Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

రాష్ట్రంలో రెండు సెజ్ ల కథ

with 2 comments

కొణతం దిలీప్

(వీక్షణం సామాజిక రాజకీయార్థిక పత్రిక జులై ఎడిషన్ లో ప్రచురితం)

ఒకటేమో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం పొందిన పోలేపల్లి సెజ్, మరొకటి ఎవరికీ తెలియని జార్జియా టెక్ విజ్ఞాన్ సిటీ సెజ్. బయటినుండి చూస్తే ఈ రెండిటి మధ్యా పెద్దగా పోలికలు లేవు. అయితే రెండిట్లోనూ మనకు కొట్టొచ్చినట్టు కనపడేవి మాత్రం అవినీతి, అంతులేనీ దోపిడీ. ఈ రెండు సెజ్ ల కథ తెలుసుకుంటే చాలు అసలు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎవరి అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టబడ్డాయో చాలా తేలికగా అర్థం అవుతుంది.  ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్ ల ముసుగులో చేస్తున్న అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారపు అసలు రంగు ఈ రెండు సెజ్ ల కథలు మనకు చెపుతాయి. 


 
 పోలేపల్లి సెజ్ దుర్మార్గం

స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణాల్లో ఒకటి పోలేపల్లి సెజ్ పేరిట జరుగుతున్న బాగోతం.  గత కొంత కాలంగా ఈ సెజ్ బాధిత గ్రామం పత్రికల్లో పతాక శీర్షికలకెక్కుతోంది. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో 14 మంది పోలేపల్లి సెజ్ బాధితులు పోటీ చేశారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. గత నాలుగేళ్లలో సెజ్ బాధిత రైతులు అనేకమంది బలవన్మరణం పాలవటం ఇక్కడి పరిస్థితి తీవ్రత తెలియజేస్తుంది. నాలుగేళ్లుగా రాజుకుంటూ వస్తున్న పోలేపల్లి రైతుల ఉద్యమం ఇప్పుడిప్పుడే తారాస్థాయికి చేరుకుంటోంది. అనేక ప్రజా సంఘాలు పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాయి, అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు ఈ రైతులు ఆందోళనకు మద్ధతు పలుకుతున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు దేశం మొదలుకొని బీజేపీ వరకూ, కాంగ్రెస్ మొదలుకొని తెరాస వరకూ అన్నీ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులూ పోలేపల్లి ప్రజలకు అన్యాయమే చేశారు. ప్రజలను తప్పుదోవపట్టించి వారి పొట్టగొట్టారు.  

ఈ కథ మొదలైంది 2003 చివరి నాళ్లలో. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న జడ్చర్ల వద్ద ఒక “ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్” నెలకొల్పాలని అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకొరకు పోలేపల్లి, ముదినేపల్లి, గుండ్లగడ్డ తాండా గ్రామాలకు చెందిన దాదాపు 1000 ఎకరాల భూ సేకరణ జరపడానికి నోటిఫికేషన్ కూడా జారీచేసింది. భూ సేకరణ కొరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక వసతుల సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి) కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు ఏడు కోట్ల రూపాయల నిధులు కూడా పొందింది. 

2004లో ఈ భూముల్లో కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సి.ఐ.ఐ) గ్రీన్ బిజినెస్ సెంటర్ వారి సహకారంతో ఒక “గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్” నెలకొల్పుతామని ప్రకటించింది ఏ.పి.ఐ.ఐ.సి .

నిరక్షరాస్యులైన రైతులను బెదిరించి, వారికి అబద్ధాలు చెప్పి, బలవంతంగా నామమాత్రపు నష్ట పరిహారానికి భూమిని సేకరించారు స్థానిక ప్రభుత్వాధికారులు. లంచాలు పోగా రైతులకు ఎకరానికి 16 వేలరూపాయల నష్టపరిహారం దక్కింది. ఈ భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులంతా దళితులు, గిరిజనులే కావడం గమనార్హం.

ఇలా సేకరించిన భూమిలో 300 ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఫార్మా సెజ్ నెలకొల్పేందుకు కేటాయించింది. రైతుల వద్ద కారు చౌకగా కొట్టేసిన ఈ భూములనే ఇప్పుడు ఎ.పి.ఐ.ఐ.సి, సెజ్ యాజమాన్యం కలిసి ఇప్పుడు వంద రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. భూములు కోల్పోయిన రైతుల్లో అనేకులు ఇప్పుడు తమ భూముల్లోనే నిర్మాణం అవుతున్న సెజ్ లో కూలీలుగా మారారు. రేపోమాపో నిర్మాణ పనులు పూర్తయితే వారికి ఆ మాత్రం ఆసరా కూడా దొరకదు.

తమ నోటికాడి కూడును లాగేసుకుని ఏర్పాటవుతున్న సెజ్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం అమలు చేస్తోంది. వారి పై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తోంది.

ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ పేరిట కేంద్ర ప్రభుత్వ నిధులు పొంది తద్వారా సేకరించిన భూములను ప్రత్యేక ఆర్ధిక మండలికి కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని ఈ సంవత్సరపు కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది.
 
1000 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం నాలుగేళ్ల తరువాత కూడా అందులో మూడోవంతు కూడా వినియోగించుకోలేదు. ఇలా అవసరంలేకున్నా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల భూములు లాక్కొని వాటిని హెచ్చు ధరలకు అమ్ముకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. ప్రభుత్వం సేకరించి వినియోగించకుండా ఉన్న 700 పై చిలుకు ఎకరాల భూములను వెంటనే రైతులకు తిరిగి అప్పజెప్పాలని, ఇక్కడినుండి ఫార్మా సెజ్ ను ఎత్తివేయాలనే ఉద్యమానికి ప్రజాస్వ్యామ్యవాదులంతా దన్నుగా నిలవాలి.
 
పోలేపల్లి సెజ్ వ్యవహారం బడుగుల పొట్టగొట్టి బడాబాబుల కడుపునింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి నిలువెత్తు ఉదాహరణ. ప్రజలను బెదిరించి వారి భూములను నామమాత్రపు ధరలకు బలవంతంగా లాక్కొని, తిరిగి వాటినే బడా పారిశ్రామికవేత్తల మద్ధతుతో ఎక్కువ ధరలకు అమ్ముకునే స్థితికి మన ప్రభుత్వాలు దిగజారాయి. అరవై ఏళ్ల స్వతంత్రం మనల్ని ఇంత “అభివృద్ధి” చేసింది. ఈ గడ్డపై ఎవరి “అభివృద్ధి” కొరకు ఎవరు త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది పోలేపల్లి సెజ్.  


 
జార్జియా టెక్ భూకుంభకోణం
 
రాష్ట్రంలో జరుగుతున్న సెజ్ బాగోతాల్లో విలక్షణమైనది జార్జియా టెక్ వారి విజ్ఞాన్ సిటీ సెజ్ వ్యవహారం. మొదలు యూనివర్సిటీ పెట్టుకుంటామని వచ్చిన సంస్థకు మనవాళ్లే సెజ్ పెట్టుకోమని సలహా ఇస్తారు. అటుపై యూనివర్సిటీకి దేశీయ “భాగస్వాములను” వెతికి పెడతారు. చివరికి 14 ఎకరాల్లో పెట్టే యూనివర్సిటీకి 250 ఎకరాల విలువైన భూమిని పళ్లెంలో పెట్టి ప్రేమతో బహూకరిస్తారు. ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కొరకేనని మనం నమ్మి తీరాల్సిందే. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అవినీతి జరగడం పాత కథ. ప్రభుత్వ పెద్దలే ప్రైవేటు కంపెనీలకు కొత్త కొత్త ప్రాజెక్టుల అలోచనలు సూచించి మరీ సొమ్ము చేసుకోవడం కొత్త పోకడ. జార్జియా టెక్ సెజ్ రానున్న రోజుల్లో ఈ రంగంలో జరిగే మరిన్ని మార్పులకు సూచిక. ఇప్పటిదాక సెజ్ అంటే అదేదో ఎగుమతుల పరిశ్రమలకు సంబంధించి వ్యవహారం అనుకునేవారు. ఇప్పుడు ఒక విశ్వ విద్యాలయానికి సెజ్ కేటాయించడం ద్వారా విద్యను కూడా “ఎగుమతి చేయగల సరుకు”గానే మన ప్రభుత్వాలు భావిస్తున్నాయని మనకు అర్థమవుతుంది. విశ్వవిద్యాలయం లాభాపేక్షలేని సంస్థ అనే నెపంతో తక్కువ ధరలకు వందల ఎకరాల భూములు కేటాయిస్తుంది మన ప్రభుత్వం. అయితే 14 ఎకరాల్లో వచ్చే విశ్వవిద్యాలయానికి లాభాపేక్ష లేకపోవచ్చు కానీ పక్కనే 236 ఎకరాల్లో వస్తున్న సెజ్ కు లాభాపేక్ష లేకుండా పోదు కదా.
 
అమెరికాలో పేరొందిన యూనివర్సిటీ అయిన జార్జియా టెక్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఒక శాఖను నెలకొల్పాలనుకుంది. ఇందుకొరకు ఇటీవలనే మన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో శ్రీశైలం హైవే పై 250 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే యాభై ఎకరాలు చాలు అన్న జార్జియా టెక్ కు మొదలు 20 ఎకరాలు ఇచ్చి ఆ తరువాత దాన్ని డెబ్భై ఎకరాలకు పెంచి చివరికి 250 ఎకరాలు ఇవ్వడమే ఒక వింత అయితే ఎకరానికి బహిరంగ మార్కెట్లో కోటి రూపాయలు పలుకుతున్న భూమిని కేవలం లక్షన్నర రూపాయలకే కేటాయించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సిఫారసు చేయడం. ఆఘమేఘాల మీద రెవెన్యూ శాఖ సదరు యూనివర్సిటీకి ఆ భూమిని కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. జార్జియా టెక్ యూనివర్సిటీకి భూమి కేటాయించడం వెనుక భారీ కుంభకోణమే నడిచినట్టు అనుమానాలు కలుగుతున్నాయి, ఈ కథ యావత్తూ ముఖ్యమంత్రికి తెలిసే జరిగినట్టూ కీలక ఆధారాలు ఉన్నాయి. అసలు ఈ భూమి కేటాయింపు వ్యవహారం మొదటి నుంచీ పరిశీలిస్తే అనేక దిగ్బ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి. 225 కోట్ల రూపాయల భూమిని ముష్టి మూడుకోట్ల డెబ్భై అయిదు లక్షలకు కేటాయించి ఆ యూనివర్సిటీ పై తమకున్న ప్రేమను చాటుకున్నారు ప్రభుత్వంలోని పెద్దలు.  అభివృద్ధి అనే ముసుగు వెనుక ప్రభుత్వ ఆస్తులు బడాబాబుల చేతిలోకి ఎంత అలవోకగా కారు చౌకగా నడిచివెళ్తున్నాయో తెలుసుకోవడానికి జార్జియా టెక్ యూనివర్సిటీ ఉదంతం ఒక చక్కని ఉదాహరణ కాగలదు.
 
పరిశ్రమలను ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో సెజ్ చట్టం తెచ్చామని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది. అయితే సెజ్ చట్టం చివరికి కొత్త జమీందారీ వ్యవస్థ అవుతుందని. కొద్ది మంది బడా బాబులకు భూ దోపిడీ చేయడానికి ఇదొక ఉపకరణంలా మారుతుందని ప్రజలు ఈపాటికే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.

జార్జియా టెక్ యూనివర్సిటీ మొదలు భూమి ఉచితంగా కావాలని అడిగింది. అటు తరువాత తమది లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి తమదగ్గర క్యాంపస్ పెట్టడానికి డబ్బులు లేవని, ఆసక్తిగల దాతల కొరకు వెతుకుతున్నామని చెప్పింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కొందరు పెద్దలు ఇదొక బ్రహ్మాండమైన వ్యాపారావకాశంగా భావించారు. మీకు పెట్టుబడి పెట్టే వ్యాపార భాగస్వాములను వెతికి పెడ్తామని భరోసా ఇచ్చారు. ఒక విదేశీ కన్సల్టెంటును పట్టుకుని “విజ్ఞాన్ సిటీ” అనే ఒక ఈస్టమన్ కలర్ స్వప్నంలాంటి ప్రాజెక్టును రచించారు. ఒక వైపు యూనివర్సిటీ, ఇంకొక వైపు స్టార్ హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు, పరిశోధనాలయాలు, అపార్ట్ మెంట్లు….ఇలా 250 యాభై ఎకరాలు సరిపోయే కథను అల్లారు. పెద్దలు ఫైళ్ళు చకచకా నడిపించారు. భూమిని కేటాయింపు నిర్ణయం జరిగిపోయాక సాక్షాతూ ముఖ్యమంత్రినే ఒప్పించి వందల కోట్ల రూపాయల భూమిని చిల్లర డబ్బులకు కొట్టేశారు. 
     
విద్యా వ్యాప్తి, ఉపాధి కల్పన సాకుతో కారు చౌకగా విలువైన భూమిని కొట్టేయడానికి ప్రైవేటు సంస్థలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఆడుతున్న తాజా బాగోతం ఇది.

జార్జియా టెక్ భూమి కేటాయింపు కథలో మనకు అన్నిటి కన్నా ముందు కొట్టొచ్చినట్టు కనపడేది రోజులు గడుస్తున్న కొద్దీ యూనివర్సిటీపై ప్రభుత్వానికి ప్రేమ పెరిగిపోయి ఆ సంస్థకు కేటాయించే భూమి పరిమాణం పెరుగుతూ పోవడం. ఒకసారి ఆ వింత చూడండి:

ఏప్రిల్ 7, 2007: జార్జియా టెక్ ప్రభుత్వానికి పంపిన ముసాయిదా ఎం.ఒ.యు. లో తమకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద యాభై ఎకరాలు కావాలని కోరింది. 

జూన్ 5, 2007: ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ జరిపిన సమీక్షా సమావేశంలో జార్జియా టెక్ యూనివర్సిటీకి హైదరాబాదులో 20 ఎకరాలు, విశాఖపట్నంలో 70 ఎకరాలు ఇవ్వాలని తీర్మానించారు. జార్జియా టెక్ ఎప్పుడూ తమకు వైజాగ్ లో భూమి కావాలని కోరలేదు
 
జూన్ 8, 2007: ముఖ్యమంత్రి, మహబూబ్ నగర్ కలెక్టర్ ఉషా రాణి తదితరులు పాల్గొన్న సమావేశంలో కొత్తూర్ మండలం మామిడిపల్లిలోని సర్వే నెంబర్ 292లో జార్జియా టెక్ యూనివర్సిటీకి 70 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 21, 2007: తమను ఎస్.ఈ.జెడ్ పెట్టుకోమని ప్రధాన మంత్రి కార్యాలయం వాళ్ళు, కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు సలహా ఇచ్చాయని కాబట్టి ఎస్.ఈ.జెడ్ పెట్టుకోవడానికి 250 ఎకరాలు కేటాయించాలని కోరుతూ జార్జియా టెక్ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.

నవంబర్ 12, 2007: మరొక లేఖలో తమకు కేటాయించే భూమి హైదరాబాద్ శివార్లలోని ముచ్చర్ల ఐటి పార్కులో ఇవ్వాలని జార్జియా టెక్ ప్రతినిధులు కోరారు.

నవంబర్ 23, 2007: యూనివర్సిటీకి ముచ్చర్ల ఐటీ పార్కులో 250 ఎకరాలు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి రంగా రెడ్డి జిల్లా కలెక్టరును ఆదేశించారు

ఫిబ్రవరి 29, 2008: ప్రభుత్వ భూముల అమ్మకానికి ధరలు నిర్ణయించే సాధికారిక (ఎంపవర్డ్) కమిటీ ఎకరానికి 18 లక్షలకు జార్జియా టెక్ కు ఇవ్వాలని సిఫారసు చేసింది.
 
మార్చ్ 15, 2008: బిట్స్ పిలాని వారికి హైదరాబాద్ శివార్లలో యూనివర్సిటీ పెట్టుకోవడానికి భూమి కేటాయించినప్పుడు లక్షన్నరకే ఎకరం ఇచ్చాం కనుక ఇప్పుడు కూడా లక్షన్నరకే ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తమకు భూమి రేటులో రాయితీ ఇవ్వాలని జార్జియా టెక్ ఏనాడూ అడగకపోవడం ఇక్కడ గమనార్హం

మార్చ్ 27, 2008: జార్జియా టెక్ యూనివర్సిటీకి ముచ్చర్ల ఐటీ పార్కులో 250 ఎకరాల భూమి ఎకరం లక్షా యాభై వేలకు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ జీవో 553 జారీ చేసింది.

పేదోళ్లను కొట్టి…

ముచ్చర్ల ఐటీ పార్కులో ఇప్పుడు జార్జియా టెక్ యూనివర్సిటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన స్థలం మొదలు నాలుగో తరగతి ఉద్యోగులకు, గవర్నమెంటు డ్రైవర్లకు ఇళ్ల స్థలాల కొరకు కేటాయించాలనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఈ విదేశీ యూనివర్సిటీకి ఇచ్చేశారు. మన బడుగుల ఆశలపై నీళ్ళు చల్లి బడాబాబుల జేబులు నింపడానికే ఈ ప్రభుత్వం “కృషి” చేస్తున్నదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
 
ఇక జార్జియా టెక్ విశ్వవిద్యాలయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన అనుమతిస్తూ ఒక కొత్త చట్టమే తీసుకురావడం ఈ కథలో కొసమెరుపు.

జార్జియా టెక్ భూకుంభకోణం గురించి హిందూ పత్రిక కథనం ఇక్కడ చదవండి:

http://www.thehindu.com/2008/06/11/stories/2008061155620400.htm

Advertisements

Written by dilkibaatein

July 29, 2008 at 11:13 am

Posted in Articles, Telugu

2 Responses

Subscribe to comments with RSS.

  1. down with SEZs

    narender

    July 29, 2008 at 11:51 am

  2. Few more Links

    Tech plans to open new international campus in India
    http://nique.net/nique/article/79

    CM Website / US VARSITY SIGNS MOU WITH STATE GOVERNMENT
    http://203.199.178.89/cmsite/05jun07prev.asp

    The next battleground: FDI for higher education news
    http://www.domain-b.com/economy/general/2007/20070213_battleground.htm

    JayaPrakash Telangana

    July 29, 2008 at 10:06 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: