Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

భూమికోసం

leave a comment »

– అల్లం నారాయణ

bhumi kosam

illustration : Akbar

ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపు తున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది.

బెంగటిల్లి చచ్చిపోయిండు శంకరయ్య. ఒక మామూలు రైతు. శంకరయ్య పోలేపల్లి బాధితుడు. మళ్ళీ పోలేపల్లి గురించే మాట్లాడాల్సి వస్తున్నది. ఉత్తమాటలే. ఏమీ జరగడం లేదన్నది పోలేపల్లి బాధితుల ఫిర్యాదు. నిజమే ఏమి జరుగుతుంది. చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఆయనకు సిరిసిల్లలో చే’నేతన్న’లు ఆత్మహత్య చేసుకోవడమూ, పోలేపల్లిలో అన్యాయంగా రైతులను బేదఖలు చేయడం అబ్బురమైపోతున్నది. ఒక సమస్యగానైనా కనబడ్తున్నవి. ఆయన తాజాగా ఉన్నారు కనుక ఇది మాట్లాడ్తున్నారు. కానీ, ఆత్మహత్యలు, నిర్వాసితులు, నేలను తలకిందు చేసి సబ్బండ వర్ణాలకు, కోటొక్క పరిసెకూ బువ్వ పంచిపెట్టే రైతన్నల బలవన్మరణాలు పట్టించుకునేంత పెద్ద సమస్యలుకాదు.

తోలు మందం పెరిగిన రాజకీయవేత్తలు ఎవరి ఊహాస్వర్గాల్లో వాళ్లు తేలియాడుతున్నారు. ఎవరితో పొత్తుపెట్టుకుంటే ఎన్ని సీట్లొస్తాయి. సీపీఐతో, సీపీఎం కలవాలా? చంద్రబాబు తో కామ్రేడ్స్‌ కత్తు కలపాలా! మధ్యలో టీఆర్‌ఎస్‌తో ప్రేమ విహారం చెయ్యాలా? బీజేపీ ఏం చెయ్యాలి! కాంగ్రెస్‌ ఒంటరియేనా! ఇదీ కదనకుతూహలం. ఇదీ పార్టీల ప్రాథమ్యం. సిరిసిల్ల ఉరిశాల అయితేనేమి? ఆకలి చావు చస్తేనేమి? ఆత్మహత్య చేసుకుంటేనేమి? ‘ఎవరికి పుట్టినవే బిడ్డా అంటే అంగట్ల పుట్టిన అవ్వా’ అన్నట్టు… ఎవరు వాళ్లు. ఎవరి శవాలవి! చివరికి బొందపెట్టడానికి ఊరిలో ఆరుగజాల నేల కరువైందని కన్నీళ్లు పెట్టుకుంటున్న పోలేపల్లి సెజ్‌ బాధితులను అడుగు.

ఇప్పటికే గోడలు కట్టేసుకుని సెజ్‌లు ప్రారంభించిన చోట, ఉన్న ఎకరమూ కోల్పోయి, పాతికో, పరకో పరిహారంగా వస్తే ఖర్చయిపోయి, చేసేందుకు పనిలేక, సెజ్‌ లో ఉద్యోగం ఎండమావులై ఖాళీగా చేతులు ముడుచుకు కూర్చున్న సత్యవేడు ప్రాంతాల రైతులనడుగు. ఏమి మిగిలింది చివరకు కొన్ని కన్నీళ్లు… ఎంతకూ తీరని కొంత దుఃఖం. నిర్వాసితులవడం అంటే నీ ఇల్లు నువ్వు ఖాళీ చేయడం. నీ భూమి నుంచి నీ తల్లి వేరు నుంచి నువ్వు వేరుకావడం. నీ వాకిలినుంచి, వాకిలిలో తలలూపే చెట్లనుంచి, పచ్చిక బయళ్లనుంచి, ఒరంజెక్కి, ఒడ్డుపెట్టి, అడుగడుగూ కదం కలిపి, కుళ్లగించి, పెళ్లగించి, చదునుచేసి దున్ని, దోకి, విత్తులేసి, లేలేత మొక్కలొస్తే మురిసిపోయే రైతు జీవితపు అత్యంత అద్భుతమైన జీవన సౌందర్యాన్ని కోల్పోవడం.

సృష్టికర్తలకు భూమినుంచి బేదఖలు కావడానికన్నా పెద్దసమస్య ఉండబోదన్న సమస్య ఈ తైతక్కల, టక్కుటమారాల మాయామోహపు వలలుపన్నే మాటల మూటలు కట్టే రాజకీయ నాయకులకు ఎట్లా తెలుస్తాయి. నిజమే అడ్డపంచె ఎగేసి కట్టినంతమాత్రాన ఎవరైనా రైతు ఆత్మను ఎట్లా పొందగలరు. ప్యాంటు తొడుక్కున్న వాళ్లకు ఎలాగూ ఆ ఆత్మశూన్యము. ఒకవేళ నిజంగానే మన నేతలకు రైతు ఆత్మ ఉంటే ప్రాణంగా ప్రేమించే, ప్రాణంగా భావించే నేలతల్లి నుంచి రైతులను బేదఖలు చేసి, రసాయనాల కంపెనీలు ఎందుకు పెడ్తారు. భూమి గుండె చప్పుడు వినగలిగిన శక్తి ఉన్నవాళ్లైతే, పర్యావరణ కాలుష్యాలకు విలవిలాడుతున్న నేలతల్లి ఆత్మఘోషను కనకుండా ఎలా ఉండగలరు.

దృశ్యం ఒక్కటే కానీ ఆత్మలు వేరు. పంచెధారి ఒకరు గొంగడిలో నడినగరంలో మీకు గిరిజనుడిలా, గిరిపుత్రుడిగా కనిపించవచ్చుగాక. కానీ ఆయన గిరిపుత్రుడు కాలేడు. ఆయనలో హెటరోడ్రగ్స్‌, టెట్రాడ్రగ్స్‌, సిమెంటు కంపెనీలు, స్టీల్‌ కంపెనీలు, ఓడరేవులు, ఇనుప ఖనిజపు అవశేషాలు, కంప్యూటర్‌ డబ్బాలు దాగున్నాయి. అంతరంగంలో ఆయనలో రైతాంగాన్ని నేల నుంచి వేరుచేసి హింసించే, బతుకుదెరువును ఊడలాక్కునే ఒక విధ్వంసకారుడు ఉన్నాడు. అమెరికానుంచో ఆవలి సముద్రాల నుంచో తైతక్కలాడిస్తున్న ‘పెద్దన్న’లూ ఉన్నారు. అదీ సమస్య. అవునూ వచ్చేదా? చచ్చేదా; ఏమొస్తుంది వ్యవసాయంతో ఏమివ్వగలదు సేద్యం. అవునూ భూమిని నమ్ముకుంటే ఏమి వస్తుంది. ఏమీరాదు. పోదు. నిజమేనా? అలాంటి పనికిరాని భూమిని ఏలికలు ఎందుకు లాక్కుంటున్నట్టు. భూమి అంటే తెలుసా! అదొక సృష్టి. ఏమిచ్చినా ఇవ్వకున్నా అది చేతినిండా పనివ్వగలదు. ఏమిచ్చినా ఇవ్వకున్నా బతుకు భరోసా ఇవ్వగలదు.

నోట్లోకి రెండు మెతుకులు ఇవ్వగలదు. లోకానికంతటికీ కొచ్చెటి మెతుకులు ఇవ్వగలదు. ఆ నేలను నమ్ముకున్న రైతుల గురించి మళ్లీ మాట్లాడడం అవసరమే. పోలేపల్లి, సత్యవేడు, కాకినాడ, కడప ఏదీ మినహాయింపు. ఏలికల విధ్వంస ప్రణాళికల విషపు కన్ను పడినమేరా రైతులకు బతుకుల్లో పరుచుకుంటున్న ఎడారులు. జీవం లేని కళ్లల్లో మొలుస్తున్న జిల్లేళ్లు. అయ్యా! అందరూ వస్తున్నరు. చెబుతున్నం. పోతున్నరు. కానీ మాకు భూమికి బదులు భూమి రాలేదు. ఎట్లా బతకాలో చెప్పండి. అని అడుగుతున్న లంబాడీలకు ఎవరు మాత్రం ఏమివ్వగలరు. నిజమే. కోటి వరాలిచ్చినా వాళ్లభూమికి భూమివ్వడం కిందకు రాదు. చెట్టు ఒక జీవ సంబంధం. మనుషులను పశుపక్షాదులను, మనుషుల మధ్య సంబంధాలను నిర్మించే కూడలి చెట్టు. చెట్టుకింద పంచాయితీలు, చెట్టు చప్టామీద బాతాఖానీలు, దుఃఖాలు, ఊరడింపులు, ఆవేశాలు, ఆరాటాలు, నవ్వులు, ప్రేమలు, మమకారాలు, ఒక పల్లెకు చెట్టొక జీవన సూత్రం. నిండు బతుకుకు సూచిక. అలాంటి చెట్టూ లేని ఊరిలో ఎక్కడ ఉండమంటారు.

ఏలికలు. సెజ్‌లు పెట్టే చిచ్చు గురించి ఎట్లా చెప్పేది ఈ ఇనుప గుండెల మనుషులకు. కరడుగట్టిపోయి లోహం మాదిరి గడ్డకట్టిపోయిన మనుషులకు చెట్టు, పుట్ట, నేల, ఆవరణం, జీవం నిలపడానికి, నిండు జీవనం తొణికిసలాడడానికి, పల్లె నిర్మాణానికి ఉనికికీ, మనుగడకూ అవసరాలన్న విషయం ఎవరు చెప్పగలగాలి! భూమి అంటే ఏమిటి? అదొక ఎడతెగని బంధం. పుట్టుక నుంచి చావుదాకా మనిషితో వచ్చే బంధం. ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపుతున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది. ఇక్కడొక కథ గుర్తుకొస్తున్నది.

ఒక ఇరాక్‌ రైతు భూమిని తీసుకున్నది ప్రభుత్వం. కోర్టులో కేసు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు, కొండపొడుగు చర్చలూ విన్న రైతు అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు ‘అవునూ నాకు ప్రభుత్వమనే ఒక ‘దాయాది’ ఉన్నట్టు తెలియదే’ అని. ఇప్పుడు పోలేపల్లి బాధితులు అడుగుతున్నారీ ప్రశ్న. వారి భూమిలో ఆ డ్రగ్స్‌, ఈ డ్రగ్స్‌ పెట్టుకోవడానికి, ఆ రెడ్డో, ఈ రెడ్డో, ఆ రావో, ఈ రావో మాకేమన్నా ‘దాయాదులా’ అని అడిగేరోజొకటి రాక తప్పుతుందా! ఏలికా! బహుపరాక్‌.

(Courtesy : AndhraJyothy 27 September 2008)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: