Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…

with 4 comments

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా జరుపుతున్న భూసేకరణ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపధ్యంలో అసలు భూసేకరణ చట్టం ఏమిటి, ప్రజలు ప్రభుత్వ అక్రమాలను ఎలా అడ్డుకోవచ్చు వంటి ఉపయుక్తమయిన విషయాలతో మానవ హక్కుల వేదిక (HRF) ఇటీవల ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ పుస్తకం అందాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం కాపీని ఇక్కడ ఇస్తున్నాం. (కె బాల గోపాల్, ఎస్ జీవన్ కుమార్ గార్లకు కృతజ్ఞతలతో …)

పుస్తకం పీడిఎఫ్ ఫైలు ఇక్కడ దిగుమతి చేసుకోండి

ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…

వేరే ఏ రకంగానూ దాన్ని ఆపలేకపోతే కనీసం చట్టాలలో ఏముందో తెలుసుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

భూసేకరణ జరుగుతున్నది 1894 నాటి భూసేకరణ చట్టం కింద. ఆ చట్టం ‘ప్రజా ప్రయోజనం’ పేరుతో ప్రజల భూములనూ, ఇతర స్థిరాస్తులనూ సేకరించే అధికారం ప్రభుత్వానికిస్తుంది. అయితే ఏ అవసరం కోసమైతే భూమి సేకరిస్తున్నారో అది ‘ప్రజా ప్రయోజనం’ కిందకి వస్తుందా, ఒకవేళ వచ్చినా మీ భూమికాక వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనే విషయంలో అభ్యంతరం చెప్పే, ప్రత్యామ్నాయాలనూ సూచించే అవకాశం మీకు ఉంది. వాటి గురించి ఆలోచించమనీ, అభ్యంతరాలకు జవాబు చెప్పమనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టగల అవకాశమూ మీకు ఉంది. అతి తక్కువ భూమిని సేకరించి, అతి తక్కువ మందిని నిర్వాసితుల్ని చేసే ప్రత్యామ్నాయాల గురించి ప్రభుత్వం ఆలోచించాలని మన రాష్ట్రప్రభుత్వం 2005లో జారీచేసిన సహాయ పునరావాస విదానంలోనే అంది. ఒకవేళ భూసేకరణ తప్పనిసరైతే దాని ధర నిర్ణయించే ముందు మీ అభిప్రాయం తీసుకోవాలని, ఆ తర్వాత కూడా మీకు ఆ ధర (నష్టపరిహారం) తక్కువనిపిస్తే అభ్యంతరం తెలిపే హక్కు మీకు ఉందని, మీరు అభ్యంతరం తెలిపితే కనక తాను నిర్ణయించిన ధర మీకు చెల్లిస్తూ కూడా అది న్యాయమా కాదా అన్న వ్యాజ్యాన్ని ప్రభుత్వం తానే కోర్టుకు నివేదించాలని ఈ విధానం అంటుంది.

ఇప్పుడు ఒక్కొక్క అడుగూ ఈ వ్యవస్థ వివరాలు చూద్ధాం. దానిని అధికారులు ఏ రకంగా వక్రీకరిస్తారో, మీరు దానిని ఏ రకంగా ఎదుర్కోవచ్చో కూడా చూద్దాం.

1. నోటీసు ఇవ్వనిదే మీ భూమి జోలికి రాకూడదు

మొదట జిల్లా కలెక్టర్‌ గానీ ఇందుకు నిమిత్తం ప్రభుత్వం నియమించిన సబ్‌కలెక్టర్‌ గానీ ఏ అవసరం కోసం ఏయే ఊర్లలో ఎంతెంత భూమి సేకరించదలచుకున్నదీ, సర్వే నెంబర్ల వారీగా రెవిన్యూ రికార్డుల ప్రకారం దాని యజమానులెవరు అనే విషయాన్ని ప్రకటించాలి. దీనిని 4(1) నోటీసు అంటారు. అంటే భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 4(1) కింద ఇచ్చిన నోటీసు అని అర్థం. ప్రభుత్వ గెజెట్‌లోనేకాక రెండు స్థానిక దినపత్రికలలోనూ ఈ నోటీసులు ప్రకటించాలి. వాటిలో ఒకటి తెలుగు దినపత్రిక అయి ఉండాలి. ఆ తరువాత 40 దినాల లోపల ఆ భూమి సేకరిస్తున్న ప్రాంతంలో ఏదైనా బహిరంగ స్థలంలో ఆ నోటీసును అంటించాలి. ఇవన్నీ జరిగినప్పుడే ప్రజలకు నోటీసు ఇచ్చినట్టవుతుంది. ఆ తరువాతే అధికారులు ఆ భూమిలోకి దిగడంగానీ, కొలతలు తీసుకోవడంగానీ, మట్టిని పరీక్షించడానికి శాంపిల్స్‌ తీసుకోవడంగానీ చేయవచ్చు.

2. అప్పుడు మీరు అభ్యంతరాలు చెప్పవచ్చు

ఆ నోటీసు ప్రచురించిన తరువాత మీరు అభ్యంతరాలు తెలుపవచ్చు. ఈ హక్కు మీకు భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 5ఎ ఇస్తుంది. మీరు అన్ని రకాల అభ్యంతరాలూ తెలపవచ్చు. ఆ అవసరం ప్రజావసరమే కాదనవచ్చు. దానికి ఈ భూమి తగినది కాదనవచ్చు. మీకు ఉన్నది ఈ భూమే అయితే అది మొత్తం తీసుకునే బదులు ఎక్కువ భూమి ఉన్నవాళ్ళ ఆస్తిలో ఒక భాగం తీసుకోవడం న్యాయం అనవచ్చు. లేదా ఎవరూ ఉపయోగించని ప్రభుత్వ భూమి ఊరిలో ఉంది కాబట్టి అది తీసుకొమ్మని సూచించవచ్చు. ఈ అభ్యంతరాలు తెలపడానికి మీకు 30 దినాల గడువు ఉంటుంది. అయితే అభ్యంతరాలు కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా తెలపాలి. ఆపైన కలెక్టర్‌ ముందు హాజరై మీరుగానీ, మీ తరపున వేరే ఎవరైనాగానీ మీ అభ్యంతరాలు సమంజసమైనవని వాదించవచ్చును. కలెక్టర్‌ మీ వాదనలు విని, అవసరమైతే ఈ విషయంలో మరింత విచారణ జరిపి, తన అభిప్రాయాలూ, సూచనలూ ప్రభుత్వానికి నివేదించాలి. దానిపైన ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుంది.

3. ప్రభుత్వం అడ్డదారి తొక్కితే …

అయితే ఆ భూసేకరణ అత్యవసరమైన లక్ష్యం కోసమైతే అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా తదుపరి చర్చలు చేపట్టవచ్చునని సెక్షన్‌ 17(4) అంటుంది. ఈ అధికారాన్ని అరుదుగా మాత్రమే ఉపయోగించాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ మన రాష్ట్రంలో దాదాపు ప్రతి భూసేకరణలోనూ సెక్షన్‌ 17(4)ను పేర్కొని అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం లేకుండా చేయడం పరిపాటి అయింది. ఈ విషయాన్ని 4(1) నోటీసులోనే రాసేస్తున్నారు. అయితే నిజంగా అర్జెన్సీ లేని సందర్భాలలో అట్లా చేస్తే మీరు ఊరుకోనక్కర లేదు. భూమి కోల్పోయే వారంతా ఒకటై మీ అభ్యంతరాలు విని తీరాలని కలెక్టర్‌ పైన ఒత్తిడి పెట్టొచ్చు. అప్పటికీ వినకపోతే హైకోర్టులో కేసు వేయొచ్చు. నూటికి తొంభై కేసులలో హైకోర్టు సెక్షన్‌ 5ఎ కింద విచారణ జరిపి తీరాలని ఆదేశం ఇస్తున్నది.

4. అభ్యంతరాలు విన్న తరువాత …

మీ అభ్యంతరాలు విని, వాటిపైన ప్రభుత్వం తన నిర్ణయం తెలియజేసిన తరువాత కలెక్టర్‌ మరొకసారి ప్రభుత్వం సేరించబోయే భూమి వివరాలను, సర్వే నంబర్‌ల వారీగా యజమానుల పేర్లు వగైరా తెలియజేస్తూ సెక్షన్‌ 6 కింద మళ్ళీ నోటీసు జారీచేస్తాడు. అదికూడా రెండు స్థానిక దినపత్రికలలో ప్రకటిస్తాడు. వాటిలో ఒకటి తెలుగు పత్రిక అయి ఉండాలి. ఇదివరకటిలాగే ఆ ప్రకటనను భూమి సేకరిస్తున్న చోట బహిరంగ స్థలంలో అంటించాలి. ఆ తరువాత భూమిని కొలిచి, దాని సరిహద్దుల్లో గుర్తులు పెట్టుకోవచ్చు. అయితే అప్పటికింకా భూమి మీదే. అది ప్రభుత్వం స్వాధీనం కావడానికి ఇంకొన్ని దశలున్నాయి. మొదట కలెక్టరు సెక్షన్‌ 9 కింద మరో నోటీసు జారీచేయాలి. ఇది గెజెట్‌లోనూ, పత్రికలలోనూ ప్రచురించే నోటీసు కాదు. ఆ భూమి అనుభవదారునికి, ఆ భూమిపైన ఏదైనా హక్కు ఉన్నదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన వారికి, లేదా వారు ఇందు నిమిత్తం నియమించిన ప్రతినిధులకు చేతికి అందిచ్చే నోటీసు. మీరు ఆ జిల్లాలో లేనట్టయితే మీకు రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపించాలి. అంతేకాక, సేకరిస్తున్న భూమి పరిసరాలలో బహిరంగ ప్రదేశంలో ఈ నోటీసును అంటించాలి కూడా. ఇందులో ఏముంటుందంటే, ఫలాన సర్వే నంబర్‌లోని ఫలాన విస్తీర్ణం గల భూమిని సేకరించడం జరుగుతున్నదనీ, ఫలాన తేదీనాడు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి మీ హక్కు ఏమిటో (అంటే యజమాని, కౌలుదారు, కొనుగోలు చేసిన వ్యక్తి, వగైరా) చెప్పి, ఆ భూమికి ఎంత నష్టపరిహారం కోరుకుంటారో తెలపమని ఉంటుంది. నోటీసు చేతికి అందించిన రోజుకూ, కలెక్టర్‌ ముందు హాజరు కావలసిన రోజుకూ నడుమ కనీసం 15 దినాల గడువు ఉండాలి. మీరు సెక్షన్‌ 9 నోటీసుకు స్పందించి కలెక్టర్‌ ఎదుట హాజరైనపుడు, ఆ భూమిలో ఇంకా ఎవరెవరికి ఏమేమి హక్కులున్నాయో మీకు తెలిసిన మేరకు చెప్పమని మిమ్మల్ని ఆదేశించే అధికారం కలెక్టర్‌కు ఉంది. మీరు తప్పనిసరిగా చెప్పాలి.

5. నష్టపరిహారం ఎంత, ఎవరెవరికి

మీరు చెప్పిన విషయాలు విని, మీరు సమర్పించిన పత్రాలు పరిశీలించిన తరువాత కలెక్టర్‌ సెక్షన్‌ 11 కింద తన ‘అవార్డు’ ప్రకటిస్తాడు. సేకరిస్తున్న భూమి పరిమాణం ఎంత, దానికి ఇవ్వదగ్గ నష్టపరిహారం ఎంత, దానిలో ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలి అనే విషయాలు అవార్డులో ప్రకటిస్తాడు. సెక్షన్‌ 6 కింద ఏ భూములు సేకరించబోయేది తెలిపే నోటీసు ప్రకటించిన రెండు సంవత్సరాల లోపల ఈ అవార్డు ప్రకటించాలి. రెండు సంవత్పరాలు దాటిపోయినట్టయితే ఈ భూసేకరణ ప్రక్రియ చెల్లదు. కలెక్టర్‌ మీ సమక్షంలో అవార్డు ప్రకటించినట్టయితే దాని ప్రతిని మీ చేతికి ఇస్తారు. అప్పుడే నష్టపరిహారమూ ఇస్తారు. మీరు అక్కడ లేనిపక్షంలో దానిని రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా మీకు పంపిస్తారు. అవార్డు ప్రకారం మీకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కోర్టులో డిపాజిట్‌ చేస్తారు. ఆ నష్టపరిహారం పట్ల మీకు మూడు రకాల అభ్యంతరాలు ఉండవచ్చు. భూమి విలువ తక్కువగా లెక్కించారన్న అభ్యంతరం ఉండవచ్చు. దాని పరిమాణాన్ని తక్కువగా లెక్కించారన్న అభ్యంతరం ఉండవచ్చు. ఆ ఆస్తిలో హక్కు లేనివారికి కూడా నష్టపరిహారంలో వాటా ఇచ్చారన్న అభ్యంతరం ఉండవచ్చు. ఏ అభ్యంతరం ఉన్నా ఆ విషయాన్ని కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా తెలిపి మీ అభ్యంతరాన్ని కోర్టుకు నివేదించమని కలెక్టర్‌ను మీరు కోరవచ్చు. కోరినట్టయితే కలెక్టర్‌ మీ అభ్యంతరాన్ని సంబంధిత సివిల్‌ కోర్టు ముందు ఉంచుతారు. ఇది సెక్షన్‌ 18 కింద మీకు ఉండే హక్కు. కలెక్టర్‌ సెక్షన్‌ 11 కింద అవార్డు మీ సమక్షంలో ప్రకటించి ఉంటే ఆనాటి నుంచి 6 వారాలలోపల మీ లిఖిత పూర్వక అభ్యంతరాలను కలెక్టర్‌కు తెలియజేయాలి. రిజిస్టర్డ్‌ పోస్ట్‌లో పంపినట్టయితే మీకది అందిన రెండు నెలల లోపల తెలియజేయాలి.

కలెక్టర్‌ ఇచ్చిన నష్టపరిహారం తీసుకొని కూడా అభ్యంతరం తెలిపి కోర్టుకు నివేదించమని కోరవచ్చును. అయితే నష్టపరిహారం తీసుకునేటప్పుడే మీ వద్ద వారు తీసుకునే రశీదు పైన మీ నిరసనను లేక అభ్యంతరాన్ని సూచిస్తూ రాసి సంతకం చేయాలి. నిరసన తెలపకుండా తీసేసుకుంటే ఆ తరువాత సెక్షన్‌ 18 కింద అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదు. మామూలుగా ఇంగ్లీష్‌లో ‘అండర్‌ ప్రొటెస్ట్‌’ అని రాస్తారు. అయితే ఇంగ్లీష్‌లోనే రాయనక్కర లేదు. మీ నిరసనను సూచించే వాక్యమేదైనా తెలుగులో అయినా రాయవచ్చును.

నష్టపరిహారం తీసుకోవడానికి మీరు నిరాకరించినా దానివల్ల మీరేమి నష్టపోరు. కలెక్టర్‌ దానిని సివిల్‌కోర్టులో డిపాజిట్‌ చేస్తాడు. నిర్దేశించిన గడువు లోపల మీరు మీ అభ్యంతరాలను కలెక్టర్‌కు తెలియజేసి కోర్టుకు నివేదించమని కోరితే నివేదిస్తాడు. ఒకవేళ మీ అభ్యంతరాలన్నిటినీ కోర్టు తిరస్కరించినా, కలెక్టర్‌ డిపాజిట్‌ చేసిన మీ నష్టపరిహారం మీకే వస్తుంది.

6. ‘ఒప్పుకోలు’ అవార్డు

కలెక్టర్‌ సెక్షన్‌ 11 కింద మీ భూమి మార్కెట్‌ విలువను బట్టి మీకు నష్టపరిహారంగా ఇస్తాడు. అయితే ఇక్కడ మార్కెట్‌ విలువ అంటే అర్ధం సెక్షన్‌ 4(1) నోటీసు జారీచేసే నాటికి మీ ప్రాంతంలో ఆ రకమైన భూమిని కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్‌ నిమిత్తం చూపించిన విలువ అని. అది నిజమైన విలువ కంటే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అనివార్యంగా రైతులు సెక్షన్‌ 18 కింద అభ్యంతరాలు తెలపడం, సివిల్‌ కోర్టులో, హైకోర్టులో (ఒక్కొక్కసారి సుప్రీంకోర్టులో కూడా) ఏళ్ళ తరబడి కేసులు నలగడం, వకీళ్ళ ఫీజులకు మధ్యవర్తుల కమిషన్లకు వచ్చిన నష్టపరిహారంలో ఎక్కువ భాగం సమర్పించుకోవడం సాధారణ అనుభవం.

అందుకని దాని స్థానంలో ప్రభుత్వం మిమ్మల్ని సంప్రదించి ఇద్దరికీ ఆమోదనీయమైన నష్టపరిహారాన్ని నిర్ణయించినట్టయితే, మీరు లిఖిత పూర్వకంగా ఆ మొత్తం మీకు ఆమోదనీయమని రాసి కలెక్టర్‌కు ఇస్తే కలెక్టర్‌ దానినే అవార్డుగా ప్రకటించవచ్చు. సెక్షన్‌ 11(2) దీనికి అవకాశం ఇస్తుంది.

ఈ మధ్య ప్రభుత్వం ఎక్కువగా ఈ ‘ఒప్పుకోలు’ మార్గాన్నే అనుసరిస్తున్నది. అయితే దీనికొక సవ్యమైన మార్గం ఉంది, అపసవ్యమైన మార్గమూ ఉంది. సవ్యమైన మార్గంతో పాటు ప్రభుత్వం ఎక్కువగా అనుసరిస్తున్న అపసవ్యమైన మార్గం గురించి కూడా వివరిస్తాము.

సవ్యమైన మార్గం ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ (సంప్రదింపుల కమిటీ) నియమాలు అనే 1992 నాటి రూల్స్‌లో ఉంది. దీని ప్రకారం ఒక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ, ఒక రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ ఉంటాయి. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్‌, ఒక రిటైర్డ్‌ జిల్లా జడ్జి, పదవిలో ఉన్న సీనియర్‌ సివిల్‌ జడ్జి, జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు ఉంటారు. సెక్షన్‌ 11 కింద కలెక్టరు అవార్డు జారీచేసిన తరువాత, ఆసక్తి ఉన్నవారు సంప్రదింపుల కమిటీ ముందుకు రావలసిందని కోరుతూ ఆయన ఫారం-1 నోటీసును గ్రామంలో రెండు బహిరంగ ప్రదేశాలలో ప్రకటిస్తాడు. లేదా రైతులే తమ అర్జీలను సంప్రదింపుల కమిటీకి నివేదించమని కలెక్టర్‌ను కోరవచ్చు.

ఈ సంప్రదింపుల కమిటీని ఒక మేరకు మాత్రమే నష్టపరిహారాన్ని పెంచే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ పెంచమన్న డిమాండ్‌ వచ్చినట్టయితే కేసును రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీకి నివేదించాలి. ఈ కమిటీలు రైతుల మీద ఎటువంటి ఒత్తిడి పెట్టకూడదు. ఒప్పుకోలు స్వచ్ఛందంగా ఇచ్చిన పిమ్మట ఇచ్చిన వారివరకు సెక్షన్‌ 11(2) కింద ఒప్పుకోలు అవార్డు ప్రకటించబడుతుంది. ఒప్పుకోని వారు పైన వివరించిన పద్ధతి ప్రకారం కోర్టులో న్యాయంకోసం వ్యాజ్యం నడుపుకోవచ్చు.

7. అపసవ్యమైన ‘ఒప్పుకోలు’

ఇది సవ్యమైన మార్గం కాగా, ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల విషయంలోనూ పూర్తిగా అపసవ్యమైన ఒప్పుకోలు మార్గాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఇందులో సంప్రదింపుల కమిటీకి స్థానం లేదు. మీ ప్రాంతపు ఆర్‌డివో లేక భూసేకరణ సబ్‌కలెక్టర్‌ భూమి కోల్పోతున్న వారిలో కొందరిని ముందు చేరదీసి వారితో ఒక ధరకు ఒప్పుకోలు పత్రాలు రాయించుకుంటారు. వారు పాలక పార్టీకి చెందినవారై ఉండి, వేరే ఏదో ప్రయోజనాలను ఆశించి ఈ నాటకంలో భాగస్వాములు కావచ్చు లేదా వేరే వ్యాపారాలో, ఉద్యోగాలో ఉన్న కారణంగా భూములు చవకగా అమ్ముకొని పోవడానికి సిద్ధపడినవారు కావచ్చు. వారితో ఒక ధరకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ ధర సెక్షన్‌ 11 కింద కలెక్టర్‌ ప్రకటించే అవార్డులోని నష్టపరిహారం కంటే ఎక్కువే ఉంటుంది. అయితే మీ ఊరి పరిసరాలలో మళ్ళీ అంత భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకోవడానికయ్యే ఖర్చు కంటే బాగా తక్కువ ఉంటుంది.

ఆ ఒప్పుకోలు పత్రాన్ని అధికారులు మీ ముఖానకొట్టి మీరు కూడా అదే ధరకు ఒప్పుకోవాలని ఒత్తిడి పెదతారు. ‘ఫలాన సుబ్బయ్య ఈ ధరకు తన భూమి ఇచ్చేశాడు. మీకేమయింది?’ అని దబాయిస్తారు. ‘రేపు మీరు కోర్టుకు పోయినా ఈ ఒప్పుకోలు పత్రం చూసిన తరువాత కోర్టు మీకు ఇంతకంటే ఎక్కువ రేటు ఇస్తుందనుకుంటున్నారా?’ అని బెదిరిస్తారు. ‘వచ్చే నెల 31వ తేదీ లోపల ఈ ధరకు ఇచ్చేదీ లేనిదీ తేల్చి చెప్పేయండి. లేదంటే సెక్షన్‌ 11 కింద కలెక్టర్‌ ఇచ్చిన అవార్డు ప్రకారం నష్టపరిహారం చేతిలో పెడతాం. తీసుకోకపోతే డిపాజిట్‌ చేస్తాం. ఆపైన ఒక పదేళ్ళు కోర్టుల చుట్టూ తిరగండి’ అని దబాయిస్తారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ ఇదే జరుగుతున్నది. మీ ఊరిలోనూ జరగబోతుంది. ఈ మోసపూరితమైన ‘ఒప్పుకోలు’ లొంగకుండా ఉండాలంటే భూమిని కోల్పోయే రైతులంతా ఒకటిగా ఉండాలి. 1992లో ప్రకటించిన రూల్స్‌ ప్రకారం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీలను నియమించి వాటి ద్వారా సంప్రదింపులు చేపట్టాలే తప్ప ఈ అడ్డదారి ఒప్పుకోలు ప్రయత్నాలకు లొంగం అని ఐక్యంగా నిలబడండి.

పైన చెప్పిన అన్ని విషయాలూ రైతుల స్వంత భూములకేకాక అసైన్‌మెంట్‌ లేక డిఫారం (డికెటి, లాపణీ) పట్టా భూములకు కూడా వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఆ భూములకు భూసేకరణ నియమాలు వర్తించవనీ, అవి ప్రభుత్వం భూములే కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చుననీ అధికారులు దబాయించినట్టయితే, మన రాష్ట్ర హైకోర్టు 2004లో భూసేకరణ అధికారి, చేవెళ్ళ మరియు మేకలపాండు కేసులో ఇటువంటి భూములకూ, స్వంత భూములకూ ఒకే రకమైన భూసేకరణ పద్ధతి వర్తిస్తుందనీ, ఒకే మోతాదులో నష్టపరిహారం ఇవ్లానీ తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేయండి. ఆ తీర్పుపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్‌లో ఇప్పటికింకా ఏ తీర్పూ రాలేదని గుర్తుచేయండి. అందువల్ల హైకోర్టు తీర్పును పాటించాలని చెప్పండి.

8. ఏ పట్టా లేకపోతే?

అయితే డిఫారం పట్టా కూడా లేకుండా ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న పేదలుంటారు. వాళ్ళకు నష్టపరిహారం ఇస్తారా, ఇవ్వరా? పేదలు అసైన్‌మెంట్‌ పట్టా ఇవ్వదగిన ప్రభుత్వ భూములకు అనుభవిస్తున్నట్టయితే, వారి ఆక్రమణను నమోదు చేయాలి. వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి విచారణ జరపాలి. నిజంగా భూమిలేని పేదలైతే వారికి డిఫారం పట్టాలు ఇవ్వాలి. ఇది ప్రభుత్వం బాధ్యత అని బోర్డు స్టాండింగు ఆర్డర్స్‌ చెప్తాయి. ఆ తరువాత ఆ భూమిని ఏదైనా ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వం సేకరిస్తే, పైన చెప్పిన హక్కులు వర్తిస్తాయి. కానీ ప్రభుత్వ అధికారులు ఆ పని చేయకపోతే? పేదలు ప్రభుత్వ భూములను ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలు ఇవ్వకపోతే? అటువంటి భూమిని ఆ తరువాత ప్రభుత్వం ఏదైనా ప్రజావసరం కోసం తీసుకుంటే వారికి నష్టపరిహారం దక్కుతుందా? దక్కాలి. కాని వారిక నష్టపరిహారం ఇవ్వాలని చెప్నే చట్టం ఏదీలేదు. వారికి డిఫౄరం పట్టాలు ఇయ్యవలసి ఉండీ అధికారులు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినట్టే భావించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్నే కోర్టు తీర్పులూ లేవు. అయితే ఆందోళన చేయగా చేయగా షంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సేకరించిన భూమిలో ఈ కోవకు చెందిన పేదలకు మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చారు. ఎకరానికి 65 వేలు ఇచ్చారు. కాబట్టి మీరు డిఫారం పట్టా సైతం లేకుండా ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న వారైతే, షంషాబాద్‌ సూత్రాన్ని మీకు కూడా వర్తింపజేయాలని ఆందోళన చేయండి. ఎకరానికి 65 వేలే అడగనక్కరలేదు. అది 2003 నాటి సంగతి. ఇప్పటి పరిస్థితికి తగినంత అడగండి.

9. ఏ భూములూ లేనివారి గతి ఏమిటి?

రైతుల భూములు పోతే ఆ భూముల్లో కూలిచేసుకుని బతికే భూమిలేని కూలీల జీవనం కూడా పోతుంది. సాగుభూములేకాక గ్రామం కూడా ఖాళీ చేయవలసి వస్తే గ్రామంలో చాకలి, మంగలి, కమ్మరి మొదలైన వృత్తులు చేసుకొని బతికే పేదల జీవనమూ పోతుంది. రైతుల భూములు, డిఫారం పట్టా భూములు, పట్టాలేకుండా ఎవరో ఒకరు సాగుచేసుకుంటున్న భూములే కాక సాగులో లేని ప్రభుత్వ బంజర్లను కూడా ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అప్పగించడం జరుగుతుంటుంది. ఆ భూములతో తాడిచెట్ల, ఈతచెట్ల కల్లు తీసి బతికే గీత కార్మికుల జీవనం పోతుంది. రాళ్ళు కొట్టి అమ్ముకొని బతికే పడ్డెరల జీవనం పోతుంది. ఆ భూములలో వాగులు ఉంటే వాటిలో చేపల వేట చేసుకొని బతికే మత్య్సకారుల జీవనం పోతుంది.

చాలాకాలం ఈ ప్రజలకు ఏ నష్టపరిహారం దక్కేదికాదు. కానీ 2005 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెం. 68లో ఈ ప్రజలకు కూడా నగదు నష్టపరిహారం ఇవ్వాలని రాశారు. ఒక ప్రాజెక్టుకోసం భూసేకరణ చేపట్టేటప్పుడు భూములు కోల్పోయే వారేకాక జీవనం కోల్పోయేవారు ఉంటారని ఈ జిఓ గుర్తించి, అటువంటి కుతుంబాలకు 625 రోజుల కనీస వ్యవసాయ కూలివేతనం నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్తుంది. ఉదాహరణకు కనీస వ్యవసాయ కూలీ వేతనం 80 రూపాయలైతే, ఒక్కొక్క కుటుంబానికి 50 వలే రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. వ్యవసాయ కూలీలకేకాదు, జీవనం కోల్పోయే సకల వృత్తులవారికీ 625 రోజుల కనీస వ్యవసాయ కూలివేతనం ఇవ్వాలి. ఎందుకంటే అన్ని వృత్తులకూ కనీస వేలనాలుండవు కాబట్టి. అడవిప్రాంత ఆదివాసులైతే అటవీ ఉత్పత్తులు కోల్పోతారు. కాబట్టి ఇంకొక 500 రోజుల కనీస వేతనం ఇవ్వాలి.

ఈ జిఓను ఆందోళన చేస్తే తప్ప ఎక్కడా అమలుచేయడం లేదు కాబట్టి, డిమాండ్‌ చేసి అమలు చేయించుకోండి. గ్రామం ఖాళీ చేయకముందే సకల వృత్తులవారి సామాజిక ఆర్థిక సర్వే జరిపి రికార్డు తయారయ్యేటట్టు చూసుకోండి. ఖాళీచేసిన తరువాత నేను ఫలాన ఊరిలో చాకలి పనిచేసే వాడిని అంటే దానికి రుజువే ఏం ఉంటుంది? కాబట్టి జిఓ 68 కింద ఇయ్యవలసిన నష్టపరిహారం ఇవ్వకుండా, లేదా కనీసం సర్వే జరిపి రికార్డు సమగ్రంగా తయారుచేయకుండా, ఊరు ఖాళీ చేయొద్దు.

ఈ జిఓను అమలుచేయమని అడిగితే దీనిని జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ కాబట్టి ఇది నీటిపారుదల ప్రాజెక్టులకే తప్ప ఇతర ప్రాజెక్టులకు వర్తించదని అధికారులు దబాయిస్తారేమో. జిఓ ఏ శాఖ జారీచేసినా అది ప్రభుత్వ జిఓయే తప్ప ఆ శాఖ జిఓ కాదు. జిఓలో వాడిన పరిభాష ప్రకారం ఎవరెవరికి వర్తించాలో వారందరికీ వర్తిస్తుంది. జిఓ 68లో వాడిన పరిభాష అన్ని రకాల ప్రాజెక్టులకూ దానిని వర్తింపజేస్తుంది. నీటిపారుదల ప్రాజెక్టు కానటువంటి గంగవరం ఓడరేవు ప్రాజెక్టు నిర్వాసితులు దీనిని అమలు చేయించుకున్నారు కాబట్టి మీరు ఏ ప్రాజెక్టు నిర్వాసితులైనా మీరు కూడా అమలు చేయించుకోవచ్చు.

10. పునరావాసం సంగతేమిటి?

వ్యవసాయ భూములేకాక నివాస ప్రాంతాలలో కూడా ప్రభుత్వం భూముల్ని సేకరించినట్టయితే, ఇళ్ళకు కూడా భూసేకరణ చట్టం కింద మొదట్లో పేర్కొన్న నియమాలు యావత్తు వర్తిస్తాయి. అంటే ఇళ్ళకు, ఇంటి స్థలానికి కూడా నష్టపరిహారం లభిస్తుంది.

ఆ తరువాత ఖాళీచేసి వెళ్ళిపోవలసిందేనా? అంటే మొన్నటిదాకా అంతే. అయితే జిఓ 68 జారీ అయిన తరువాత పరిస్థితి పూర్తిగా కానున్న కొంత మెరుగయింది. గ్రామస్తులందరూగానీ, గ్రామంలో ఒక సామాజిక వర్గంగానీ ఒక చోట కలిసి ఉండదలిస్తే వారికి ఒకచోటే పునరావాసం కల్పించాలి. వారికి ప్రభుత్వం ఉచితంగా ఇంటిస్థలం ఇవ్వాలి. దరిద్రరేఖకు దిగువన ఉన్న వారికైతే 40,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. ఆ పునరావాస స్థలాన్ని ఆదర్శగ్రామంలాగా సకల వసతులతో తీర్చిదిద్దాలి. రోడ్లు, కరెంటు, బడి, రక్షిత మంచినీటి వ్యవస్థ, ఆటస్థలం వగైరాలన్నీ ఉండాలి. ఖాళీచేసిన ఊరినుంచి అక్కడికి పోవడానికి ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు ఖర్చులకోసం ఇవ్వాలి. పవువులున్న వారికి పశువుల కొట్టం కట్టుకోవడానికి 3000 రూపాయలు ఇవ్వాలి. చిన్న అంగళ్ళు లేక ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకొని బతుకుతున్న వారికి కొత్తచోట అవి కట్టుకోవడానికి 25000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. సాగుభూమికి నష్టపరిహారం వద్దు భూమికి భూమి కావాలని కోరినట్టయితే, సాగుయోగ్యమైన భూమిగాని అందుబాట్లో ఉన్నట్టయితే రెండున్నర ఎకరాల తరి, 5 ఎకరాల మెట్ట మించకుండా ఇయ్యొచ్చు. నిర్వాసితులు ఆదివాసులైతే ఆదివాసీ ప్రాంతంలోనే వారు ఎంచుకున్న చోట పునరావాసం కల్పించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, పైన చెప్పిన అన్ని మొత్తాల మీద 25 శాతం వారికి అదనంగా ఇవ్వాలి. నష్టపరిహారం బదులు భూమికి భూమి ఇచ్చే విషయంలో ఆదివాసులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.

ఈ హక్కుల అమలు సంక్లిష్టంగా ఉండగలదు కాబటి. ప్రతీ ప్రాజెక్టుకూ జిఓ 68లోని పునరావాస పథకం అమలు నిమిత్తం జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారిని ‘అడ్మినిస్ట్రేటర్‌’గా ప్రభుత్వం నియమించాలి. ఆ అధికారి చేపట్టవలసిన మొట్టమొదటి పని, అతి తక్కువ మందిని నిర్వాసితులు చేసే ప్రత్యామ్నాయాన్ని అన్వేషించడం. ఆ తరువాత నిర్వాసితులను సంప్రదించి, పైన పేర్కొన్న పునరావాస పథకానికి ఆచరణ రూపం ఇవ్వాలి. అయినప్పటికీ అవకతవకలూ అవినీతీ ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతీ ప్రాజెక్టుకూ నిర్వాసితుల భాగస్వామ్యంతో ఒక పర్యవేక్షణ కమిటీ, ఒక ఫిర్యాదుల కమిటీ వేయాలి.

ఈ పునరావాస పథకం ఇప్పటికెక్కడా సక్రమంగా అమలుకాలేదు కాబట్టి దీని వివరాలు తెలుసుకొని అమలు చేయించుకుంటారని ఆశిస్తూ పైవివరాలు ఇచ్చాము.

ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. వర్తక వాణిజ్య రంగాల పెద్దల ప్రయోజనాలను కాపాడడంకోసం తయారుచేసిన చట్టాలు వాటంతటవి అమలవుతాయిగానీ మీ బోటి సాధారణ ప్రజల అవసరాలకోసం చేసిన చట్టాలు, జిఓలు అడుగడుగునా నిఘావేసి అమలు చేయించుకుంటే తప్ప అమలుకావు.

( మానవహక్కుల వేదిక )

పుస్తకం పీడిఎఫ్ ఫైలు ఇక్కడ దిగుమతి చేసుకోండి

Written by Polepally InSolidarity

September 3, 2008 at 7:56 am

4 Responses

Subscribe to comments with RSS.

 1. మంచి విషయాలు తెలియచేస్తున్నారు. మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు

  chilamakuru vijayamohan

  September 3, 2008 at 6:38 pm

 2. manchi vishayalu chepparu..

  bujji

  September 3, 2008 at 7:59 pm

 3. […] పూర్తి పాఠం యూనికోడ్ లో ఇక్కడ చదవండి […]

 4. […] మానవ హక్కుల వేదిక వారు వేసిన “ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…” అనే కరపత్రం లంకె కింద ఇస్తున్నాను. […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: