాత పోలేపల్లిలో కుటుంబాలూ – సామాజిక సంబంధాల్లో వచ్చిన మార్పులు చూస్తే – రాజ్యహింస భూ నిర్వాసితులు మీద, తద్వారా స్త్రీలపైన పితృస్వామిక హింసతో పాటు అదనంగా పెరిగిన కుటుంబ హింస, సామాజిక హింసా దోపిడీలు ఎలా రూపం తీసుకుంటాయో అన్నది స్పష్టంగా కనపడుతోంది. గుండ్లగడ్డ తాండా పోలేపల్లిలో సెజ్‌ల తర్వాత దాదాపు నలభై ఒక్కమంది రైతులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై తర్వాత గుండెపోటు వచ్చి చనిపోయారు. కొంతమంది అవమానం భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు.

వాళ్ల పిల్లలు చాలామంది అదృశ్యమైపోయారు. చాలామంది భర్తలు చనిపోయిన స్త్రీలు పిల్లలతో సహా బతుకుదెరువుకై నగరాలకు వలసలు పోయారు. చాలామంది అల్లుళ్లు భార్యల్ని కట్నంగా ఇచ్చిన భూమి పోయిందని పుట్టిళ్లల్లో వదిలేసారు. కుదిరిన ఆడపిల్లల పెళ్లిశ్లు ఆగిపోయాయి. మగపిల్లలు చదువులు ఆపి మేస్త్రీలుగా, ఫ్యాక్టరీల్లో కూలీలుగా, హోటల్స్‌లో సర్వర్స్‌గా కుదిరారు. అప్పులు తీర్చడానికి స్త్రీలు-పురుషులు ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ కూలీలుగా వలసలు పోయారు. చాలామంది అరబిందో-హెటిరో ఫార్మా సెజ్‌లలో దినసరి కూలీలుగా మారారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అయిపోయిన తర్వాత వాళ్ల గతి అధోగతే.

కంపెనీలలో ఇంక వీళ్ల అవసరం ఉండదు. ఐ.టి. ప్రొఫెషనల్స్‌, ఫార్మాసిస్ట్స్‌, డాక్టర్స్‌ – లాంటి వాళ్లే కావాలి. పోలేపల్లిలో పదవ తరగతి పాస్‌ కాని యువతనే ఎక్కువ. వాళ్లకు కూలీపని లేదా హోమ్‌గార్డ్స్‌ పని ఇస్తారు. అది అణిగిమణిగి ఉంటేనే. అది కాంట్రాక్ట్‌ పద్ధతిలో. ఆ మినహాయింపు సెజ్‌ చట్టానికి ఉంది.

కొడుకులు లేని వృద్ధస్త్రీలు-పురుషులు జడ్చర్ల టవున్‌లో బస్‌స్టాపుల్లో, హోటళ్ల ముందు బిచ్చమడుక్కుంటున్నారు. కట్నం ఇంకా తెమ్మని స్త్రీలపైన భర్తల, అత్తమామల హింస ఇంకా ఎక్కువైంది. సర్కారు బళ్లకు వెళ్లే చిన్నారి పిల్లలు టవున్లలో బాలకార్మికులుగా మారిపోయారు. ఇది పాలకులు సెజ్‌ల ద్వారా సాధించిన గ్రామీణ అభివృద్ధి.

ఇక ఫార్మా ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పనిచేస్తున్న పోలేపల్లి రైతాంగం పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉంది. వీళ్లకి మనరాష్ట్ర కార్మిక చట్టాలు ఏవీ వర్తించవు. సెజ్‌ చట్టాలే వర్తిస్తాయి. సెజ్‌ చట్టం తన కంపెనీలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికునికి ఏ ఒక్క హక్కుని గుర్తించదు, గౌరవించదు, ఆమోదించదు. ఆఖరికి కార్మికుడు పని చేసే క్రమంలో కంపెనీలో చనిపోయినా సరే, కార్మికురాలిపై లైంగిక అత్యాచారం జరిగినా సరే, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఆ నయా విదేశీ సంస్థానాల్లో పర్మిషన్‌ తీసుకొని వాళ్లు అనుమతిస్తేనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అంత కౄరంగా ఉన్నాయి సెజ్‌ చట్టాలు. పోలేపల్లి ఫార్మా సెజ్‌లలో కార్మికులకు వర్క్‌ పర్మిట్‌ కార్డ్‌ – వీళ్ల భూమి పోయింది, వీళ్లకు కూలీ ఇవ్వండి అని కలెక్టర్‌ దగ్గర్నించి తీసుకురావాలి. ఉదయం తొమ్మిదికల్లా నాలుగు కిలోమీటర్లు నడిచి కంపెనీకి రావాలి. ఒక్క నిముషం లేటైనా హోంగార్డ్స్‌తో గెంటిస్తారు. పనిముట్లు వాళ్లే తెచ్చుకోవాలి. తాగటానికి నీళ్లు కార్మికులే తెచ్చుకోవాలి. గుంటూరు-ఒరిస్సా-కేరళ నుంచి కూలీలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకువచ్చి స్థానిక స్త్రీలకు, కార్మికులకు పోటీగా తెచ్చి వాళ్లలో అభధ్రతను నింపుతారు. ఎందుకు వాళ్లనకు తెచ్చుకొన్నారు అంటే చేస్తే చెయ్యండి, లేకపోతే లేదంటారు. పోలీసులను పిలుస్తామంటారు. ఎదిరించిన వారిని భయ పెట్టడానికి మనిషంత ఎత్తు కుక్కల్ని కాపలా పెట్టారు. చాలాసార్లు కార్మికులనకు బూతు మాటలు తిట్టడం, వలస కార్మికుల్ని బూటు కాళ్లతో తన్నడం చేస్తుంటారు. ముక్తావర్‌ అనే ఒరిస్సా కార్మికుడు యాజమాన్యం కొడితే రక్తాలు కారిన గాయాలను ప్రెస్‌ వాళ్లకు చూపించాడు.

కూలీ చేయించుకొని జీతం కూడా ఎగ్గొడుతున్నారు. పైసలు ఇవ్వటానికి రోజులు రోజు తిప్పించుకుంటారు. పనివేళలు 8-12 గంటలు. అదనపు జీతం కూడా ఇవ్వరు. వారానికి 4-5 రోజుల పని మాత్రమే ఉంటుంది. స్త్రీలను బూతు మాటలు, తిట్లతో లైంగిక వేధింపులకు గురిచేస్తారు.

ఈ కార్మికులకు ఐక్యమై పోరాటం చేసే, ప్రశ్నించి హక్కుల్ని సాధించుకునే వెసులుబాటు కూడా లేదు. ఇష్టంలేని వారిని వెంటనే పని లోంచి తీసేసే అధికారం సెజ్‌ల చట్టంలో ఉంది. పోలేపల్లి ఫార్మా సెజ్‌లలో ఇక బానిసల రాజ్యం కొనసాగుతోంది. పని భద్రత లేక నిత్యం అభద్రతలో అక్కడి రైతు కార్మికులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే వారు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూనే ఉన్నా రైతుల నుంచి కార్మికులుగా – కూలీలుగా – బానిసలుగా మారినా పోరుబాట వీడలేదు. తమకు మద్దతు ఇస్తున్న ప్రజాసంఘాలతో కల్సి ప్రజాస్వామిక పోరాటాన్ని చేస్తూనే, రాజకీయ పోరాట పంథాని ఎంచుకుని ఉప ఎన్నికల్లో భూ నిర్వాసితులైన తప్పెట మొగులయ్య, ఎట్టి శ్రీనివాసులు, బుచ్చంగాలి శీనయ్య, దేపల్లి యాదయ్య, కందూరు నరసయ్య, ఎట్టి చినఎంకయ్య, ఊసేని సత్తెమ్మ, మాల జంగిలమ్మ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి తమ భూముల్ని దోచుకున్న రాజకీయ పార్టీలతో తలపడి ఎనిమిది వేల ఓట్లు సాధించారు. ఇది తమనకు బిచ్చగాళ్లుగా మల్చిన రాజకీయ నాయకులపైన తమ నిరసన అని – ఓట్లు చీల్చి ప్రధాన రాజకీయ పార్టీలను ఓడించడమే తమ ధ్యేయమనీ, తమకు జరిగిన అన్యాయాన్ని లోకానికి తెలపడమే ఈ ఎన్నికల్లో పాల్గొనే వ్యూహం వెనకాల ఉద్దేశ్యాలనీ వారు చెప్పారు. పెరిగిన ఆత్మవిశ్వాసంతో, గుంజుకున్న భూమికి – భూమే నష్టపరిహారంగా కాదు జీవనాధారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.

మళ్లీ మళ్లీ ఎం.ఆర్‌.ఒ. ఆఫీస్‌ ముందు, కలెక్టర్‌ ముందు సెజ్‌ చట్టాన్ని ఎత్తేయేలనీ, అక్కడి ఫార్మా సెజ్‌లను కూలగొట్టాలనీ అడపాదడపా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. సెజ్‌లు తమ జీవితాన్ని ఎంత పెను విషాదంలో ముంచాయో ప్రపంచానికి చెబుతూనే ఉన్నారు. భూ విస్తీరణ చట్టాన్ని కూడా ఎత్తేసి దేవాదాయ, వక్ఫ్‌ భూములు అంటే దేవుడి భూములు, శ్మశాన దిబ్బెలు కూడా కబ్జా చేస్తూ దాన్నొక రాష్ట్ర ఆదాయ మార్గంగా చూపిస్తున్నారు- ఈ భూ బేహారులు.

Advertisements

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:12 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: