Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

రైతన్నకు వెన్నుపోటు

leave a comment »

 
అసైన్డ్‌ పేరిట వేల ఎకరాలు స్వాధీనం
అయిన వారికి కట్టబెట్టేందుకే!
సర్కారే భూ బకాసుర పాత్ర
పారిశ్రామిక పార్కు పేరిట దందా
తమకు దిక్కెవరంటున్న చిలమత్తూరు రైతులు
నష్టపోతున్నది దళితులే ఎక్కువ-

ఎం.ఎల్‌. నరసింహారెడ్డి
చిలమత్తూరు నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి

 

ఇది బక్క రైతుపై ఉక్కుపాదం. పారిశ్రామిక పంజా కోరల్లో చిక్కిన శ్రామికుడి ఆర్తనాదం. అభివృద్ధి ముసుగులో అన్నదాత కడుపుకొట్టే నయవంచన. ఎకరం వేటలో కనికరం మరచిన పాలక ప్రభువుల తీక్షణ వీక్షణం. ఏకంగా సర్కారే భూ బకాసుర పాత్ర పోషిస్తున్న వైనం. అసైన్డ్‌ పేరుచెప్పి, అయినవారికి వేల ఎకరాలు దోచిపెట్టే ఘరానా దోపిడీ. ఈ దోపిడీలో చిత్తుచిత్తు అవుతున్నది అనంతపురం జిల్లా చిలమత్తూరు రైతు.


అనంతపురం జిల్లాలోని బక్కరైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని భూముల్ని అయినవారికి కట్టబెట్టేందుకు రైతుల నోట్లో మట్టికొడుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)ను ప్రయోగించింది. చిలమత్తూరు మండలంలో రైతులు దశాబ్దాలుగా సాగుచేసుకొంటున్న భూముల్ని నిర్దాక్షిణ్యంగా స్వాధీనం చేసుకుంటోంది. అదీ వందెకరాలో, వెయ్యెకరాలో కాదు- ఏకంగా ఆ మండలంలోని అసైన్డ్‌, ప్రభుత్వ భూమి మొత్తాన్ని!!

చిలమత్తూరు మండలం కర్ణాటక సరిహద్దులో ఉంది. ఇక్కడ్నుంచి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట ప్రయాణం. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు పారిశ్రామిక సంస్థలు భూములు కొంటున్నాయి. అమ్మాలనుకున్న రైతులు నచ్చిన ధరకు భూముల్ని అమ్ముకున్నారు. ఇప్పుడు చిలమత్తూరు మండలంలోని మొత్తం భూమిపై కొన్ని బడా సంస్థల కన్నుపడింది. వీరి తరఫున ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు పెడుతున్నుట్లు ప్రకటించింది. ఇందుకోసం నాలుగైదు దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకొంటున్న అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి నోటీసులిచ్చింది. ఈ భూముల్లో నీటి సదుపాయం కలిగి చెరకు, మొక్కజొన్న, వరి, టమోటా తదితర పంటలు పండుతున్నాయి.


రెండేళ్ల కిందట 2240 ఎకరాల సేకరణ ప్రారంభించిన ప్రభుత్వం- ఈ ఏడాది మే ఐదో తేదీన 3542.77 ఎకరాల సేకరణకు నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు లేఖరాసింది. తాజాగా గత నెల 17న మూడోదశ కింద 5933.57 ఎకరాల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు అదే రోజు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. దీంతో మండలంలో 11,716.37 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లయింది. ఈ మండలంలో 11,040.49 ఎకరాలు డి.కె.టి.(అసైన్డ్‌) భూమి కాగా, 1674.48 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ మొత్తం కలిపితే 12714.97 ఎకరాలు. ఇందులో 11,716.37 ఎకరాల్ని స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. తొలి విడత సేకరించిన భూమిని లేపాక్షి నాలెడ్జి హబ్‌కు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ పెద్దలు సన్నిహితులుగా ఉన్న నిర్మాణ సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. మరో నాలుగు గ్రామాల్లో మిగిలిన అసైన్డ్‌, ప్రభుత్వ భూమిని నాలుగోదశ కింద త్వరలోనే సేకరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆశ్చర్యమేమిటంటే మండంలో వాగులు, వంకలు, చెరువులు, నదులు ప్రవహించే మార్గాలు కూడా సేకరణ జాబితాలో ఉన్నాయి.
మూడో దశలో సేకరించే భూములు కింద చిలమత్తూరు నార్త్‌, చిలమత్తూరు సౌత్‌, కోడూరు, వీరాపురం, హుస్సేనాపురం గ్రామాలు ఉన్నాయి.కలెక్టర్‌కు ఏపీఐఐసీ రాసిన రెండు లేఖల్లో కూడా చిలమత్తూరులో పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, ఆ మేరకు ఎలాంటి జాప్యంలేకుండా భూమిని సేకరించాలని పేర్కొన్నారు. తుది ఉత్తర్వులు జారీకాక ముందే భూములు తమకు స్వాధీనం చేసేలా పెనుకొండ ఆర్డీఓను ఆదేశించాలని కూడా ఏపీఐఐసీ పేర్కొంది. అంటే ఇక్కడ ఆ జిల్లా యంత్రాంగం చేయాల్సింది పోస్టుమ్యాన్‌ ఉద్యోగం మాత్రమేనన్నమాట. ఈ లేఖ అందిందో లేదో రెవెన్యూ అధికారులు రంగంలో దిగి సర్వే మొదలుపెట్టారు. భూముల్లో రైతుల పంటలున్నాయా లేదా అనే విషయాల్ని కూడా చూడకుండా… భూములిచ్చేసి పరిహారం తీసుకోండంటూ హుకుం జారీచేశారు. తమ పొట్ట కొట్టొద్దంటూ రైతులు ఎంతగా బతిమాలినా పట్టించుకునే నాథుడే లేడు. కారణం- భూములపై కన్నేసిన వారు ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులు కావడమే.

 
ఎక్కువమంది దళిత రైతులే

ఇక్కడ భూమిని సాగు చేసుకుంటున్న వారిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాల రైతులు. ఎకరా నుంచి ఐదెకరాల్లోపున్న సన్న, చిన్నకారు రైతులే ఎక్కువమంది. తాతల కాలం నుంచి తాము భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడొచ్చి అసైన్డ్‌ భూమి అంటూ స్వాధీనం చేసుకుంటే ఎలా బతుకుతామని వీరాపురం గ్రామానికి చెందిన ఆదిమూర్తి అనే రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం బ్యాంకు రుణాలకు, ఇతర అప్పులకు మాత్రమే సరిపోతుందని, తాము కూలీకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఆయన విలపించారు. ఈయనే కాదు- మండలంలోని ఏ గ్రామ రైతును కదిపినా ఇదే ఆవేదన. వారం రోజులుగా రైతులంతా అధికారుల వద్దకు వెళ్లి తమ భూమిని తీసుకోవద్దంటూ మొరపెట్టుకొంటున్నారు.


వ్యూహాత్మకంగా తొలుత అసైన్డ్‌ భూమి

భూ సేకరణలో తొలుత అసైన్డ్‌ భూమిని ఎంచుకోవడం వ్యూహాత్మకమే. మొత్తం అసైన్డ్‌ భూమిని తీసేసుకుంటే- వాటి మధ్యలో ఉన్న పట్టా భూమికి రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్‌ చేయలేరన్న ఉద్దేశంతో- ఈ భూమిపై కన్నేసిన పెద్దలు ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. అసైన్డ్‌, ప్రభుత్వ భూములు కలిగున్న వారిలో ఎక్కువ మంది దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారు. వీరిలో పట్టా భూములు కలిగిన వారి సంఖ్య నామమాత్రం. తొలుత అసైన్డ్‌, ప్రభుత్వ భూమిని మాత్రమే సేకరించాలని నిర్ణయించడానికి మరో కారణం కూడా ఉంది. ఈ భూముల్ని ఆనుకొని కర్ణాటక ప్రాంత భూములున్నాయి. వాటిని ఎకరా రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ప్రైవేటు పారిశ్రామికవేత్తలు కొన్నారు. ఆ భూముల ధరలు ఇప్పుడింకా పెరిగాయి. పట్టా భూముల జోలికెళ్తే- ఎక్కువ ధర వస్తుందన్న ఉద్దేశంతో రైతులు తమ భూమిని ఇవ్వబోమని అడ్డం తిరగవచ్చు, లేదా ఎక్కువ పరిహారాన్ని కోరవచ్చు. అటూ ఇటూ ఉన్న భూమి తీసుకొంటే… మధ్యలోని రైతు ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందన్నది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. ”నాకు మూడెకరాల భూమి ఉంటే… అందులో ఒకటిన్నర ఎకరాను అసైన్డ్‌ భూమి పేరిట సర్వేచేశారు. మిగతా భూమీ రెండో జాబితాలో ఉందటున్నారు. నేను కూలి పనికిపోయి ఐదుగురిని ఎలా పోషించగలను” అని ఎర్రపరెడ్డి అనే రైతువాపోయారు.

 
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో ప్రభుత్వ భూ సేకరణ జాబితాలో ఇవన్నీ ఉన్నాయి
వాగులు, చెరువులు, నదీ మార్గాలూ సేకరణ
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో వాగులు, వంకలు, చెరువులే కాదు, నదులు ప్రవహించే మార్గాలు కూడా సేకరణ జాబితాలో ఉన్నాయి. కుషావతి, చిత్రావతి నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. ఏపీఐఐసీ కర్నూలు జోనల్‌ మేనేజర్‌ భూసేకరణకు సంబంధించి అనంతపురం జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో- నదులు ప్రవహించే సర్వే నెంబర్లే కాదు, నదులు అని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. చిలమత్తూరు నార్త్‌ ప్రాంతంలో సర్వే నెంబరు 850, 851, 853లో ఉన్న 75 ఎకరాల నదీ ప్రాంతాన్ని కూడా భూ సేకరణలో చేర్చారు. ఇదంతా కుషావతి నది ప్రాంతమైనా, చుట్టు పక్కల సేకరించే భూసేకరణ ప్రభావం చిత్రావతిపై పడనుంది. ఇక చెరువులు, వంకలు, కుంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరాపురంలోని చెరువుకు ప్రత్యేకత ఉంది. సైబీరియన్‌ పక్షులు యేటా కొన్ని రోజులు ఇక్కడికి వస్తుంటాయి. వీటిని చూడటానికి విదేశీ పర్యాటకులే వస్తుంటారు. పక్షుల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ చెరువును ఊట చెరువుగా(పర్కులేషన్‌ ట్యాంకుగా) 2001లో మార్చారు. దీనివల్ల వరి పండే 120 ఎకరాలు ఆరుతడి పంటలకు అనువుగా మారినా గ్రామస్థులు సహకరించారు. ఇప్పుడు ఈ చెరువు కూడా సేకరణ జాబితాలో ఉంది. హుస్సేనాపురంలో ఓ వంక, రెండు కుంటలు, కోడూరులో ఓ కాలువ, మూడు కుంటలు, రెండు చెరువులు, కొంత అటవీ భూమి, మూడు వంకలు, చిలమత్తూరు నార్త్‌ ప్రాంతంలో నాలుగు చెరువులు, మూడు కుంటలు, చిలమత్తూరు దక్షిణ ప్రాంతంలో నాలుగు చెరువులు, పలు కుంటలు సేకరణ జాబితాలో ఉన్నాయి. ఈ చెరువులు, కుంటలు, వంకల ద్వారా ప్రయోజనం పొందే రైతుల్లో అసైన్డ్‌ భూమి కలిగిన వారే కాదు, పట్టా భూమి కలిగిన వారూ ఉన్నారు. ఓసారి ఈ నీటి వనరులు ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్లాక రైతులకు అందుబాటులో ఉండవు. భూగర్భజలంపై కూడా ప్రభావం చూపి బోర్లు దెబ్బతినే అవకాశం ఉంది. పర్యవసానంగా పట్టా భూములు కలిగిన రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిహారం మొత్తం తీసుకొని వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Courtesy: Eenadu 25th August 2008

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: