Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

దేశంలోనే అతిపెద్ద ‘రియల్‌’ కుంభకోణం

leave a comment »కోస్తా కారిడార్‌, సెజ్‌ల భూసేకరణపై ధ్మజమెత్తిన అఖిలపక్షం
పార్టీలన్నీ ప్రజలకు అండగా నిలవాలని ప్రతిన
ఇవి స్పెషల్‌ రియల్‌ ఎస్టేట్‌ జోన్లు:కేసీఆర్‌
భయపెట్టి లాక్కుంటున్నారు: నారాయణ
న్యాయం చేయకపోతే తిరిగి లాక్కుంటాం: డాక్టర్‌ మిత్రా

కోస్తా కారిడార్‌పై అఖిలపక్షం కన్నెర్ర చేసింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ప్రత్యేక రియల్‌ ఎస్టేట్‌ మండళ్లుగా మారాయని ధ్వజమెత్తింది. ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా మారిందని విమర్శించింది. దేశంలో ఇదే అతిపెద్ద కుంభకోణమని అభివర్ణించింది. సెజ్‌ల భూసేకరణకు వ్యతిరేకంగా గజ్జె కట్టాలని నిర్ణయించింది. భూములు కోల్పోయిన రైతులకు అండగా నిలవాలని… వారికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిశ్చయించింది.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (ఆన్‌లైన్‌): కోస్తా కారిడార్‌, ఇతర ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) పేరిట జరుగుతున్న భూసేకరణ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అఖిలపక్ష నేతలు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ బెదిరింపుల కారణంగానే పేదలు భూములు వదులుకుంటున్నారని ధ్వజమెత్తారు. సెజ్‌లకు భూసేకరణను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మక్దూం భవన్లో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సీపీఐ కార్యదర్శి నారాయణ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు.

భూములను కాపాడుకునేందుకు పేదలకు సహకరించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన కార్యాచరణ ఖరారు చేసేందుకు మరోసారి సమావేశం కావాలని నిశ్చయించారు. ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్‌, న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్‌, జనతాదళ్‌ నాయకుడు గట్టు భాస్కర్‌, లోక్‌సత్తా తదితర పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు.

సమావేశ తీర్మానాలివీ…

* నవంబర్‌లో పోలేపల్లి, ఓడరేవు-నిజాంపట్నం ప్రాంతాలను సందర్శించాలి. పోలేపల్లి భూముల్లో అసైన్‌మెంట్‌ పట్టాల పేరిట పేదల కడుపుకొట్టిన వైనాన్ని పునఃపరిశీలించాలి

* భూసేకరణకు విడుదల చేసిన వివిధ రకాల జీవోలను ఉపసంహరించాలి.

* ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో స్పష్టం చేయాలి.

* పరిహారం విషయంలో అసైన్‌మెంట్‌, పట్టా భూముల మధ్య తేడాలు చూపకూడదు.

* సామాజిక, ఆర్థిక సర్వే సమగ్రంగా జరపాలి. భూమి యజమానిని కూడా ఆయా కంపెనీల్లో షేర్‌హోల్డరుగా చేర్చాలి.

* * *

ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకుల ప్రసంగం వారి మాటల్లోనే…

ఇవి స్పెషల్‌ రియల్‌ ఎస్టేట్‌ జోన్లు: కేసీఆర్‌

ఇవి స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్లు (ఎస్‌ఈజడ్‌)లు కాదు. స్పెషల్‌ రియల్‌ ఎస్టేట్‌ జోన్లు. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా రాష్ట్రంలో భూ సేకరణ జరుగుతోంది. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా మారింది. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా వ్యవహరిస్తున్నారు. రైతుల దగ్గర నుంచి పది నుంచి 15 వేల రూపాయలకు భూములు లాక్కుని కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు.

దేశంలో ఇదే అతిపెద్ద ‘రియల్‌’ కుంభకోణం. మంచి నాయకులు ఎవరేం చెప్పినా వింటారని, మంచి మాటలను ఆచరిస్తారని రాజీవ్‌గాంధీ అన్నారు. కానీ, రాష్ట్రంలో కుసంస్కార, కుళ్లుబుద్ధి, అహంకారపూరిత ప్రభుత్వం ఉంది. “ఎవరేమనుకుంటే మాకేంటీ?”, “అలా అన్నారా!!”, “అయితే ఏంటిట?” అంటూ అహంకారంగా వ్యవహరిస్తున్నారు. ఈ గద్దల్ని తరిమికొట్టాలి. ప్రజలకు అండగా నిలవాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూ వినియోగంపై ప్రభుత్వానికి శాస్త్రీయ దృక్పథం లేదు.

భూకేటాయింపులను పునఃసమీక్షిస్తాం: మిత్రా

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులను పునఃసమీక్షిస్తాం. రైతుల నష్టాన్ని పూరించేలా, వారికి న్యాయం జరిగేలా చూస్తాం. అక్రమంగా తీసుకున్న భూములకు తగిన పరిహారం ఇప్పిస్తాం. అలా ఇవ్వని సంస్థల నుంచి భూములను వెనక్కి తీసుకుంటాం. పట్టణాల్లో స్థలాలను అభివృద్ధి చేసి నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు ఆ స్థల యజమానులకు ప్లాట్లు ఇస్తున్నారు. అలాగే పరిశ్రమల్లోనూ రైతులకు వాటా కల్పించాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న సెజ్‌లతో ప్రజలకు ఉపాధి లేదు. ట్యాక్స్‌ హాలీడేతో ప్రభుత్వానికి రాబడి లేదు. పైగా పర్యావరణ కాలుష్యం. వీటివల్ల కేవలం పరిశ్రమలకే లాభం. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయాలి. పచ్చని పంట పొలాలను సేకరించరాదు.

భయపెట్టి లాక్కుంటున్నారు: నారాయణ

కంపెనీల కోసం ప్రభుత్వం భూమిని సేకరించడం లేదని చెబుతున్నారు. మరి ఆ భూముల దగ్గర కలెక్టర్లు, ఆర్డీవోలు, పోలీసులు ఎందుకుంటున్నారు? భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతాం అని వారు రైతులను భయపెట్టి మరీ లాక్కుంటున్నారు. సెజ్‌లు, పరిశ్రమల పేరిట వేలాది ఎకరాలను సేకరిస్తున్నా… అక్కడ ఏయే పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పడం లేదు. ప్రభుత్వ రంగాలకు భూమి ఇస్తే ప్రజల చేతిలో ఉన్నట్టే. అదే ప్రైవేటు సంస్థలకు ఇస్తే ఆశలు వదులుకోవాల్సిందే. వేలాది ఎకరాలు వాటికి అప్పనంగా అప్పగిస్తూ నయా ఫ్యూడల్‌ వ్యవస్థను ప్రభుత్వమే తయారు చేస్తోంది. దీనికి అడ్డుకోకపోతే భవిష్యత్తు తరాలకు భూమి ఉండదు. రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు అండగా నిలవాలి. మేం మీతోనే ఉన్నాం అని భరోసా ఇస్తే ప్రజలు ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారు.

సమగ్ర ప్యాకేజీ ఏదీ!?: రాఘవులు

పరిశ్రమలకు భూసేకరణ తప్పుకాదు. రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. మార్కెట్‌ రేటును బట్టి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదు. భవిష్యత్తు తరాలనూ దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఉన్న పరిస్థితులకన్నా మెరుగైన సమగ్ర ప్యాకేజీ కల్పించాలి. పరిశ్రమల్లో వాటా, ఉద్యోగాల విషయం తేల్చాలి. ఆ భూములపై ఆధారపడిన కూలీలు, చేతివృత్తుల వారికి కూడా ప్యాకేజీ ఇవ్వాలి. అసైన్డ్‌ భూములనూ పట్టా భూములుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయాలి. పేదలు సాగు చేసుకుంటున్న భూమికీ పరిహారం ఇవ్వాలి.

బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే భూసేకరణకు తనకు సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వమే భూమిని సేకరించాలి. అఖిలపక్షంతో చర్చించి ఇందుకు ఒక విధానాన్ని రూపొందించాలి. ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి.

ప్రభుత్వమే ‘రియల్‌’ వ్యాపారి: లాల్‌జాన్‌ బాషా, టీడీపీ

1894లో రైల్వే లైన్లు వేసేందుకు కంట్రాక్టర్లు కఠినంగా వ్యవహరించారు. దీంతో రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. రైతుల మేలుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. తక్కువ ధరకు రైతుల నుంచి భూమిని లాక్కుని లక్షలాది రూపాయలకు అమ్ముకుంటోంది. భూసేకరణ చట్టాన్ని మార్పు చేయాలి.

Advertisements

Written by dilkibaatein

October 20, 2008 at 10:59 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: