Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

బ్యాలెట్టే నిరసన బావుటా

with one comment

– సుజాత సూరేపల్లి

అభివృద్ధి పేరిట ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ ప్రాజెక్టులు చట్ట విరుద్ధమైనవి. పేదల జీవనాధారాలను హరించివేయడమే కాదు పర్యావరణానికి కూడా ఎనలేని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలేవీ వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదు. పేదల హక్కులను కాపాడడం లేదు. ఈ పరిస్థితులలో పేదలు తమకుతామే పోరాడక తప్పదు.

ఎన్నికల ప్రక్రియ మన ప్రజాస్వామ్యపు విశిష్ట లక్షణంగా భాసిల్లుతోంది. 1951లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిననాటి నుంచి ఎన్నికలు దేశ పరిపాలనా వ్యవహారాలలో కీలక పాత్ర వహిస్తున్నాయి. అయితే ఈ విశిష్ట, ఆవశ్యక ప్రజాస్వామ్య ప్రక్రియ చాలావరకు అగ్రకులాలవారు, సంపన్నులకు అనుకూలంగా దుర్వినియోగమవుతున్నది. కండబలం, ధన బలం ఉన్నవారే చట్టసభలకు ఎన్నికవుతున్నారు. తత్ఫలితంగా రాజ్యాంగ సంస్థలు బలహీనపడుతున్నాయి. ఇది సమాజంలోని ప్రతి వర్గాన్ని మరీ ముఖ్యంగా పేదలపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతోంది. రాజ్యాధికార సాధనకు ఒక మార్గంగా ఎన్నికలను బహిష్కరిస్తున్న పార్టీలు కూడా ఆ ప్రక్రియకు వెలుపల లేవు. పాలక పార్టీకి వ్యతిరేకంగా నిర్దిష్ట పార్టీలకు లేదా అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా అవి కూడా ఎన్నికల ప్రక్రియలో పరోక్షంగా పాల్గొంటున్నాయి.

ఇలా ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములవుతున్నందునే ఎన్నికలు మన ప్రజాస్వామ్యవ్యవస్థలో నిర్ణయాత్మకమైనవిగా రూపొందాయి. ఆ ప్రక్రియలో ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ పేదల హక్కుల సాధనకు ఎన్నికలను ఉపయోగించుకోవల్సిన అవసరమెంతైనా ఉంది. సత్వర అభివృద్ధి కోసం పాలకులు ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆర్థి క మండలాలు (సెజ్‌లు) కులపరమైన దోపిడీకి సరికొత్త తార్కాణాలుగా ఆవిర్భవించాయి. పోలేపల్లి సెజ్‌ పరిధిలోని గ్రామస్తులు, పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులైన గిరిజనులు, కాకినాడ సెజ్‌కు బాధితులైన మత్స్యకారులు, ఇంకా పులిచింతల, రాజోలిబండ, భూపాలపల్లి మొదలైన ప్రాజెక్టులతో కన్న ఊర్లను వదిలి పరసీమలకు వలసపోవల్సివచ్చిన గిరిజనులు, పేదరైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మాటలకందనివి.

మరే రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో సెజ్‌ల ఏర్పాటు చేస్తున్నారు. దళితులు, గిరిజనులు, సన్నకారు, చిన్నకారు రైతుల భూములను స్వాయత్తం చేసుకోవడానికే ఈ సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలో నిజమెంతైనా ఉంది. పేదలను దోపిడీచేయడంలో మన రాష్ట్రం ఒక ప్రయోగశాల అయిపోయింది. అభివృద్ధి పేరిట ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ ప్రాజెక్టులు చట్ట విరుద్ధమైనవి. పేదల జీవనాధారాలను హరించివేయడమే కాదు పర్యావరణానికి కూడా ఎనలేని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలేవీ వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదు. పేదల హక్కులను కాపాడడం లేదు. ఈ పరిస్థితులలో పేదలు తమకుతామే పోరాడక తప్పదు. ఎన్నికల తరుణమే హక్కుల పోరాటానికి అనువైన సమయం. గత ఐదు సంవత్సరాలలో పోలేపల్లి సెజ్‌ బాధితులైన 50 రైతులు అత్యంత దయనీయ పరిస్థితులలో మరణించారు.

తెలంగాణ రాష్ట్రసమితి, కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఎవరూ వారి సమస్యల గురించి పట్టించుకోలేదు. ఆందోళనలు నిర్వహించలేదు. అయితే గత ఏడాది మే లో ఉపఎన్నికలలో పోటీచేయడానికి పోలేపల్లి సెజ్‌ బాధితులు నిర్ణయించుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికలలో తాము గెలిచే అవకాశాలులేవని వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ తమ హక్కుల సాధనకు వారు పోటీచేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓడిపోయాడు. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి 2000 ఓట్ల తేడా తో ఓడిపోయాడు. ఆకలితో నకనకలాడిపోతున్న వారే ఆ ఉపఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర వహించారు. ఈ ఉప ఎన్నికల మూలంగానే పోలేపల్లి బాధితుల గురించి రాజకీయపక్షాలు, మీడియా పట్టించుకున్నాయి. ఇది ఆ బాధితులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సెజ్‌ అధికారులతో తమ పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో ఉద్యమాలకు ప్రేరేపకులు అయ్యారు.

ఆ పేదల మూలంగానే సెజ్‌ల అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేక ఉద్యమం సంఘటితమయింది. ప్రజల పోరాటాలను పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులపై ఉంది. తమ సమస్యలను రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో చాటిచెప్పడానికి పోలేపల్లి బాధితులు ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకొంటున్నారు. ఈ క్రమంలో వారు గత ఏడాది ఉప ఎన్నికలలో పాల్గొన్నారు. ప్రస్తుత ఎన్నికలలో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే 29 మంది అభ్యర్థులు (19 మంది దళితులు, నల్గురు బిసిలు, నల్గురు గిరిజనులు, ఇద్దరు ముస్లింలు) నామినేషన్లు దాఖలుచేశారు. అమానుష అన్యాయాలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటమిది. సెజ్‌ల మూలంగా నిర్వాసితులవుతున్నవారి సమస్యలను రాజకీయ పక్షాల ఎజెండాలలో ప్రాధాన్యం వహించేలా చేశారు.

ఎన్నికలలో పోటీచేయడంలో వారి లక్ష్యాలివి: ‘అభివృద్ధి’కి బలవుతోన్న ప్రజలను సంఘటితపర్చడం, దోపిడీదార్లను సవాల్‌ చేయడం; సెజ్‌ అక్రమాలు, అన్యాయాలను దేశప్రజల దృష్టికి తీసుకెళ్ళి, వాటికి వ్యతిరేకంగా చైతన్యపరచడం; రాజ్యాంగ సంస్థలలో విలువల క్షీణత, ఎన్నికల ప్రక్రియలోని లొసుగులకు మౌన ప్రేక్షకులుగా ఉండిపోక, పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రజలను పురిగొల్పేందుకు; సెజ్‌ల అక్రమాలపై కేవలం ఖండన మండనలకే పరిమితం కాకుండా గట్టి కార్యాచరణకు దిగేలా రాజకీయపక్షాలపై ఒత్తిడి తీసుకురావడానికి; పేదల వ్యతిరేక ప్రాజెక్టులను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేయడానికి. బాధిత ప్రజలకు న్యాయం జరగాలి.

అయితే అది అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా లేనప్పుడు అది న్యాయమెలా అవుతుంది? పేద దళితులు, బహుజనులు, మైనారిటీలు, ఆదివాసీల జీవన స్థితిగతులకు అనుగుణంగా న్యాయాన్ని పునర్‌నిర్వచించాలని పోలేపల్లి పోరాటకారులు డిమాండ్‌ చేస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామిక వాదుల నైతిక కర్తవ్యం కాదా?

Advertisements

Written by Sujatha Surepally

March 29, 2009 at 8:42 pm

One Response

Subscribe to comments with RSS.

  1. “అర్థవంతంగా లేనప్పుడు అది న్యాయమెలా అవుతుంది?” చాలా కష్టమైన ప్రశ్న అడిగారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: