Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోరాట పటిమను కోల్పోయామా?

with 10 comments

– కె.బాలగోపాల్‌

మొదట నందిగ్రాం, ఇప్పుడు సింగూర్‌. పారిశ్రామికీ కరణ పేరిట ప్రజల  జీవనాధారమైన భూమిని, నీటిని, గాలిని, చెట్లను కార్పొరేట్‌ కంపెనీలకు ఎడాపెడా కట్టబెడుతున్న రెండంకెల వృద్ధిరేటు విధానాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చునో పశ్చిమ బెంగాల్‌ రైతాంగం దేశానికి చూపి స్తున్నారు. బాధిత ప్రజానీకం ఒక్కటిగా నిలబడితే ప్రతిపక్ష పార్టీలూ, ప్రజాసంఘాలూ, టీవీ చానెళ్లముందే కాక నేల మీద కూడ ప్రతిఘటనకు సిద్ధపడితే, కొట్టినా కాల్చినా అరెస్టు చేసి జెయిల్లో పడేసినా సరేననుకున్నట్టయితే, గ్రామాలనూ, భూములనూ ఖాళీచేయించకుండా ఉమ్మడిగా అడ్డు తగలడం సాధ్యమేనని రుజువు చేశారు.

గతంలో అనేక చారిత్రక సందర్భాలలో వామపక్ష పార్టీల నేతృత్వంలో ప్రజా పోరాటాలకు మార్గదర్శకులుగా నిలబడ్డ బెంగాల్‌ ప్రజలు ఈసారి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షవాది కాని నాయకురాలి నేతృత్వంలో మళ్లీ అదే పాత్ర పోషిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నందిగ్రాంలో జరిగిన హింస సింగూర్‌లో పునరావృతం కాలేదు. ప్రస్తుత ప్రయత్నాలు సఫలం అయితే కాకపోవచ్చు. అప్పట్లో సింగూరు పోరాటం శాంతియుతంగా జరిగింది కాబట్టే ఓడిపోయిందనీ, అందుకే నందిగ్రాంలో భూమి పోరాటం అనివార్యంగా హింసాత్మక రూపం తీసుకుందనీ చాలామంది వ్యాఖ్యానించారుగానీ అది తొందరపాటు వ్యాఖ్య అనుకోవలసి ఉంటుందేమో. అయిపోయిందనుకున్న సింగూరు భూపోరాటం మళ్లీ పుంజుకుంది.

ఉమ్మడిగా జనం కంపెనీవారి పనులకు అడ్డంపడి ప్రభుత్వాన్నీ టాటా వారినీ చర్చలకు లాక్కురాగలిగారు. నందిగ్రాంలో సెజ్‌ స్థాపనను వ్యతిరేకిస్తున్న వారి తరపున నిలబడ్డ ‘భూమి ఉచ్ఛేద్‌ ప్రతిరోధ్‌ సమితి’కీ, ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడం తమ పార్టీ బాధ్యతగా భావించిన సిపిఎం కార్యకర్తలకూ మధ్య ఘర్షణ మొదటినుంచి హింసాత్మకంగానే సాగింది. హింస ఇరువైపులా జరిగింది. చివరికి ప్రభుత్వానికుండే పాలనాహక్కును నిలబెట్టడానికి పోలీసులూ సాయుధ సిపిఎం కార్యకర్తలూ ఉమ్మడిగా చేసిన దాడి దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది, తీవ్ర విమర్శకు కారణమయింది.

ఆనాడు ఇది అన్యాయం అన్న ఆ రాష్ట్ర గవర్నర్‌ గోపాల కృష్ణ గాంధీ చొరవను ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘అధిక ప్రసంగం’ గా వర్ణించింది. తన పరిధి (కాబినెట్‌ పంపించిన కాగితాల మీద సంతకంపెట్టి విశ్రాంతి తీసుకోవడం) దాటి పోతున్నా డనింది. ఇప్పుడు బహుశా వారు నాలుక కరుచుకుంటున్నా రేమో. గవర్నర్‌గారు మళ్లీ పరిధి దాటిపోయి సామరస్య సాధనకు పూనుకున్నారు. ఇప్పటివరకు ఆ ప్రయత్నం ప్రజా స్వామికంగానే సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఆ చొరవే తీసుకోకపోతే ఒక పక్క రైతుల పట్టుదల, మరొక పక్క ‘ఇట్లాగయితే ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోతాం’ అన్న టాటా వారి బ్లాక్‌ మెయిల్‌, దానికి తోడుగా ‘మా ఊరికి రండి’ అంటూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలుకుతున్న ఆహ్వానం, అన్నీ కలిసి మళ్ళీ భారీగా పోలీసులను దించడాన్ని ‘అనివార్యం’ చేసేవనడంలో సందేహం లేదు.

సంఘర్షణ ఒక్కొక్కసారి ఎంత తప్పనిసరి అనుకున్నా, మానవ ప్రాణాలకు విలువ ఉందని భావించే వారందరూ దానిని నివారించే చొరవను, ఆ చొరవకు ఉద్యమకారుల వైపు నుంచి లభించిన స్పందనను హర్షిస్తారు. ఈ పోరాట స్ఫూర్తి ఇతర రాష్ట్రాల ప్రజలకు ఎందుకు కొరవడిందనేది ఆవేదన కలిగిస్తున్న ప్రశ్న. నిజానికి పారిశ్రామికీకరణ పేరు మీద జరుగుతున్న అడ్డగోలు భూసంతర్పణలో పశ్చిమ బెంగాల్‌ది మొదటి స్థానం కాదు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ లాంటి రాష్ట్రాలు చాలా ముందున్నాయి. మనది బహుశా అగ్రభాగాన ఉన్న రాష్ట్రం.

పెట్టుబడి పెడతానని ముందుకొచ్చిన వాడు ఎంత భూమి అడిగితే అంత, అక్కడ ఏ పరిశ్రమ పెడతాడో, ఏ సాంకేతిక ప్రక్రియ వాడతాడో, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాడో, ఎంత కాలుష్యం పుట్టిస్తాడో, ఏమీ తెలియకుండ ఏమీ అడగకుండ అప్పగించేస్తున్నారు. ఒక్కొక్కసారి అటువంటి వాడెవడూ కనుచూపు మేరలో లేకున్నా, ‘భవిష్యత్‌ పారిశ్రామిక అవసరా పేరు మీద ఊర్లూ పొలాలూ ఖాళీ చేసి ‘ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌’ కు అప్పగించేస్తున్నారు. గ్రామాలేమయినా చీమల పుట్టలా, భవిష్యత్‌ అవసరాల కోసం సాఫు చేసి భూమిని శుభ్రం చేసి ఏ టాటా వారో అంబానీగారో రాకపోతారా ఆ భూమిలో రూపాయలు పండించకపోతారా అని నిరీక్షించడానికి? గ్రామాలు చీమల పుట్టలే అయ్యాయి.

తెలుగుదేశం హయాంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5000 ఎకరాల భూమిని సేకరించినప్పటి నుంచి నిన్న మొన్న జమ్మలమడుగు దగ్గర స్టీల్‌ ప్లాంట్‌కు భూమి అప్పగింత దాకా, ఏ భూసేకరణలోనైనా ‘ఇంత భూమి ఎందుకు?’ అన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ ప్రశ్నను వేయవలసిన పద్ధతిలో వేస్తే అంత భూమి నిజానికి అక్కర లేదన్న జవాబు లభిస్తుందనీ, అక్కరలేని భూమి వెనక్కి వస్తుందనీ సింగూరు అనుభవం తెలుపుతుంది. కానీ మన దగ్గర అడగ వలసిన పద్ధతిలో అడగలేకపోయాం. కాకినాడ దగ్గర 10 వేల ఎకరాల భూమిలో సెజ్‌ నెలకొల్పే ప్రతిపాదన మొదట వచ్చినప్పుడు అది ఒఎన్‌జిసి వారికోసం అన్నారు.

వారి రిఫైనరీలు నెలకొంటాయన్నారు. కాని తనకా భూమి వద్దని ఒఎన్‌జిసి అనింది. అప్పుడు ఒఎన్‌జిసి కాకపోతే ఇంకొకరెవరో వస్తారన్నారు. అనంతపురం జిల్లాలో 60 వేల ఎకరాల సెజ్‌ భూతానికి మొదట ముందుకొచ్చిన డెవెలపర్‌ వెనక్కి పోగా ఇంకొకరిని తీసుకొస్తామంటున్నారు. ఒక అవసరం కోసం భూములుసేకరిస్తారా లేక భూములు సేకరించి అవసరాన్ని వెతుక్కుంటారా? ప్రజలకు జీవనాధారం అయిన భూమి అంత పనికిరానిదయి పోయిందా? ఈ క్రమంలో, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఏర్పడ్డ ఎపిఐఐసి ఒక భూముల బ్రోకర్‌ అయింది.

నగర అభివృద్ధి కోసం పథక రచన చేసి దాని అమలుకోసం చొరవ తీసుకునే లక్ష్యంతో ఏర్పడ్డ ‘హుడా’ ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు, ప్రత్యేకించి బిల్డర్లకు, కట్టబెట్టే ప్రక్రియలో మధ్య దళారీగా మారినట్టే, ఎపిఐఐసి కూడ ప్రజలకు జీవనాధారమైన భూములను కంపెనీలకు కట్టబెట్టే ప్రక్రియలో అదే పాత్ర పోషిస్తున్నది. హైదరాబాద్‌ పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా గ్రామాలలో ప్రతి భూసేకరణ వెనుక ఉన్నది ఈ కథే.

మహబూబ్‌ నగర్‌ జిల్లా పోలేపల్లి దగ్గర ఏ సెజ్‌ ప్రస్తావనా లేకుండ ఎపిఐఐసికి గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ నెలకొల్పడం అనే నిరపాయకంగా ధ్వనించే లక్ష్యంకోసం అని చెప్పి, గ్రామీణ భూములు అప్పగించి ఆ తరువాత అక్కడ అత్యంత కాలుష్య కారకాలయిన మందుల కంపెనీల సెజ్‌ నెలకొల్పారు. పోలేపల్లిలో భూములు కోల్పోయిన వారి ఆందోళనే ఇప్పటి దాకా చూశాము. ఇంకా మిగిలి ఉన్నవారు కాలుష్యం వల్ల రేపు ఊరు ఖాళీ చేసే రోజు రాబోతుంది.

అభయారణ్యాలు, రిజర్వ్‌ అడవులు, తీరప్రాంత పరిరక్షిత భూములు ఎంత పవిత్రమైనవో, అక్కడ పుల్లలు ఏరుకోవడం సహితం ఎంత నష్టకరమో ప్రభుత్వాలూ, న్యాయస్థానాలూ చెప్పగా విన్నాం. ఆదివాసులకు భూమి హక్కులు కల్పించే ‘అటవీ హక్కుల చట్టం’ వల్ల జీవ వైవిధ్యం ధ్వంసం అవుతుందన్న కారణంగా కనీసం మూడు హైకోర్టులు ఆ చట్టం అమలు పైన ‘స్టే’ ఇచ్చాయి. కానీ ఈ పవిత్ర విషయాలు కంపెనీలకు చేసే భూసంతర్పణకు అడ్డురావడం లేదు.

తూర్పుగోదావరి జిల్లా గాడిమొగ దగ్గర రిలయన్స్‌ వారికి, కృష్ణా జిల్లా పోలాటితిప్ప దగ్గర ఒక కాంగ్రెస్‌ ఎంపీగారికి మడ అడవులున్న భూమిని అప్పగించారు. వారిద్దరూ రాత్రికి రాత్రే స్థానిక గ్రామస్తులకే కొంచెం ఎక్కువ కూలి ఇచ్చి మడ చెట్లు కొట్టించారు. ఇదేం అన్యాయం అని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ను అడుగగా వారు రిలయన్స్‌ను కేంద్ర ప్రభుత్వమే ఏం చేయలేదని అన్నారట. కృష్ణా జిల్లా కలెక్టర్‌ను అదే ప్రశ్న అడుగగా వారు ఆ భూమి అసలు నిషిద్ధ ప్రాంతంలో లేదన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిజాం పట్నానికి దక్షిణాన నెలకొంటున్న పారిశ్రామిక కారిడార్‌ విస్తారంగానే మడ అడవులను మింగేయనున్నది.

కర్నూలు జిల్లాలో జిందాల్‌ వారు ఆలస్యంగా భాగస్వాము లయిన ఒక కంపెనీకి సిమెంట్‌ పరిశ్రమ కోసం 300 ఎకరాల మేత పోరంబోకుతో సహా 1500 ఎకరాల భూమి అప్పగిం చారు. మేత భూములను సిమెంటు పరిశ్రమ కెట్లా ఇస్తారని హైకోర్టులో కేసు వేయగా గ్రామ అడంగల్‌లో అది మేత భూమిగా నమోదయిన మాట వాస్తవమే గానీ అది మేత భూమిగా ఎప్పుడు మారిందో సూచించే కాగితాలేవీ లభ్యం కావడం లేదని కోర్టుకు జవాబు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం గ్రామంలో గుబురుగానున్న ఎత్తయిన చెట్ల మీదికి ఆరు నెలల పాటు వేల రకాల పక్షులు వలసవచ్చి పిల్లల్ని పొదిగి తీసుకుపోతుంటాయని పర్యాటకులకు తెలుసు. ఇప్పుడు దానికి దగ్గరున్న కాకరపల్లి శివారులో దాదాపు 20 వేల ఎకరాల పొలాల నడు మ 1400 ఎకరాలలో బొగ్గు తో నడిచే థర్మల్‌ ప్లాంట్‌ వచ్చి వాలనుంది. ఏ పర్యావరణ ప్రమాణాల ప్రకారమూ ఇది జరగగూడదు గానీ స్థానిక ప్రజలకు ఏ సమాచారమూ లేకుండ జరిగిపోతూ ఉంది. మరిక్కడ నందిగ్రాంలూ సింగూర్‌లూ ఎందుకు జరగడం లేదు? ఒక కారణం పాలకుల కుటిల నీతి. పాలకులు అంటే కేవలం రాజకీయ నాయకులు కాదు, కలెక్టర్‌ స్థాయి అధికారులు కూడ. వారు అబద్ధాలు చెప్తున్నారు. ‘భూములు పోతే పోతాయి, మీకందరికీ ఉద్యోగాలొస్తాయి’ అని చెప్తు న్నారు.

‘మీ ఊరికి కాలుష్య ప్రభావం అసలే ఉండదు’ అంటున్నారు. ‘ మీకు రోడ్లొస్తాయి, షాపులొస్తాయి, మీరంతా అభివృద్ధి చెందిపోతారు, ఇది ఇష్టపడనివారు మీకు అబద్ధాలు చెప్తున్నారు’ అంటున్నారు. గ్రామాలలో పెత్తందార్లను, కుల పెద్దలను చేరదీసి, వారికి అక్కడ రాబోయే సెజ్‌లో లేక పరిశ్రమలో చిన్న చితక కాంట్రాక్టులు ఇస్తామన్న హామీ యిస్తున్నారు. వారు తమ పెత్తనాన్ని వాడుకొని ప్రజలను అదుపు చేస్తున్నారు. లేదా గ్రామం రెండుగా చీలి ఘర్షణలు నెలకొంటున్నాయి. పార్టీలు ప్రజా సంఘాల వైఫల్యమూ ఉంది.

కొందరు నిజాయితీగా ప్రయత్నం చేసి విఫలం అవుతుండగా కొందరి పోరాటాలు టీవీ కెమెరాలను దాటి పోవడం లేదు. ఉద్యమాలకు పుట్టినిల్లుగా తన గురించి తాను చెప్పుకునే తెలుగు సమాజం ఎక్కడో ఏ ఘడియలోనో ఉద్యమించే శక్తిని కోల్పోయింది. ప్రజలను ఒక తాటిమీద సంఘటిత పరచి అన్యాయానికి అడ్డంగా నిలబెట్టే శక్తిని పార్టీలు, ప్రజాసంఘాలు కోల్పోయాయి. ఆరు నెలలు టీవీ చానెళ్లకు సెలవిచ్చి మమతా బెనర్జీని రాష్ట్రానికి ఆహ్వానిద్దామా?

Courtesy: Andhra Jyothy -Sept 10, 2008

Advertisements

Written by dilkibaatein

September 10, 2008 at 9:31 am

10 Responses

Subscribe to comments with RSS.

 1. “తెలుగు సమాజం ఉద్యమాలకు పుట్టినిల్లు” ఎప్పుడూ కాదు. పేరెన్నదగిన స్వాతంత్ర్య సమరయోధుల్లో తెలుగు తేజాలెన్ని? కుల, మత,సమాజ సంస్కరణల్లో మన తెలుగు ప్రజల contribution ఎంత? మన పోరాటపటిమలు చెప్పుకోవడానికేగానీ, నిజానికి లౌక్యాన్ని పుణికిపుచ్చుకున్న జాతి మనది. పోరాటానికికాదు, ఎప్పుడూ బతకనేర్వడానికే మన ప్రధమ తాంబూలం.

  కాబట్టి, అత్యాశ మానుకుని నిజాల్లో జీవిద్దాం. ఈ గ్లోబలైజేషన్ ద్వారా బాగుపడిన మధ్యతరగతి ఈ ఉధ్యమాలకు దూరంగా వుండటానికి ఇష్టపడుతుంది. మేధావులు తమ మేధతో ఈ తంతువల్ల అప్పటికే కడుపు మండిన పెదవాడి గుండెను మండించి, ఆ వేడిలో తమ మేధను వాడి చేసుకుంటారు. వ్యాసాలు, ప్రసంగాలూ, ధీసీస్ లూ, డాక్టరేట్లూ గడిస్తారు. చివరకు మిగిలేది, పేదవాడికోపం పెదవికి చేటు…అంతే !

  సాధారణంగా ఈ పోరాటాలు కొనసాగించే వామపక్షాలు తమ గురివింద నలుపు బెంగాల్లో గ్రహించి మిన్నుకుండిపోతాయి. మమతా బెనర్జీ అధికారంలో వుండుంటే ఇప్పుడు తను చేసే పోరాటం ఈ పార్టీలే జరిపుంటాయి. నంది పందైనా, పంది నందైనా నష్టపోయే పేదవాడికి ఒరిగేదిమాత్రం, నిండుసున్న.

  అందుకే ఈ ప్రాజెక్టులు ఆపేసే పోరాటాలు మాని, పేదలకు కనీసం సరైన compensation అందించే మార్గాలు వెదకండి.

 2. మహేశ్,

  మీ వ్యాఖ్యలో కొన్ని నిష్టుర సత్యాలు ఉన్నాయి. కానీ కొంత అసంబద్ధ వాదనా ఉంది.

  ఎన్ని చారిత్రక తప్పిదాలు చేసినా ఇవ్వాళ్టికీ ఈ దేశంలో అంతో ఇంతో పేదవాడి తరఫున పోరాడుతున్నది వామపక్షాలే. అధికారంలోకి వచ్చిన చోట వారి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చే పని చేస్తున్నారన్నది కూడా నిజమే. అంతమాత్రం చేత అసలు పోరాటమే నిష్ఫలం అనే అర్ధంలో మీరు వాడిన “పేదవాడి కోపం పెదవికి చేటు”, “ఒరిగేది నిండు సున్న” అనే వాక్యాలని మాత్రం నేను ఒప్పుకోలేక పోతున్నాను. అసలీ పోరాటాలే లేకపోతే ఈపాటికి వంటిమీద ఉన్న బట్టలు కూడా వలిచేసుకునేవి మన ప్రభుత్వాలు.

  రాజ్యాంగ బద్ధంగా, న్యాయబద్దంగా తమకు రావల్సిన నష్టపరిహారం, పునరావాసం రాకపోవడం వల్లనే కదూ ప్రజలు పోరాటాలు చేస్తున్నది.

  ప్రాజెక్టులు ఆపాలనే పోరాటాలు మానేయాలని, నష్టపరిహారం అందించే మార్గాలు వెతకాలని ఉచిత సలహా ఇచ్చారు. మీ నుండి అస్సలు ఊహించని sarcastic వ్యాఖ్య ఇది.

  ఏళ్లకు ఏళ్లు శాంతియుతంగా ధర్నాలూ, నిరసనలూ చేస్తే పట్టించుకునే దిక్కులేదు. పైగా దారుణ అణచివేతతో ఉద్యమాలను ఎదుర్కొనే పనిచేస్తున్నాయి మన ప్రభుత్వాలు.

  అసలేమీ చేయకుండానే నష్టపరిహారం సాధించుకునే గొప్ప అయిడియాలు ఏమైనా మీ వద్ద ఉంటే ఇవ్వగలరు.

  Konatham Dileep

  September 11, 2008 at 1:48 pm

 3. బాల గోపాల్ గారు.. చాలా బాగా చెప్పారు సార్, సింగూర్, నందిగ్రాం లలో కుడా ఉద్యమాన్ని మొదలుపెట్టింది SUCI అనే కమ్యూనిస్టు పార్టీనే అన్న సంగతి మీరు మరచిపోయినట్లు ఉన్నారు. కాకపోతే తృణమూల్ కాంగ్రెసుకి బలం ఎక్కువగా ఉండటం వలన ఆ పార్టీ పేరు వెలుగులోకి రాలేధు.

  ఇక మహేష్ గారు ఒక వ్యాఖ్య చేసారు “తెలుగు సమాజం ఉద్యమాలకు పుట్టినిల్లు ఎప్పుడూ కాదు ” అని, శ్రీకాకుళ ఉద్యమం ఆయన మరచి నట్లు ఉన్నారు. ” ఈ విప్లవాగ్నులు ఎచటవని అడిగితే శ్రీకాకుళం వైపు చేయి చూపించాలి” అనే గీతం/కవిత మీకు గుర్తులేదా మహేష్ గారు..దానికి దాశాబ్ధాల పూర్వమే జరిగిన తెలంగాణా విమొచనోద్యమం ఉద్యమం కాదా!! లేక తెన్నెటి విశ్వనాధం నడిపిన ప్రత్యేక అంధ్ర ఉద్యమం ఒక ఉద్యమం కాదా!

  మహేష్ గారు అన్నట్లు globalization వలన మద్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడలేదు. వాళ్ళని ఒక తెలియని మత్తులో పడేసి, పోరాటాలకు పనికిరాకుండా కృత్రిమ జీవితానికి అలవాటుపడేట్లు చేసాయి ఈ బహుల జాతి కంపెనీలు. జీవితమంటే నా కుటుంబం కోసం బ్రతకటం, పొదుపు అనే పదం లేకుండా విచ్చల విడిగా ఖర్చు చేయడం అనే విధంగా మార్చాయి. ఈ విషయం లో మన ప్రభుత్వ పాత్ర చాలా వుంది. ఒక మేధావి మౌనం దేశానికి ఎంత చేటో మీరు మరచినట్లు ఉన్నారు. పేదల తరుపున వకల్తా పుచ్చుకోవడమే ఈ మేధావులు చేసిన తప్పా!

  ఈ ఉద్యమం కూడా ఒక కమ్యూనిస్టు పార్టినే మొదలు పెట్టింది మహేష్ గారు. బెంగాల్ లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఆ రెండే అనుకుంటే పొరపాటు. మావోయిస్టులు కూడా ఈ ఉద్యమానికి వత్తాసు పలికారు. ప్రతీ పోరాటం విజయం సాధించాలని లేదు. ఒక పోరాటం విఫలమైనా అధి ప్రజల్ని మానసికంగా మరింత శక్తివంతులని చేస్తుంది. ఆ శక్తి ఈ ప్రజలు మరిన్ని పోరాటాలు చేసేలా చేస్తుంది. పోరాటాలు ఆపేస్తే మనకి స్వాతంత్ర్యం వచ్చేదా? ప్రోజెక్టులు కట్టొచ్చు కాని వాళ్ళకి ఈ సారవంతమైన భూమే కనబడిందా! ఒక పేద రైతునుండి భూమి లాక్కుని అతనికిచ్చే లక్షలతో అతడు ఎంతకాలమని బ్రతుకుతాడు. వ్యవసాయం తప్ప ఏమీ చేత కాని ఆ రైతుకిచ్చిన ఆ డబ్బు కొద్ది కాలం వరకు అతడిని ఆదుకోగలదు, ఆ తర్వాత ఆ రైతు ఏం చేయగలడు, ఆత్మహత్య తప్ప!

  sarat chandra

  September 11, 2008 at 7:06 pm

 4. నా పిడివాదానికి కొన్ని కారణాలున్నాయి. ప్రజా ఉద్యమాలకు నా మద్దత్తు ఎప్పుడూ వుంటుంది. కానీ, ఈ మధ్యకాలంలో సైద్ధాంతిక శూన్యంలో కొట్టుమిట్టాడుతూ వారి నాయకత్వం మీద ఆశతో నిలబడుతున్న సామాన్యుల్ని ప్రతిచోటా నిలువునా ముంచుతున్న వామపక్షాల పోరాటాలమీద నాకు ఎక్కడ లేని అసహనం పుట్టుకొస్తోంది.

  అధికారంలో వుండగా SEZ లకు ఇచ్చే నష్టపరిహారం ప్యాకేజిని standardize చేసి విధానపరంగా నిర్ణయించే అవకాశంవుండీ చెయ్యకుండా, ఇప్పుడు దొరికినచోటల్లా దొంగనాటకాలాడుతుంటే వారిని గుడ్డిగా సమర్ధించలేక, కనీసం పేదవాళ్ళని వాళ్ళ మానాన వదిలెయ్యమంటున్నాను. పోరాటాలకన్నా advocacy ద్వారా విధానపరమైన మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించమంటున్నాను.

 5. “…అందుకే ఈ ప్రాజెక్టులు ఆపేసే పోరాటాలు మాని, పేదలకు కనీసం సరైన compensation అందించే మార్గాలు వెదకండి” అనే వితండవాదం “గ్లోబలైజేషన్ తోటీ నిర్వీర్యులైన మద్య తరగతి” mind set నుంచి వచ్చే మాటలే.

  ఉన్నవాని భుమికి అవసరానికన్నా ఎక్కువ నష్టపరిహారం ఇప్పించి (పలుకుబడి, పరిచయాలు ఉంటయి కాబట్టి) లేనివాని భుమి గుంజుకుని అసలు కన్న తక్కువ, లేదా అసలే ఇయ్యని ప్రభుత్వం దెగ్గరనా , advocacy ద్వారా విధానపరమైన మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించమంటున్నది. గట్టిగ ఉద్యమించి అడిగితెనే ఇన్ని ఏన్లు సతాయిస్తున్నరు, advocacy చేసి ఎన్ని తరాలను ఇంకా వెట్టి చేయమంటున్నరు?

  “కనీస హక్కులు” ఎవరన్న అడగంగనే సాలు, అసలు విషయాన్ని వదిలి ఉద్యమించే వాల్లను brand చేసే ముందు, మన contribution ఎంత అన్న విషయం మనం ఒకసారి ప్రశ్నించుకోవాలె ! అసలు ఉద్యమం ఎందుకు, ఎవరికోసం, ఏ కారణాల కోసం జరుగుతున్నది, అన్న ముచ్చట పక్కన బెట్టి, వీల్ల నాయకత్వం మీద నమ్మకం లేదు, వాల్ల నడవడిక మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నయి అని అనుకునుడు కూడ, middle class escapist mentality లక్షణమే !

  JayaPrakash Telangana

  September 11, 2008 at 8:45 pm

 6. మహేశ్,

  నువ్వంటున్నట్టు సెజ్ ల వంటి కొన్ని విషయాల్లో వామపక్షాలు అధికారంలో ఉన్నచోట ఒకలా, లేనిచోట ఒకలా మాట్లాడుతున్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వామపక్షాల పోరాటాలే ఇవ్వాళ ప్రభుత్వాలని సంక్షేమం గురించీ, సామాజిక న్యాయం గురించీ మాట్లాడేటట్టు చేస్తున్నాయి. తాజా ఉదాహరణే ఇవ్వాలంటే ఒక్క బషీర్ బాగ్ ఉద్యమం వల్ల ఎనిమిదేళ్ళుగా విద్యుత్ చార్జీలు పెంచే సాహసం చెయ్యలేదు మన రాష్ట్ర ప్రభుత్వాలు.

  ఇంకో విషయం. రాష్ట్రంలో జరుగుతున్న రెండు ముఖ్య సెజ్ వ్యతిరేక ఉద్యమాలు (పోలేపల్లి, కాకినాడ) ప్రధాన కమ్యూనిస్టు పార్టీల (CPI, CPM) దన్ను లేకుండానే ఉధృతంగా కొనసాగుతున్నాయి.

  Konatham Dileep

  September 12, 2008 at 10:28 am

 7. విద్యుత్ చార్జీలు పెంచలేదని సంతోషించాలా? భవిష్యత్తులో అసలు మన విద్యుత్ ఎలా ఉంటుందో తల్చుకొని బాధ పడాలో అర్థం కావడంలేదు.

  chavakiran

  September 12, 2008 at 12:43 pm

 8. ఏమీ బాధ పడొద్దు కిరణ్. మన్మోహన్ అణు ఒప్పందం కుదుర్చుకున్నాడు గదా ఇక “చౌక విద్యుత్” కుప్పలు తెప్పలుగా లభ్యమవుతుంది :)

  Konatham Dileep

  September 12, 2008 at 1:17 pm

 9. :)

  chavakiran

  September 12, 2008 at 2:46 pm

 10. Balagopal sir baga chepparu, ground realities ne close ga observe chestunnaru kanuka cheppagaligaru

  rajesh

  September 12, 2008 at 3:49 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: