Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

భూములెందుకు ఇచ్చేయాలి?

leave a comment »

-కె.బాలగోపాల్‌

సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?

ప్రైవేట్‌ పరిశ్రమల కోసం ప్రభుత్వం భూసేకరణ చేయకూడదనీ ఆ ప్రైవేట్‌ కంపెనీలే రైతుల దగ్గర కొనుక్కోవాలనీ ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది. ప్రభుత్వం తనకు భూసేకరణ చట్టం ఇచ్చిన బలవంతపు భూసేకరణ అధికారాన్ని వినియోగించడం వల్ల తలెత్తుతున్న నిరసన, ఆందోళనల నేపథ్యంలో బలవంతానికి తావులేని ప్రత్యామ్నాయంగా ఇది ముందుకొచ్చింది.

స్వచ్ఛందంగానే కొనుక్కునేటట్టయితే రైతులు అడిగినంత భూమీ ఎందుకు అమ్మేస్తారు? తమకు తెలిసిన ఏకైక జీవితమైన సేద్యాన్ని వదిలిపెట్టి ఎందు కు వెళ్లిపోతారు? కొనుక్కునే వాడికి ఆ భూమి చాలా లాభాల కు భూమిక కాబోతుందని వారికి తెలుసును కాబట్టి ఒకవేళ భూమిని వదిలిపెట్టడానికి సిద్ధపడినా చాలా పెద్దమొత్తం కోరుతారు. ఎక్కడికక్కడ తక్కువ ఖర్చుతో సాగించుకోవాలని చూసే కంపెనీలు దీనికి ఎందుకు సిద్ధపడతాయి? కాబట్టి ప్రభుత్వం ఎక్కడయినా ప్రైవేట్‌ కంపెనీలే రైతుల నుంచి భూమి కొనుక్కోవాలి-మేం సేకరించం అని ప్రకటిస్తే అక్కడే దో మర్మం దాగి ఉందని సందేహించడం సబబుగా ఉంటుం ది. భారీగా పెట్టుబడులు పెట్టి ప్రకృతి వనరులను భారీగా కొల్లగొట్టి భారీగా లాభాల కోసం వేటాడే వ్యవహారంలో వారంతట వారు ఏ ప్రజాతం త్ర సూత్రాన్నయినా గౌరవిస్తారనుకోవడం భ్రమే అవుతుంది. ఈ మర్మం ఏమిటన్నది జార్ఖండ్‌ రాష్ట్రంలో చూడగలము.

జార్ఖండ్‌ అపారమైన ఖనిజ సంపద గల రాష్ట్రం. ఇనుము, బాక్సైట్‌, బొగ్గు, యురేనియంలతో మొదలుపెట్టి అనేక చిన్నతరహా ఖనిజాల దాకా అక్కడ విస్తారంగా దొరుకుతాయి. అయితే ఈ భూమి అధికంగా షెడ్యూల్డు ప్రాంతం. అంతేకాక తమ భూమి మీదికి వచ్చిన తెల్లవారిపైన పోరాటాలు చేసిన పూర్వీకులను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్న హో, ముండా, ఒరవాన్‌, సంథాల్‌ తెగలు అధికంగా నివసిం చే ప్రాంతం కూడ. అందువల్ల రాజ్యాంగం షెడ్యూల్డు ప్రాంతం లో భూబదలాయింపుల పైన పెట్టిన నియంత్రణనే కాక స్థాని క ఆదివాసుల ప్రతిఘటనను కూడ జార్ఖండ్‌ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండ పారిశ్రామికీకరణ వ్యూహాలు రచించజాల దు. కాగా, అన్ని ప్రాంతాల లాగ జార్ఖండ్‌లోనూ రాజకీయ నాయకులకూ బ్యూరోక్రాట్లకూ సకల బుద్ధిజీవులకూ ఈ ఖని జ సంపద ‘వృధా’ కాకూడదన్న విశ్వాసం బలంగా ఉంది. దానినంతా వేగంగా వెలికితీసి భారీ పెట్టుబడులు జత చేసి పారిశ్రామికీకరణ త్వరత్వరగా చేపట్టడం వల్ల వచ్చే ‘అభివృ ద్ధి’ అభిలషణీయమని నిజంగా ఎంతగా నమ్ముతున్నారో చెప్పడం కష్టంగానీ ఈ క్రమంలో తమకు రాగల ప్రయోజనం కోసం తపిస్తున్నారన్నది మాత్రం నిజం.

కాబట్టి జార్ఖండ్‌ ప్రభుత్వం టాటా, జిందా ల్‌, మిత్తల్‌ వంటి పారిశ్రామికవేత్తలతో చాలా ఒప్పందాలు చేసుకుంది. వారు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతా రు, ఖనిజ పరిశ్రమలు, ఇనుము ఉక్కు బాక్సైట్‌ విద్యుత్‌ తదితర కర్మాగారాలూ నెలకొల్పుతా రు. ప్రభుత్వం వారికి అన్నిరకాల సహాయ సహకారాలూ అందిస్తుంది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఇస్తుం ది. అయితే రైతుల భూమి మాత్రం సేకరించి పెట్టదు. కంపెనీలు రైతులతో ప్రత్యక్షంగా ఒప్పందాలు చేసుకొని భూమి కొనుక్కోవడం అంటే ఏమిటో అక్కడి గ్రామాలలో చూడవ చ్చు. గ్రామాలలో దళారులను తయారు చేసుకోవడం, వారికి పైసలీయడం, తినబెట్టడం, తాగబోయడం, వారి గూండాయి జంతో ఇతర ప్రజలను లొంగదీసుకొని ఒప్పించాలని చూడ డం పెద్ద పెద్ద కంపెనీల కన్ను పడ్డ అన్ని గ్రామాలలోనూ కనిపించే చిత్రం. చివరికి రైతు ఎందుకొచ్చిన గొడవలెమ్మని అమ్మకానికి ఒప్పుకున్న నాడు అది స్వచ్ఛందమైన ‘సేల్‌ డీడ్‌’ రూప మే తీసుకుంటుంది. అతని చేత కొట్టి సంతకం చేయిస్తారనుకోనక్కరలేదు. అమ్మకాలకు అనుకూలమైన గుంపు గ్రామంలో తయారు చేయబడుతుంది. వారికి అకస్మాత్తుగా చేతి నిండా డబ్బులు, మోటార్‌ సైకి ళ్లు లభిస్తాయి. వారు అమ్మకాన్ని వ్యతిరేకించేవారితో గొడ వ పెట్టుకుంటారు.

ఆ వ్యతిరేకత సంఘటితమైన చోట వారి మీటింగ్‌లలో అల్లరి చేస్తారు. క్రిమినల్‌ కేసులవుతాయి. పోలీసులు ఏకపక్షంగా కేసులు పెడతారు. ఇదంతా జరుగుతుండగా మరో వైపు ఒప్పించే ప్రచారమూ జరుగుతుంటుంది. ఎకరానికి రెండు లక్షలిస్తారట, ఉద్యోగాలిస్తారట, భూమి ఇచ్చేస్తే ఏం అన్న చెవికొరుకుడు సాగుతుంటుంది. ఈ అశాంత పరిస్థితిని ఎక్కువ కాలం తట్టుకోవడానికి చాలా సంకల్పం కావాలి. ఆదివాసులు మాత్రమే నివసించే ప్రాంతాలలో నాగరిక సమాజ పు బలహీనతలింకా పూర్తిగా ఒంట బట్ట లేదు కాబట్టి అక్కడ ఈ పాచిక ఎక్కువగా పార లేదు. మిశ్రమ గ్రామాల పరిస్థితి వేరే. అక్కడ దళారులు దొరుకుతున్నారు; ఆశపెట్టి, భయపె ట్టి, విసిగించి లోబరచుకునే ప్రయోగమూ సాగుతున్నది. ఉదాహరణగా టాటాలనూ, జిందాల్‌నూ, మిత్తల్‌నూ కూడ తీసుకోవచ్చునుగానీ టాటా కంపెనీకి సంబంధించిన ఒక ఉదాహరణే చెప్పుకుందాం. ఎందుకంటే టాటా వారు మర్యాదస్తులనీ మురికి పనులు చేయరనీ ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది.

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూం జిల్లానుంచి వేరు చేసి కొత్తగా ఏర్పరిచిన సరాయికేలా-ఖర్స్‌వాన్‌ జిల్లాలోని సుమారియా బ్లాక్‌లో టాటావారు సాలీనా 12 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగల కార్ఖానా నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. నాలుగు గ్రామ పంచాయితీలలోని 23 గ్రామాలలో భూమికోసం వేట మొదలుపెట్టా రు. ఆ గ్రామాలలో గట్టి ప్రతిఘటన ఎదురయింది. వ్యతిరేకించే రైతులు భూమిరక్షా గ్రామీణ ఏక్తా మంచ్‌ అనే వేదిక ఏర్పాటు చేసుకొని ఆందోళనకు దిగారు. టాటావారు చూసి చూసి ఆ వేదిక నాయకులనే లొంగదీసుకున్నారు. వారే టాటావారి ఏజెంట్లుగా మారారు. అయితే ఒకనాడు మంచ్‌ నాయకులు టాటావారు నెలకొల్పిన ఒక ఎన్‌జివోతో కలిసి ఆ గ్రామాలలో సర్వే మొదలు పెట్టే సరికి ప్రజలకు అనుమానం వచ్చింది.

ఎందుకోసం సర్వే చేస్తున్నారని అడిగితే రేషన్‌కార్డు లివ్వడం కోసం అని సమాధానం చెప్పారు గానీ వారు ప్రజలచేత నింపిస్తున్న ఫాంలో కేవలం ఆదాయం వివరాలేకాక సర్వే నెంబర్లు సరిహద్దుల యుక్తంగా భూముల వివరాలూ ఉన్నాయి. అసలు సంగతి గ్రహించిన గ్రామస్తులంతా ఒకటయి అప్పటిదాకా తమకు నాయకత్వం వహిస్తున్న మంచ్‌ను తొలగించి భూమిరక్షా గ్రామీణ ఆందోళన్‌ అభియాన్‌ అనే కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. మంచ్‌కూ అభియాన్‌కూ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం మే నెల 21వ తేదీన టాటావారు మంచ్‌ ప్రతినిధులతో కలిసి టెంటోపోసీ అనే గ్రామంలో టైలరింగ్‌ నేర్పించే పునరావాస కేంద్రాన్ని ఆవిష్కరించే ప్రయ త్నం చేయగా అభియాన్‌ నాయకత్వంలో గ్రామస్తులు జనతా కర్ఫ్యూ విధించి ఆ ఊరికి వచ్చే దారిలో ఉన్న వంతెనకు అడ్డం గా నిలబడి టాటా వారిని గ్రామములోనికి రానియ్యలేదు. వంతెన దగ్గరే అభియాన్‌లో చురుకయిన కార్యకర్త అయిన హీరాలాల్‌ మహతోకూ, దళారులుగా తయారయిన మంచ్‌ నాయకులకూ తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ చొరవకు హీరాలాల్‌ మూల్యం చెల్లించవలసివచ్చింది. సెప్టెంబర్‌ 12న అత ను మోటార్‌ సైకిల్‌ పై తన స్వగ్రామమయిన టిడింఘిపా నుంచి జిల్లా కేంద్రానికి పోవడానికి బయలుదేరగా ఊరిబయ ట మంచ్‌ నాయకులు అతనిపైన బాంబులు వేసి కాల్పులు జరిపి హత్య చేశారు. దీనితో అతని గ్రామంలో ఎంతటి భయ వాతావరణం ఏర్పడిందంటే ముగ్గురు పిల్లలున్న అతని భార్య మేనకను పరామర్శించడానికి కూడా అతని ఇంటికెవరూ పో యే పరిస్థితిలేదు. ఆ వాతావరణం ఇంకొక మూడు నాలుగు గ్రామాలలో తీసుకురాగలిగితే ఆ 23 గ్రామాలలో తమ 12 మిలియన్‌ టన్నుల ఉక్కు కర్మాగారానికి కావలసిన భూమి దొరికేస్తుందని టాటావారు భావిస్తుండవచ్చు.

కానీ అది జరగకూడదని అభియాన్‌ కార్యకర్తలు గట్టి సంకల్పంతో ఉన్నారు. నష్టపరిహారం, పునరావాసం దక్కుతాయి లెమ్మన్న ఆశ ఈ ప్రాంత ప్రజలలో కల్పించడం కష్టం. వారికి దగ్గరలోనే జాదుగూడ ఉంది. కొంచెం దూరంలో జంషెడ్‌పూర్‌ ఉంది. జాదుగూడలోని యురేనియం కార్పొరేషన్‌ వారి గనులకూ కర్మాగారానికీ భూములిచ్చిన వారు ‘ఇప్పుడు ఏ హోటల్‌లో ప్లేట్లు కడుగుతున్నారో ఏ బస్టాండులో మూటలు మోస్తున్నారో మాకు తెలీదా’ అంటారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన జంషెడ్‌పూర్‌ ఉక్కు కర్మాగారం గురించి కూడ వారి కి ఆసక్తికరమైన జ్ఞాపకాలున్నాయి.

తొలుత టాటావారు ఉక్కు కర్మాగారం నెలకొల్పినప్పుడు సాంకేతిక స్థాయి చాలా వెనుక బడివుండింది. విపరీతమైన వేడిలో చేతుల్తో ఎక్కువ పనిచేయవలసి ఉండింది. ఆ దశలో ఆ కర్మాగారం కోసం భూములిచ్చిన ఆదివాసులు ఆ కర్మాగారంలో ఆదివాసులు పెద్ద సంఖ్య లో పని చేశారు. అయితే కాలక్రమంలో యంత్రాల ఆధునికీకరణ పెరిగిన కొద్దీ ఆదివాసులు ఒక్కొక్కరుగా బయటకుపో యి ఆదివాసీయేతరులు చేరారు. భూమిపోయి నా పని దొరుకుతుంది అన్న వాదనకు జవాబుగా వారు మరొక అనుభవా న్ని కూడ చెప్తారు. సమీపంలోని రఖా అనే గ్రామం వద్ద 1967లో రాగిలోహపు ఖనిజం తవ్వితీసే గనులు ప్రారంభమయ్యాయి. దానికోసం భూమికోల్పోయిన వారిలో చాలామంది ఎప్పటిలాగే చెల్లాచెదురయిపోగా కొద్దిమందికి ఆ పరిశ్రమలోనే చిన్నవే అయినా పనులు దొరికా యి. వారు బాగుపడ్డారనే అందరూ అనుకున్నారు.

కానీ 30 సంవత్సరాలు గడచిన తరువాత ఆ గనులనుంచి ఖనిజం తీయడం ఇంక లాభదాయకం కాదని మూసివేశారు. ‘ఇప్పుడు వారికి భూమీ లేదు, ఉద్యోగమూ లేదు. కంపెనీ మూసివేసినప్పుడిచ్చిన పైసలు ఖర్చయిపోయిన తరువాత ఏమీ లేదు. వస్తుందో రాదో, వస్తే ఎన్నిరోజులుంటుందో తెలియని ఉద్యోగం కోసం భూములెందుకు ఇచ్చేయాలి?, అని వారు అడుగుతున్నారు.

నేలకింద ఉన్న ఖనిజాలు అలానే ఉండిపోవలసిందే నా అని ఆందోళన చెందే వారుంటారు. ఇది సులభంగా తెగే చర్చ కాదు కానీ, విస్థాపన గురించి బలవంతపు భూ సేకరణ గురించి అమలుకాని పునరావాస ప్రక్రియ గురించి జరుగుతు న్న వివాదం నిజానికి భిన్న అభివృద్ధి నమూనాల మధ్య వివా దం అని గుర్తించాలి. రాజకీయ పక్షాలు, టాటా జిందాల్‌ అంబానీలు, మీడియా ఏకైక అభివృద్ధి నమూనా ఉందని ఊదరగొడుతున్నాయి. భారీగా పెట్టుబడులు ఆహ్వానించి అత్యధిక వృద్ధి రేటు సాధించడం, సకల మానవ ప్రాకృతిక వనరులనూ దానికి దాసోహం చేయడం ఈ నమూనా.

ఇది కలిగించే విధ్వంసాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు వేస్తున్న ప్రశ్న, దీనికి ప్రత్యామ్నాయాలు లేవా అని . ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి, వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచేదిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా అన్నది పాలక అభివృద్ధి నమూనా నిరసనోద్యమాల నుంచి ఎదుర్కొంటున్న సవాలు. ఈ సంవాదంలో అన్ని ప్రశ్నలకూ సులభమైన జవాబులు లేకపోవచ్చు. కానీ ఇక్కడొక సంవాదమే లేనట్టు, చర్చించేదేమీ లేనట్టు, పాలకులు అభివృద్ధి అని పేరు పెడుతున్న దానిని వ్యతిరేకించే వారంతా అజ్ఞానులు, మూర్ఖులు, అవకాశవాదు లు అయినట్టు వ్యవహరించడం క్షంతవ్యం కాదు.

(Courtesy: Andhrajyothy, October 8, 2008)

Advertisements

Written by JayaPrakash Telangana

October 8, 2008 at 2:24 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: