Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ప్రత్యేక ఆర్థిక మండలాలు – మహిళలపై ప్రభావం

with one comment

సెజ్‌ల వల్లత భూములు కోల్పోయిన రైతుల కష్టాలను, ఈ పరిణామాలతో మరిన్ని అవస్థల పాలవుతున్న స్త్రీల పరిస్థితిని వివరిస్తున్నారు సాదు రాజేష్‌

అభివృద్ధి ఎలా ఉంటుంది? అభివృద్ధి ఫలాలు ఎవరు అందుకోవాలి? అభివృద్ధి అవసరం ఎవరికి కావాలి? అభివృద్ధిని ఎలా సాధించాలి? ఈ ప్రశ్నలకు నేడు మన ప్రభుత్వాల నూతన అభివృద్ధి సంస్కరణల విధానం స్పష్టంగా తెలియజేస్తోంది. అభివృద్ధి అంటే పచ్చని పంటలతో తులతూగే పల్లె సీమలను విస్తాపనం చేసి వాటి స్థానంలో ధగధగ కాంతులతో మెరిసే హోటల్స్‌ను, సినిమాహాళ్లను, టౌన్‌షిప్‌లను, హబ్‌లను, పబ్‌లను నిర్మించి కొంతమంది ధనికులకు ఆనంద నిలయాలను తయారు చేయడమే అభివృద్ధిగా చెప్పడం జరుగుతోంది. బలవంతంగా పేద, మధ్యతరగతి రైతుల భూములను లాక్కొని వారి జీవితాలను నిర్వాసితం చేసి అభివృద్ధి ఫలాలను అందుకోండి అని చెపుతోంది. విదేశీ మారక ద్రవ్యం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో విదేశీ భూభాగంను సృష్టించడమే అభివృద్ధిగా చెపుతోంది. ఇందుకు ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి నమూనా ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌) నిర్మాణం.

ఈ సెజ్‌లు దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలు, వ్యవసాయ, వ్యవసాయాధారిత కుటుంబాల ప్రజలు మూకుమ్మడి విస్తాపనలతో తల్లడిల్లుతున్నాయి. ఈ సెజ్‌ రేపిన సెగ పచ్చని పల్లె జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఊసురోమంటున్న రైతులు ప్రాణాలను తీస్తోంది. ఈ సెజ్‌ల నిర్మాణం వెనుక ఈ శతాబ్దపు పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ పేరున బహుళజాతి సంస్థల పెట్టుబడులు, దేశీయ పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నూతన దళారులైన డెవలపర్లు దాగి ఉన్నారు. నాటి ఈస్టిండియా కంపెనీ పాలన తిరిగి సెజ్‌ల రూపంలో రాబోతోందని బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ మన పాలకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పాలకులు సెజ్‌ల నిర్మాణంలో దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించడం ఆందోళన, ఆశ్చర్యంను కలిగిస్తోంది.

తమ స్వంత భూములలో తమనే కూలీలుగా చేసి, ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ లేకుండా చేసే ఈ విధానం అభివృద్ధిలో భాగమే సహజమేనని అంటున్నారు. అభివృద్ధి పేరుతో పేదవాళ్ల గుడిసెలు మాయమైపోతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ తాత ముత్తాతల నుండి పశువులను, వ్యవసాయంను నమ్ముకొని జీవనం గడుపుతున్న రైతు జీవితం కనుమరుగవుతోంది. ఇక వ్యవసాయ పొలాల్లో రైతు, పనిచేసే కూలీ కనిపించరు. వీరంతా తమ భూముల్లోనే నిర్మించబోయే, నిర్మించాలనుకునే, నిర్మిస్తున్న ఫ్యాక్టరీల గేట్లకు సెక్యూరిటీ గార్డులగానో లేక మలినాన్ని శుభ్రం చేసే స్వీపర్‌లుగానో అవతార మెత్తుతున్నారు. ఎటు చూసినా పచ్చగా ఆహ్లాదభరితంగా కనిపించే కోస్తా తీరం కోస్టల్‌ కారిడార్‌ పేరుతో పెట్రోల్‌, రసాయనాల ఫ్యాక్టరీలకు కేంద్రం కాబోతోంది. విశాలమైన జీడిమామిడి, సపోట, కొబ్బరితోటలు కనుమరుగై అభివృద్ధి పేరుతో వస్తు ఉత్పత్తి ఎగుమతి కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి.

ఆరుగాలం కష్టపడే రైతు సెజ్‌ల వలన భూమికోల్పోయి, తన భూమిచుట్టూ ముళ్లకంచెను నిర్మించి, భవనాలు నిర్మిస్తుంటే ఆ నిర్మాణంకై తనే కూలీగా మారి ఇటుకలను అందిస్తూ జీవచ్ఛవంలా ఏమి చేయలేక కుమిలిపోతూ ఏడుస్తూ… ఏడుస్తూ గుండె బరువెక్కి చివరికి గుండె ఆగిపోతే తన చితికి ఆరడుగుల నేల దొరకని దైన్యస్థితి సెజ్‌ నిర్మాణ ప్రాంతాల్లో నెలకొంది. తాము కోల్పోయిన భూములకు సరియైన నష్టపరిహారం, పునరావాసం కల్పించండి అని అడిగితే జైలు గోడలేదిక్కవుతున్నాయి. ‘మా భూములు లాక్కోవడం మూలంగానే తమ భర్తలు చనిపోయారని రైతుల భార్యలు, పిల్లలు ఆవేదనతో ఆందోళన చేస్తున్నా, ఈ ఆవేదనలు, ఆందోళనలు అభివృద్ధి రథచక్రాల కింద నలిగిపోతున్నాయి. కుటుంబ యజమాని చనిపోయి భారమంతా మహిళల పై పడటం మూలంగా అప్పులను తీర్చలేక, పనులు దొరక్క, పిల్లలను సాకలేక బాధ్యతలను నేరవేర్చలేని అయోమయ స్థితిలో ఉండటం విచారకరం. ‘మా భూమి మాకు కావాలి, మాకు కంపెనీల కూలీ వద్దు’ అని సెజ్‌ బాధిత స్త్రీలంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. భూమినే నమ్ముకొని జీవిస్తున్నందుకే పుట్టెడు దుఃఖం, వేలకొలది అప్పులు బహుమతులుగా మిగిలిపోతున్నాయి. తమ భూముల్లోనే తాము వలస జీవుల్లాగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది. అది సత్యవేడు కావచ్చు, కాకినాడ కావచ్చు, పోలేపల్లి కావచ్చు ప్రాంతాలు వేరైనా మహిళల బాధలు ఒకటే. సమాజంలో ఇప్పటికే అనేక అసమానతలతో హింసకు గురి అవుతున్న మహిళల జీవితాలపై రాజ్యం అభివృద్ధి పేరుతో భయ భ్రాంతులకు గురిచేస్తూ జీవితాలను ఆభద్రతాభావంలోకి నెట్టివేస్తోంది. నమ్ముకున్న భూమి కోసం మహిళలు అనుభవిస్తున్న బాధలను పరిశీలించాల్సి అవసరం ఉంది.

మన రాష్ట్రంలో మొదట చిత్తూరు జిల్లా సత్యవేడు, వరదయాపాళెం మండలాల పరిధిలో ‘శ్రీ సిటీ కంపెనీ’ భూసేకరణను ప్రారంభించింది. మొదటగా కొంతమంది రైతులు డబ్బు ఆశకు అమ్ముకోవడం జరిగింది. ఈ మండలం పరిధిలో 12 వేల ఎకరాల భూమిని సేకరించారు. 12 గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. బలవంతంగా పట్టా భూములకు మూడున్నర లక్షలు, పట్టాకాని భూమికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. భూమిపై ఆధారపడి పెట్టుబడులకు అప్పులు ఇచ్చిన వాళ్లు ఇబ్బందులు పెట్టడంతో కొంతమంది బలవన్మరణాలు పొందటం, అనారోగ్యంతో చనిపోవడంతో మహిళలపై కుటుంబ భారం ఎక్కువయ్యింది. శాకమూరి పద్మావతమ్మ (70) వరదాయపాళెం మండలం మోపురుపల్లి గ్రామవాస్తువ్యురాలు. ఈమె కొడుకు నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోవడం, సెజ్‌ వచ్చి వీరికున్న ఆరు ఎకరాల భూమి పోవడంతో బతకడం ఇబ్బందిగా మారింది. తను ఆవేదనతో ఇలా అంటోంది. ‘కయ్యతో పొరకవాడినా మొగోడి మాదిర్తో సెద్దిం జెసినా, పియ్యిదినో, పిడకలేరో గుట్టుగా సంసారం జేసినం, ఆ కష్టమంతా నాశనం అయిపోయింది. అదెందో సెజ్‌ అంటా, వాళ్లకి దూము తగల…… మా భూములే కావాల్సిచ్చోనాయ్‌. ఫ్యాక్టరీలు కడతరంటా, ఇంటింటికి ఉజ్జోగలంటా, మాకొద్దు సామీ…. మామానాన మమ్మల్ని బతుకనియ్యండి అని కాళ్లావెళ్లబడి బతిమిలాడినం. భూమి పోతే ఏమి? ఇగంతా బంగారమే అని చెప్పినారు. కాయితాల్లో ఎందెందో రాసుకున్నారు. మాకు భూమి తల్లికి బంధం తెగిపోయింది. మడకగట్టి, అడుసు తొక్కా, నాట్లేసిన మా భూములు చూడబోము ఇప్పుడం’టూ గుండె బరువుతో తన ఆవేదనను తేలియజేసింది. పద్మావతమ్మ లాంటి మహిళలు అనేకమంది కుటుంబ భారాలను భరించలేక, నిస్సహాయ స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికీ శ్రీసిటీ యజమాన్యం ఏయే కంపెనీలనకు ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత లేదు.

సత్యవేడు తరువాత ఆంధ్రప్రాంతంలో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలాల ఆందోళనలో ఎక్కువగా మహిళలు భాగస్వాములవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనగానే ఆహారధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మొదట కాకినాడ సెజ్‌ 10,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం 12,500 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. కాకినాడ దగ్గర సహజవాయు నిక్షేపాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఒ.ఎన్‌.జి.సి. వారికి శుద్ధి కర్మగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది. ఈ సెజ్‌ ఏర్పాటు వలన యు కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సుమారు 16 గ్రామాలు ధ్వంసం అయిపోయినాయి. కాకినాడ సెజ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే తమ భర్తలను అరెస్ట్‌ చేసి జైలులో పెట్టారు. మా అనుమతి లేకుండా మా భూములను లాక్కొంటున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించిన మహిళలు అని చూడకుండానే లాఠీలతోని సమాధానం చెప్పుతున్నా రంటున్నారు. ‘మమ్మల్ని కబేళాలకు తరలించండి’ అన్న స్త్రీల ఆర్తనాదాలు ప్రతి గ్రామంలో వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చ్‌ 8న ‘మహిళా ఆక్రందన దినంగా’ ఇక్కడి మహిళలు ఆందోళన చేసారు. ప్రత్యేకంగా సెజ్‌ వ్యతిరేక మహిళా సంఘంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎస్‌.ఇ.జెడ్‌. గ్రామీణ జీవనం మీద ప్రభావంతోపాటు మహిళలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. కాకినాడ సెజ్‌ బాధిత మహిళల మనోభావాలను పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి.

పాటి గంగానాగేశ్వరమ్మ (38) యు. కొత్తపల్లి మండలం, శ్రీరాంపురం గ్రామ నివాసి. తన ఆవేదనను ఈ విధంగా వెల్లిబుచ్చింది, ‘మా భూములు పనికిరావని, నిస్సారమయినవని, పంటలు పండవని, రెవెన్యూ అధికారులు, ప్రైవేట్‌ వ్యాపారులు బెదిరించి లాక్కున్నారు. మా భర్తలను జైలుకు పంపారు. ప్రతి సంవత్సరం మూడు పంటలు పండుతున్నాయి. ఈ సెజ్‌ వస్తుందని గత రెండు సంవత్సరాల నుండి ఒక్కపూట తిండి మాత్రమే తింటున్నాం. మాకు ఓ పండుగా లేదు, సంతోషం లేదు. ఏ రాత్రి పోలీసోల్లు వచ్చి మా భర్తలను, పిల్లలను తీసుకుపోతారనే బెంగతో ఉన్నాం. మా బాధలను తీరుస్తాడని చంద్రబాబును ఓడించి వై.ఎస్‌.ను గెలిపిస్తే మా పంట పొలాలను లాక్కోమని ఆజ్ఞాపించాడు. మేం ఎలా బతకాలి? మాకు పంచభక్ష పరమాన్నం వద్దు. ఏ చెట్టు కాయో పండో తిని బతుకుతున్నాం. కానీ మా భూములని మాత్రం వదిలివెళ్లం. ఈ సెజ్‌ వచ్చాకే మాకు, మా భర్తలతో బెంగ మొదలయ్యింది. రొజుకొక గండంగా జీవచ్చవంలాగా బతుకుతున్నాం. మా పిల్లల్ని చదువుకు కూడా పంపించలేని స్థితిలో ఉన్నాం. ఎవరు సహాయం చేసినా వాళ్లకు చేతులెత్తి దండం పెడుతాం’ అని అంటోంది. కాకినాడ సెజ్‌లో భూములు మొత్తం సారవంతమయిన భూములు. మాకు ఏ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు అవసరం లేదు.మా పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. కొంతమంది స్త్రీలు తమ భర్తలు వలస వెళ్లారని, వచ్చిన ఆ కొద్ది డబ్బులతో జల్సా చేయడం మూలంగా ఏ పని లేకపోవడం భారం అంతా మా పైననే పడుతుందని ఆవేదనతో వెల్లడిస్తున్నారు.

మన రాష్ట్రంలో మహిళల జీవితాలలో చీకట్లను, కడగండ్లను నింపి నిస్సహాయ స్థితిలో పడవేసిన సెజ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల దగ్గరి పోలేపల్లి ఎస్‌.ఇ.జెడ్‌. దాదాపుగా నలభై కుటుంబాల యజమానులు గుండె బరువెక్కి, భూములు పోయాయనే ఆవేదనతో బలవన్మరణాలను పొందారు. మొదట 2003లో పోలేపల్లి వద్ద 969 ఎకరాల భూమిని ఎ.పి.ఐ.సి.సి. సేకరించింది. ఔషధ కంపెనీల కోసం ఈ భూమిని సేకరించింది. పోలేపల్లి సెజ్‌తో రాష్ట్రంలో రోజుకొక అమాయక రైతు బలవన్మరణాలను పొందుతున్నారు. ఇక్కడి మహిళలు ఆందోళన కరమయిన దుస్థితిలో ఉన్నారు. సిరులు పండించే రైతులు ఊపిరులు పోతున్నాయి. అందుకే న్యాయం కావాలని మహిళలు ఉద్యమిస్తున్నారు. పోలేపల్లి సెజ్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్కరకమయిన బాధ. అందరూ బాధితులే. అభివృద్ధి కోసమని భూమిని లాక్కొన్నారు. భూమికోసం పోలేపల్లి, గుండ్లగడ్డ తండావాసులు మూడు నెలల పాటు చెట్టుకిందనే వంటలు చేసుకోని పోరుచేసారు. స్త్రీలను పోలీస్‌వాళ్లు విచక్షణారహితంగా కొడుతూ, అసభ్యంగా తిడుతూ, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని పోలేపల్లి నివాసి చుక్కమ్మ ఆవేదనతో అంది. చుక్కమ్మ భర్త నర్సయ్యకు మూడున్నర ఎకరాల భూమి ఉండేది. భూమి లాక్కోవడంతో మనోవేదనతో ఆరు నెలలకే చనిపోయాడు. చుక్కమ్మకు నలుగురు మగపిల్లలు. అందులో ఒకరు పదవ తరగతి, ఒకరు ఇంటర్‌ చదువులు అయిపోయి అరబిందో కంపెనీలో కూలీలుగా మారిపోయారు. ఆర్‌.డి.ఒ., కలెక్టర్‌, పోలీస్‌ వాళ్లకు భయపడకుండా ఎదురు తిరిగినా చుక్కమ్మ తన భర్త ఫోటో చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తోంది. కింద నుండి పై దాకా అధికారులు మొత్తం మా భూములను లాకోకవటంలో సూత్రధరులేనని అంటోంది. కంపెనీలో కూలీకి వెళితే అనేక అమానవీయమయిన మాటలతో దూషిస్తున్నారని చెప్పింది.

అంజమ్మది రెండుఎకరాల భూమి పోయింది. భర్త చనిపోవడంతో అప్పులు తీర్చడానికి ఊరోదిలి వేరే ఊరిలో కూలీ పని చేసుకొని అప్పు తీర్చుకుంటోంది. ఎడ్లమ్మి వచ్చిన పైసలతో కొడుకు కోడల్ని సాదింది. ఈమె భర్త 2006లో చనిపోయాడు. పోయిన తన పొలం చూసి వస్తానని చెప్పి పొలంలో కూర్చోని కుమిలి కుమిలి అక్కడే కుప్పకూలిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకపోతే నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడు. అంజమ్మ ఇప్పుడు కొడుకు, కోడలితో జీవచ్ఛవంలా ఉంది. భర్త ఫోటోను గుండెలకదుముకుంటూ ఏడుస్తోంది. ‘భూమికోసం ధర్నా చేస్తే – చెట్టుకింద అన్నం తింటుంటే గిన్నెల్ని కాళ్లతో తన్ని తీసుకపోయి జీపుల ఎసిండ్రు. అల్ల గిన్నెల గుడంగ మెతుకు ఉండదు’ అని ఆక్రోశించింది.

పోలేపల్లి సెజ్‌ కుటుంబ సంబంధాలలో, మానవీయ బంధాలలో కూడా చిచ్చును రేపుతోంది. భూమి పోవడంతో ఇల్లరికం వచ్చిన అల్లుడు బిడ్డను వదిలివెళ్లాడని ఒక రైతు బాధపడితే, అల్లుడుకు భూమి లేదని బిడ్డను తండ్రి తిసుకుపోవడం లాంటి ఘటనలు కూడా ఇదే గ్రామంలో ఉన్నాయి.

సారవంతమయిన భూములుపోయి, నిస్సహాయ స్థితిలో, జీవిచ్ఛవంలా భర్తలు చనిపోవడంతో గుండె బరువుతో మహిళలు జీవిస్తున్నారు. ఎదో కొంత ఉపాధితో పిల్లలను బతికించుకుంటున్నారు. మనసు చంపుకొని ఫ్యాక్టరీల్లో కూలీకి వెళితే అక్కడి వెకిలి మాటలతో బనాయిస్తున్నారు. స్త్రీల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ, కనీసం మూత్రానికి పోయినా దానికే పోయినవని సాక్ష్యం ఏంటి అని అనుమానిస్తున్నారని అంటున్నారు. ఉదయాన్నే ఇండ్లలో పనిచేసి తొమ్మిది గంటలకల్లా ఫ్యాక్టరీలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా సెక్యూరిటీ గార్డ్‌లతో తరిమివేస్తారు. మధ్యాహ్నం సరిగ్గా భోజనం కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రత లేదు. ఎలాంటి హక్కుల్లేవు. బానిస ల్లాగా చూడటంతో దిక్కుతోచని స్థితిలో ఇక్కడి ప్రజలు బతుకుతున్నారు.

ప్రత్యేక ఆర్థిక మండలాలు అభివృద్ధికి నిలయాలుగా మారుస్తామని, వస్తు ఉత్పత్తి ఎగుమతి చేయడానికే ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుతూనే కనీసం మర్యాదగా జీవించలేని పరస్థితిని సృష్టిస్తున్నారు. అభివృద్ధి మంత్రం అమాయక పేదలకు అభయ హస్తానివ్వాలి కాని నిరాశ్రయులను చేయడం ఎంతవరకు సమంజసం. ఈ సెజ్‌లవలన మహిళలే ఎక్కువగా బాధపడే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రభుత్వం చెప్పుతున్నా మహిళలకు సెజ్‌ల వలన రక్షణలేకుండా పోతోంది. అభివృద్ధి ఫలాలను అందుకునే స్థితిలో లేరు. అభివృద్ధికి ఆమడదూరంలోనే ఇంకా ఉంటున్నారు. ఈ సెజ్‌లు దేశ వ్యాప్తంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంగా మారాయి. ఏ కంపెనీలు ఏర్పడు తాయోననే స్పష్టత లేకుండా భూములను సేకరించడం మూలంగా రైతులు చనిపోయివారి భార్యా పిల్లల మనోవ్యధ ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఈ ప్రజాస్వామిక దేశంలో దేశానికి అన్నంపెట్టే రైతు విలవిల్లాడి పోయి ఆత్మహత్య చేసుకుంటుంటే వారి శవాలమీద ఫ్యాక్టరీలను నిర్మించి, బహుళజాతి సంస్థలను ఆహ్వానించి భవనాలు లేపుతున్నారు. ఇవి వాస్తవానికి అభివృద్ధిని ప్రజలకు అందించగలిగేవేనా?

Advertisements

Written by Polepally InSolidarity

September 11, 2008 at 9:38 pm

One Response

Subscribe to comments with RSS.

  1. manaku okariddaru mamata benerjeelu kavalemo..

    bujji

    September 12, 2008 at 1:47 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: