Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోటీతో.. పోలేపల్లి నిరసన

with one comment

ఓటుతో ప్రభుత్వ వ్యతిరేకత సమీకరణ | పాలమూరు లోక్‌సభకు 15 మంది పోటీ

మహబూబ్‌నగర్‌,న్యూస్‌టుడే: పోలేపల్లి రైతులకు పొలం..ఇళ్లు తప్ప మరేదీ తెలియదు..ఉదయం లేవగానే పశువులను చెలకలకు తీసుకెళ్లి..పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చి జొన్న గటకలో పచ్చి మిరపకాయ నంజుకొని హాయిగా కాలం వెళ్లదీసేవారు..కాని సెజ్‌ వాళ్ల జీవితాలపై పిడుగు వేసింది.. ఉన్న 800 ఎకరాలు పోయాయి..రైతుల జీవితాలు బీళ్లుగా మారాయి. చచ్చినా పూడ్చేందుకు స్థలం లేకుండా పోయింది.. ఒకప్పుడు పచ్చని పొలాల్లో బిక్కుబిక్కుమంటూ గట్ల వెంటున్న చింతచెట్లే ఇపుడు ఉద్యమానికి నీడనిస్తున్నాయి…ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో ఇష్టారాజ్యంగా పేదల భూములను లాక్కొని ముఖ్యమంత్రి అనుయాయులకు కట్టబెట్టిన తీరును జడ్చర్ల ఉప ఎన్నికలో పోటీ చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎండకట్టి ప్రత్యేకతను సాధించుకున్నారు. ఏడేళ్లుగా పోరాటం చేస్తున్న ‘పోలేపల్లి’ సెజ్‌ బాధితులు ఈ ఎన్నికల్లో మరో కొత్త కోణాన్ని ప్రపంచానికి ఆవిష్కరించారు. కొత్త పోకడతో పోలేపల్లిని చర్చనీయాంశం చేశారు.

 • లక్ష్యం: ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో ప్రభుత్వం కొంతమంది వ్యక్తులకు పేదల భూములు బలవంతంగా తీసుకొని కట్టబెట్టడాన్ని వ్యతిరేకించేలా ప్రజలను చైతన్యం చేయడం..ప్రభుత్వ నిర్ణయం తప్పని గుర్తించి పేదల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 • గాంధీ పోరాటం: పోలేపల్లి ఫార్మాసెజ్‌తో అన్నీ కోల్పోయిన బాధితులు గాంధీ సిద్ధాంతాలను నమ్ముకున్నారు. శాంతియుతంగా పోరాటం మొదలెట్టి ఏడేళ్లయింది. కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చాయి. ఈ ఉద్యమాన్ని ప్రపంచాన్ని తెలియజేసి అండగా నిలిచే వారికి ‘పోలేపల్లి సెజ్‌.కామ్‌’ను ఆవిష్కరించారు. ఇపుడు సెజ్‌ ఉద్యమం రాజకీయ పార్టీలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఓటుతో సెజ్‌ వ్యతిరేక ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
 • జడ్చర్ల ఉప ఎన్నికలే స్ఫూర్తి: పోలేపల్లి ఫార్మా సెజ్‌ ఏర్పాటు సమయంలో ఇళ్లు, ఉద్యోగం, ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు కేశవరావు, మల్లురవి మాట మరచిపోయారు. అంతలోనే వచ్చిన జడ్చర్ల ఉప ఎన్నికల్లో నిలిచిన మల్లురవిని ఓడించడానికి 13 మంది సెజ్‌ బాధితులు పోటీ చేశారు. ప్రచారం చేసుకోకుండా ఎన్ని అడ్డంకులు కల్పించినా చివరికి బాధితులు సత్తా చాటారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి చెమటలు పోయించారు.
 • ఇపుడు లోక్‌సభ బరిలో..: సెజ్‌ చట్టం రూపొందించిన పార్లమెంటులోనే మా బతుకుల సంగతి తేల్చుకుంటాం..రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను తీసుకొని పొట్టకొట్టిన తీరును బట్టబయలు చేస్తాం.. ఇదేదో అత్యాశ కాదు.. మా పోరాటానికి ఉన్న బలం..అంటూ సెజ్‌ వ్యతిరేక ఉద్యమ ఐక్య కార్యచరణ కమిటీ నేత మధు కాగుల పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడానికి 15 మంది సెజ్‌ బాధితులు పోటీ చేశారు. దేశంలోనే అత్యధిక మంది పోటీచేసిన రెండో లోక్‌సభ స్థానంగా మహబూబ్‌నగర్‌ ఉండిపోయింది. కారణం..సెజ్‌ను వ్యతిరేకిస్తూ బాధితులు పోటీ చేయడమే. జాతీయంగా పత్రికల్లో కథనమై కూర్చుంది. రాజకీయ పార్టీల్లోనూ దడ పుట్టించింది. ప్రభుత్వానికి భూ దాహం రాష్ట్ర ప్రభుత్వ భూ దాహానికి పోలేపల్లి, గుండ్లగడ్డతండా పరిధిలో 240 మంది పేద రైతు కుటుంబాలు బజారున పడ్డాయి. 40 మందికి పైగా రైతులు మానసికంగా కుంగిపోయి చనిపోయారు. వాళ్ల ఆత్మశాంతికి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. అంతా ఎస్సీ,ఎస్టీ పేదలమే. మా పొట్ట కొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఓటు విలువ ఎంతో చెప్పేందుకు పోటీకి దిగుతున్నామని బాధితులు ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.
 • కూలీ పనికి కూడా అక్కరకు రామా..?జబ్బార్‌: పొలం పుట్ర పోగొట్టుకొని కూలీపనికి కూడా పనికి రానివాళ్లుగా తయారయ్యాం. నాకు ఉన్న 54 ఎకరాలు సెజ్‌ పేర ఇవ్వమన్నా బలవంతంగా గుంజుకున్నారు. మా ఇంట్లో 60 మందికి పైగా ఉంటాం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాం. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకోసమే మేమే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేశాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన గళాన్ని వినిపించాం.
 • కందులు, ఉల్వలు ఊహలకే: కుర్మయ్య: నాకు ఉన్న ఆరు ఎకరాల పొలంలో కందులు, ఉల్వలు, జొన్నలు పండించుకునే వాళ్లం. నా భూమిని చూస్తే అవే గుర్తుకు వస్తాయి. పచ్చటి మా పొలాల్లో సెజ్‌ల పేరుతో ఫార్మా కంపెనీలు పెట్టారు. భూములు ఇవ్వమని తేల్చి చెప్పినా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. మా ఇంట్లో వాళ్లను ఎవ్వరిని కూలీ పనిలోకి తీసుకోవడం లేదు. ఉపాధి పోయింది.. మా సమస్యను చట్టసభల్లో వినిపించడానికే లోక్‌సభకు పోటీ చేశా.
 • సెజ్‌పై సమరం…సత్యమ్మ: మా ఓట్లతో గెలిచిన నాయకులు మా సమస్యల గురించి పట్టించుకోలేదు. ఇక మా సమస్యను చట్టసభల్లో వినిపించాలనే ఉద్ధేశ్యంతో లోక్‌సభ స్థానానికి పోటీ చేశా.. నాకున్న నాలుగు ఎకరాలు లాగేసుకున్నారు. కట్టుకోవడానికి బట్ట..తినడానికి తిండి లేకుండా ఉన్నాం. పొలం ఉన్నపుడు దానిలో కందులు, జొన్నలు, మిరప పండించుకునేదాన్ని. కిరాణంలో నూనె, చిన్నచిన్నవస్తువులనే కొనేదాన్ని..ఇపుడు అన్ని అంగట్లోనే కొనాల్సి వస్తుంది. కూలీకిపోయి సంపాదించుకుందామన్న ఎవరూ పని ఇవ్వడం లేదు..కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నా..ఇంకా పోరాటం చేస్తా
 • పిల్లలు పస్తులుంటున్నారు..జంగిలమ్మ: ఉన్న పొలం పోగొట్టుకొని మేమంతా నడిరోడ్డు మీద పడ్డాం. మా పిల్లలు పస్తులుంటున్నారు. ఏ ప్రజాప్రతినిధి వచ్చి మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు. కనీసం మేము చెప్పినా వినలేదు. ఎనిమిది ఎకరాలు సెజ్‌లో పోయింది. మా ఆర్తనాదాలను పార్లమెంటుకు తీసుకెళ్లాలనే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేశా..

Courtesy: Eenadu – April 22, 2009

Advertisements

Written by dilkibaatein

April 22, 2009 at 11:41 am

Posted in News Archive, Telugu

One Response

Subscribe to comments with RSS.

 1. ఇంత తొందరగా ఈ బ్లాగును అప్ డేట్ చెస్తున్నదుకు దిలీప్ గారికి అభినందనలు..

  kjaanu

  April 22, 2009 at 1:57 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: