Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

రాష్ట్రంలో రెండు సెజ్‌ల కథ

leave a comment »

ప్రజా ప్రయోజనాల్ని కాలరాచి, ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్‌ల ముసుగులో చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గురించి చెబుతున్నారు కొణతం దిలీప్‌

ఒకటేమో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం పొందిన పోలేపల్లి సెజ్‌, మరొకటి ఎవరికీ తెలియని జార్జియా టెక్‌ విజ్ఞాన సిటీ సెజ్‌. బయటి నుండి చూస్తే ఈ రెండిటి మధ్యా పెద్దగా పోలికలు లేవు. అయితే రెండిట్లోనూ మనకు కొట్టొచ్చినట్టు కనపడేవి మాత్రం అవినీతి, అంతులేని దోపిడీ. ఈ రెండు సెజ్‌ల కథ తెలుసుకుంటే చాలు అసలు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎవరి అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టబడ్డాయో చాలా తేలికగా అర్థం అవుతుంది. ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్‌ల ముసుగులో చేస్తున్న అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారపు అసలు రంగు ఈ రెండు సెజ్‌ల కథలు మనకు చెపుతాయి.

పోలేపల్లి సెజ్‌ దుర్మార్గం

స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణాల్లో ఒకటి పోలేపల్లి సెజ్‌ పేరిట జరుగుతున్న బాగోతం. గత కొంతకాలంగా ఈ సెజ్‌ బాధిత గ్రామం పత్రికల్లో పతాక శీర్షికలకెక్కుతోంది. మొన్న జరిగిన ఉపఎన్నికల్లో 14 మంది పోలేపల్లి సెజ్‌ బాధితులు పోటీచేశారు. దీంతో ఆ అంశం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గత నాలుగేళ్లలో సెజ్‌ బాధిత రైతులు అనేకమంది బలవన్మరణం పాలవటం ఇక్కడి పరిస్థితి తీవ్రత తెలియజేస్తోంది. గత నాలుగేళ్లుగా రాజుకుంటూ వస్తున్న పోలేపల్లి రైతుల ఉద్యమం ఇప్పుడిప్పుడే తారాస్థాయికి చేరుకుంటోంది. అనేక ప్రజా సంఘాలు పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాయి. అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు ఈ రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగుదేశం మొదలుకొని బిజెపి వరకూ కాంగ్రెస్‌ మొదలుకొని తెరాస వరకూ అన్నీ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులూ పోలేపల్లి ప్రజలకు అన్యాయమే చేశారు. ప్రజలను తప్పుదోవపట్టించి వారి పొట్టగొట్టారు.

ఈ కథ మొదలైంది 2003 చివరి నాళ్లలో. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న జడ్చర్ల వద్ద ఒక ‘ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ కారిడార్‌’ నెలకొల్పాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పోలేపల్లి, ముదినేపల్లి, గుండ్లగడ్డ తాండా గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి ఎకరాల భూసేకరణ జరపడానికి నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది. భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఎ.పి.ఐ.ఐ.సి) కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు ఏడు కోట్ల రూపాయల నిధులు కూడా పొందింది. 2004లో ఈ భూముల్లో కాన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సి.ఐ.ఐ.) గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ వారి సహకారంతో ఒక ‘గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌’ నెలకొల్పుతామని ఎ.పి.ఐ.ఐ.సి. ప్రకటించింది.

నిరక్షరాస్యులైన రైతులను బెదిరించి, వారికి అబద్ధాలు చెప్పి, బలవంతంగా నామమాత్రపు నష్టపరిహారానికి స్థానిక ప్రభుత్వాధికారులు భూమిని సేకరించారు. లంచాలు పోగా రైతులకు ఎకరానికి పదహారు వేల రూపాయల నష్టపరిహారం దక్కింది. ఈ భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులంతా దళితులు, గిరిజనులే కావటం గమనార్హం. ఇలా సేకరించిన భూమిలో మూడు వందల ఎకరాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం 2005లో ఫార్మా సెజ్‌ నెలకొల్పేందుకు కేటాయించింది. రైతుల వద్ద కారు చౌకగా కొట్టేసిన ఈ భూములనే ఇప్పుడు ఎ.పి.ఐ.ఐ.సి. సెజ్‌ యాజమాన్యం కలిసి వంద రెట్లు ఎక్కువ ధరలకు అమ్ము కుంటున్నారు. భూములు కోల్పోయిన రైతుల్లో అనేకులు ఇప్పుడు తమ భూముల్లోనే నిర్మాణం అవుతున్న సెజ్‌లో కూలీలుగా మారారు. రేపోమాపో నిర్మాణ పనులు పూర్తయితే వారికి ఆ మాత్రం ఆసరా కూడా దొరకదు.

తమ నోటికాడి కూడును లాగేసుకుని ఏర్పాటవుతున్న సెజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం అమలు చేస్తోంది. వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తోంది. ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ కారిడార్‌ పేరిట కేంద్ర ప్రభుత్వ నిధులు పొంగి తద్వారా సేకరించిన భూములను ప్రత్యేక ఆర్థిక మండలాలకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని ఈ ఏడాది కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్షింతలు వేసింది. వెయ్యి ఎకరాలు సేకరించిన ప్రభుత్వం నాలుగేళ్ల తరువాత కూడా అందులో మూడోవంతు కూడా వినియోగించుకోలేదు. ఇలా అవసరం లేకున్నా నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల భూములు లాక్కొని వాటిని హెచ్చు ధరలకు అమ్ముకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. ప్రభుత్వం సేకరించి వినియోగించకుండా ఉన్న ఏడువందల పై చిలుకు ఎకరాల భూములను వెంటనే రైతులకు తిరిగి అప్పజెప్పాలని, ఇక్కడి నుండి ఫార్మా సెజ్‌ను వెంటనే ఎత్తివేయాలని, పోలేపల్లి సెజ్‌ వ్యవహారం బడుగుల పొట్టగొట్టి బడాబాబుల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నామేనని అర్థమవుతుంది. ప్రజలను బెదిరించి వారి భూములను నామమాత్రపు ధరలకు బలవంతంగా లాక్కొని, తిరిగి వాటినే బడా పారిశ్రామికవేత్తల మద్దతుతో ఎక్కువ ధరలకు అమ్ముకునే స్థితికి మన ప్రభుత్వాలు దిగజారాయి. అరవై ఏళ్ల స్వతంత్రం మనల్ని ఇంత ‘అభివృద్ధి’ చేసింది. ఈ గడ్డపై ఎవరి ‘అభివృద్ధి’ కోసం ఎవరు త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది పోలేపల్లి సెజ్‌.

జార్జియా టెక్‌ భూ కుంభకోణం

రాష్ట్రంలో జరుగుతున్న సెజ్‌ బాగోతాల్లో విలక్షణమైనది జార్జియా టెక్‌ వారి విజ్ఞాన్‌ సిటీ సెజ్‌ వ్యవహారం. మొదలు యూనివర్సిటీ పెట్టుకుంటామని వచ్చిన సంస్థకు మనవాళ్లె సెజ్‌ పెట్టుకోమని సలహా ఇస్తారు. అటుపై యూనివర్సిటీకి దేశీయ ‘భాగస్వాములను’ వెతికి పెడతారు. చివరికి పద్నాలుగు ఎకరాల్లో పెట్టే యూనివర్సిటీకి 250 ఎకరాల విలువైన భూమిని పళ్లెంలో పెట్టి ప్రేమతో బహుకరిస్తారు. ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని మనం నమ్మి తీరాల్సిందే. ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల్లో అవినీతి జరగడం పాత కథ. ప్రభుత్వ పెద్దలే ప్రైవేట్‌ కంపెనీలకు కొత్త కొత్త ప్రాజెక్ట్‌ల ఆలోచనలు సూచించి మరీ సొమ్ము చేసుకోవడం కొత్త పోకడ. జార్జియా టెక్‌ సెజ్‌ రానున్న రోజుల్లో ఈ రంగంలో జరిగే మరిన్ని మార్పులకు సూచిక. ఇప్పటిదాక సెజ్‌ అంటే అదేదో ఎగుమతుల పరిశ్రమలకు సంబంధించిన వ్యవహారం అనుకునే వారు. ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయానికి సెజ్‌ కేటాయించడం ద్వారా విద్యను కూడా ‘ఎగుమతి చేయగల సరుకు’గానే మన ప్రభుత్వాలు భావిస్తున్నాయని మనకు అర్థమవుతోంది. విశ్వవిద్యాలయం లాభాపేక్షలేని సంస్థ అనే నెపంతో తక్కువ ధరలకు వందల ఎకరాల భూములను కేటాయిస్తుంది మన ప్రభుత్వం. అయితే పద్నాలుగు ఎకరాల్లో వచ్చే విశ్వవిద్యాలయానికి లాభాపేక్ష లేకపోవచ్చు. కానీ పక్కనే 2436 ఎకరాల్లో వస్తున్న సెజ్‌కు లాభాపేక్ష లేకుండా పోదుకదా.

అమెరికాలో పేరొందిన యూనివర్సిటీ అయిన జార్జియా టెక్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఒక శాఖను నెలకొల్పాలనుకుంది. ఇందుకోసం ఇటీవలనే మన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ శివార్లలో శ్రీశైలం హైవే పై 250 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే యాభై ఎకరాలు చాలు అన్న జార్జియా టెక్‌కు మొదలు ఇరవై ఎకరాలు ఇచ్చి, ఆ తరువాత దాన్ని డెబ్భై ఎకరాలకు పెంచి, చివరికి 250 ఎకరాలు ఇవ్వడమే ఒక వింత అయితే ఎకరానికి బహిరంగ మార్కెట్లో కోటి రూపాయలు పలుకుతున్న భూమిని కేవలం లక్షన్నర రూపాయలకే కేటాయించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సిఫారసు చేయడం, ఆఘమేఘాల మీద రెవెన్యూ శాఖ సదరు యూనివర్సిటీకి ఆ భూమిని కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. జార్జియా టెక్‌ యూనివర్సిటీకి భూమి కేటాయించడం వెనుక భారీ కుంభకోణమే నడిచినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కథ యావత్తూ ముఖ్యమంత్రికి తెలిసే జరిగినట్టూ కీలక ఆధారాలు ఉన్నాయి. అసలు ఈ భూమి కేటాయింపు వ్యవహారం మొదటి నుంచీ పరిశీలిస్తే అనేక దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి. 225 కోట్ల రూపాయల భూమిని కేవలం మూడు కోట్ల డెబ్భై అయిదు లక్షలకు కేటాయించి ప్రభుత్వంలోని పెద్దలు ఆ యూనివర్సిటీపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. అభివృద్ధి అనే ముసుగు వెనుక ప్రభుత్వ ఆస్తులు బడాబాబుల చేతిలోకి ఎంత అలవోకగా కారుచౌకగా నడిచివెళ్తున్నాయో తెలుసుకోవడానికి జార్జియా టెక్‌ యూనివర్సిటీ ఉదంతం ఒక చక్కని ఉదాహరణ కాగలదు.

హైదరాబాద్‌లో శాఖను పెట్టాలనే ఉద్దేశ్యంతో వచ్చిన విదేశీ యూనివర్సిటీ సంస్థకు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఎస్‌.ఇ.జెడ్‌. స్థాపించి అందులో యూనివర్సిటీ పెట్టుకోమని సలహా ఇచ్చారు ప్రభుత్వంలోని పెద్దలు. అంతే కాదు కారుచౌక రేటుకు 250 ఎకరాలు కూడా కేటాయించేశారు. లాభాపేక్ష లేకుండా ఉండాల్సిన విద్యాసంస్థలను ఎస్‌.ఇ.జెడ్‌. పేరిట పక్కా వ్యాపారంగా మార్చేసే కొత్త దోపిడీ దారిని కనిపెట్టారు కొందరు దళారులు, ప్రభుత్వ పెద్దలు.

పరిశ్రమలను ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో సెజ్‌ చట్టం తెచ్చామని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. అయితే సెజ్‌ చట్టం చివరికి కొత్త జమీందారీ వ్యవస్థ అవుతుందని, కొద్ది మంది బడా బాబులకు భూ దోపిడీ చేయడానికి ఇదొక ఉపరకణంలా మారుతోందని ప్రజలు ఈపాటికే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.

ఇప్పుడు ఏకంగా లాభాపేక్షలేని యూనివర్సిటీలకు కూడా సెజ్‌లు కేటాయించడం మొదలు పెట్టి విద్యను కూడా వ్యాపారం చేశారు. హైదరాబాద్‌లో క్యాంపస్‌ పెడుతామని వచ్చిన జార్జియా టెక్‌ యూనివర్సిటీ మొదలు భూమి ఉచితంగా కావాలని అడిగింది. అటు తరువాత తమది లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి తమదగ్గర క్యాంపస్‌ పెట్టడానికి డబ్బులు లేవని, ఆసక్తిగల దాతల కోసం వెతుకుతున్నామని చెప్పింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కొందరు పెద్దలు ఇదొక బ్రహ్మాండమైన వ్యాపారావకాశంగా భావించారు. మీకు పెట్టుబడి పెట్టే వ్యాపార భాగస్వాములను వెతికి పెడ్తామని భరోసా ఇచ్చారు. ఒక విదేశీ కన్సల్టెంట్‌ను పట్టుకుని ‘విజ్ఞాన్‌ సిటీ’ అనే ఒక ఈస్టమన్‌ కలర్‌ స్వప్నం లాంటి ప్రాజెక్ట్‌ను రచించారు. ఒకవైపు యూనివర్సిటీ, ఇంకొక వైపు స్టార్‌ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, పరిశోధనాలయాలు, అపార్ట్‌మెంట్లు… ఇలా రెండు వందల యాభై ఎకరాలకు సరిపోయే కథను అల్లారు. పెద్దలు ఫైళ్లు చకచకా నడిపించారు. భూ కేటాయింపు నిర్ణయం జరిగిపోయాక సాక్షాత్తూ ముఖ్యమంత్రినే ఒప్పించి వందల కోట్ల రూపాయల భూమిని చిల్లర డబ్బులకు కొట్టేశారు.

విద్యావ్యాప్తి, ఉపాధి కల్పన సాకుతో కారుచౌకగా విలువైన భూమిని కొట్టేయడానికి ప్రైవేట్‌ సంస్థలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఆడుతున్న తాజా బాగోతం ఇది.

జార్జియా టెక్‌ భూమి కేటాయింపు కథలో మనకు అన్నిటి కన్నా ముందు కొట్టొచ్చినట్టు కనపడేది రోజులు గడుస్తున్నకొద్దీ యూనివర్సిటీపై ప్రభుత్వానికి ప్రేమ పెరిగిపోయి ఆ సంస్థకు కేటాయించే భూమి పరిమాణం పెరుగుతూ పోవడం. ఒకసారి ఆ వింత చూడండి.

  • 7 ఏప్రిల్‌ 2007 : జార్జియా టెక్‌ ప్రభుత్వానికి పంపిన ముసాయిదా ఎం.ఒ.యు.లో తమకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద యాభై ఎకరాలు కావాలని కోరింది.
  • 5 జూన్‌ 2007 : ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్‌ జరిపిన సమీక్షా సమావేశంలో జార్జియా టెక్‌ యూనివర్సిటీకి హైదరాబాద్‌లో ఇరవై ఎకరాలు, విశాఖపట్నంలో డెబ్భై ఎకరాలు ఇవ్వాలని తీర్మానించింది. జార్జియా టెక్‌ ఎప్పుడూ తమకు వైజాగులో భూమి కావాలని కోరలేదు.
  • 8 జూన్‌ 2007 : ముఖ్యమంత్రి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఉషారాణి తదితరులు పాల్గొన్న సమావేశంలో కొత్తూర్‌ మండలం మామిడిపల్లిలోని సర్వే నెం. 292లో జార్జియా టెక్‌ యూనివర్సిటీకి డెబ్భై ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు.
  • 21 సెప్టెంబర్‌ 2007 : తమను ఎస్‌.ఇ.జెడ్‌. పెట్టుకోమని ప్రధానమంత్రి కార్యాలయం వాళ్లు, కేంద్ర వాణిజ్యశాఖ వర్గాలు సలహా ఇచ్చాయని కాబట్టి ఎస్‌.ఇ.జెడ్‌. పెట్టుకోవడానికి రెండు వందల యాభై ఎకరాలు కేటాయించాలని కోరుతూ జార్జియా టెక్‌ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.
  • 12 నవంబర్‌ 2007 : మరొక లేఖలో తమకు కేటాయించే భూమి హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చర్ల ఐ.టి. పార్క్‌లో ఇవ్వాలని జార్జియా టెక్‌ ప్రతినిధులు కోరారు.
  • 23 డిసెంబర్‌ 2007 : యూనివర్సిటీకి ముచ్చర్ల ఐ.టి. పార్క్‌లో రెండు వందల యాభై ఎకరాలు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
  • 29 ఫిబ్రవరి 2008 : ప్రభుత్వ భూముల అమ్మకానికి ధరలు నిర్ణయించే సాధికారిక (ఎంపవర్డ్‌) కమిటీ ఎకరానికి 18 లక్షల రూపాయల చొప్పున జార్జియా టెక్‌కు ఇవ్వాలని సిఫారసు చేసింది.
  • 15 మార్చ్‌ 2008 : బిట్స్‌ పిలాని వారికి హైదరాబాద్‌ శివార్లలో యూనివర్సిటీ పెట్టుకోవడానికి భూమి కేటాయించినప్పుడు లక్షన్నరకే ఎకరం ఇచ్చాం కనుక ఇప్పుడు కూడా లక్షన్నరకే ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తమకు భూమి రేటులో రాయితీ ఇవ్వాలని జార్జియా టెక్‌ ఏనాడూ అడగకపోవడం ఇక్కడ గమనార్హం.
  • 27 మార్చ్‌ 2008 : జార్జియా టెక్‌ యూనివర్సిటీకి ముచ్చర్ల ఐ.టి. పార్క్‌లో రెండు వందల యాభై ఎకరాల భూమి ఎకరం లక్షా యాభై వేలకు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ జి.ఒ. 553 జారీ చేసింది.

పేదోళ్లను కొట్టి….

ముచ్చర్ల ఐ.టి. పార్క్‌లో ఇప్పుడు జార్జియా టెక్‌ యూనివర్సిటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన స్థలం మొదలు నాలుగో తరగతి ఉద్యోగులకు, గవర్నమెంట్‌ డ్రైవర్లకు ఇళ్ల స్థలాల కొరకు కేటాయించాలను కున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఈ విదేశీ యూనివర్సిటీకి ఇచ్చేశారు. మన బడుగుల ఆశలపై నీళ్లు చల్లి బడాబాబుల జేబులు నింపడానికే ఈ ప్రభుత్వం ‘కృషి’ చేస్తున్నదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

ఇక జార్జియా టెక్‌ విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయం స్థాపన అనుమతిస్తూ ఒక కొత్త చట్టమే తీసుకురావడం ఈ కథలో కొసమెరుపు.

Advertisements

Written by dilkibaatein

July 1, 2008 at 2:07 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: