Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఒక ఆశ….ఒక నిరాశ

leave a comment »

గుక్కెడు ‘మంచి’ నీళ్ల కోసం దశాబ్దాల తరబడి ఆందోళన చేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన ఫ్లోరైడ్‌ బాధితులు, పాలకుల పారిశ్రామికీకరణ విధానాల మూలంగా సర్వం కోల్పోయిన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ నిర్వాసితులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నారు. ఫ్లోరోసిస్‌ బాధితురాలు తిరుపతమ్మ మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్‌ వేయగా అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు పేర్కొనలేదన్న కారణంగా అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి 16 మంది సెజ్‌ నిర్వాసితులు నామినేషన్‌ వేసి బరిలో నిలిచారు.

మహబూబ్‌నగర్‌ బరిలో ‘పోలేపల్లి’ నిర్వాసితులు (మహబూబ్‌నగర్‌ – ఆన్‌లైన్‌ ప్రతినిధి)

polepally-elections-2009

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి ఈసారి జరిగే ఎన్నికల్లో పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల అంశం ప్రధాన సమస్యగా మారనుంది. ఈ స్థానం నుంచి 16 మంది సెజ్‌ బాధితులు నామినేషన్లు దాఖలు చేయడం సంచలన ం సృష్టించింది. పాలకులు, రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేయనందుకు నిరసనగానే తాము ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు బాధితులు ‘ఆన్‌లైన్‌’కు వివరించారు. పోలేపల్లి సెజ్‌ జడ్చర్ల మండల పరిధిలో ఉంది. సెజ్‌ పరిధిలో పోలేపల్లితో పాటు ముదిరెడ్డిపల్లి గ్రామం కూడా ఉంది. ఈ రెండు గ్రామాల్లో కలిసి 4 వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. గతంలో జడ్చర్ల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పోలేపల్లి నిర్వాసితులకు 13 వేల ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా 20 నుంచి 30 మంది సెజ్‌ నిర్వాసితులకు ఓట్లు వేశారు. అయితే, ఈసారి సెజ్‌ సమీప నియోజకవర్గాల్లో ఈ అంశం ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ సమస్య గురించి అంతగా తెలియని కొడంగల్‌, మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల్లో నిర్వాసితులు చేసే ప్రచారాన్ని బట్టి ఈ ప్రభావం మరింత పెరగవచ్చు. నామినేషన్‌ వేసిన వారిలో గంగపురి రవీందర్‌గౌడ్‌, కుర్మయ్య, ఎంఎ. జబ్బార్‌, చిన్న ఎంకయ్య, దేపల్లి సాయన్న, రంగమ్మ, జంగిలమ్మ, లక్ష్మమ్మ, గజ్జి నర్సింలు, బి, వెంకటేశ్వర్లు, లింగయ్య, పాండు, సత్యమ్మ, కందూరి నర్సింలు ఉన్నారు. తాము భిక్షాటన చేస్తూ ఓట్లు అడుగుతామని నిర్వాసితులు చెబుతున్నారు. ఈ పార్లమెంట్‌ స్ఢానం నుంచే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ వేసిన జంగిలమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను మోసం చేసిందని, తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పేందుకే ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నామని చెప్పారు. తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భూములు తీసుకుని ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారని, డబ్బులు కూడా ఇవ్వలేదని మరో పోటీదారుడు సీనయ్యగౌడ్‌ తెలిపారు.

ఫ్లోరోసిస్‌ బాధితురాలి నామినేషన్‌ తిరస్కరణ (ఆన్‌లైన్‌ ప్రతినిధి – నల్లగొండ)

flouride-nalgonda

ఫ్లోరైడ్‌ రక్కసి నల్లగొండ జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్నది. ఫ్లోరోసిస్‌ సమస్యను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పేందుకు గడచిన కొన్ని సంవత్సరాలుగా బాధితులు అనేక రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 1996లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానానికి వందల సంఖ్యలో నామినేషన్లు వేసిన జలసాధన సమితి ఢిల్లీ స్థాయిలో ఫ్లోరోసిస్‌ సమస్యను ఎలుగెత్తి చాటిన సంగతి తెలిసిందే. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిగూడ జడ్పీటీసీ స్థానానికి ఫ్లోరోసిస్‌ బాధితురాలు పానుగంటి తిరుపతమ్మ పోటీ చేసి 1,785 ఓట్లను సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఇదే తిరుపతమ్మ నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇండిపెండెంటు అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసింది. అయితే, మంగళవారం జరిగిన పరిశీలనలో ఆమె నామినేషన్‌ తిరస్కారానికి గురైంది. ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాలను పొందుపర్చలేదన్న కారణంతో అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. నోటరీ చేసిన స్వల్ప తప్పిదానికి తిరుపతమ్మ మహాసంకల్పం నెరవేరకుండా పోయింది. మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన 28 సంవత్సరాల తిరుపతమ్మ తల్లి లేకపోవడంతో తండ్రి సంరక్షణలో జీవనం సాగిస్తోంది. ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసిన తిరుపతమ్మ ఎస్‌టీడీ బూత్‌ నిర్వహణతో కుటుంబానికి తనవంతు తోడ్పాటునందిస్తోంది. ఫ్లోరైడ్‌ సమస్యను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను కలిసి తనలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా చూడాలని వేడుకుంది. రాష్ట్ర గవర్నర్లు సుశీల్‌కుమార్‌షిండే, సుర్జీత్‌సింగ్‌ బర్నాలాలను సైతం కలిసి ఫ్లోరోసిస్‌ సమస్యను ఎలుగెత్తి చాటింది. ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిలను కూడా కలిసి జిల్లా సమస్యను ఏకరువు పెట్టింది.

Courtesy: Andhrajyothy 4th April 2009

Advertisements

Written by dilkibaatein

April 6, 2009 at 9:21 am

Posted in Articles, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: