Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మరో ఆర్తగీతం

leave a comment »

– అల్లం నారాయణ

ఇప్పుడంతా జాతర. సమ్మక్క సారక్క జాతరల శివ్వాలు తూలినట్టు, ఇప్పుడు ఓ నెలరోజులు అన్ని పార్టీలూ శివ్వాలు తూలుతాయి. అటెంక మళ్లీ అయిదేండ్లదాకా.. రారెవ్వరు? గుద్దు ఇప్పుడే.. కక్షకట్టి అందరి ముఖాల మీదా ముద్దెర. మాయామోహం చూపుతున్న ముఖాల మీద…

‘కడుపున కాయో, పండో కాయకుంటే నే బాగుండు’ పండంటి పాపను కని అంగట్ల అమ్ముకోవడం ఇప్పుడు పాతబడిపోయింది. పాలసేపులు బిడ్డా. ఎవరికి చెప్పుకోను. పాలసేపుల కన్నకడుపు కోత బాధ. ఆరుస్తరా! తీరుస్తరా! పాణం బిగపడ్తది. మనసుల అగ్గిరేగుతది.

కడుపుల దుఃఖం సుమ్మర్లు తిరిగే సుడిగాలి చుట్టుకుంటది. ఈ కన్నపేగు శోకం ఎవరికి చెప్పుకోను. కన్ను తల్లడిల్లి కాల్వలు కట్టిన శోకం కృష్ణమ్మ పాయయితది. కడుపుల పిండాలు మెసలకపోవడమే మంచిది. అయ్యా! అయిదేండ్లకోసారి జరిగే జాతర. అమ్ముడుపోయిన పసికూనలను కన్న తల్లుల శోకానికి మీ పెద్ద పెద్ద మాటల్లో చోటుందంటారా? శానసార్లు ఓటేసినం. మా తండా మారలేదు. గద్దలాడుతున్న మా బతుకు ఎజెండా మారలేదు.

చంద్రబాబూ, రాజశేఖర్‌రెడ్డీ, చిరంజీవీ, నారాయణా, రాఘవులూ, దత్తాత్రేయా, జయప్రకాశ్‌నారాయణా దయగల్ల ప్రభువుల మీరు. మీ అందరిదీ ఒకే ముఖం. అద్దంలో చూసుకున్నట్టు ఒకే ముద్దెర. అయిదేండ్ల కిందట జరిగింది జాతర. మళ్లీ ఇన్నాళ్లకు. వేసీవేసీ నెరిబడ్డం. కలర్‌ టీవీలు, పావలా వడ్డీలు కాదు. పిల్లలను అమ్ముకునేంత బతుకు బర్‌బాజ్‌ ఎందుకయిందో; చెప్పగలరా సారూ! ‘బొందపెట్టనీకి జాగలేదు’ గుంజుకున్నరు. మా బతుకుదెరువును లాక్కున్న రు. కూరగాయలో, పంటలో, పడావులో.. ఏదైతేనేం. అది మా భూమి. మా రెక్కల కష్టంతో విచ్చుకుని పచ్చని పువ్వులై పూచే పుడమి. నేను చిన్నెంకయ్యను. పోలేపల్లి జంగిలమ్మను. మట్టిల పుట్టినోళ్లం. మట్టిని పిసికి బతికినోళ్లం. చివరికి ఈ మట్టిల ముతమై, కలిసిపోదామన్నా మాకు బొందల గడ్డ దక్కలేదు. ఏం పాపం చేసుకున్నం మాహారాజులారా! గద్దల లెక్క తన్నుకుపోతిరి.

వాళ్ళెవరూ పాలోళ్లు కాకపోయిరి. చెట్టుకొట్టి, పుట్టతవ్వి, ఒడ్డుపెట్టి, ఒరంజెక్కి, నాటేసి, నీళ్లుపెట్టి, కంటికి రెప్పలా కాపాడుకున్న మా భూమిని.. కంపెనీలకు కట్టబెడ్తిరి. అరిగోస మహరాజులారా! కాళ్లకింద నేల కదిలిపోయినంక ఇంక బతికెందుకు దండ గ. పోనీ చచ్చిపోదామన్నా బొందల గడ్డ కూడా గతిలేని బతుకాయెగదా. కంపెనీలు మా బతుకుదెరువు గుంజుకోవడమే మంచిదంటే… అభివృద్ధి అంటే ఆ అభివృద్ధి మాకెందుకు మారాజులారా! కాకులను కొట్టి గద్దలకు పెట్టడమే ఇప్పటి న్యాయం అంటే అది మాకెందుకు సారూ… చెప్పుండ్రి. ఒకటే ముఖంతో వస్తున్న లీడర్లందర్నీ అడుగుతున్నం. పావలా వడ్డీ, కలర్‌టీవీ, నెట్‌క్యాష్‌ సంగతి కాదు. ఈ భూములు గుంజుకునుడు సంగతి ఏందో? చెప్పుండ్రి సారూ.. అప్పుడు ఎవ రు ఏందో? ఎవరు? పులో అప్పుడు తేల్చుకుంటాం.

పోలేపల్లి న్యాయం అయితే అదే చెప్పండి. మా సంగతి ఇప్పటికే మేము చూసుకుంటన్నం. దీని సంగతి తేల్చండ్రి. అప్పుడు గుద్దుతాం. ముద్దెర. పక్కన కృష్ణమ్మ. గలగలా… జలాజలా కోసంత దూరంపోతే కడుపుతో ఉన్నది నాగార్జున కొండ. అది కృష్ణ గుంటూరు జిల్లాల శిశువులకు స్తన్యం ఇచ్చిన తల్లి కృష్ణమ్మ మమ్మల్ని పరాయిలను చేసింది. పోనియ్‌ పంటపొలాలకు సరే.. రాకపోతే రాకపోయే దూపకు నీళ్లు నల్లగొండ జిల్లాకు కన్నొంకర..కాలొంకర. ఫ్లోరైడ్‌ నీళ్లు తాగి వంకర్లు తిరిగిపోయిన బతుకులు. జంతు ప్రదర్శనశాలలో జీవులను చూసినట్టు.. ఒకరా! ఇద్దరా! అందరూ వస్తిరి. చూసిపోతిరి. కని మా బతుకు మారకపాయె. ఎన్ని చెప్పిండ్రు. అయిదేండ్లకోసారి ఫ్లోరైడ్‌ పోతదంటిరి. ఏదీ.

తాగడానికి నీళ్లియ్యని రాజ్యాలెందుకు? రాజులారా! అవి కూలిపోయి. నాశనం గాను. గుటికెడు మంచినీళ్లయ్యని రాజ్యాలు ముతమైపోను. ఎన్ని బాతాలు కొడ్తిరి. ఎక్కడి ఫ్లోరైడ్‌ అక్కడే. మా బతుకులు వంకర తీరకపాయె. ఏండ్లు గడిచిన గాని మా బతుకులు మారకపాయె. కలర్‌టీవీ సంగతి తర్వాత. కంప్యూటర్ల సంగతి తర్వాత గీ ఫ్లోరైడ్‌ గతి ఇంకా ఎన్నాళ్లుంటదో? ఒక్కసారి చెప్పండి. సింగరేణి రాజపోశవ్వా! నీ కిప్పుడు ఏం కావాలి. ఒక కలర్‌టీవీయా? నట్టింట నడయాడే ఎన్టీఆర్‌ బొమ్మా. కార్డు గీకితే ఫెళఫెళలాడుతూ వచ్చిపడే నాలుగు పచ్చనోట్లా? వద్దన్నా ఇచ్చే పావలా వడ్డీయా? కొన్ని బియ్యమా? వందరూపాయలకే ఉప్పు పప్పు, చింతపండు మూటగట్టి ఇచ్చే ముదిగారపు వంట గాసమా? ఏం కావాలి రాజపోశవ్వా? బొగ్గుబాయిల బతుకు బొందలై విస్తరిస్తున్న కలికాలంలపోతున్న పంటపొలం, మామిడితోట కాడ కంచెరేగుల కాపలాకూకున్న పోశవ్వా! పొలం పండనెప్పుడు? గింజ ఇంటికి రానెప్పుడు? కొఠీర్లు నిండేదెప్పుడు? నువ్వు కోటలు కట్టేదెప్పుడు? అయినా! వండుకొని కుక్కలకు పెట్టేంత పెడ్తున్నడు రాజశేఖర్‌రెడ్డి బువ్వ. బువ్వ పెడ్తున్నాడు భూమి గుంజుకుంటే మాత్రం బాధెందుకు?

అయినా.. ఇప్పటి కాలం భూమి గుంజుకొని.. బువ్వ భిక్షంబెట్టుడు కాలం. గోదావరిఖని, బెల్లంపల్లి, మందమర్రి, భూపాల్‌పల్లి, గనులల్ల బారుగా తొవ్వుకుంటూ పచ్చటి పొలాలు తొక్కుకుంటూ కృత్రిమంగా పేరుకుంటున్న గుట్టమీది పట్నంతుమ్మ ముల్లై గుచ్చుతున్నది బతుకు. ఏమి కాలం నాయనలారా! ఇది. ఉన్న బతుకుదెరువు గుంజుకున్న సంగతి ఏంది? రాజపోశవ్వా! కిలకిల నవ్విన భూమి. వలపోస్తున్నదా! తలపోస్తున్నదా! రాజనాలు పండే భూమి, పైరగాలికి వరికంకుల ఉయ్యాలలూపి, పనలు, పనలుగా, పచ్చ సముద్రపు అలల సయ్యాటలాడే భూమి, నీళ్లు తడిసినప్పుడు, వెండి వెన్నెల నురగలెత్తే భూమి మీది నుంచి లేచిరా. రాజపోశవ్వా. ఇదేంది అని మాత్రం ఇప్పుడు అడగకు.

రాజపోశవ్వా. ఈ భూమినీ రెక్కల కింద సాల్లు పోసుకున్నదనీ, ఈ భూమి నీ జబ్బల సత్తువ మీద నాగేటి చాళ్లయిందని మాత్రం అనకు! సింగరేణికి అగ్గి తల్గ. బాయి దొరలకు అగ్గి తల్గ. ప్రైవేటోనికి అగ్గి తల్గ. ఓపెన్‌కాస్ట్‌లు పాడయిపోను. అవి మా భూమిని సెరపట్టే సీసకులయితన్నయని మాత్రం అడగకు. కలర్‌ టీవీ వద్దు. కరుకునోటూ వద్దు. ఉచిత కరెంటూ వద్దు. రెండ్రూపాలకు కిలో బియ్యం వద్దు. వందకు వంట సరుకూ వద్దు. నీ పావలా వడ్డీ వద్దు.. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ల్ల నా భూమి మాత్రం గుంజుకోవద్దని మాత్రం అడుగకు. అప్పుడింక ఏ పార్టీ నీ దగ్గరికి రాదు. ఏ పార్టీ దగ్గరా.. నీ భూమిని, పంటపొలాన్ని, పచ్చని బతుకునిచ్చే ప్రకృతి సంపదను బొగ్గుబాయిలు ఎందుకు? తీసుకోవాలంటే ఒక్క జవాబూ లేదు.

అందుకే రాజపోశవ్వా. ఇప్పుడంతా జాతర. సమ్మక్క సారక్క జాతరల శివ్వాలు తూలినట్టు, ఇప్పుడు ఓ నెలరోజులు అన్ని పార్టీలూ శివ్వాలు తూలుతా యి. అటెంక మళ్లీ అయిదేండ్లదాకా.. రారెవ్వరు? గుద్దు ఇప్పుడే.. కక్షకట్టి అందరి ముఖాల మీదా ముద్దెర. మాయామోహం చూపుతున్న ముఖాల మీద… గమనిక: ప్రకృతి సంపద, మానవ వనరుల కలివిడితో సాంప్రదాయబద్ధమైన భారతీయ గ్రామీణ వ్యవస్థలను బహుళజాతి కంపెనీలకు అమ్మేసి, రసాయన పరిశ్రమలు, విమానాశ్రయాలు, వాన్‌పిక్‌లు, సెజ్‌లు అభివృద్ధి అని నమ్మించి, ఆ సొమ్ముతో ప్రజలకు బిచ్చగాళ్లను చెయ్యడానికి బియ్యం ఎందుకు? దయ్యం ఎం దుకు? ఆరు దశాబ్దాలు గడిచినా మారని ఈ బతుకుల ఆర్తి వినండి. అప్పుడు ప్రకటించండి మీ ప్రణాళికలను. కాకపోతే కొన్ని మౌలిక సత్యాలతోటి…

Advertisements

Written by JayaPrakash Telangana

April 4, 2009 at 7:34 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: