Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ప్రజాజీవితాన్ని నాశనం చేస్తున్న సెజ్‌లు

leave a comment »

సెజ్‌ల వలన సాగుభూమి, తాగునీరు, సాగునీరు, పర్యావరణాలను రైతులు నష్టపోతున్నారని, మొత్తంగా ఇదొక సామాజిక విధ్వంసం అని అంటున్నారు పి.వి. రమణ

దేశంలో ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వటం, పారిశ్రామికీకరణ ద్వారా కోట్లాది ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యాలుగా పార్లమెంట్‌ లో 23 జూన్‌ 2005న ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం (సెజ్‌) అమలులోకి తెచ్చింది మన ప్రభుత్వం. నిజానికి వ్యవసాయాన్ని దెబ్బ తీయడం, బడా పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి కంపెనీలకు సేవ చేయటమనే సామ్రాజ్యవాద విధానలలో భాగమే ఈ సెజ్‌ల ఏర్పాటని ఆచరణలో మనకు అర్థం అయింది. ‘సెజ్‌’ల చట్టం అమలులోకి వచ్చి కేవలం మూడు సంవత్సరాలు దాటకుండానే జరిగిన వనరుల విధ్వంసం, పర్యావరణ నాశనం, ఆహార అభద్రత లాంటి సమస్యల్ని చూస్తుంటే ప్రఖ్యాత చరిత్రకారుడు సుమిత్‌ సర్కార్‌ ‘సెజ్‌ల పేరిట ఆధునిక చరిత్రలో అతి పెద్ద భూ ఆక్రమణకు దారితీయబోతోంది’ అని చెప్పిన మాట అక్షరాల రుజువయింది. అలాగే ఆర్థిక శాస్త్రవేత్త అమిత్‌ బాధురి ‘అభివృద్ధి తీవ్రవాదం’గా గుర్తించిన ఈ విధానాలు భవిష్యత్‌లో మరెంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో గ్రహించవచ్చు.

గత జనవరి 4న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన వీరప్ప మొయిలీ ‘సెజ్‌ల కన్న ముందే ఎక్సుక్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఇఇజెడ్‌) లు 1965లలో ప్రారంభమై, ఒక్క కాండ్లాలో తప్ప మిగిలినవన్నీ తమ లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. సెజ్‌ల వల్ల సంపద అంతా కొద్ది మందికే చెందే పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిఘా లేకపోతే సెజ్‌లు పూర్తి రియల్‌ ఎస్టేట్‌లుగా మారిపోయి ప్రజల్ని తీరని కష్టాలకు గురిచేస్తాయి’ అని హెచ్చరించటం, అలాగే జనవరి 22న ఆర్థికమంత్రి చిదంబరం, మంత్రుల గ్రూప్‌ సమావేశంలో ‘సెజ్‌లకు నేను వ్యతిరేకం కాదు, కాని అజాగ్రత్తగా అమలు చేస్తే చాలా ప్రమాదం ఉంది. ఆర్థిక శాఖకు వీటిపై అనేక అభ్యంతరా లున్నాయి. భారతదేశంలో రైతుకు, భూమికి పవిత్రబంధం ఉంది. దాన్ని తొలగించాలనుకున్నప్పుడు చాల జాగ్రత్త అవసరం. దాన్ని తేలికగా తీసుకొంటే పొరపాటే. అదొక మైన్‌ఫీల్డ్‌’ అని ఆనాడు అనటం ప్రమాదాన్ని గుర్తించనట్లే కనబడుతుంది గానీ, చట్టం అమలులో వేగం చూస్తుంటే ఆ అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని రుజువయిపోయింది. ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా ప్రకారమే ‘సెజ్‌ల మొత్తం పెట్టుబడి 3,60,000 కోట్ల రూపాయలైతే, టాక్స్‌లు, డ్యూటీలు మినహాయింపుల వలన, ప్రభుత్వానికి 1,74,000 కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం వస్తుందని’ చెప్పినా లెక్కచెయ్యకుండా బడా పెట్టుబడిదార్లకు, బహుళజాతి కంపెనీ లకు లాభాలు చేకూర్చటానికి పాలకులు ఎంత తొందరపడుతున్నారో మనకు తెలుస్తుంది.

బహుళజాతి కంపెనీల చేతుల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

సెజ్‌ల కోసం అధికంగా అన్ని సదుపాయాలు గల ప్రధాన నగరాల చుట్టూ ఉన్న భూముల కోసమే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, డిమాండ్‌ చేస్తున్నారంటే కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే.

‘అసోచామ్‌’ రిపోర్ట్‌ ప్రకారం ‘నేటికి 130 సెజ్‌లకు కేటాయించిన భూమిలో యాభై శాతం పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ కోసమే’, అక్టోబర్‌ 2006 నాటికి సెజ్‌ల అనుమతి పొందిన వాటిలో అరవై శాతం రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల వారివే.

బహుళజాతి సంస్థ ‘మెర్రిక్‌లించ్‌’ అంచనా ప్రకారం ‘భారతదేశంలో 2005లో 12 బిలియన్‌ డాలర్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అవకాశాలుండగా, 2015 నాటికి 90 బిలియన్‌ డాలర్లకు పెరుగు తుంది’, ‘ఆసియాలోకల్లా భారతదేశంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఎక్కువ అనుకూల పరిస్థితులున్నాయ’ని గోల్డెన్‌ ఫాక్స్‌ ఆసియా రియల్‌ ఎస్టేట్‌ అధిపతి మైఖేల్‌ స్మిత్‌ అన్నాడు. కేవలం విదేశీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు 2.7 బిలియన్‌ డాలర్లు భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా జె.పి. మోర్గన్‌, ‘నైట్‌ఫ్రాంక్‌’ లాంటి బడా విదేశీ బహుళజాతి కంపెనీలు మరో నాలుగు బిలియన్‌ డాలర్లు పెట్టుబడికి సిద్ధమవుతున్నాయి. ‘అసోచామ్‌’ రిపోర్ట్‌ ప్రకారమే భారత్‌కు వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో (ఎఫ్‌.డి.ఐ.) 2003లో 2.7 బిలియన్‌ డాలర్లుంటే అందులో రియల్‌ ఎస్టేట్‌ శాతం 4.5 మాత్రమే. 2006 నాటికి 8 బిలియన్‌ డాలర్లు మొత్తం పెట్టుబడులలో 26 శాతానికి పెరిగిపోయింది.

భారత్‌లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ‘యూనిటెక్‌’ గత సంవత్సరం చివరి భాగంలో 452 కోట్ల రూపాయల లాభం గడించింది. అంతకు ముందు సంవత్సరం కేవలం పదుమూడు కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 31.90 శాతం లాభం పెరిగిందన్నమాట. దాంతో వారి షేర్ల విలువ విపరీతంగా పెరిగిపోయి మార్చ్‌ 2004 నాటి నుండి డిసెంబర్‌ 2006 మధ్య 324 కోట్ల రూపాయల నుండి 37,894 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే 11,561 శాతం అన్నమాట.

గుజరాత్‌లో మోడి ప్రభుత్వం అదోని గ్రూప్‌ కంపెనీకి ముంద్రాపోర్ట్‌ సెజ్‌ కోసం చదరపు గజం యాభై పైసలకు అమ్మింది. ఆ కంపెనీ దాన్ని చదరపు గజం 1200 రూపాయల చొప్పున అమ్ముకుంది. ఈ విధంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే భూమిని కేవలం ఎనిమిది కోట్ల రూపాయలకు పొందగలిగారు.

రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ‘పార్శ్వనాథ్‌’ చైర్మన్‌ ప్రదీప్‌ జైన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, ఇండోర్‌, గుర్‌గాఁవ్‌, డెహ్రాడూన్‌, నాందేడ్‌లలో సెజ్‌ పనులు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం 7.6 కోట్ల చదరపు అడుగుల నుండి 20.9 కోట్ల చదరపు అడుగుల భూమి వారి స్వాధీనంలో ఉంది.

పంటపొలాల ఆక్రమణ

ఇప్పటికే ప్రపంచీకరణ విధానాల ఫలితంగా వ్యవసాయ భూమి చాలా తగ్గిపోయింది. మొత్తం దేశంలో 46 శాతం వ్యవసాయ భూమి ఉండగా 1990-2003 మధ్య పదమూడు సంవత్సరాలలో 1.5 శాతం తగ్గిపోయింది. చూస్తే చాలా తక్కువశాతం కింద కనబడుతుంది, కాని ఆ భూమి 21 లక్షల హెక్టార్లు. ఇక సెజ్‌ల కోసం బంగారు పంటలు పండే పంట భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవటంతో వ్యవసాయ భూమి మరింత కుంచించుకుపోయి దేశ ఆహార భద్రతకే పెద్ద ప్రమాదంగా మారింది.

అత్యధిక వ్యవసాయ భూమి కలిగి ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సెజ్‌లకోసం కేటాయించిన భూమిలో డెబ్భై శాతం ఈ రాష్ట్రాలదే. దేశ ఆహార అవసరాలు తీరుస్తున్న రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌లలో కూడా వేలాది ఎకరాల పంట భూముల్ని సెజ్‌ల కోసం కేటాయిస్తున్నారు.

విశాఖ జిల్లా అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో మెగా కెమికల్‌ కాంప్లెక్స్‌ల కోసం పది వేల ఎకరాలు, నక్కపల్లిలో ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలేపల్లి, చిత్తూరు జిల్లాలో సత్యవేడు, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లా అక్కంపేట, మాంబట్టు, కండ్రీగ గ్రామాలలో వేలాది ఎకరాల భూమిని సెజ్‌లకు కేటాయించారు. వీటిలో అత్యధిక భాగం పంట భూములే.

కేరళలో 1980లో పది లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంటే నేడు 3.5 లక్షల హెక్టార్లకు పడిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 1991 నుండి 2001 వరకు పది సంవత్సరాల్లో 33 వేల ఎకరాల వ్యవసాయం తగ్గిపోయింది. దేశంలో బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఎమ్మార్‌, ఎం.జి.ఎఫ్‌. ల చేతికి నాలుగు వేల హెక్టార్లు, డి.ఎల్‌.ఎఫ్‌. కంపెనీకి 3500 హెక్టార్లు ధారాదత్తం చేయబడింది.

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఇరవై అయిదు మండలాల్లో తొంభై వేల హెక్టార్ల భూమి గత అయిదు సంవత్సరాలలో వ్యవసాయం నుండి ఇతర అవసరాలకు మార్పు చెందింది. పురాణాలలో హిరణ్యాక్షుడు భూమి అంతా చాపలాగ చుట్టినాడని కథలు విన్నాం గాని నేడు మన కళ్లెదుటే సామ్రాజ్యవాద అనుకూల శక్తుల చేతుల్లోకి మొత్తం భూమంతా ప్రభుత్వమే ధారపోయడం వలన ఎంత సామాజిక విధ్వంసం జరగబోతుందో ఊహించగలం.

నీటి కొరత ప్రమాదం

లక్షలాది ఎకరాల భూముల్ని సెజ్‌ల కోసం కేటాయించి, వాటి నీటి అవసరాలు తీర్చటమే ప్రధానంగా మారడంతో, దేశంలో వ్యవసాయానికి, అలాగే ప్రజల తాగునీటి అవసరాలకు తీరని కొరత ఏర్పడుతుంది.

వ్యవసాయ భూముల అవసరాలు తీరుస్తున్న భూమిలో ఉన్న నీటినే కాకుండా, అనేక నదులు, రిజర్వాయర్లు, సెజ్‌ల అవసరాల కోసం కేటాయించడంతో మరింత నీటి కొరత ఏర్పడే ప్రమాదం ముంచుకువస్తోంది.

మన రాష్ట్రంలో ‘వైట్‌ ఫీల్డ్‌ పేపర్‌ మిల్స్‌’ కోసం గోదావరి నదికి అయిదు కిలోమీటర్ల దూరంలో కేటాయించిన సెజ్‌ కోసం రోజుకు 100 మిలియన్‌ లీటర్ల నీటి వాడకానికి ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. గుజరాత్‌లో అదోని గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ముంద్రా పోర్ట్‌ సెజ్‌ కోసం రోజుకు ఆరు మిలియన్‌ లీటర్ల నీటిని నర్మదా నది నుండి తీసుకోవటానికి అనుమతినిచ్చారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ‘ఫాబ్‌ సిటీ సెజ్‌’ కోసం ఏకంగా ఒక పైపు లైన్‌ వేసి దాని ద్వారా రోజుకు ఇరవై మిలియన్‌ లీటర్ల వరకు నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల వలన 19 నదులు, వాటిపై నిర్మితమైన 27 సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లకు నష్టం కలిగే పరిస్థితి దాపురించింది. విజయనగరం జిల్లా, ఎస్‌.కోట మండలంలోని బోడవార గ్రామంలో జిందాల్‌ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న అల్యూమినా రిఫైనరీ కోసం, రైవాడ రిజర్వాయర్‌ నుంచి రోజుకు 33,600 క్యూబిక్‌ మీటర్ల నీటిని పైపులైను ద్వారా సరఫరా చేసేందుకు అంగీకరించారు. రైవాడ రిజర్వాయర్‌ నీటిని ఆరు వేల ఎకరాల వ్యవసాయ భూములకు ఇస్తామని గతంలో వాగ్దానాలు చేసి, ప్రస్తుతం సాగునీటి అవసరాలతో పాటు గతంలో విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్న రైవాడ నుంచి జిందాల్‌ కంపెనీకి నీరు ఇస్తే, విశాఖ ప్రజలకు మంచినీటి కోసం అలమటించే ప్రమాద పరిస్థితి ఎదుర్కోవాలి.

విశాఖ జిల్లాలో మాకవరపాలెంలోని రస్‌ అల్‌ ఖైమా అనే కంపెనీయే ఏర్పాటు చేయనున్న మరో అల్యూమినా రిఫైనరీకి నీరు సరఫరా జరిగితే ఆ ప్రాంతానికి సాగు, తాగునీటిని అందిస్తున్న గోస్తనీ నది అదృశ్యమయిపోయే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కోస్టల్‌ కారిడార్‌లో రసాయన పరిశ్రమలు, పోర్ట్‌లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జి.ఒ. 34 విడుదల చేసింది. ఈ పరిశ్రమల్లో దాదాపు డెబ్భై శాతం ప్రైవేట్‌ వారిదే. కేవలం నాలుగు జిల్లాలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో దీనికోసం 1.5 లక్షల ఎకరాల భూమిని సేకరిస్తారు. దీనికోసం ఏలేరు ఎడమ కాలవనుంచి రోజుకు 385 మిలియన్‌ లీటర్లు, సామర్లకోట కాలువ నుంచి 1848 ప్యూబిక్‌ లీటర్లు గోదావరి నుండి 100 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేస్తారు.

ఈ విధంగా సెజ్‌ల అవసరాలే ప్రధానంగా అమలు చేయటం వలన భవిష్యత్‌లో భయంకరమైన సాగు, తాగు నీటి సమస్య ఏర్పడే ప్రమాదం కనపడుతోంది.

సెజ్‌ల దోపిడీతో చిన్నాభిన్నమైన ప్రజల జీవితాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో ‘పోలేపల్లి’ వద్ద రైతులు సాగు చేసుకొనే భూమిని ఔషధరంగ సెజ్‌ కు కేటాయించారు. భూములు కోల్పోయిన రైతుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టారు. పనుల్లేక, రైతులంతా కూలి పనులకోసం తిరుగుతూ మలమలమాడిపోతున్నారు.

చిత్తూరు జిల్లా సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలలో పన్నెండు వేల ఎకరాల వ్యవసాయ భూమిని సెజ్‌ల కోసం కేటాయించారు. సర్వేలు జరిపి గ్రామానికి ఒకరు చొప్పున సెక్యూరిటీ గార్డును నియమించారు. రైతులెవ్వరు సర్వే జరిగిన భూముల్లో దిగి వ్యవసాయం చేయకుండా చూడాలి. చుట్టపక్కల గ్రామ పొలాల్లో పచ్చదనంతో ఎదుగుతుంటే సెజ్‌ ప్రాంతపు పొలాలు పాడుబడిపోయి ఉన్నాయి. వారిచ్చిన కొద్దిపాటి నష్టపరిహారం ఖర్చయిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. పనులు దొరకక మలమల మాడుతున్నారు.

నెల్లూరు జిల్లా తడ మండలంలో అక్కంపేట, పెద్ద మాంబట్టు, చినమాంబట్టు, కండ్రిగ గ్రామాల్లో వెయ్యి ఎకరాలు చైనా కు చెందిన అపాచీ కంపెనీ సెజ్‌కు కేటాయించారు. పంటపొలాలు పాడుబడి పోవడంతో, పశువులు, గొర్రెల మేతకు గడ్డిలేక, వాటిని పెంచలేక అమ్మేసుకొంటున్నారు. రైతులు దీనంగా బతుకులు వెళ్లదీస్తున్నరు.

తొమ్మిది జిల్లాల సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం ప్రారంభమైతే తీరప్రాంత మత్స్యకారుల జీవితాలు నాశనమైపోతాయి. వీరంతా సముద్రం వేటపై బతుకుతున్న వారే. కేవలం విశాఖ జిల్లాలోనే తీరప్రాంతంపై ఆధారపడిన మత్స్యకారులు ఎనభై వేలు ఉన్నారు.

ఇంకా సెజ్‌ల భస్మాసుర హస్తం పడిన చోటల్లా రైతులు, పట్టణ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్ర సమస్యలకు గురవుతున్నారు. రైతులు కూలీలయిపోయారు. చేతివృత్తులు చేసుకొని బతికే వారికి జీవనాధారం పోయింది. పనులు దొరకటం లేదు. ఎంతో ఆత్మాభిమానం తో కష్టపడి బతికినవారికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

సెజ్‌ల దోపిడీని ఎదుర్కొంటున్న ప్రజలు

రాజస్థాన్‌లో ఆల్సార్‌ జిల్లాలో ఆరు వేల హెక్టార్ల భూమిని ఓ మాక్సి సెజ్‌ కు కేటాయించడంతో ఆ ప్రాంత ప్రజలు జనాధికార యాత్ర పేరుతో నిరసన ప్రదర్శనలు జరిపి ఉరేగింపులలో ‘అరె అరె దొంగలు వచ్చారు. సెజ్‌లు తెచ్చారు, తరమండివారిని’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

ముంబయి శివార్లలో రిలయన్స్‌ కంపెనీకి 35 వేల ఎకరాలు కేటాయించారు. అందులో అత్యధిక భాగం రియల్‌ ఎస్టేట్‌ కోసమే. అక్కడ 30 వేల మంది రైతులు నిరసన ప్రదర్శన జరిపి ‘మేం విధర్భా రైతుల్లాగా ఆత్మహత్యలు చేసుకోదల్చుకోలేదు. మేం రైతులం. భూమికోసం ప్రాణాలైనా అర్పిస్తాం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన చరిత్ర మాకుంది’ అని హెచ్చరిస్తున్నారు. రాయ్‌గడ్‌లో మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్‌ అరుణ్‌ శివకర్‌ ‘ఈ భూమి మాకు తరతరాల నుండి రక్షణ కల్పిస్తోంది. అలాంటి దాన్ని అమ్మేయమంటున్నారు. అందుకు మేము ఒక కార్యక్రమాన్ని తీసుకొన్నాం. మేము 35 వేలమందిమి ఉన్నాం. ఒక్కొక్కరి దగ్గర ఒక్క రూపాయి వసూలు చేసి 35 వేల రూపాయలకు ఒక చెక్‌ తీసుకొని, కంపెనీ అధిపతులకు పంపిస్తూ, ”మీరు మా తల్లిలాంటి భూమిని అమ్మమంటున్నారు. మేము మీ తల్లిగారినే కొనాలనుకుంటున్నాం. ఈ చెక్‌ తీసుకొని మీ తల్లి గారిని మాకు అమ్మండి’ అని అడుగుతున్నామని, భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోను వదలబోమని చెప్పారు.

కర్ణాటక రాష్ట్రంలో 36 గ్రామాలలో సెజ్‌ల కోసం 12 వేల ఎకరాలు కేటాయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ నందగుడి ‘రైతు హిత్‌కారిణి సమితి’ ఆధ్వర్యంలో తీవ్రమైన నిరసన ప్రదర్శనలు జరిపారు. మంగుళుర్‌లో రెండు వేల ఎకరాల్లో ఏర్పాటైన సెజ్‌ను వ్యతిరేకిస్తూ నాలుగు గ్రామాల ప్రజలు ‘కృషి భూమి సంరక్షణ వేదిక’ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌, నందిగ్రాంలో కెమికల్‌ ఫ్యాక్టరీ సెజ్‌ కోసం 22 వేల ఎకరాల పంట భూములను కేటాయించారు. ప్రజలు నిరసనలు తెలుపుతుంటే పోలీసులు కాల్పులు జరిపి 14 మందిని బలి తీసుకొన్నారు. అయినా బెదరకుండా ప్రాణాలైనా అర్పిస్తాం, మా భూమిని మాత్రం వదులుకోం – అని ఉద్యమించి ప్రభుత్వం సెజ్‌ను రద్దు చేసుకోనేటట్లు చేసారు. సెజ్‌ల వ్యతిరేక పోరాటంలో భారత ప్రజలందరికీ మార్గదర్శకం అయ్యారు.

తొమ్మిది లక్షల జనాభా ఉంటే, పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేసి గోవాలో 15 సెజ్‌ల కోసం 1500 ఎకరాలు కేటాయించారు. అందులో ఫార్మా పార్క్‌ నిర్మాణ పనులు ప్రారంభమై దాదాపు అయిదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. సెజ్‌లను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఐక్యంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు, పనులు ఆపటం, హెచ్చరికల తర్వాత కంపెనీల యంత్రాలు, సిబ్బంది వాహనాలు ధ్వంసం చేసారు. పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు, ‘గోవా బచావో ఆందోళన్‌’తో పాటు, ఎన్‌.సి.పి., బి.జె.పి., శివసేన లాంటి రాజకీయ పార్టీలను కూడా కలుపుకొనే ‘సెజ్‌లు మాకొద్దు’ అంటూ ‘గోవా మూవ్‌మెంట్‌ ఎగెనిస్ట్‌ సెజ్‌’ల ఆధ్వర్యంలో ఉద్యమించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు పర్యాటకులు గోవాలో అడుగుపెట్టకూడదని, అప్పటికే ఉన్న పర్యాటకులు డిసెంబర్‌ 28 లోపున గోవా వదిలిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. దానితో టూరిజం మీదే ప్రధానంగా ఆధారపడ్డ గోవా ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్‌ 31న 15 సెజ్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. ప్రజా ఉద్యమం ద్వారా మొత్తం సెజ్‌లను రద్దు చేయించిన ఘనత గోవా ప్రజలదే.

విశాఖజిల్లా మాకవరపాలెంలో జిందాల్‌ అల్యూమినా రిఫైనరీ కోసం 1300 ఎకరాలు కేటాయించారు. దీనికి వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజలు తీవ్ర పోరాటం కొనసాగిస్తున్నారు. కొత్త అడ్డతీగల వద్ద సెప్టెంబర్‌ 30న యూనివర్సల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ వారు సర్వేకోసం రాగా వారిపై గిరిజన మహిళలు దాడిచేసి, వారి యంత్రసామాగ్రిని, వాహానాల్ని ధ్వంసం చేసి తమ నిరసన తెలిపారు.

విజయనగరం జిల్లా, ఎస్‌.కోట మండలంలో బొడ్డవార గ్రామంలో జిందాల్‌ అల్యూమినా రిఫైనరీ కోసం 1048 ఎకరాలు కేటాయించారు. జాయింట్‌ కలెక్టర్‌ స్వయంగా హాజరయిన గ్రామసభలో గ్రామస్తులందరూ ఏకకంఠంతో తమ భూముల్ని అప్పచెప్పమని చెప్పారు. దానితో ఆయనే 98 శాతం ప్రజలు సెజ్‌ను వ్యతిరేకిస్తున్నారని ప్రకటించవలసి వచ్చింది. అంత జరిగినా, ఇంకా బలవంతాన భూముల్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు ఐక్యంగా ఎదుర్కొంటున్నారు.

ఒరిస్సా, కళింగనగర్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌లో టాటాలకు స్టీల్‌ ప్లాంట్‌ కోసం 2500 ఎకరాలు కేటాయించారు. వారు పనులు ప్రారంభించినపుడు వేలాది గిరిజనులు ‘బిస్తాపన్‌ బిరోధీ జనమంచ్‌’ ఆధ్వర్యంలో ఉద్యమించగా పోలీసుల కాల్పుల్లో 2 జనవరి 2007న పన్నెండు మంది గిరిజనులు అమరులయ్యారు. అదే ప్రాంతంలో కొరియా కంపెనీ పొహాంగు స్టీల్‌ కంపెనీ (పోస్కో)కి ఇనుప ఖనిజాన్ని తవ్వి, తమ దేశానికి తీసుకువెళ్లటానికి పన్నెండు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌కు 4500 ఎకరాలు కేటాయించారు. ఆ ప్రాంత రైతులు, గిరిజనులు, పదమూడు మందిని కాదు, పదమూడు వేల మందిని చంపినా మా భూముల్ని వదలం అంటూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. సంవత్సరం పైన కళింగనగర్‌ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి, వాహనాల రాకపోకలు బంద్‌ చేసారు. దీనివలన ప్రైవేట్‌ కంపెనీలకు నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తమ ప్రాంతంలోకి అనుమతి లేకుండా వచ్చిన నలుగురు పోస్కో కంపెనీ అధికారుల్ని ‘పోస్కో ప్రతిరోధ్‌ సంగ్రామ్‌ సమితి’ నిర్బంధించి, చివరకు జగజిత్‌సింగు పూర్‌ పరిపాలనా అధికార్లు నుంచి రాతపూర్వకంగా వారి ప్రాంతంలోకి అనుమతి లేకుండారాము అని తీసుకొన్న తర్వాతే వారిని వదిలారు.

ఒరిస్సా, కోరాపుట్‌ జిల్లాలలో దియోమాలి ప్రాంతంలో మైనింగు ప్రాజెక్ట్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీకి భూమిని కేటాయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ పది వేలమంది గిరిజనులు ఏప్రిల్‌ 19న సిమిలిగుడ బ్లాక్‌, అప్పరక్రాంతి గ్రామం వద్ద తమ సంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, బాణాలతో నిరసన ప్రారంభించారు. ‘లోక్‌శక్తి అభిజాన్‌’ ఆధ్వర్యంలో ‘ఒక్క అంగుళం భూమి కూడా ప్రాజెక్ట్‌కు ఇవ్వం’ అని పోరాటానికి సిద్ధమవుతున్నారు.

పై విషయాలు గమనిస్తే సామ్రాజ్యవాదులకు తలవంచి, మన పాలకులు సెజ్‌ల విధానం ద్వారా మన దేశ ప్రజల్ని మరింత బానిసత్వంలోకి తోసేయబోతున్నారని మనకు అర్థం అవుతోంది. బాధితులైన రైతులు, గిరిజనులు, మత్స్యకారులు, పట్టణ ప్రాంత ప్రజలు సెజ్‌లకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని కార్మిక, ఉద్యోగ మిత్రులందరూ సమర్థించటంతో పాటు వాటిలో పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisements

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:04 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: